హరిచందన -13 వ భాగం

సాంఘిక నవల

బయటినుంచి సన్నాయి మేళం వినిపిస్తుంటే అందరూ బయటికి వచ్చారు.
తలపై అక్షయ పాత్ర,, చేతిలో చిరుతలుతో కాళ్ళకికట్టిన గజ్జెలు ఘల్లు ఘల్లు మనిపిస్తూ”హరిలో రంగ హరీ “అoటు చిరుతలు వాయిస్తూ ఇంటింటికి తిరిగే హరిదాసు. పళ్లెంలో బియ్యం తీసికెళ్లి అతను వంగితే తలపై ఉన్న పాత్రలో బియ్యం పోసి, చేతిలో ఉన్న నోటు కూడా అందులో వేసింది సుశీల.
“అయ్యగారికి దణ్ణం పెట్టు, అమ్మగారికి దణ్ణం పెట్టు “అంటూ గంగిరెద్దులవాళ్ళు వచ్చారు.డోలు,సన్నాయి రాగాలకు అనుగుణం గా, వాటిచేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా ఉత్సాహంగా
ఉంది. హరి ఫ్రెండ్స్ అవన్నీ సెల్ లో బoధించుకున్నారు.
“సిటీలో అయితే గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేస్తారు..”
“ఆ సందడిలో కొందరి ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయ్”
“అదేంటీ…గాలిపటాలు ఎగరేస్తే ప్రాణాలు పోవడం?” అయోమయంగా చూసింది సుశీల.
ఆ దారంపైన గాజు పొడిపుస్తారు, తొందరగా తెగిపోకుండా ఉండడానికి. ఆ గాలిపటాలు తెగిపోయినప్పుడు, ఆ దారాలు స్కూటర్ మీద వెళ్లే వాళ్ళ మెడకి చుట్టుకుని ఒక్కొక్కసారి ప్రాణాలు పోతుంటాయి. డాబాల మీదకి వెళ్ళి ఎగరేస్తూ, ఆ ఉత్సాహంలో చూసుకోకుండా కిందపడి కొందరు ప్రాణాలు కోల్పోతారు ” చెప్పాడు రమేష్.
“ఏవిటో.. వింత చేష్టలు… “అంది సీతమ్మ.
అందరూ గుడికి వెళ్ళి, అభిషేకం, పూజ చూసి తీర్ధ ప్రసాదాలు తీసుకుని, ఇంటికి వచ్చారు. లోపలికి రాబోతుంటే……
గేట్ ముందు ఆగిన కారులో నుంచి దిగుతున్న మేనత్త సుబ్బలక్ష్మి, ఆమె భర్త రాజారావు, మనవడు సుందరాన్ని చూసి, అటు పరుగెత్తింది సుశీల.
శైలజ లోపలికెళ్ళిపోతుంటే, చందన ఆమెని అనుసరించింది.
బెడ్ మీద కూర్చుని “ఛ! అనవసరంగా వచ్చానేమోనే.. వీళ్ళు….. ఏమిటో నా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా హడావిడి చేసేస్తున్నారు.”అంది, అసహనంగా
” నువ్వే కదే… ఇక్కడికి వచ్చేందుకు ప్లాన్ చేసింది? “
పక్కన కూర్చుని ” శైలూ!అయినా ఇప్పుడేమైందని ?
ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు చూడగానే పెళ్లి కుదిరిపోయినట్లా ? ” అంది, భుజమ్మీద చెయ్యి వేసి.
“వాళ్ళు కుదిరిపోయినట్లే అనుకుంటున్నారుగా “
“వాళ్ళు కుదిరితే బాగుంటుంది అనుకుంటున్నారు, ఈ బంగారు బొమ్మని వదులుకోకూడదు అని అనుకుంటున్నారేమో!. ” శైలజ గడ్డం పట్టుకుని అంది,చిరునవ్వుతో.
“ఫోవే!…….ఇప్పటి నుంచి…నువ్వు.. నీ అత్తవారిని సపోర్ట్ చేస్తున్నావే!” అంది చిరుకోపంతో.
