అనుభవాలకు ఆదికావ్యం ఆడదాని జీవితం…

పాటలు ఎన్నో రకాలు. కొన్ని పసిగీతాలు కొన్ని ముగ్ధత్వాన్ని నింపుకున్నవి. కొన్ని ప్రౌఢలు మరికొన్ని వయసు పండిన అనుభవాన్ని నింపుకుని, యిటు ముగ్ధత్వాన్నీ దాచుకున్నవి. అలాంటి పాటే ఈ గీతం. అనుభవాన్ని-అనుభూతిని పంచే అనుభవాల ఆదికావ్యం. సందర్భానికనుగుణంగా నేపథ్యంలో రెండుసార్లుగా వినిపించే గీతాపాఠం. రెండు భిన్నమైన దారుల్లో ఈ పాట ప్రయాణిస్తుంది.

ఎన్నో పుటల రాగపరిమళం మగువ జీవితం. అందులో ఎన్నో దశలు. యవ్వనం ముందు జీవితానికి కావల్సినంత మరంద జ్ఞాపకం. కలలకు చిరునామా ఆ ప్రాయం. ఊహల ఉనికి ఆ వయసు. ఇన్ని వలయాల్ని ఏ తడబాటూ లేకుండా పొరపాటు చేయకుండా దాటితే జీవితం ఆసాంతం వాసంతికా పరాగమే. కానీ ఎగిసే మనసుని ఉరికే వయసుని అంత సులభంగా ఆపేదెలా! ఇన్ని మోహవలయాల్ని ఛేదించేదెలా! దానికి ఒకటే మార్గం కట్టుబాటు. మనకు మనం చేసుకునే ఒడంబడిక. మన చుట్టూ గీసుకునే గీత. ‘నాలాగా ఎందరో!’ చిత్రం కోసం ఆత్రేయగారి అక్షరాల నుంచి అనుభవసారంలా సాగిన ఈ గీతం ఆ వయసు పాడుకునే సంబరమే కాదు నేర్చుకోగలిగినంత పాఠం కూడా.

పల్లవి : అనుభవాలకు ఆదికావ్యం
ఆడదాని జీవితం
అందులో ఇది మొదటి వాక్యం
ముందు రాగల కథకు భాష్యం…
అనుభవాలకు ఆదికావ్యం
ఆడదాని జీవితం…

సమాజం ఎంత మారినా మధ్యతరగతి జీవితాలు మారవు. మార్పు జరుగుతున్నా మారడానికిష్టపడని, మార్పును అంతగా అంగీకరించని మనుషులు అక్కడ కనిపిస్తారు. తర్వాత తరం చెప్పినా అర్థం చేసుకోని కఠినత్వం, మరో మాటలో చెప్పాలంటే ఛాందసం. బిడ్డల మీద మమకారం తప్ప కొన్ని పరిధులను దాటి ఆలోచించలేని తల్లిదండ్రులు. కొత్తగా ఒక అడుగు ముందుకు వేయాలంటే ఎంతో ఆలోచన. లోకం వేలెత్తి చూపుతుందేమోననే భయం. కొన్ని దశకాల క్రితం పరిస్థితులివి. ఒక్కోచోట తండ్రి ఎదుట పిల్లలు తమ అభిప్రాయాలను చెప్పుకునే స్వాతంత్రం కూడా సరిగా లేకపోవడం ఆ పరిస్థితులను మరింత దించింది. ఏదైనా తేడా జరిగితే దేవుని రాతలు అని సరిపుచ్చుకునే తత్వం, తమను తాము సమర్ధించుకునే తీరు బాధిస్తుంది. పర్యవసానం జీవితాంతం మూటగట్టుకునే వేదన. ఇన్నింటిని మోసిన జీవితమే ఈ చిత్రంలోని నాయిక కళ్యాణిది.

అందుకేనేమో ఆత్రేయగారు ఒక్క వాక్యంలో స్త్రీ మనుగడను ఆదికావ్యంతో పోల్చారు.

