వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రపంచంలో అతి కొద్ది దేశాలకు మాత్రమే పరిమితమై , గ్రామీణ జీవనోపాధికి ఆయువు పట్టైన రెండవ అతిపెద్ద పరిశ్రమగా , ప్రత్యక్షంగా , పరోక్షంగా 70 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న రంగం . ప్రపంచ చేనేత వస్త్రాలలో 90% పైగా భారతదేశంలోనే నే యబడతాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు 7న భారత ‘జాతీయ చేనేత దినోత్సవం’ గా జరుపుకుంటాము. నూలు , కాటన్ , సిల్క్ , పట్టు వంటి పలు రకాలుగా ఈ వస్త్రాలు అందుబాటులో ఉంటాయి .
పద్మశాలి , పట్టుశాలి, తొగట , దేవాంగ వంటి వారి కులవృత్తి.
మగ్గంపై వస్త్రాలను చేతితో నేయడం జీవనోపాధిగా కలిగిన వారిని చేనేతకారులు అంటారు. తెలుగు రాష్ట్రాల జనాభాలో 12 శాతం ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
చేనేత వస్త్రం తయారీ విధానం :
మలినాలను తొలగించిన పత్తిని స్థూపాకారంగా చుట్టి రాట్నం సహాయంతో దారాన్ని బయటకు తీస్తారు. ఈ దారానికి గంజిని పెట్టి గట్టిదనం వచ్చేలా చేసి, ఆ తర్వాత మగ్గంపై వస్త్రాన్ని నేస్తారు. నిలువు వరస దారాలను ‘పడుగు ‘ (వార్పు) అనీ, అడ్డు వరస దారాలను ‘పేక ‘(ఫిల్లింగ్ త్త్రెడ్) అనీ అంటారు.

ఉనికి:
భారతదేశంలో అతి ప్రాచీన కుటీర పరిశ్రమ ఐన ఈ చేనేత వృత్తి కారణంగా దేశానికి పేరు ప్రఖ్యాతలు , ఆర్థిక బలాన్ని చేకూర్చింది. దేశంలో రెండో అతిపెద్ద ఆర్థిక వనరైన చేనేత 100 ఏళ్ల క్రితం నుంచి విదేశీ మా రకద్రవ్యాన్ని ఆర్జించిన ఘనత కలిగినది. శాతవాహనుల కాలంలో మన వస్త్రాలు యూరప్ దేశానికి ఎగుమతి చేయబడ్డాయి.
ఆరడుగుల చీరను అగ్గిపెట్టెలో దూర్చి ప్రపంచాన్ని అబ్బురపరచిన ఘనత మన చేనేత రంగానిది. మహాత్మా గాంధీ రాట్నంపై నూలు వడికి దేశ ప్రజలకు స్వదేశీ వస్త్రాలను ధరించాలని ఇచ్చిన పిలుపు ఉద్యమానికి ఊపిరి పోసింది. 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాల్లో నిర్వహించిన భారీ సమావేశంలో నేతలంతా విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలు ధరించి ఉత్పత్తుల పునరుద్ధరణకు పిలుపునిచ్చారు . ‘బానిసత్వం వద్దు ఆత్మగౌరవం ముద్దు’ అనే నినాదంతో సాగిన స్వాతంత్ర్యోద్యమంలో నూలు వడికే రాట్నం ప్రధాన భూమిక పోషించి, స్వాతంత్ర్య సముపార్జనకు ఒక సాధనంగా మారింది. ఆ విధంగా స్వాతంత్ర్య ఉద్యమానికి , చేనేత రంగానికి విడదీయరాని అనుబంధం ఉంది.
అంతర్జాతీయ మార్కెట్ అభిరుచుల కనుగుణంగా మన చేనేతకారులు తమ కళను, నైపుణ్యాన్ని మెరుగు పరచు కుంటున్నారు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలంగాణ రాష్ట్ర పోచంపల్లి వస్త్రాలు అమెరికా , స్విట్జర్లాండ్ , సింగపూర్ వంటి పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయి . సిరిపురం, వెల్లంకిలలో తయారవుతున్న కాటన్ దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్స్ కు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది . రాజాపేట మండలంలోని రఘునాధపురం లో తయారవుతున్న లుంగీలు ముంబై , సూరత్ ల ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి .భూదాన్ పోచంపల్లి తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్, కొయ్యలగూడెం , సంస్థాన్ నారాయణపురం, పుట్టపాక, సిరిపురం, వెల్లంకి,ఆలేరు, గుండాల, నాగారం వంటి వందలాది గ్రామాల్లో వేల సంఖ్యలో కుటుంబాలు చేనేత వృత్తిని ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా భారతీయ చేనేత వస్త్రాలకు, ప్రత్యేకించి మన తెలంగాణ పోచంపల్లి చేనేత వస్త్రాలకు విశిష్ట స్థానం ఉండడం భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయం. ఇక ఇందులోని లోతుపాతులను తరచి చూస్తే….
