వివేకం మేల్కొన్నది

శ్రీ_పరాభవ_అధిక_జ్యేష్ఠ_పౌర్ణమి

“వివేక్! ప్లీజ్! నాకు అవసరంగా కొంత డబ్బు కావాలి సర్దగలవా?” రవీంద్ర, వివేక్ చేతులు పట్టుకుని బ్రతిమాలుతూ అడుగుతున్నాడు.
వివేక్ ఆలోచనలో పడ్డాడు. ‘తనదగ్గర అంత డబ్బెక్కడుంది? మొన్ననే ఇల్లు కొన్నాడు. తనజీతంలో చాలా మటుకు ఇంటిమీద తెచ్చిన అప్పు కట్టడానికే సరిపోతుంది. కానీ పాపం చాలా బ్రతిమాలుతున్నాడు. ఏం అవసరం పడిందో ఏమో?’ ఇలా ఆలోచించసాగాడు.
అతని ఆలోచనలు కనిపెట్టిన రవీంద్ర, “నాకు కొంత డబ్బు రావాల్సి ఉంది. అది వచ్చేవరకు ఎదురు చూడడం కష్టం. మా అమ్మను హాస్పిటల్ లో చేర్పించాలి. నువ్వే ఎలాగాయినా ఈ గండం గట్టెక్కించు.”
వివేక్ మనస్సు చలించింది. “సరే! డబ్బు సర్దడానికి ప్రయత్నిస్తాలే” అభయమిచ్చాడు.
“నిజమైన స్నేహితుడివంటే నువ్వే వివేక్.” రవీంద్ర కళ్ళలో తడి కనిపించింది.
“దానిదేముందిలే! అవసరమనేది ఎవరికైనా రావచ్చు. నాకవరమైతే నువ్వు ఇవ్వవూ!” అన్నాడు.
రవీంద్ర సంతోషంగా తన డిపార్ట్ మెంట్ వైపు వెళ్ళిపోయాడు.
ఆఫీసులో అందరూ వీళ్ళనే గమనిస్తున్నారు.
“వివేక్! నిజంగానే అతనికి డబ్బిస్తున్నావా? రవీంద్ర అందుకు అర్హుడేనా? కొంచెం ఆలోచించు.” అన్నాడు పక్క సీట్లో కూర్చునే వేణుగోపాల్.
“ఎందుకైనా మంచిది. ఒకసారి ఆలోచించుకొ!” అన్నాడు మళ్ళీ.
ఈసారి వివేక్ కు కొంచెం కోపం వచ్చింది. ‘ప్రతి ఒక్కడూ సలహాలు ఇచ్చేవాడే. వీలయితే సహాయం చేయాలి. లేకుంటే లేదు. అంతేగానీ, మంచి మనసుతో సహాయపడేవాళ్లను వెనక్కి లాగడం ఎందుకు?’ మనసులో వేణుగోపాల్ ను తిట్టుకున్నాడు.
కోపంగా మారుతున్న వివేక్ ముఖ కవళికలు గమనించిన రఘు, ఇక ఊరుకోమన్నట్టు వేణుగోపాల్ కు సైగ చేశాడు.
ఇంటికి వచ్చే దారిలో ఆలోచించసాగాడు. ‘ఎలా రవీంద్రకు సహాయం చేయాలి. కావ్యను అడిగితే. తనదగ్గర మాత్రం అంత డబ్బు ఎక్కడుంటుంది? తాను చేసేది చిన్న ఉద్యోగమే కదా! ఇప్పుడు తన జీతంలో చాలా భాగం ఇంటి మీద తీసుకున్న అప్పు తీర్చడానికే సరిపోతుంది. ఏదో వేదినీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు తన జీతం ఉపయోగపడుతోంది. తాను చాలా పొదుపుగా ఖర్చు పెట్టె మనిషి కాబట్టి సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ విషయాలన్నీ రవీంద్రతో ఎలా చెప్తాడు.’ ఆలోచనలతో ఉండగానే ఇల్లు చేరాడు.
అప్పటికే ఆఫీసునుంచి కావ్య వచ్చేసినట్టుంది. వివేక్ ఫ్రెష్ అప్ అవగానే టీ తెచ్చి ఇచ్చింది.
హాల్ లో సోఫాలో కూర్చుని టివిలో ఏవో ప్రవచనాలు చూస్తున్న తల్లి శాంతమ్మ పక్కన కూర్చున్నారు ఇద్దరూ.
అప్పుడే కూతురు ఉజ్వల ఆటలనుంచి వచ్చి, “నాన్నా!” అంటూ వివేక్ భుజాలమీడికి ఎక్కింది.