1చ : దేవుని రాతలు మనుషుల ఆశలు
కలసిన నాడు కల్యాణయోగం
కలసిన హృదయాల కళ్యాణిరాగం…
అనుభవాలకు ఆదికావ్యం
ఆడదాని జీవితం…

దివ్యాంగుడైన ఒక మధ్యతరగతి తండ్రి కూతురు వివాహం కోసం చేసే పోరాటం ఈ చిత్రం. జరిగిన కొన్ని సంఘటనల కారణంగా తన మనసు అద్దం మీదకు రాబోయే పురుషుడిని గురించిన భయం-ఆందోళనలు, పెళ్లిచూపుల వేధింపులకు కుంగిపోకుండా విలువలను కాపాడుకుంటూ నడిచే కూతురు, వీరిరువురి కథే ఈ చిత్రం.

2చ : చిన్నతనాన చిరుహృదయాన
పెద్దలు నాటిన వావీ వరుసలు
కన్నెతనాన కన్నులు కలిసిన
తొలి నిమిషాన తొడిగెను మొగ్గలు
ఇంకా నీకిీ సిగ్గెందులకు
నీ సిగ్గే అందం అతని కళ్ళకూ…
అనుభవాలకు ఆదికావ్యం
ఆడదాని జీవితం…

ఒక కన్నె హృదయంలోని కలలు-కోరికలు పెద్దల నీడన పెంచుకున్న ఆశలు-సంతోషాలు. ముచ్చటగా దోబూచులాడే వయసు ఉరకలు, అదుపు చేస్తూ నిలువరించే సంస్కారం, పెరిగిన వాతావరణం, తల్లిదండ్రుల పెంపకంలోని నెమ్మదితనం అన్నీ అందంగా అక్షరాలలో నిండిన నిత్యనూతన ఆనందాలు.

ఒకప్పుడు చిన్నతనాన్నుంచే వరుసలు కలిపి మాట్లాడడం అనేది తెలిసిన విషయమే. కేవలం అది పరాచికానికే కాక పెద్దవుతున్నకొద్దీ నా సొంతం నా హక్కు అని అధికారం చూపే స్థాయికి అవతలి వ్యక్తి మారిపోటం, ఇవతలి మనిషి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా కట్టుబాట్లని అతిక్రమించడం. అటువంటి పురుషుడిని ఏ యువతీ కావాలనుకోదు. అది ఎంత దగ్గర బంధమైనా తన అభిప్రాయానికి గౌరవం లేని చోటును ఏ స్త్రీ అంగీకరించదు.

వావీవరుస ఉన్న బావ చలపతి కారణంగా కళ్యాణి జీవితం విషాదంలో కూరుకుపోతుంది. సగటు ఆడపిల్లల జీవితానికి వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టంగా ఉన్న ఆ దశలో చుట్టూ పరిస్థితులు, మనుషులు ఆ భావనను మరింత బలపరచటం మరోకారణం.

3చ : నింగిని అంటే పొంగుల వయసును
నేలను ఏలే ఊహల మనసును
దేవుడు ఎపుడో రాసున్నాడని
దీవించి కలిపింది మన సంప్రదాయం
మనసుకు చాలమ్మా మమకారం
తనువుకు కావాలి మంగళసూత్రం…
అనుభవాలకు ఆదికావ్యం ఆడదాని జీవితం….

మనసుకు చాలమ్మా మమకారం…తనువుకు కావాలి మంగళసూత్రం…ఎంత చక్కటి నిజం. పాటను దేదీప్యం చేస్తూ ఆత్రేయగారి చిరునామాను పట్టి ఇచ్చే వాక్యాలివి.

మన సంప్రదాయాన్ని, విలువలను సుతిమెత్తగా వివరించిన వారి కలం నైపుణ్యానికి, పితృవాత్సల్యంతో అందించిన అక్షరాశీస్సులకి శిరస్సు వంచి వందనం చేయాలి. ఏ కాలానికైనా అనుగుణంగా కాలానికి అతీతంగా నిలిచే అక్షరసత్యాలివి.

