అపోహ

కథ

కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి డ్రైవింగ్ స్కూల్ లో చేరింది కావేరి.

తాము ఉంటున్న గల్ఫ్ దేశంలో ఆడవాళ్ళు కూడా డ్రైవింగ్ లైసెన్స్

తీసుకుంటే మంచిదని తెలిసింది.  స్నేహితురాళ్ళు చేరితే తాను కూడా చేరింది.

పిల్లలు బడులకి వెళ్లడానికి బస్సులు ఉంటాయి  కానీ ట్యూషన్స్ లో దింపడానికి, అలాగే

పాఠశాలేతర కార్యక్రమాలకు తల్లితండ్రులే కారుల్లో పిల్లల్ని

దిగబెడుతుంటారు. తండ్రి ఆఫీసుకో, వ్యాపారానికో వెళ్లిపోతే తల్లిదే ఆ

బాధ్యత.

ఆరోజు మరో ఇద్దరు స్నేహితురాళ్ళతో కలిసి టాక్సీలో డ్రైవింగ్ స్కూల్ కి

వెళ్లింది కావేరి. తనకి కార్ డ్రైవింగ్ నేర్పే డ్రైవరు ఇంకా రాకపోవడంతో ఆడవాళ్లు వేచియిండే

గదిలో వేచి చూడసాగింది. పావుగంట తర్వాత  డ్రైవరు రావడంతో బయటికి వచ్చింది. డ్రైవింగ్ స్కూల్ లో ఉండే కార్ల వద్దకు వెళ్ళింది.

తనకు కేటాయించిన కారులో అతను పక్క సీటులో కూర్చోగా డ్రైవింగ్ స్కూల్

పరిసరాలలో నేర్చుకోసాగింది. కాసేపయ్యాక నెమ్మదిగా రోడ్డు మీదకి వచ్చింది.

మొత్తానికి గంటసేపు డ్రైవింగ్  పూర్తయ్యాక డ్రైవింగ్ స్కూల్ లో కార్ పార్క్ చేసింది.

సమయం చూసుకునేసరికి మధ్యాహ్నం రెండు దాటింది.

 “రెండో తరగతి చదువుతున్న కొడుకు  హర్విన్ బడి నుండి ఇంటికి వచ్చేసే సమయం అయిపోయింది. తాను ఇంటికి చేరడానికి ఎంత లేదన్నా అరగంట పడుతుంది. పైగా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది. ఎలా మరి?’

ఆలోచించసాగింది. భర్త అరుణ్ ఆఫీసుకి వెళ్ళాడు. సాయంత్రం వరకు కానీ రాడు. సాధారణంగా గల్ఫ్ దేశాల్లో ఉదయం ఏడు నుండి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకే బడి ఉంటుంది. ‘ఎదురింట్లో  ఉండే మలయాళీ ఫ్రెండ్  ‘జీజా’ కి తాను వెళ్ళేంతవరకు హార్విన్ ని  చూసుకోమని చెప్తే సరి’ అని అనుకుని ఆమెకు ఫోన్

చెయ్యబోయింది. కానీ ఆమెకు ఇంట్లో చంటి పాపతో కష్టమేమో అని

ఆలోచించి ఆగిపోయింది.  కానీ మళ్ళీ  ‘జీజా అత్తగారు ఈమధ్యే ఇక్కడికి వచ్చారు కదా ఆవిడని

చూసుకోమని అడుగుదాం’ అని జీజాకి ఫోన్ చేసి, విషయం చెప్పింది.

ఆమె

‘పర్లేదు, చూసుకుంటామన్నాక’ కావేరి ఊపిరి పీల్చుకుంది. తనతోపాటు డ్రైవింగ్ కి వచ్చిన

స్నేహితురాళ్ళు వాళ్ళ పిల్లలు బడి నుండి వచ్చేస్తారని ముందే

వెళ్ళిపోయారు.

కాసేపయ్యాక కావేరి ఎక్కిన టాక్సీ తమ అపార్ట్మెంట్ కి చేరగానే ముందు జీజా ఇంటికి వెళ్ళి కొడుకు

హర్విన్ ను ఇంటికి తీసుకువెళ్లింది. వాడికి బట్టలు మారుస్తుండగా

“అమ్మా!! ఆంటీ చేసిన కర్రీ సూపర్” మెచ్చుకున్నాడు. “ఏ కర్రీ?” నవ్వుతూ అడిగింది.

“కప్ప కారి అన్నారమ్మా” చెప్పాడు వాడు. ఆ పేరు వినగానే తుళ్లిపడింది.

మొహం వివర్ణమై “ఏంటీ… కప్ప  కూర తిన్నావా?” అని గట్టిగా అరిచేసింది.

