నాగేశ్వర జ్యోతిర్లింగం

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎనిమిదవదైన ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడుందనే దానిపై వివాదాలున్నాయి. గుజరాత్ లోని ద్వారకకు సమీపములో ఉన్న నాగేశ్వర ఆలయమే అసలైన జ్యోతిర్లింగమని గుజరాతీయులు అంటే, ఔంధ నాగనాథ్ ఆలయమే అసలైన జ్యోతిర్లింగమని మహారాష్ట్రీయులు అంటారు. ఈ రెండు ఆలయాలను నేను వివిధ సందర్భాలలో దర్శించడం జరిగింది. వాటి వివరాలు మీకోసం.
శివపురాణం ప్రకారం, దారకుడు అనే రాక్షసుడు పార్వతీదేవి నుండి వరాలు పొంది, వరగర్వంతో అందరినీ పీడిస్తుంటాడు. సుప్రియ అనే శివభక్తుడు కూడా బాధింపబడడంతో అతని కోరిక మేరకు శివుడు దారుకుని సంహరిస్తాడు. ఇంకొక పురాణం ప్రకారం ఈ జ్యోతిర్లింగం దారుకావనమనే ప్రదేశంలో ఉందని చెప్తారు.
ఔంధ నాగనాథ్ ఆలయం-మహారాష్ట్ర
ఇది మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఔంధ నాగనాథ్ గ్రామంలో వెలసింది. పర్లి వైద్యనాథ్ ఆలయానికి 120 కిమీ, ఔరంగాబాద్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం. ఇది దేశ వారసత్వ సంపదగా గుర్తింపబడి పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. ఆలయం హేమత్ పంతి శైలిలో నిర్మించబడింది. ఆలయ గోపుర నిర్మాణం మాత్రం మరాఠా శైలిలో ఉంటుంది. వనవాస కాలంలో ధర్మరాజు నిర్మించాడని పురాణ కథనం. చారిత్రిక ఆధారాల ప్రకారం 13వ శతాబ్దంలో దేవగిరి యాదవులతో నిర్మించబడింది. 17వ శతాబ్దంలో ఇండోర్ మహారాణి అహల్యబాయ్ ఆలయాన్ని పునరుద్ధరించారు. కాలసర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో జరుపుతారు.


ఆలయంలో స్తంభాలపైనున్న శిల్పకళాచాతుర్యం మనల్ని ఆకట్టుకుంటుంది. ఆలయ మంటపంలో విష్ణుమూర్తి ప్రతిమ ఉంటుంది. ఆలయ మంటపంలో సర్పదోష నివారణ పూజలను చేస్తున్నారు. ఆలయం చుట్టూ చిన్న చిన్న ఉపాలయాలున్నాయి. మిగిలిన జ్యోతిర్లింగాలు, భండారేశ్వరుడు, చింతామణీశ్వరుడు, నీలకంఠేశ్వరుడు, వ్యాసమహర్షి, గణేషుడు, దత్తాత్రేయ, వామదేవుడు, దశావతారాలు, కృష్ణ రుక్మిణి ఆలయాలు ఉన్నాయి. ఆలయ వెనుక భాగంలో నందీశ్వర మంటపం ఉంది. దీని వెనక ఒక విశేషమైన కథ ఉంది. అదేమిటంటే పూర్వం నామదేవ్ అనే భక్తుడు శివుని భజన చేస్తుంటే, పూజారులు అతనిని అడ్డుకొని ఆలయం వెనుకకు పంపించేశారట. అదేమీ పట్టించుకోని నామదేవ్ శివుని కీర్తనలు పాడుతుంటే, మొత్తం ఆలయమే నామదేవ్ ఎదురుగా తిరిగిందట. అందుకే నంది వెనుక భాగంలో ఉండిపోయిందని చెప్తారు. ఆలయ ప్రాంగణంలోనే ఉన్న పుష్కరిణిని రుణవిమోచన తీర్థం అంటారు. ఆలయ వెనుక భాగం గోడపై నామదేవ్ విగ్రహముంటుంది. ఆలయం ముందు ప్రాంగణంలో అహల్యబాయ్ విగ్రహముంటుంది.
సిక్కు మత స్థాపకుడైన గురునానక్ ఈ ఆలయాన్ని సందర్శించాడని, అందుకే ఇది సిక్కులకు కూడా పవిత్ర స్థలం అయిందని చెప్తారు.