ఎన్నో సంబంధాలు ఏవో కారణాల వలన దాటిపోగా చివరకు మంచి మనసున్న యువకుడు అంధుడైన ప్రభాకర్ ని చేసుకుందామనుకున్న తరుణంలో ప్రమాదానికి గురై అతను చనిపోతాడు. ఆమె మనసు అద్దంమీద గాఢంగా పడిన అతని బొమ్మ పగిలిపోతుంది. అప్పటివరకూ వివాహ విషయంలో జరిగిన పరిణామాలతో అలసిన ఆమె మనసు ఇష్టపడిన మనిషి కూడా దూరమవడంతో స్థిమితాన్ని కోల్పోతుంది. అందరూ ఉన్నా ఒంటరిగా దీనలా మిగిలిపోతుంది. విషాదం అంచున ఆమె జీవితం మరల మొదలవుతుంది.

మానసికంగా ఆమె వివాహం జరిగిపోయింది. ప్రభాకర్ చనిపోయిన సందర్భంలో నేపథ్యంలో వినిపించే ‘అనుభవాలకు ఆదికావ్యం ఆడదాని జీవితం అందులోని ప్రతి మలుపూ ఆశనిరాశల నిట్టూర్పు…’ ఆత్రేయ కలంలోంచి ఊపిరి పోసుకున్న ఈ వాక్యాలు బాలు వెర్షన్ లో బరువుగా వెలువడుతూ కళ్యాణి జీవితంలోని నిలువెత్తు వేదనను అశ్రురాగంలో వినిపిస్తాయి. విధి ఆమె నుదుటి రాతను చెరిపివేస్తే, కన్నీటితో నిండిన అరచేయి అసంకల్పితంగానే నుదుటి తిలకాన్ని తుడిచివేస్తుంది. బాలు పాడిన ఈ పాట బావ చేసిన మోసానికి బాధపడే సన్నివేశంలో మొదటిసారి వినిపిస్తుంది.

చ : వావీ వరుసలు మనసుకు కావమ్మా
మనుషులు అల్లిన మాటల వలలమ్మా
వేటగాడికి వలపుండదమ్మా
లోబడితే నీ బ్రతుకుండదమ్మా
నీ కథలో ఇది ఒక తొలి మలుపూ
నిను కన్నవారికి మేలుకొలుపూ…

ఎంత సందర్భోచితమైన పదచిత్రణ. పదానికి దీటుగా స్వరం, బాలు గళం బాధను కురిపిస్తూ మనసుల్ని మేల్కొల్పుతుంది.

ఆత్రేయ కలం చిందించిన ఈ అక్షరపాఠాన్ని ఎమ్మెస్ విశ్వనాథన్ గారు అద్భుతంగా స్వరకల్పన చేశారు. మొదటి వెర్షన్లో ఈ పాటను సుశీలగారు ఆలపించిన తీరు సుమధురం. సుమనోహరం. భావాన్ని పెద్దరికంగానూ పాటను మృదువుగానూ గానం చేయడంలో వారికి వారే సాటి.

ఆదికావ్యం అన్నచోట దీర్ఘంగా తీసిన ఆలాపన అగాధమంత లోతు ఉన్న స్త్రీ అంతరంగాన్ని గాఢంగా చూపుతుంది. సుశీలగారి గళంలో గమకాలు చాలా సున్నితంగా, భావపూరితంగా పాటను మనోదర్శనం చేస్తాయి. చరణాల నడుమ వచ్చే స్వరాలాపనలు, చివరిలో దీర్ఘంగా వచ్చే గమకాలు మరింత అపురూపం. కళ్యాణం గురించి కళ్యాణి కన్న కలల పరిమళాలను మోసి తెచ్చే స్వరాలవి.