“అవునమ్మా!! నువ్వు కూడా చెయ్యి.” అని అన్నాడు వాడు. కడుపులో తిప్పేసి

డోకు రాబోగా తమాయించుకుంది.

‘ఛీ ఛీ… ఏం మనుషులు వాళ్ళు… అసలు పిల్లాడికి దానితో చేసిన కూర పెడతారా?

మనమేమన్నా చైనా లో ఉన్నామా, కొరియాలో ఉన్నామా’ అని అనుకోగానే ఒళ్ళు

మండింది. వాడేదో చెప్పబోతున్నా వినకుండా  గబగబా  వాడిని బాత్రూమ్ లోకి లాగేసి టూత్ బ్రష్ పై నాలుగంగుళాల మందాన టూత్ పేస్ట్ వేసి వాడి పళ్ళు బరబరా తోమింది. “అమ్మా!! నొప్పి” అని

వాడు అరుస్తున్నా వినిపించుకోలేదు.

ఆపై సబ్బంతా అరిగిపోయేలా స్నానం చేసి, బట్టలు తొడిగి కూర్చోబెట్టి, లెక్కలు చేయిస్తుందే గాని ఆమె మనస్సు, మనస్సులో లేదు.

‘ఈయన రానీ, వాళ్ళ పని చెప్తాను’ అని పళ్ళు పటపటా కొరుక్కోసాగింది.  ‘నా బట్లర్

ఇంగ్లిష్ తో ఏదో రోజు మామూలు కబుర్లు ఐతే ఆడవచ్చు కానీ ఇలాంటి

తీవ్రమైన విషయం మాట్లాడటానికి ఈయనతో వెళ్తేనే మేలు’ అని భర్త కోసం

ఎదురుచూడసాగింది.

‘అసలు వాళ్ళు ఎదురింట్లోకి వచ్చిన దగ్గర నుండి ఎంత సహాయం చేశాను. కొంచెం

కూడా విశ్వాసం లేదు’ అని తిట్టుకుంది. సోఫాలో చేరబడేసరికి వాళ్ళతో

పరిచయం గుర్తుకువచ్చింది.

ఏడు నెలల క్రితం…

ఉదయం భర్త ఆఫీసుకి వెళ్ళాక కొడుకు హర్విన్ ని హడావుడిగా

తయారుచేయసాగింది కావేరి. ఉదయం ఏడు గంటల నుండే బడి మొదలు అయిపోతుంది

కాబట్టి ఆరున్నరకే బస్సు వచ్చేస్తుంది. ఒక్కో స్టాపు దగ్గర పిల్లలను

ఎక్కించుకుంటూ వెళ్తుంది. బయట చాలా చలిగా ఉంది. ఎడారి దేశంలో ఎప్పుడూ

ఎండే ఉంటుంది అనుకుంటారు కానీ ఎండాకాలం ఓ నాలుగు నెలలు ఉంటుంది. ఆపై

వాతావరణం హాయిగా మారి డిసెంబర్, జనవరి నెలల్లో విపరీతమైన చలిగా

ఉంటుంది. ఇంట్లో కూడా స్వెటర్స్ వేసుకోవాల్సిందే.

“మీ నాన్న ఉదయం ఐదు గంటలకే ఆఫీసుకి వెళ్ళిపోయారు. నువ్వు కానీ బస్సు

ఎక్కలేదనుకో ఎలా దిగబెట్టగలను? అసలే నాకు డ్రైవింగ్ రాదు. పద తొందరగా”

అని కొడుకుని గబగబా లిఫ్ట్ దగ్గరికి లాక్కెళ్ళింది కావేరి.

కిందకి వచ్చేసరికి హర్విన్ ఎక్కాల్సిన బస్ స్టాప్ లో అప్పటికే ఆ బడికి

చెందిన విధ్యార్ధులు, విధ్యార్ధినులు వచ్చేసి వేచి చూస్తున్నారు.

కాసేపయ్యాక కొడుకుని బస్సు ఎక్కించాక అపార్ట్మెంట్ చుట్టూ ఓ నాలుగు

అడుగులు వేసి, ఇంటికి రావడానికి లిఫ్ట్ దగ్గరికి వచ్చింది. అప్పటికే అక్కడ ఒక పడుచు

జంట, చిన్న బాబు ఉన్నారు. అతను సంవత్సరం నిండని చంటిపాపని ఎత్తుకున్నాడు.  వాళ్ళ పక్కన కొన్ని సూట్కేసులు ఉన్నాయి. మొదటిసారి వాళ్ళని చూస్తుంది.

లిఫ్ట్ కిందకి రాగానే అందరూ లోపలికి వెళ్ళాక అతను నాలుగో అంతస్తు బటన్

నొక్కాడు. ‘ఐతే వీళ్ళు కూడా తమ అంతస్తే’ అని అనుకుంటూ వాళ్లవైపు చూసి

పలకరింపుగా నవ్వింది కావేరి.

