ప్రతి ఏడూ పంచాంగం
వింటుంటాను
ఏమున్నది ఎప్పటి తీరే
రాక్షసులకు రాజపూజ్యం
అమాయకులకు అవమానం
అవినీతిపరులకు ఆదాయం
వ్యథాగ్రస్తులకు వ్యయం
ఆరు వీసెల అలజడులూ
అరవై వీసెల అన్యాయాలూ
యాభై తూముల ఎదురుగాలి
ఎనభై తూముల పడమటి గాలి
గుట్టలను ముంచెత్తే వరద నీళ్ళు
గుండెల నిండా కన్నీళ్లు
మత్త కోకిలలు పంచమ స్వరంల
పాత రాగాలు తీసుకుంటు వుంటయి
ఉన్మత్త సినీ కోకిలలు బూతు పాటలతో
సోషల్ మీడియాను ఏలుతుంటయి
అందరికి ఏ గ్రహం ఏ ఇంట్ల ఉంటదో గాని
సామాన్యుని ఇంట్ల ఎప్పటికీ శని గ్రహమే ఉంటది.
సూర్యుడు తూర్పున ఉదయించి
పశ్చిమాన అస్తమిస్తాడు
ఎదిగిన పిల్లలు తూర్పు దేశాన పుట్టి
పడమటి దేశాలకు వలస వెళతారు
అగ్ర దేశాలకు వెళ్లిన అమ్మాయిలు పురుళ్లకు
అమ్మలను పిలిపించి అక్కడి పౌరులను కంటారు
నాన్నలిక్కడ కర్రీ పాయింట్లలో కూరలను కొంటారు
నల్ల మిరియాలు, లవంగాలు, ఏలకులు
మన కాడ పెరుగని నాజూకు పంటలకు
ధరలు పెరుగుతాయి
వడ్ల గింజలు పండిచ్చే రైతుకు గిట్టుబాటే ఉండదు
తాడి చెట్టెక్కి కల్లు తీసే గీత కార్మికుని
గీత సక్కగ లేక కిందబడి పానం పోతే
లక్ష రూపాయలిస్తరు
అభిమాన హీరో మొదటి రోజు మొదటాట సిన్మా
తొక్కిసలాటల సచ్చిపోతె ఇరువై లక్షలిస్తరు
గుట్టలన్నీ మాయమై గచ్చిబౌలీల బంగ్లాల
పడారి గోడలకు పునాది రాళ్లై తేల్తయి
గోదావరి ఉశికంత గోల్ మాలై
గోల్కొండ అవుతల కృత్రిమ బీచులల్ల
పరుచుకుంటది
గంజాయి పండించిన రైతు
గబుక్కున చట్టానికి దొరుకుతడు
మాదక ద్రవ్యాలను సరఫరా చేసేటోడు
దర్జాగా తిరుగుతుంటడు
అమ్మకు ఆటానా గోలీ కొననోడు
ఆడిపిల్లకు ఆరు లక్షలు పెట్టి
చీర ఫంక్షన్ చేస్తడు
పడరాని పాట్లు పడి పత్తిరైతు పంట అమ్మేటాలకు
పత్తి పలుగుతది తేమ తలుగుతది ధర తగ్గుతది
షో రూముల కాటన్ పేరు పెట్టుకున్నాక
విలువ వేలల్ల పెరుగుతది
టమాట కిలో రెండ్రూపాయలకు అమ్ముడు పోక
రోడ్ల పక్కన పారబోస్తడు రైతు
కోల్డ్ స్టోరేజీల దాచి అమ్మినప్పుడు
కిలో అరువై రూపాయలు పలుకుతది
ఏ గ్రహం ఏ ఫలితమిచ్చినా
సామాన్యునికి ఆగ్రహం పెల్లుబికక ముందే
మనిషితనానికి పరాభవం జరుగకుండా
చూడమ్మా పరాభవా