“నా బంగారుతల్లి. హోమ్ వర్క్ చేసుకున్నావా తల్లీ?” అని కూతురిని ముద్దాడాడు.
‘ఇప్పుడు చేసుకుంటాను నాన్నా.” పుస్తకాల సంచి ముందేసుకుని కూర్చుంది. కూతురికి చదువు మీద ఉన్న శ్రద్ధకు మురిసిపోయాడు.
ముగ్గురూ టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. వివేక్ ఎందుకో అన్యమనస్కంగా ఉండడం గమనించారు అత్త కోడళ్ళిద్దరూ.
“ఏమైందండి? అలా ఉన్నారు.” అడిగింది కావ్య.
“పెద్ద సమస్య వచ్చిపడింది. మా ఆఫీసులో పనిచేస్తున్న రవీంద్ర నీకూ తెలుసుగా. అతనికి అత్యవసరంగా డబ్బు కావాలట. అతనికి రావాల్సిన డబ్బు రెండుమూడు రోజుల్లో రావచ్చట. కానీ ఇప్పుడు వాళ్ళమ్మగారిని హాస్పిటల్ లో చేర్పించాలి, డబ్బు సర్దమని నన్ను వేడుకుంటున్నాడు. అతని పరిస్థితి చూసి, నేను కాదనలేకపోయాను.” అన్నాడు వివేక్.
“మనం మాత్రం ఎక్కడినుంచి తెస్తామండీ? ఇంటి అప్పు తీర్చడానికే ఎంత డబ్బూ చాలడం లేదు. మన పరిస్తితి తెలిసీ ఎలా మాట ఇచ్చారు. నాకా రవీంద్రగారి గురించి బాగా తెలుసు. అతనికి మీకంటే ఎక్కువ జీతమే వస్తుంది. పైగా అతని భార్య కూడా పెద్ద ఉద్యోగమే చేస్తోంది. వాళ్ళు బాగా ఆస్తిపరులని విన్నాను. మీకు గుర్తుందో లేదో అతను పోయిన సంవత్సరం మన దగ్గర తీసుకున్న అప్పు ఇంకా పూర్తిగా తీర్చనే లేదు…” ఇంకా ఏదో అనబోయిన కావ్య భర్త మొహంలో మారిపోతున్న రంగుల్ని చూసి ఆపేసింది.
శాంతమ్మ, మనమరాలిని తీసుకుని మెల్లిగా అక్కడినుంచి లేచి తనగదిలోకి వెళ్ళిపోయింది. కొడుకు కోడలు ఏ విషయమైనా చర్చించుకునేటప్పుడు ఆవిడ జోక్యం చేసుకొదు. తనను సలహా అడిగితేనే చెప్తుంది.
“ఉజ్వల పేరిట మీ నాన్నగారు బ్యాంక్ లో పెట్టిన డబ్బు ఉందికదా!” మెల్లిగా విషయంలోకి వచ్చాడు.
ఈమాట వింటూనే కళ్ళు పెద్దవి చేసి, “అది పాప డబ్బు. దాని చదువుకోసం మా నాన్న వేసిన డబ్బు. దాని చదువుకు మాత్రమే వాడాలి. ఆ డబ్బు ముట్టుకుంటే నేనూరుకొను.” నిష్కర్షగా చెప్పింది కావ్య.
ఇక వివేక్ లోని వివేకం నశించింది.
“ఏం? అంతోటి డబ్బు నేను సంపాదించలేని చవటననుకున్నావా? ఇన్నిరోజులూ నా సంపాదనతోనేగా ఇల్లు గడిచింది. నువ్వు ఈ మధ్యే ఒ చిన్నపాటి ఉద్యోగంలో చేరావు. ఏదో కలెక్టర్ గిరి వెలగబెదుతున్నట్టు ఆ పొగరేమిటి? ఏదో మిత్రుడి అవసరానికి కొంత డబ్బు అడిగితే తెగ నీలుగుతున్నావు. నీ బోడి డబ్బు నాకేం ఆకఖారలేదు. ఛీ ఛీ పాడు కొంప మనశ్శాంతి లేదు. కొంచెం కూడా నన్నారతం చేసుకొనే వాళ్ళు లేరు.” విసురుగా అక్కడినుంచి బయటికి వెళ్ళిపోయాడు.
నిశ్చేష్టురాలైపోయింది కావ్య. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. అక్కడే ఉన్న సోఫాలో కూలబడిపోయింది.