బయటికి వచ్చాక వాళ్ళు కూడా తనతోపాటే వస్తుండటంతో ‘మా ఎదురింట్లోకి

వస్తున్నారా ఏమిటి?’ అనుకుంది.

ఆమె అనుకున్నట్లుగానే అతను ఎదురింటి తలుపు తెరిచాడు. భార్యా పిల్లలని

లోపలికి తీసుకువెళ్తుండగా “ఎక్స్ క్యూజ్ మీ. నా పేరు కావేరి. మేము ఎదురుగా

ఉంటాము. కొత్తగా వచ్చినట్లున్నారు. ఏదైనా అవసరం ఐతే అడగండి.” అని

నవ్వుతూ ఆంగ్లంలో చెప్పింది కావేరి.

ప్రతిగా కొత్తగా వచ్చిన ఆమె మోములో ఆనందం.

“థాంక్ యు సో మచ్. మై నేమ్ ఈజ్ మిథున్. షి ఈజ్ మై వైఫ్ జీజా, దీజ్ ఆర్

అవర్  కిడ్స్. వుయ్ ఆర్ ఫ్రమ్ కేరళ.” అని మిథున్  పరిచయం చేసుకున్నాడు.

‘ఓహో మలయాళీలా…’ అని అనుకుంటూ జీజా వైపు పరిశీలనగా చూసింది కావేరి. వంకీలు తిరిగిన

నల్లటి పొడవు జుట్టుతో, పెద్ద కళ్ళతో అందంగా ఉంది. అందుకే కాబోలు కేరళ

వాళ్ళను కూడా ఎక్కువగా మన సినిమాల్లో హీరోయిన్స్ గా తీసుకుంటారు అని

నవ్వుకుంది కావేరి.

ఇంట్లోకి రాగానే వేడిగా టీ చేసి, పిల్లల కోసం బిస్కట్స్ తెచ్చి జీజా ఇంటి

కాలింగ్ బెల్ కొట్టింది కావేరి. తలుపు తీసిన ఆమెకు ట్రే అందివ్వబోతుంటే

వద్దంటూ మొహమాటపడింది. పర్వాలేదు తీసుకొమ్మంటూ ఆంగ్లంలో

మాట్లాడుతూ, సైగలతో ఇచ్చింది కావేరి. అది మొదలు రెండు ఇళ్ల మధ్య

రాకపోకలు మొదలయ్యాయి. ఇద్దరు  అబ్బాయిలు కూడా ఒకే వయస్సు

వాళ్లవడంతో ఎక్కువగా కలిసి ఆడుకునేవారు.

కావేరి భర్త అరుణ్ ని అడిగి తన

కొడుకుని కూడా హర్విన్ బడిలోనే జాయిన్ చేశాడు మిథున్.

చంటిపాప ఉండటంతో కొడుకుని బస్ స్టాప్ దగ్గర దింపడం జీజాకి కుదరకపోతే, ఆ

అబ్బాయిని కూడా తన కొడుకుతో పాటే బస్ ఎక్కించేది కావేరి.

ఓరోజు మధ్యాహ్నం జీజా కంగారుగా కావేరి ఇంటి తలుపు తట్టింది. “బేబీ …

బేబీ …” అని ఏడవసాగింది. “ఏమయ్యింది…” అని జీజా ఇంట్లోకి గాబరాగా

పరిగెట్టింది కావేరి. మంచం మీద ఉన్న పాప విపరీతంగా ఏడుస్తుంది. జ్వరంతో

ఒళ్ళు కాలిపోతుంది. తండ్రి మిథున్  ఆఫీసుకి వెళ్ళేసరికి పాపకి ఒంట్లో బాగానే ఉంది.

“అరెరె!! ఐ విల్ టెల్ టు మై హస్బండ్. అదృష్టవశాత్తు ఈయన ఇంట్లోనే

ఉన్నారు.” అని తన ఇంట్లోకి పరిగెత్తి భర్తను తీసుకొచ్చి హడావుడిగా

హాస్పిటల్ కు పరుగుతీయించింది. అక్కడ వైద్యం అయ్యాక ఇంటికి

తీసుకొచ్చి, పాపను పడుకోబెట్టింది జీజా.

సాయంత్రం ఇంటికి వచ్చిన మిథున్ “థాంక్ యు సో మచ్ ఫర్ యువర్ కైండ్

హెల్ప్” అంటూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అరుణ్ చేతులు

పట్టుకున్నాడు.

“ఇట్స్ ఓకే నో ప్రాబ్లెమ్. యాజ్ వుయ్ ఆర్ నైబర్స్.

వుయ్ నీడ్ టు హెల్ప్ ఈచ్ అదర్” అని మిథున్ భుజంపై చెయ్యి వేసి

ఓదార్చాడు అరుణ్.

