లోకాభిరామాయణం -6

బంధాలు – బంధుత్వాలు

ఈనాటి మన లోకాభిరామాయణం ఒక కథ లాంటి వాస్తవంతో మొదలు పెట్టాను
ఒక అన్నా చెల్లెలు ఉన్నారు. వారిద్దరూ ఒకరిపట్ల మరొకరు చాలా అనురాగంతో ఉండేవారు. ఆమెలో ఉండే ముక్కుసూటితనం, చలాకీ తనం ఆ అన్నయ్యకి చాలా ఇష్టం. అలాగే ఏ అవసరం వచ్చిన అండగా నిలబడి అన్నయ్య అంటే చెల్లెలికి ప్రేమ. ఒకరి కష్టసుఖాలు మరొకరు చెప్పుకునే వాళ్ళు.
వాళ్ల పిల్లల పెళ్లిళ్లు కూడా అయిపోయాయి, ఇక పెద్ద వయసులో సరదాగా సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఉండగా, హఠాత్తుగా అన్నగారి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అడుగడుగునా చెల్లెలిని మాటలతో కాకుండా చేతల్లో అవమానించడం మొదలుపెట్టాడు.
అది ఆమెకు అర్థం కావటం లేదు. ఎందుకు హఠాత్తుగా ఇలా, తన వల్ల ఏం తప్పు జరిగింది, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని అనుక్షణం బాధపడేది. కానీ ఆమెకి సమాధానం దొరకలా.
ఆ అవమానాలు భరించలేక ఈమె కూడా అతని పట్ల పరుషంగా మాట్లాడింది. ఇద్దరి మధ్య మాటలు బంద్.
ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా పట్టలేని సదరు అన్నగారి ప్రస్తుత ఆగ్రహం పరిస్థితిని ఆసరాగా తీసుకుని ఆమె అంటే గిట్టని వాళ్లు అతనికి ఇంకా ఏవో కల్పించి చెప్పడం మొదలు పెట్టారు. దాంతో ఇంకా దూరం పెరిగింది.
కొంతకాలం గడిచింది. అనుకోని విధంగా ఇద్దరూ ఒకే ఆలయంలో కలిసారు. ఎవరు ముందు పలకరించారో తెలియదు కానీ పలకరించుకున్నారు.
అప్పుడు చెల్లెలు ఒక అన్నగారి మొహంలోకి చూస్తూఇలా అడిగింది .
“అన్నయ్యా, మనకు ఏదైనా కష్టం వస్తే మొదట భగవంతుడికి, మనకి అత్యంత ఆప్తులైన వారికి చెప్పుకుంటాం. ఆకలితో అలవాటించిపోతున్న ఒక మనిషికి అన్నం పెడితే వాళ్ళని అన్నపూర్ణాదేవి అనుకుంటాం. నేను చాలా కష్ట సమయంలో, తోబుట్టువులు ఇంకా ఉన్నా కూడా, నీకే నా బాధ చెప్పుకున్నా. అలాగే నీవు అనారోగ్యంతో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చావు. నేను అన్నం పెడితే తిని, ‘రెండు నెలల తర్వాత ఈరోజు కడుపు నిండా తిన్నానమ్మా’ అన్నావు. అంటే నీలో నేను భగవంతుని చూసా. నాలో నువ్వు అన్నపూర్ణాదేవి చూసావు. మరి ఎందుకు మన మధ్య ఈ గాప్ వచ్థింది. నేను నీకు నమ్మకంతో, చెప్పిన మాటలు అందరికీ ఎందుకు చెప్పావు? నేను ఏదైనా తప్పు చేస్తే నీవు డైరెక్ట్ గా అడగవచ్చు కదా! వార్ధక్యం మనల్ని కమ్మేసింది. ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందినా ఆ పోయిన రోజులు తిరిగి రావు కదా! అన్నయ్యా. నువ్వు ఎందుకు ఇలా చేసావు” అని అడిగింది.

ఈ కథలో ఆ అన్నయ్య చెల్లెలకి ఏమి సమాధానం చెప్పాడు, అతను ఆలోచించాడా లేదా అనేది పక్కన పెడదాం.
అతను అర్ధం చేసుకుని తన ప్రవర్తనకి కారణం చెప్పి , సమస్యని పరిష్కరించుకుంటే ఆ అన్నాచెల్లెళ్ల బంధం తిరిగి చిగురిస్తుంది.
లేదా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తోంది అని అతను అనుకుంటే ఆ బంధం వీగిపోతుంధి.
పన్నెండు సంవత్సరాల వరకూ తెలిసీ తెలియని వయసులో ఆటపాటల పైనే మనసు ఉంటుంది. ఆ తర్వాత చదువు ఉద్యోగం. ఆ యవ్వన దశలో ఉండే పోటీ తత్వం, తర్వాత పిల్లల చదువులు, పెళ్ళిళ్ళ బాధ్యతల్లో తలమునకలవుతూ ఉండటం వల్ల ఏ బంధాలు గుర్తు రావు.
అరవై సంవత్సరాలు దాటిన తర్వాత మళ్లీ మనిషిలో ఆ ప్రేమా ఆప్యాయతలు చిగురించటం మొదలుపెడతాయి. యవ్వన ఆవేశం తగ్గుతుంది. ఆలోచన, విచక్షణ, క్షమాగుణం పెరుగుతూ వస్తాయి.
ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే, మనలో ఒకప్పుడు ఉన్న అతి ఆవేశం, కోపం,ఈర్ష్యా,ద్వేషాలు మొదలైన గుణాలు ఈ రోజు చాలా సిల్లీగా అనిపిస్తాయి. అలా అనిపించాయి అంటే నీలో పరిపక్వత వచ్చినట్లే. ఈ పరిపక్వత మానవత్వానికి ప్రతీక.