‘ఇప్పుడు తనెమన్నది? పాప డబ్బు వాడేస్తే తాము అంత డబ్బు మళ్ళీ కూడబెట్టగలరా? పెళ్ళయినప్పటినుండీ చూస్తోంది. ఒక్కరూపాయి కూడా బ్యాంక్ లో వేసుకుందామని లేదు. అదిగినవాళ్లకు లేదనకుండా అపర దానకర్ణుడిలా ఇలా దానం చేస్తుంటాడు. అది అప్పే కానీ వాటిని తీర్చేవాళ్లెంతమంది. ఈయన సంగతి తెలిసి అవసరం ఉన్నా లేకపోయినా అప్పు… అప్పు అని ఈయన వెంటపడుతూ ఉంటారు. పెళ్ళయిన కొత్తలో అత్తగారు తనకు అప్పుడే చెప్పారు. ‘ఈ అలవాటు మాన్పించడం మా వల్ల కాలేదు. కనీసం నువ్వయినా మార్చు.’ అని. కనీసం పాప పుట్టిన తరువతాయినా ఈయన బుద్ధి మారితే బాగుండేది. అయినా తాను కూడా ఏమన్నది? ఆ రవీంద్రలాంటి డబ్బున్న వాళ్ళకు అప్పు ఇవ్వడం ఎందుకు? మనమేం డబ్బులు రాశులు పోసుకుని ఉన్నామా? ఉన్నదాంట్లోనే ఏ అప్పులూ చేయకుండా తాము బతకడంలేదూ! ఎందుకీ మనిషికి అర్థం కావడం లేదు.’ పదే పదే కళ్ళు వత్తుకుంటూ ఆలోచిస్తోంది. హఠాత్తుగా ఏదో గుర్తొచ్చింది. వెంటనే లేచి బీరువా తెరచి, అందులోంచి, భర్త అత్తగారు చేయించిన నాలుగు బంగారు గాజులు, నెక్లెస్ తీసి ఒక కర్చీఫ్ లో చుట్టి, భర్తకు కనబడే విధంగా టేబుల్ మీద పెట్టింది.
శాంతమ్మ అంతా గమనిస్తూనే ఉంది. కోడలు చేసిన ఈ పనిని మాత్రం హర్షించలేకపోయింది.
“ఏం పనే కావ్యా ఇది? వాడంటే మూర్ఖుడు. నీవు కూడా అలా ప్రవర్తిస్తే ఎలా?” కోడల్ని కొప్పడింది.
“ఏం చేయాలి అత్తయ్యా ! నాకు చేతనైన పని ఇదే.” మొహం కప్పుకుని ఏడ్చింది.
**
బయటికి వెళ్ళిపోయిన వివేక్ తమ కాలనీలోని పార్కులోకెళ్ళి ఒక బెంచీ మీద కూర్చున్నాడు.
‘రవీంద్రకు మాటిచ్చాడు. ఇప్పుడేం చేయాలి?’ ఇదే ఆలోచిస్తున్నాడు.
ఇంతలో ఎవరిదో చేయి భుజం మీద పడడంతో ఉలిక్కిపడి, తలతిప్పి చూశాడు.
తన కొలీగ్ ప్రశాంత్. “నాకంతా తెలుసు వివేక్. ఆ రవీంద్ర వాళ్ళమ్మను నిజంగా హాస్పిటల్ లో చేర్చడానికి డబ్బు అడిగాడనుకున్నావా? అతను భార్య చెల్లెలి పెళ్ళికి వెళ్లాలట. అందుకోసం బట్టలూ అవీ కొనడానికి అతనికి డబ్బు కావాలి. ఇలా తల్లికి బాగాలేదని అంటే నువ్వు జాలిపడి ఇచ్చేస్తావని అతను అభిప్రాయపడ్డాడు. వాళ్ళు మాకు దూరపు చుట్టాలు. అతను, అతని భార్య చేసే ఖర్చులు, జల్సాలకు ఎంత దబ్బాయినా చాలదు. నీవెందుకు అనవసరంగా ఎక్కడినుంచో డబ్బు తెచ్చి, అతనికిచ్చి, అతని అలవాట్లను ప్రోత్సహించడం. అతని సంగతి తెలిసిన ఆఫీసులోని వాళ్ళెవరూ అతనికి డబ్బు ఇవ్వరు. అతనికిచ్చిన డబ్బు మళ్ళీ మనకు తిరిగి రాదు. మనమా మధ్యతరగతివాళ్ళం. మనం కష్టపడి సంపాదించిన డబ్బు, ఇలా ఎవరి విలాసాలకో ఇవ్వడం ఎంతవరకు న్యాయం? ఇవన్నీ ఆఫీసులో చెప్తే బాగుండదని, నీకెలాగైన చెప్పాలని చూస్తున్నాను. నీకూ ఒక కూతురు ఉంది. ఆ అమ్మాయి భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించు. అలా అని నీవు ఎవ్వరికీ సహాయం చెయ్యద్దని చెప్పడం లేదు. తనకుమాలిన ధర్మ వద్దని అంటున్నాను.” సుదీర్ఘమైన ఉపన్యాసంలాంటికి ఇచ్చాడు.