ఆలయం విశాలంగా ఉంది పెద్ద పెద్ద క్యూ లైన్లు ఉన్నాయి. ఇక్కడ స్వామి భూగర్భం (అండర్ గ్రౌండ్) లో ఉంటారు. క్రిందకు దిగడానికున్న మెట్లు ఇరుకైన స్థలంలో ఉన్నాయి. మొదటి మెట్టు నిటారుగా ఉంటుంది. కూర్చుని తప్పించి క్రిందకు దిగలేము. ఆ మెట్టుపై అడుగు పెట్టాక తలవంచుకునే క్రింది మెట్లు దిగాల్సి ఉంటుంది. చిన్నగదిలో లింగాకారంలో స్వామి దర్శనమిచ్చారు. స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. గాని అక్కడున్న పూజారులు ఎవరి మట్టుకు వారే దక్షిణ వెయ్యమని… ఆఖరికి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డులు కూడా… దక్షిణ కోసం చేతులు చాచారు.
ఆలయ స్తంభాలపై శిల్పాలని ఎంత అందంగా చెక్కారంటే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అందమైన స్త్రీమూర్తులు, వివిధ రకాల జంతువులు, అతి సున్నితమైన డిజైన్లు ఆ గుండ్రని స్తంభాలపై అలరారుతున్నాయి.
మేము వెళ్లిన సమయంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉండటంతో, స్పెషల్ టికెట్ తీసుకున్నాము. అయినా దర్శనానికి చాలా సమయం పట్టింది. ముఖ్యంగా గర్భగుడిలోనికి దిగి, ఎక్కడంలో సమయం ఎక్కువ తీసుకుంటుంది. కొద్ది కొద్దిగా భక్తులను కిందకు పంపిస్తారు. వాళ్లు పైకి వచ్చాక మరి కొంతమందిని… అందుకని దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. నాగనాథ్ దర్శనం చేసుకున్నాక మేము పర్లి వైద్యనాథ్ కు బయలుదేరి వెళ్ళాము.
నాగేశ్వర జ్యోతిర్లింగం- గుజరాత్
ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ లోని ద్వారకకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సర్పదోషాలను నివారించే శక్తివంతమైన క్షేత్రం కాబట్టి, దీనిని నాగేశ్వరక్షేత్రం అంటారు. దారుకుడు అనే రాక్షసుని బారి నుండి మునులను రక్షించడానికి శివుడిక్కడ వెలిశాడని పురాణ కథనం.
చాలా దూరం నుండే ధ్యానముద్రలో, త్రిశూలం, ఢమరుకం రెండు చేతుల్లో ధరించి, అభయ వరద ముద్రలతో మరో రెండు చేతులతో కూర్చున్న భంగిమలో ఉన్న, 85 అడుగుల (25 మీటర్లు) ఎత్తు, 25 అడుగుల వెడల్పున్న శివుని విగ్రహం, ముదురు ఇటుక రంగులో ఉన్న ఆలయగోపురం మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. వాటిని చూసుకుంటూ, ముందుకెళ్తే పెద్ద ఆర్చి మనకి స్వాగతం పలుకుతుంటుంది.
ఇంకా దగ్గరికి వెళ్తే, చుట్టూ ప్రాకారంతో, ప్రవేశద్వారంతో ఆలయముంటుంది. ఎత్తైన ప్రధాన ఆలయగోపురం, దాని ముందు రెండు చిన్న గోపురాలు కనిపిస్తాయి. ప్రధాన గోపురం ఒకదానిపై ఒకటిగా ఉన్నట్టున్న ఐదు గోపురాలతో, గోపురశిఖరం పెద్ద కలశాకారంలో, దాని ముందున్న భాగమంతా చిన్న చిన్న కలశాలతో… మిగిలిన ఆలయాల్లా కాకుండా ఈ ఆలయ నిర్మాణం భిన్నంగా అనిపించింది. ముదురు ఇటుక రంగు, గంధం రంగుల కలయికతో అద్భుతంగా కనిపించింది.
బయటినుండే క్యూలైన్లలో ప్రవేశించి, హాలులోకి వచ్చాక, అక్కడ టికెట్టు (అభిషేకానికి టికెట్ ₹ 200), పూజాసామాగ్రి తీసుకోవాలి. గర్భగుడి ముందు నుండి కుడివైపు నుండి ఎడమవైపు సాగే క్యూలైన్లోనే మనకు జ్యోతిర్లింగ దర్శనం అవుతుంది. అభిషేకం టికెట్లు తీసుకున్న వాళ్లకి గర్భగుడి లోపలికి ప్రవేశముంటుంది.