సిద్దిపేట గొల్లభామ చీరలు:
ఏ బుర్రలో ఏ ఆలోచన పురుడు పోసుకుంటుందో, అది ఏ సరికొత్త ఆవిష్కరణకు దారితీస్తుందో చెప్పలేం.తల మీద పాలకుండ చేతిలో పెరుగు గురిగి పట్టుకొని కొప్పున పూలదండను ముడిచి చేతి గాజుల గలగలలు, కాలి గజ్జె ల ఘల్లు ఘల్లుల్లో తన ఇంటి ముందు నుంచి నడిచి వెళుతున్న గొల్లకాంత నీడను చూసిన నేతన్న మదిలో మెరిసిన ఆలోచన, ఏడు పదుల ప్రస్థానాన్ని కొనసాగించి 2012లో ‘జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ‘ ను సొంతం చేసుకుని ‘జీ 20 శిఖరాగ్ర సదస్సు’ లో స్థానం సంపాదించి యావత్ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కళాత్మక వస్త్ర సోయగం సిద్దిపేట గొల్లభామ చీరల అద్భుత ఆవిష్కరణ.
సిద్దిపేటకు చెందిన వీరబత్తిని సోమయ్య, రచ్చ రాం నరసయ్య అనే ఇద్దరు నేత కార్మికులు చాలా శ్రమించి ఈ నేత ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

చీర అంచులు, పైట చెంగుల్లో వయ్యారంగా హొయలొలికించే రంగురంగుల గొల్లభామలు సిద్ధిపేట నేతన్నల కళా నైపుణ్యాన్ని ‘ఔరా!’ అనిపించి ఎల్లలు దాటించాయి.
దరీస:
యావద్భారత దేశంలో తమకు మాత్రమే సొంతమైన ‘దరీస్’ను నేసి 2017లో జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొంది,లండన్ మ్యూజియంలో ప్రదర్శనార్హతను సాధించి,రంగురంగుల తివాచీలను పరిచి ప్రపంచ చేనేత ప్రియులను స్వాగతించిన వరంగల్ జిల్లా కొత్తవాడ నేతన్నల కళాత్మక నైపుణ్యానికి దేశం గర్వపడింది.
హిమ్రూ:
తొలిసారిగా జీన్స్ క్లాత్ తయారు చేయడమే కాకుండా ఒకనాటి రాజ కుటుంబాల స్త్రీలు ధరించే హీమ్రూ పట్టు చీరలను మగ్గంపై నే సి యునెస్కో విశిష్ట సాంప్రదాయ వస్త్రాలలో చోటు దక్కించుకున్న వరంగల్ జిల్లా కమలాపూర్ నే తన్నల కళానైపుణ్యానికి ప్రపంచం అచ్చెరు వొందింది.
దసలి:
పట్టుపురుగుల నుంచి దారం తీసి వస్త్రాన్ని నేయడమే కాకుండా అటవీ ప్రాంతాలలో లభించే సహజ సిద్ధమైన వివిధ రంగులతో వాటిని ఆకర్షణీయంగా రూపొందించి, దసలీ పట్టు నేతలోని మెళకువలతో ప్రపంచ చేనేత పటంపై తమ సత్తా చాటుకున్నారు మహదేవ్ పూర్ నేత కార్మికులు.
రాజన్న సిరిసిల్ల చీరలు:
సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్ ఇరువది ఏడు సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టుచీరకు వెండి కొంగును జతకూర్చి సరికొత్త రికార్డు సృష్టించాడు. అరటి, తామర నారతో పట్టుచీరలు తయారుచేసి, అందరిని అబ్బురపరిచి ప్రభుత్వ అవార్డు సైతం అందుకున్నాడు.
వందల ఏళ్ల క్రితమే అగ్గిపెట్టలో దూరే చీరలను నేసి
ప్రపంచాన్ని అబ్బుర పరిచిన ఘన చరిత్ర మన చేనేత రంగానిది.