“నీ మొహం….” తలమీద చిన్నగా మొట్టి “నీ తరువాతే నాకు ఎవరైనా ” అంది.
“ఎస్క్యూజ్ మీ!” తలుపు మీద టకటక కొట్టి లోపలికొచ్చిన సుశీల “అందరూ హాల్లో సమావేశం అయ్యారు. మిమ్మల్ని రమ్మంటున్నారు.” చెప్పింది.
శైలజ ముఖం చూసి, ” ఏమిటలా ఉన్నారు? ఇష్టం లేదా?” అడిగింది.
“అహ!అదేం కాదు సుషీలా. అనెస్పెక్టేడ్ కదా. పేరెంట్స్ తో చెప్పకుండా…. అని ఫీల్ అవుతోంది “చెప్పి,
“పద శైలూ!”శైలజ చెయ్యి పట్టుకుని లేపి,భుజాల చుట్టూ చెయ్యి వేసి కిందకి తీసుకొచ్చింది.
“అమ్మా శైలజా!మా అక్క సుబ్బలక్ష్మి, బావగారు, వాళ్ళ మనవడు సుందరం “పరిచయం చేశాడు రాంప్రసాద్.
“నమస్తే!” నమస్కరించి, చందన పక్కన కూర్చుంది.
అందరూ మళ్ళీ మాములు కబుర్లలో పడ్డారు.
“మా వాడు బొంబాయిలో టిసియస్ పనిచేస్తున్నాడు.”
చెప్పాడు రాజారావు, మాటల మధ్యలో.
“మా శైలూ హరిగారి ఆఫీస్ లో పని చేస్తోంది అంకుల్.”చెప్పింది చందన.
“వాడికి ఇంకా పాతికెళ్లే.. అప్పుడే తొందరందుకే అమ్మా అని మావాడు అమెరికా నుంచి ఒకటే గొడవ.ఏమిటో పిదపకాలం పిదప బుద్దులు…. పాతికెళ్ళు దాటినా ఆడపిల్లలకి, ముప్ఫయ్ దాటినా మగపిల్లలకి పెళ్లి చెయ్యరు. వాళ్లేమో అక్కడ అడ్డదారులు తొక్కడం.”సాగదీసుకుంటూ అంది సుబ్బమ్మ.ఉరఫ్ సుబ్బలక్ష్మి.
“అదే.. ఇప్పుడు సహజీవనాలు ఎక్కువయ్యాయిగా . పెళ్లయ్యి పిల్లల తండ్రులే కాదు,తల్లులు కూడా పిల్లల్ని గాలికి వదిలేసి… మరొకరితో… ఛండాలo.”అన్నాడు రాజారావు
“పిదప కాలం పిదప బుద్ధులు… కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతోంది.మూడు ముళ్ల బంధానికి, పేగుబoధాన్ని కూడా లెక్క చెయ్యకుండా తమ స్వార్ధం చూసుకుంటున్నారు. కోరికలు తీర్చు కోవడమే ముఖ్యం అనుకుంటున్నారు.. అది ధర్మబద్ధంగా జరగాలని పెద్దలు చెప్పిన మాటలను పెడచెవినా పెట్టేస్తున్నారు.” రాజారావుఅన్నాడు మళ్ళీ.
“ఆడవాళ్లు కూడా మగవాళ్ళకంటే ఎక్కువగా తాగి తూలడాలు ,ఆ చింపిరి గుడ్డలు కట్టుకుని ఊరేగడాలు ,మంచి చెడు ఆలోచించకుండా….పెళ్లయిన మగవాళ్ళతో… ఛ ఛ…. కుటుంబ వ్యవస్థకు మూలం అయిన స్త్రీలు కూడా దాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు”
“వీళ్లిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకునే అవకాశం కల్పించండి “.
హరికి మెసేజ్ పెట్టింది చందన.
సుందరం హరిలాగే ఎత్తుగా స్మార్ట్ గా హుందాగానే ఉన్నాడు.
అమెరికాలో ఎమ్మెస్ చేసి,వచ్చి బొంబాయిలో జాబ్ చేస్తున్నాడు.