ఈ కొత్త జీవితం మన పిల్లలకీ బంధాలు, బంధుత్వాల విలువ తెలియజేస్తుంది. అలాకాకుండా అరవై దాటిన తర్వాత కూడా కక్షలు, కార్పణ్యాలతో ఉంటే,సాధించేది ఏమీ లేకపోగా అదే వారసత్వం పిల్లలకి వస్తుంది.
బంధాలు బంధుత్వాలు పది కాలాల పాటు పదిలంగా ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
భార్యా భర్తలు, తోబుట్టువులు ,ఇతర కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల మధ్య అభిప్రాయభేందం తలెత్తితే వారి మధ్య మూడో మనిషి జోక్యం ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రేయస్కరం కాదు.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో సభ్యుల మధ్య పొరపొచ్చాలు ఏర్పడితే, కుటుంబ పెద్ద పరిష్కరించే వాడు. ఇప్పుడు అలాకాదు, ప్రతివారికీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఒకటి బలంగా ఉంటోన్నది. కాబట్టి ఎవరి సమస్యని వాళ్ళే పరిష్కరీంచుకోవాలి. మూడో మనిషికి తెలిస్తే అనర్ధమే కానీ ఉపయోగం ఉండదు.
నేటి పరిస్థితుల్లో ఎవరితోనైనా బంధం తామరాకు మీద నీటి బొట్టలా ఉంటే ఎంతో మంచిది.
ఇది కేవలం రక్తసంబంధీకులకే కాదు స్నేహానికి,మానవ బంధాలకి కూడా వర్తిస్తుంది.
వచ్చేవారం మరో ముచ్చటతో వస్తా .

Written by PVS Krishnakumari

పేరు. : పీ. ( వల్లూరు) వి. యస్. కృష్ణ కుమారి
భర్త : పోతరాజు వేణుగోపాల కృష్ణ మూర్తి ( రిటైర్డ్ ఫైనాన్స్ ఆఫీసర్ హై కోర్టు)
పుట్టిన తేది. ఆగష్టు, 14
తండ్రి. : వల్లూరు కోటేశ్వరరావు
తల్లి : వల్లూరు రాజ్యలక్ష్మి
పిల్లలు : నీలా సుందరి ( కూతురు )
రవిశంకర్ ( అల్లుడు)
శ్రీవాత్సవ ( కుమారుడు)
‌. మృణాళిని ( కోడలు)

జన్మస్థలం : వల్లూరు , గుంటూరు జిల్లా
విద్యాభ్యాసం. : పొన్నూరు, విజయవాడ ,
క్వాలిఫికేషన్ : బి.ఏ. బీఈడీ
వృత్తి. : ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ శ్రీవాణి మోడల్ స్కూల్ ( సొంత స్కూల్)
ప్రవృత్తులు. : సంగీతం, సాహిత్యం
సాహితీ ప్రయాణం. : 2010 లో మొదటిసారిగా కవితలతో మొదలైంది. వార్త, మన తెలంగాణా, సత్యం ఆన్లైన్ మ్యాగజైన్ లలో వందకి పైగా కవితలు
2015 లో మొదటి కథ ' ఓ సీత కథ' నవ్య వారపత్రికలో ప్రచురితమైంది. ఆ తర్వాత నవ్య, పాలపిట్ట, నమస్తే తెలంగాణా, జాగృతి, ఉషోదయ వెలుగు, వార్త ఆదివారం అనుబంధం, ఉషా మ్యాగజైన్ లలొ దాదాపు ఇరవై ఐదు కథలు, బహుమతులు , సాధారణ ప్రచురణకు ప్రచురితమైనాయి.
కథా మంజరి, కథా వేదిక, తరుణి ఇంకా అనేక ఫేస్ బుక్ గ్రూప్ లలో యాభైకి పైగా కథలు రాగా, ఇరవై కథలకి బహుమతులు వచ్చాయి.
నవలలు : జీవన విపంచి
వేద సుధామయం.
నేల నుండి నింగికి ( అముద్రితం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎయిర్ డ్రై తో క్లే తో చేసిన చిత్రాలని డ్రై చేసిన చిత్రాలు

చేనేత పరిశ్రమ