నాకెందుకో

కవిత

నాకెందుకో…
ఈ సమాజాన్ని మార్చే శక్తి
నా చేతిలో ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది.
మనిషి మనిషిని గా చూసే చూపులను
ఒక్కసారిగా మార్చేదాన్ని.
కులం, మతం, ధనం, అహంకారం అనే గోడలను
ఒకే ఊపిరితో కూల్చేదాన్ని
.
నాకెందుకో
ఎవరూ కన్నీరు కార్చని లోకాన్ని
నిర్మించాలనిపిస్తుంది.
అమ్మ కళ్లలో నిరాశ ఉండకూడదు,
తండ్రి పై బాధ్యత బాధ ఉండకూడదు,
పిల్లల చేతుల్లో పుస్తకాలే ఉండాలి,
బాధల బరువులు కాదు.

నాకెందుకో…
ఎల్లప్పుడూ నవ యవ్వనం ఉండేలా
కాలాన్నే ఆపేయాలనిపిస్తుంది.
ముసలితనం అనే మాటే లేకుండా చేసి,
వణుకుతున్న చేతులకు
మళ్లీ కలలు పట్టించాలనిపిస్తుంది.
ముడతల వెనుక దాగిన ఆశలకు
మళ్లీ రంగులు అద్దాలనిపిస్తుంది
.
నాకెందుకో…
నన్ను ప్రేమించే వాళ్లనే కాదు,
ప్రేమించడం తెలిసిన వాళ్లనే
ఈ భూమిపై పుట్టించాలనిపిస్తుంది.
ద్వేషం, అసూయ, కక్ష, కపటం ఉన్న హృదయాలను
గాలిలో కలిపేయాలనిపిస్తుంది.
ప్రతి మనసులో
ఒక్క మంచి మాట,
ఒక్క సానుభూతి,
ఒక్క మానవత్వపు చినుకు నింపాలనిపిస్తుంది.

నాకెందుకో…
ప్రపంచం అంతా ఒకే ఇంటిలా,
మనుషులంతా ఒకే కుటుంబంలా ఉండాలని అనిపిస్తుంది.
ఎవరూ ఎవరికీ పరాయివారు కాకుండా,
ఎవరూ ఒంటరిగా ఏడవకుండా,
ఎవరూ “నన్నెవరూ అర్థం చేసుకోరు”
అని అనకూడదనిపిస్తుంది.
కానీ…
నా చేతిలో ఆ శక్తి లేకపోయినా,
నా మాటలో ఒక వెలుగు ఉండాలి,
నా హృదయంలో ఒక ప్రేమ ఉండాలి,
నా అడుగుల్లో ఒక మార్పు ఉండాలి ఎందుకంటే
సమాజం ఒక్కసారిగా మారదు.
ఒక్క మంచి మనసుతోనే మారడం మొదలవుతుంది.

 

R. రవళి BA —2

Written by R Ravali

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సామాన్యుల పంచాంగం

ఆమె నా కావ్య నాయిక!