మాట్లాడేవిధానం కూడా మృదువుగానే ఉంది. కాదనడానికి కారణాలు కనిపించలేదు చందనకి. అందుకే హరికి మెసేజ్ పెట్టింది.
“ఓకే “రిప్లై ఇచ్చాడు హరి.
రెండు నిముషాల తరువాత సుందరం భుజమ్మీద చెయ్యివేసి
“పదరా! ” బయటికి తీసికెళ్లాడు ..
పెద్దవాళ్లందరు ఇప్పటి కాలం పిల్లల ప్రవర్తనగురించి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు.
బంటీ వచ్చి “ఆంటీ! హరి బాబాయ్ మిమ్మల్ని పిలుస్తున్నాడు” చందన తో చెప్పాడు.
శైలూ భుజమ్మీదచెయ్యి వేసి “పద “అని, ఇద్దరూ బయటికి వెళ్లారు.
“ఎక్కడికే?” అయోమయంగా చూసింది శైలజ.
“నాకు అన్నివిధాల బాగున్నాడనిపించింది. నీకేమైనా సందేహాలు ఉంటే అతనితో మాట్లాడి నివృత్తి చేసుకుంటావని.. హరికి మెసేజ్ పెట్టాను. అందుకే.. పిలిచాడు.”
“నీకు ఓకే అనిపిస్తోందా “?
“నీకు ఓకే అనిపించడం ముఖ్యం…. నాకైతే ఒంక పెట్టడానికి ఏమీ లేదని అనిపిస్తోంది.నాకు కాబోయే అత్తవారి బంధువు అని ఎంత మాత్రం ఆలోచించకు. నేనుకూడా ఆ దృష్టితో చెప్పడంలేదు.
ఇప్పుడే పెళ్లేంటి అనే ధోరణిలో కాకుండా.. ఇంకో రెండేళ్ల తరువాత అయినా చేసుకోవాలికదా, మంచి సంబంధం అయినప్పుడు…ఇప్పుడే ఎందుకు కాకూడదు? ఆ దృష్టితో ఆలోచించు… ఇప్పుడే ఏమీ చెప్పకు. పేరెంట్స్ తో మాట్లాడాలి అని చెప్పు ” ఇద్దరూ హరి, సుందరం కూర్చున్న లాన్ లోకి వెళ్లారు.
“శైలజా! నా బంధువు అని కాదుగానీ సుందరం మోస్ట్ ఎలిజిబుల్ బేచులర్. మంచివాడు.. నాలాగే…”నవ్వాడు హరి.
“మీకు మీరే సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటారా?”అంది,చందననవ్వుతూ.
“పోనీ నువ్వు ఇవ్వు “
“చందూ ఇచ్చేసినట్లే . మీతో పెళ్ళికి ఒప్పుకుందoటేనే సర్టిఫై చేసినట్లే కదా “అంది శైలజ.
“ఎక్కడ ఒప్పుకుంది? సస్పెన్స్ లోనే ఉంచిందిగా, పేరెంట్స్ ని అడగాలిఅంటూ.”అన్నాడు హరీ, నవ్వుతూ.
“చూడండి.. మా హరి చెప్పాడంటే…. నాకు నమ్మకం. వీడు నా వెల్ విషర్ అని నమ్ముతున్నాను.అందుకే నాకేమి సందేహాలు లేవు.
మీకేమైనా సందేహాలు ఉంటే నిరంభ్యంతరంగా అడగవచ్చు” అన్నాడు సుందరం.
చందన లేచి, హరికి కూడా రమ్మని సైగ చేసింది. ఇద్దరినీ ఒంటరిగా వదిలి వారిద్దరూ దూరంగా వెళ్లి కూర్చున్నారు.
“చెప్పానుగా నాకేమీ సందేహాలు లేవు. మీరేమైనా అడగవచ్చు “
“మీరు మళ్ళీ అమెరికా వెడతారా? “ఏదో అడగాలి కదా అని అడిగింది.