పూజా సామాగ్రి (కొబ్బరికాయ, ప్రసాదం, వెండి నాగుల ప్రతిమలు- నాగిని నాగేశ్వర జంట ప్రతిమలు, కలశంలో జలం) టికెట్టు ₹ 250. ఒక గ్రూపుగా 10 మందిని లోపలికి పంపిస్తారు. ఒక పూజారి మంత్రాలు చదువుతుంటే, గర్భగుడిలో శివలింగం ముందు చుట్టూ కూర్చొని, నామగోత్రాలు చెప్పుకొని, మనమే పూజ చేసుకోవాలి. ఇక్కడ స్వయంగా మనమే శివునికి అభిషేకం చేస్తాం. అలా ఐదునిమిషాలు లోపల కూర్చుని పూజ చేసుకున్నాం. జ్యోతిర్లింగం వెనుక ఉన్న కుడ్యంపై నాగేశ్వరి (పార్వతి) అమ్మవారి ప్రతిమ ఉంటుంది. మన దేవాలయాల్లోలా యిక్కడ కొబ్బరికాయ కొట్టరు. హోమంలో వేస్తారు.
గర్భగుడి ఎదురుగా నల్లని శిలతో చేసిన పెద్ద నంది, ఎత్తైన స్తంభాలపై నిర్మించిన హాలులో ఉంటుంది. దాని ముందు తాబేలు ప్రతిమ ఉంటుంది (సోమనాథ్ లో కూడా అలాగే ఉంది). హాలులో ఉన్న క్యూలైన్ల నుండి ఏడెనిమిది మెట్లు దిగి క్రిందకు వెళ్ళి, మరల అన్ని మెట్లెక్కి గర్భగుడిలోకి ప్రవేశిస్తాం.
నందివిగ్రహం ప్రక్కన నిలబడి ఎంతసేపైనా దర్శనం చేసుకోవచ్చు. హాలు చాలా పెద్దది కాబట్టి, అక్కడ కూర్చొని ఎంతసేపైనా ధ్యానం చేసుకోవచ్చు. దర్శనం ఉదయం 5: 30 నుండి రాత్రి 9 వరకు ఉంటుంది.
హాలులో నందికి వెనుకగా కాస్త దూరంలో దాని అమ్మవారి ఉపాలయం, వెనుక పెద్ద త్రిశూలం, ఉంటాయి. అమ్మవారి దర్శనం చేసుకుని, ఆలయం బయటికి వస్తే మర్రిచెట్టు క్రింద పాల రాతితో చెక్కబడిన, నంది వాహనం, దానిపై కూర్చున్న శివపార్వతులను, వారి ఒడిలో ఉన్న విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యులను దర్శనం చేసుకున్నాం. తర్వాత దీని ఎదురుగా ఉన్న వృక్షం దగ్గరున్న శనీశ్వరుని దర్శనం చేసుకున్నాక, ఆలయం వెనుకభాగంలో ఉన్న పుష్కరిణి (నాగేశ్వర చెరువు) దగ్గరికి వెళ్ళాం. చాలా పెద్దదిది. ఇందులో దిగడానికి, ఆలయ వెనుకభాగం నుండి మెట్లు లేవు. బయట నుండి ఉన్నాయి. మెయింటెనెన్స్ అంత బాగాలేదు. గాని, అందులో ఉన్న పెద్ద పెద్ద చేపలను చూస్తూ చాలాసేపు గడిపాం.
ఆలయం లోనికి మొబైల్ ఫోన్లను, బ్యాగులను ఎలౌ చేశారు. లోపల మూలవిరాట్టు (శివలింగం)ను ఫోటోలు తీసుకున్నా ఎవరూ ఏమీ అనలేదు.
ఆలయానికి ముందే షాపులు, పార్కింగ్ ప్లేస్ ఉన్నాయి.
నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకకు దగ్గరగా ఉండడంతో, ఈ క్షేత్రానికి వచ్చేవారు, ఇక్కడకు దగ్గరలో ఉన్న ద్వారక, గోపిక తలాబ్, బేట్ ద్వారక, రుక్మిణి ద్వారక కూడా సందర్శిస్తారు.
గోపిక తలాబ్: కృష్ణుడు, అవతార సమాప్తికి ముందు, ద్వారకను విడిచి పెట్టినప్పుడు, గోపికల బాధ్యతను అర్జునునికి అప్పచెప్తే, గోపికలను తీసుకొని హస్తినాపురానికి వెళ్తున్నప్పుడు, త్రోవలో బందిపోట్లు దాడి చేస్తే, అర్జునుడు ఓడిపోయాడట. దాంతో గోపికలు బందిపోట్లకు చిక్కకుండా, యీ చెరువులో దూకి ప్రాణత్యాగం చేశారట. అందుకని ఈ చెరువుని పుణ్యస్థలంగా భావిస్తారు అక్కడివాళ్ళు. ఆ ప్రక్కనే శ్రీకృష్ణుని ఆలయముంది.
