మన భవిష్యత్తు ఏది?

కవిత

పక్షుల కిలకిలారావాలతో మేల్కొన్న ఉదయ వేళలిప్పుడులేవు
మొబైల్ ఫోన్ల అరుపులతో తడబడుతోంది.
ఉదయం..!

మనిషి అభివృద్ధి పేరుతో
అడవులు నరికేస్తే…
రేపటి పిల్లల చేతుల్లో
పుస్తకాలు కాదు

ఆక్సిజన్ బాటిళ్లను
మోయవలసి వస్తుంది..!

ఒకప్పుడు
చెట్టు నీడలో కూర్చుని
తల్లి జోలపాట పాడేది…
ఇప్పుడు
నరికిన చెట్ల రక్తం తో
మనిషి వేసిన కాంక్రీట్ గోడల మధ్య
ఊపిరాడక బంధీలైపోవలిసి వస్తుంది..!

ప్రకృతిని జయించాను అని అనుకొన్న మనిషి

చివరికి…
ఒక నీటి బొట్టుకోసం
ఆకాశం వైపు చేతులు చాచే రోజులు
ఎంతో దూరంలో లేవు..!

మొబైల్ ఫోన్ల సిగ్నల్స్ ఉన్నాయి
మట్టివాసనను తాకే వేళ్లు లేవు..!

ఎయిర్‌కండిషన్ గదుల్లో
ఊపిరాడని సమయాన..
డబ్బు కట్టలు పట్టుకుని
మనిషి ఒక ఆక్సిజన్ చుక్క కోసం
ప్రకృతి దేవుడిని వేడుకుంటాడు
కానీ… నాకూ యోగ్యత

లేదు అని తెలుసుకోలేకపోయాడు..!

కాంక్రీట్ అడవుల్లో మునిగిపోయిన
మనిషి చెవులకు చెట్ల నుంచి వచ్చిన
మధుర రాగాలు వినే యోగ్యత
లేదని తెలుసుకోలేకపోయాడు..!

ఆకుపచ్చ భూమి పగుళ్లు తేలిన ఆర్తనాదం..
ఎండిపోయిన నదుల గుండె చప్పుడు విని
పలికిన ప్రతి మాటలో
మట్టివాసన గొప్పతన్నాన్ని

మనిషి చెవుల్లో నాటాలి

నరికిన చెట్ల నీడల్లో..
చెదిరిన పక్షుల గూళ్లలో
ప్రకృతి బాధను
కన్నీటి చుక్కగా కాదు,
అగ్నిజ్వాలగా రాసే స్వరాలు వినిపిస్తున్నాయి

ఒక మొక్క నాటడానికి..
ఒక నదిని కాపాడడానికి..
ఒక పక్షి గూటిని నిలబెట్టడానికి..

మన శ్వాసను నిలుపుకోవడానికి..
ఇంకా సమయం ఉంది…!

ప్రకృతిని రక్షించు అంటోంది జూన్ ఐదో తేది
మనమందరం కలిసొస్తే
పచ్చని ప్రపంచం నవ్వుతుందట!

ప్రకృతిని ప్రేమిద్దాం…
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ….
పచ్చని భూమి మన అందరి బాధ్యత!
అదే మన భవిష్యత్తు!!

Written by Manjula Patipati

రచన: మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
చరవాణి 9347042218

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వివేకం మేల్కొన్నది

నాన్న మాట