కళ్ళు పెద్దవి చేసి వింటున్నాడు వివేక్. అతనిలోని వివేకం ఒక్కసారిగా మేల్కొంది. కావ్య గుర్తొచ్చింది. పశ్చాత్తాపం కలిగింది.
ప్రశాంత్ చేయి పట్టుకుని కృతజ్ఞతగా చూశాడు. వెంటనే ఇంటికి బయలుదేరాడు.
ఇంట్లో ఎవ్వరూ భోజనం చేసినట్టు లేదు. ఉజ్వలకు అన్నం పెట్టినట్టుంది. నిద్రపుచ్చుతోంది కావ్య. కావ్య మొహం చూడాలంటే సిగ్గుగా అనిపించింది వివేక్ కు.
“అమ్మా! నువ్వింకా భోంచేయలేదా?” అడిగాడు శాంతమ్మను.
“లేదురా! నీకోసమే కనిపెట్టుకుని ఉన్నాను. ఇలారా. ఇటు కూర్చో. నీతో కొంచెం మాట్లాడాలి.” అన్నది.
తల్లి పక్కన కూర్చున్నాడు. ఆమె ఏం మాట్లాడదలచిందో ఊహించాడు.
“ఒరేయ్ వివేక్. కావ్య మంచి పిల్లరా. ఈకాలంలో పుట్టాల్సిన పిల్ల కాదు. ఎంత గుట్టుగా సంసారాన్ని సాగిస్తుందో నీకేం తెలుసు? ఏనాడూ నాకిది కావాలి అని అడిగి ఎరగదు. ఎప్పుడైనా చీర కొనుక్కోమని వాళ్ళ పుట్టింటివాళ్ళు డబ్బు ఇచ్చినా, నీ చెల్లెలు ఇంటికి వచ్చినప్పుడు, ఆ డబ్బుతో తనికి చీర కొని ఇచ్చే మంచి మనసు తనది. చుట్టుపక్కల ఆడవాళ్ళంతా తాము కొన్న చీరలు, నగలు చూపిస్తుంటే ఏమాత్రం ఆశ పడి ఎరగదు. ఇవాళ ఉజ్వల కోసం దాచిన డబ్బు ఎవరికోసమో అడిగితే మాత్రం ఆ తల్లి ప్రాణం ఒప్పుకోలేదురా! నీ భార్య మనసు నీకింకా అర్థం కాలేదా? ఎవరికోసమో తనను నొప్పిస్తావా? చదువుకున్న వాడివి. వివేకం తెలిసిన వాడివి. నీకు చెప్పేంత చదువు నాకు లేదనుకో. అయినా అనుభవం ఉన్న దానిలా చెప్తున్నాను. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నీ పద్దతి మార్చుకో.” అన్నది.
లోపలి గదిలోకి వెళ్ళాడు. ఉజ్వల నిద్రపోతోంది. పక్కనే ఉన్న టేబుల్ మీదున్న నగలను చూశాడు. ఎవరో ఛెళ్లున కొరడాతో కొట్టినట్టయింది. ఇక ఆగలేకపోయాడు.
“కావ్యా! ఈ మూర్ఖుణ్ణి క్షమించు. నీ విలువ తెలుసుకోలేకపోయాను.” అన్నాడు ఆమె చేతులు పట్టుకుని కళ్లకద్దుకుంటూ. దిగ్గున లేచింది కావ్య. “అయ్యో అదేం మాటలండీ! రండి భోంచేద్దాం. అత్తయ్యగారు కూడా భోంచేయలేదు.” అని అంటూంటే, ఇంత మంచి మనసున్న భార్యనా, తాను ఇన్ని మాటలన్నది అనుకున్నాడు. తానే అందరికీ వడ్డించాడు. సరదాగా నవ్వుతూ మాట్లాడాడు.
పడుకుంటూ తనను తాను ఆత్మ పరిశీలన చేసుకున్నాడు.
ఓ గంట కింద తాను చిర్రుబుర్రులాడాడు.
ఇప్పుడు ఒకింత భారం దిగినట్లుగా అనిపిస్తోంది.
అప్పుడు మాట్లాడింది ఆ వ్యక్తే.
ఇప్పుడు మాట్లాడిందీ తనే.