నాయిక జీవితంలోని సంతోషాన్ని సుశీలగారి గళం పంచుకోగా, బాలు గళం వేదనను కురిపించింది. తెరమీద రూపాదేవి-లక్ష్మీకాంత్ పాత్రోచితంగా నటించారు. ప్రత్యేకంగా కళ్యాణి పాత్రలో రూపాదేవి నటన చాలా సహజంగా ఉంటుంది.

గణేష్ పాత్రో రచించిన ఈ ఆలోచనాపూరిత కథను ఈరంకి శర్మగారు అంతే ఆలోచనాపూరితంగా చిత్రానువాదం చేసిన తీరు అవ్యక్తమైన విషాదం.

మన జీవితం మనదే కాదు, చుట్టూ ఉన్న వారిది కూడా. కానీ వారి కోసం తల వంచుతూ మనల్ని మనం కోల్పోవడం ఎంత బాధాకరం. అందులోనూ ముఖ్యమైన విషయాలలో వేగంగా అడుగు ముందుకు వేయలేనితనం ముందు జీవితాన్ని బరువుగా చేస్తుంది. ఒకోసారి ముగింపు లేని వేదనకు లోనుచేస్తుంది. అదే ఈ చిత్ర నాయిక కథ. నాలాగా ఎందరో అంటూ సమాధానం ఇవ్వలేని ప్రశ్నను మనకు గురిపెడుతుంది.

ఇది ఒక కళ్యాణి కథ మాత్రమే కాదు. ఆనాటి వివాహ వ్యవస్థ, వరకట్న సమస్య, సంప్రదాయం పేరుతో పెళ్లిచూపులు, ప్రశ్నల వేధింపులు, లాంఛనాలు, పెట్టుపోతలు, ఆ వెనుక మరెన్నో. ఇన్నింటి మధ్యన నలిగిపోయిన మధ్యతరగతి కుటుంబాలు. వీటన్నిటినీ దాటుకుని నిలబడిన జీవితాలు. నిలబడలేక, కలబడలేక కూలబడిన కుటుంబాలు. అందరికీ ఒకసారి కన్నీటివందనం.

కళ్యాణి పలికిన చివరి మాటలు మన మనసుల మీద గాఢమైన ముద్రను వేస్తూ కలచివేస్తాయి. ‘ఎందుకమ్మా రైలు మీద రాళ్లు విసురుతున్నావు’ అన్న తండ్రి ప్రశ్నకు ‘రైలు మీద కాదు నాన్నా నా నొసటి రాతమీద విసురుకుంటున్నాను రాళ్లు. ఇవి రాళ్లు కావు నాన్నా, రాతిగుండె లోకం నా చేత రాల్పించిన కన్నీళ్లు…’ బరువెక్కిన మన మనసు బాధపడటం మాని ఆలోచించే మాటలివి.

కమర్షియల్ గా అంతగా విజయం సాధించనప్పటికీ విమర్శకుల ప్రశంసలతో పాటూ ఎన్నో అవార్డులను అందుకుందీ చిత్రం. ఈ పాటకు గాను సుశీలగారు నంది పురస్కారం అందుకోగా, బాలుగారికి తొలి నందిని తెచ్చిపెట్టిందీ గీతం.

‘దేవుని రాతలు మనుషుల ఆశలు కలిసిన నాడు కల్యాణయోగం కలసిన హృదయాల కళ్యాణిరాగం…’ కలలు కల్లలైన వేళ కళ్యాణయోగం లేని రాగం ఒంటరిగా మిగిలిపోతుంది…విధి వెక్కిరింతకు బలైన కళ్యాణి నిస్సహాయంగా దాటిపోయిన జీవితాన్ని మోస్తూ మన మనసుల్ని భారం చేస్తుంది….ఆమె జారవిడుచుకున్న జీవితం గోడమీద కన్నీటి రాతలో నిర్వికారంగా నిరాశ్రయగా….ఇదే ఆత్రేయ అక్షరం మన మనసులమీద సూటిగా ఆత్మీయంగా చెక్కిన అనుభవాల ఆదికావ్యం….

Written by Modali Padma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లోకాభిరామాయణం 2/1

నా వంగదేశ యాత్ర