బతుకమ్మ చీరలు, అగ్గిపెట్టెలో ఇమిడే చీరలు , దబ్బనంలో దూరే చీరలు , భద్రాద్రి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పట్టు పీతాంబరాలతో సిరిసిల్ల చేనేత రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ప్రధాని మోడీకి ప్రత్యేక శాలువ, సచిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రంతో వస్త్రం,తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ గారి చిత్రంతో వస్త్రం, దానిపై జాతీయ గీతాన్ని కూర్చడం వంటి పలు అద్భుతాలను ఆవిష్కరించాడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు హరిప్రసాద్. మొట్టమొదటిసారిగా ఎలక్ట్రానిక్ మగ్గం కూడా తానే స్వయంగా తయారు చేసుకొని, దానిపై బంగారంతో పట్టుచీరలు నేసి సొంత బ్రాండ్ ఇమేజ్ ని కూడా సంపాదించుకున్నాడు. ఈతని కళానైపుణ్యానికి ముచ్చటపడిన సునీతా విజయ్ అనే ఎన్నారై ఈ తడు తయారు చేసిన వస్త్రాలకు ‘సిరిపట్టు’అని నామకరణం చేసి, ప్రోత్సహించి అన్ని రకాలుగా సహాయ సహకారాలందించడం సంతోషించ దగిన విషయం.
ఈ బృహత్కార్యానికి రాజకీయ, చలనచిత్ర రంగ ప్రముఖులు, ఎన్నారైలు శాయశక్తులా తోడ్పడటం అభినందించదగిన విషయం.
రంగుల సోయగాలను కొంగున ముడేసి,
మన ఖ్యాతిని ప్రపంచానికి చాటిన నేతన్న నేడు సరైన ఆదరణ లేక శ్రమకు తగిన ఫలితం దక్కక శూన్యంలోకి దృక్కులు సారిస్తున్నాడు.
మనదైన ఈ కళను బ్రతికించుకోవడం మనందరి బాధ్యత.ప్రభుత్వాలు ఎంతగా ప్రోత్సాహాన్ని అందించినప్పటికీ మార్పు అనేది మూలం నుంచి వచ్చినప్పుడే సమస్య పరిష్కారం అవుతుంది.
అతి సామాన్యులమైన మనవల్ల ఏమవుతుందని అనుకోకుండా ‘బిందువు బిందువు కలిస్తే సింధువు’ అవుతుందని అందుకు మన వంతు సహకారం అందించాలని ప్రతీ ఒక్కరు ఆలోచిస్తే ఈ సమస్య పరిష్కరించబడటం చాలా తేలిక.
శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాల్లో ఈ వస్త్రాల(చేనేత)ను కొనుగోలు చేయడం తమ విధిగా భావించాలి.
ఎన్ని కార్పోరేట్ చదువులు చదివినప్పటికీ, ఎంత ఉన్నత స్థాయికి చెందిన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ, చేనేత కుటుంబాల్లోని యువకులు తమ వారసత్వ సంపద ఐన ఈ నేత పనిని న్యూనతగా గాక దాన్ని తమ వారసత్వ హక్కుగా గర్వంగా స్వీకరించ గలగాలి.
సృష్టిలోని అందాలను పడుగు పేకల్లో ఒదిగించే కళానైపుణ్యం తమకే సాధ్యమంటూ గర్వంగా మగ్గంపై వేళ్లను కదిలించాలి.
అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తూ,తమకు మాత్రమే సొంతమైన రంగుల వలువను(చేనేత రంగాన్ని)కొత్తపుంతలు తొక్కించాలి.
సంపన్న వర్గాల్లోని (ఉన్నతమైన విలువలు కలిగిన) స్త్రీలు పెద్ద ఎత్తున వస్త్రాలు కొనుగోలు చేసి, పేదవారికి వితరణ గావించడం మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం. ఆ సహృదయతకు ఇంకో అడుగును కూడా జోడించి ఈ వస్త్రాలను కొనుగోలు చేసి వితరణ గావిస్తే దానంతో పాటు కళను కూడా బ్రతికించుకున్న వాళ్లమవుతాం.
‘సొంత లాభం కొంత మానుక పొరుగు వారికి తోడుపడవోయ్ ‘
అన్న గురజాడ వారి హితాన్ని అనుసరించి మనం కొనుగోలు చేసే వస్త్రాలలో ఇప్పటినుండి చేనేత వస్త్రాలను కూడా జోడించి మనదైన ఈ అద్భుత కళను బ్రతికించి ముందు తరాలకు ఘనమైన కానుకగా అందిద్దాం.