కానీ ఎంత తేడా !!

అంటే మన మానసిక పరిస్థితిని బట్టి ఎదుటి వ్యక్తి మాటలు మన మనసుపై ప్రభావం చూపుతాయి. సాధారణంగా మనం ప్రతిదీ ఎదుటివారిపై తోసేస్తాం.

‘అబ్బా… ఇలా నన్ను నేను విశ్లేషించుకుని చూసుకొన్నది ఎన్నాళ్ళయింది?!’ అనుకుని చిన్నగా నవ్వుకున్నాడు వివేక్.

Written by Rohini Bhairava Josyula

నా పేరు రోహిణి భైరవజోశ్యులు. మా ఊరు అనంతపురం.
ప్రస్తుత నివాసం హైదరాబాద్.
నేను M.Com., M.A ( ఇంగ్లీష్) చేశాను. పెళ్ళయ్యాక చేసినవి.
20 సంవత్సరాలు కామర్స్ లెక్చరర్ గా వివిధ కళాశాలల్లో పని చేశాను.
మా వారు బ్యాంక్ లో Assistant General manager గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఉద్యోగ రీత్యా మేము
Asansol (West Bengal), Faridabad (Haryana) near Delhi, Kannur ( Kerala) తిరిగాము.
అలాగే ఆదోని ( కర్నూలు), నిజామాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్ళాము.
కొడుకులు, కోడళ్లు , ముగ్గురు మనవళ్ళు ఉన్నారు.

నేను 3 1/2 సంవత్సరాల నుంచి కథలు రాస్తున్నాను.
నేను ఎక్కువగా కుటుంబ కథలు రాస్తుంటాను. అప్పుడప్పుడు హారర్ కథలు, హాస్య కథలు కూడా రాస్తుంటాను.
ఈనాడు ఆదివారం పత్రికలో రెండుకథలు పబ్లిష్ అయ్యాయి.
సంచిక, విశాలాక్షి, విశాఖ, ఉషా, సుమతి, సహరి, తిరుపతి రచయితల పోటీ, విజయనగరం జిల్లా రచయితల సంఘం మొదలగు పత్రికలు నిర్వహించిన పోటీలలో బహుమతులు వచ్చాయి. ఇప్పుడు ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.
ఇదీ నా పరిచయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సడి చేయని చప్పట్లు

మన భవిష్యత్తు ఏది?