“మమ్మీ, డాడీ అక్కడున్నారు కనుక, వెడితే వెళ్ళవచ్చు. అక్కడ సెటిల్ అవుదామని నాకు లేదు. హరి,నేను ఒకేసారి వెళ్ళాo, ఎమ్మెస్ చేసి వచ్చేశాం. నాకు హరికి క్లోజ్ నెస్ ఎక్కువ. మీకు తెలుసో లేదో మా జేజేమ్మకి తమ్ముడే మాతాతయ్య. అంటే మా నానమ్మకి మేనమామ. మానానమ్మ తమ్ముడి కూతురు రుక్మిణి అమ్మమ్మ.ముత్తాత గారి చెల్లెలి మనవరాలు సీతమ్మమ్మ.అలా బీరకాయ పీచు అంటారు అలా అన్నమాట. నిన్న రాంప్రసాద్ తాతయ్య కాల్ చేసి, చెప్పినప్పుడు మా జేజేమ్మ మీ గురించి మంచిపిల్లరా అబ్బీ అని సర్టిఫై చేసింది. మా అమ్మ నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడే అమెరికా వెళ్లారు. నేను మా నానమ్మ తాతయ్య దగ్గరే పెరిగాను. ఇక్కడికి దగ్గరే… కడియంలో నర్సరీలు ఉన్నాయి. పొలాలు ఉన్నాయి. సొంత ఇల్లుంది.వాళ్లకి నాన్న ఒక్కడే కొడుకు. వాళ్ళకి నేనొక్కడినే కొడుకుని. సెలవులు ఇచ్చినప్పుడల్లా నానమ్మ ఇక్కడికి తీసుకొచ్చేది. హరి నేను, జగ్గూ బాగా ఆడేవాళ్ళము. పెద్దవాళ్ళకి చెప్పకుండా వెళ్లి గోదావరిలో ఈతలు కొట్టేవాళ్ళం.
“చెప్పి, నవ్వాడు.
“వరసకి కాకపోయినా అన్నదమ్ముల కంటే క్లోజ్ గా ఉంటాం మేము ముగ్గురం…. “.సెల్ రింగ్ అవుతుంటే ఆగి, చూసి “హాయ్ మామ్… ఆ…. ఆ… ఇందాకే వచ్చాం… ఆ…. నువ్వు కూడా చూడు.. ఇక్కడే ఉన్నారు…”సెల్ శైలజకి ఇచ్చాడు.
“హలో ఆంటీ!నమస్తే! “చిరునవ్వుతో విష్ చేసింది శైలజ.
“హలో! ఇద్దరి అభిప్రాయాలూ కలిశాయా?.. మొహమాటం వద్దు. జేజికి నువ్వు బాగా నచ్చావ్…హరికి కాబోయే భార్య మీ కజిన్ అట కదా….ఇంతకీ ఏం నిర్ణయించుకున్నారు “
“ఇంటికి వెళ్లి అమ్మ నాన్న గారితో మాట్లాడాలి ఆంటీ. మేము పండుగ సంబరాలు చూద్దామని వచ్చాం. పేరెంట్స్ కి చెప్పకుండా., మేము నిర్ణయం తీసుకోవడం…”
“నిజమేలే.ఇట్స్ ఓకే బేబీ, ఐ హోప్ ఫర్ ది బెస్ట్ “
సెల్ సుందరానికి ఇచ్చేసింది.
సుశీల వచ్చి “భోజనానికి పిలుస్తున్నారు” అని చెప్పడంతో లేచి లోపలికెళ్ళారు.

అప్పటికే పెద్దవాళ్లందరి భోజనాలు అయిపోయాయి.
సుబ్బలక్ష్మి తల్లి,తండ్రి తో మాట్లాడుతుంటే, రాజారావు అక్కడే పక్కగా ఉన్న నవ్వారు మంచంపై పడుకున్నాడు.
“ఒరే అబ్బీ!”బామ్మ గారు పిలిస్తే అటు వెళ్ళి “ఏంటీ జేజీ?……” వెళ్ళి ఆవిడ పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు సుoదరం.
“చూడరా అబ్బీ……

( సశేషం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎన్నికలు – స్త్రీల పాత్ర