బేట్ ద్వారక: ఓఖా ద్వీపకల్పంలో వుంటుందిది. దీనిని అంతర్ ద్వీపం లేదా శంఖోదర ద్వీపమని (శంఖాలు ఎక్కువగా దొరుకుతాయని) కూడా అంటారు. శ్రీకృష్ణుడు అష్ట భార్యలతో నివాసముండే అంతఃపురమిది. ఇక్కడ నివాసం, ద్వారకలో పాలన. అంతకుముందు బోట్లో వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు బ్రిడ్జి కట్టారు. బస్సును పార్కింగ్ ప్లేసులో పెట్టి అక్కడ నుండి ఆటోలో వెళ్లాలి. మూడు, నాలుగు కిలోమీటర్లు ప్రయాణించి బేట్ ద్వారక చేరుకున్నాం. ఇక్కడ మధ్యాహ్నం ఒంటిగంటకి ఆలయం మూసేస్తారు.
ఇక్కడ ద్వారకాధీశుడు ఎత్తైన మంటపం మీద, రెండడుగుల ఎత్తులో, నల్లరాతిలో, మూసిన కన్నులతో దర్శనమిస్తాడు. ప్రక్కనే రాధ, లక్ష్మి ఆలయాలున్నాయి. దుర్వాస మహాముని శాపమివ్వడంతో రుక్మిణి ఆలయం ఇక్కడ కాకుండా, రుక్మిణి ద్వారకలో ఉంటుంది.. దర్శనం చేయిస్తామని, మన చుట్టూ చాలామంది తిరుగుతారు. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు. కుచేలుడు శ్రీకృష్ణునికి బియ్యమిచ్చి, అతని కృప యెలా పొందాడో చెప్పి, అన్నదానానికి డొనేట్ చెయ్యమని మన వెంట పడతారు.
ఇక్కడ మొబైల్ ఫోన్లను, బ్యాగులను లోపలికి అనుమతించరు. ఇక్కడ స్కూబా డైవింగ్, తదితర వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి.
దండివాలా హనుమాన్ టెంపుల్: హనుమాన్, అతని కుమారుడు మకరధ్వజుని విగ్రహాలు సింధూర వర్ణంలో … ఎడమ చేతి వైపు గణేష్, కాలభైరవుని విగ్రహాలున్నాయి.
రుక్మిణి ద్వారక: అందమైన పాలరాతి విగ్రహం. అమ్మవారిని దర్శించుకున్నాం. ఒక ప్రక్కగా శివాలయం, హనుమాన్ మందిరం ఉన్నాయి.
ద్వారక: బడా చార్ థామ్ యాత్రలో ఒకటైన, దివ్య దేశాలలో ఒకటైన, ద్వారకాధీశుని ఆలయం పెద్ద ప్రాంగణంలో, ఉపాలయాలతో, శారదాపీఠంతో కూడి వుంటుంది. ఈ ఆలయం 5 అంతస్తులతో, 72 స్తంభాలతో అతి సుందరంగా వుంటుంది. దీనిని జగత్ మందిరని కూడా అంటారు. ఆలయం 200 బిసి లో కట్టబడినదని, తర్వాత పునర్నిర్మించబడినదని, పురావస్తు పరిశోధనలు తెలియచేస్తున్నాయి.
ద్వారకాధీశుని రెండడుగుల ఎత్తైన విగ్రహం, పెద్ద పీఠం మీద ఉంటుంది. శ్రీకృష్ణుడిక్కడ కన్నులు మూసుకునే ఉంటారు. ద్వారకాధీశుని చేతుల్లో శంఖం, చక్రం, గద, కలువ పువ్వు ఉంటాయి. మూలవిరాట్టుకు రోజుకి ఆరుసార్లు అలంకరణ చేస్తారు. అలాగే ధ్వజపతాకాన్ని కూడా ఆరుసార్లు మారుస్తారు. అలంకరణ చేసినప్పుడు, తెరలు వేసి, హారతి యిస్తూ తెరలు తీస్తారు. హారతి ఇస్తున్నప్పుడు చూడడం గొప్ప అనుభూతి.
నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శనానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతాలను సందర్శించడం మర్చిపోవద్దు

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పసిదనంతో ప్రయాణం (కాలమ్ 11)

కొత్త లోకాలు (కాలమ్ 3)