చిన్న పిల్లలతో పనులు కష్టంగా ఉండటంతో మిథున్  తల్లితండ్రులను వీసాపై

తీసుకువద్దామని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అతని తండ్రికి ఊర్లో పనులు

ఉండటంతో రాలేకపోయాడు. కానీ తల్లి ‘సోలీ’ రాగలిగింది.

ఆమెను పలకరించడానికి వచ్చిన కావేరికి తినమని అరటికాయ చిప్స్, అరటిపండు

హల్వా ఇచ్చారు. వాటిని మొదటిసారి తినడంతో ఆమెకి బాగా నచ్చాయి. సోలీ

దగ్గర నేర్చుకున్న కొబ్బరి పాలు వేసి వండే కూరలు నచ్చేవి అరుణ్ కి కూడా.

సోలీ వచ్చాక ఇంట్లో సందడి పెరిగింది. సాధారణంగా గల్ఫ్ దేశాల్లో

కేరళవాళ్ళు తరతరాలుగా ఉండటంతో తనకు తెలిసిన కొందరు బంధువుల ఇంటికి వెళ్ళి

వస్తుండేది సోలీ.

‘వాళ్ళతో కాలం  బాగానే గడుస్తుంది అనుకుంటుండగా ఈరోజు ఇలా అయ్యింది’ అని

నిట్టూర్చింది కావేరి.

కాలింగ్ బెల్ మోగింది.

కావేరి  లేచి వెళ్ళి తలుపు తీసేసరికి అరుణ్ ఆఫీసు నుండి

వచ్చాడు. ఉదయం ఐదు గంటలకు వెళితే ఇప్పుడు రాత్రి ఏడు అయ్యింది. ఆఫీసు

ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు అంటే పన్నెండు గంటలు రానుపోనూ

ప్రయాణంతో కలిపి పద్నాలుగు గంటలు…

అరుణ్ లోపలికి రాగానే విషయం చెప్పింది. అతను కూడా అవాక్కయ్యాడు. “నేను

ఫ్రెష్ అయ్యి వచ్చాక వాళ్ళింటికి వెళదాం” అంటూ బాత్రూమ్ లోకి దూరాడు.

కాసేపయ్యాక హార్విన్ ని తీసుకుని ఇద్దరూ జీజా ఇంటికి వెళ్లారు.

“ఈరోజు మా అబ్బాయి వచ్చినప్పుడు తినడానికి ఏం పెట్టారు?” అని

నెమ్మదిగా అడిగాడు అరుణ్. తమనే చూస్తున్న తల్లితో మలయాళంలో

చెప్పాడు మిథున్.

“కప్ప కారి (కూర)” అని నవ్వింది సోలీ.

“చూసారా? నేను చెప్పాను కదా” అని కోపంగా కళ్ళు తిప్పింది కావేరి, అరుణ్ ని

చూస్తూ.

 “కప్పా, కప్ప… దేనితో చేస్తారు” అని అనుమానంగా అడుగుతున్న

కావేరితో “ఒరు నిమిషం. నీంగళ్ అథు రుచిచునొక్కువో” అని సోలీ లోపలికి

వెళ్లింది.

“ఓరి దేవుడో!! మా కొడుక్కి పెట్టిందే కాకుండా మాక్కూడానా” అని గుండెలు

దడదడలాడసాగాయి  ఇద్దరికి. అక్కడి నుండి పారిపోవాలనిపించింది.

ఓ గిన్నెలో కూర  తీసుకొచ్చి వాళ్లకిచ్చింది సోలీ.

వణుకుతున్న చేతులతో అందుకున్న ఆ గిన్నెలో చూసేసరికి పసుపు రంగులో ఓ

ముద్దకూర ఉంది.

భయపడ్డట్టుగా లేదు.

హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని   “ఈ కూర ఏమిటి ?” కుతూహలంగా అడిగింది కావేరి.

“కర్రపెండలం ముక్కల్ని ఉడకపెట్టి, పోపు వేసి, కొబ్బరి పాలతో చేశాము.”

జీజా ఆంగ్లంలో చెప్పింది.

“ఓహ్… కర్ర పెండలంతో కూరా…?” గట్టిగా నవ్వేసారు అరుణ్, కావేరి లు  “మేము కర్ర పెండలం ఉడకబెట్టుకునే తింటాo కానీ ఇలా కూర వండుకుంటారని తెలియదు.” చెప్పింది  కావేరి.

 ‘పదంలో అర్ధం తేడా వలన ఎంత అపోహపడ్డాం.’ అని నవ్వుకుంటూ తమ ఇంటికి బయలుదేరారు కావేరి, అరుణ్ లు

Written by Madhavi Baitaru

పేరు: మాధవి బైటారు.
కలం పేరు: దేవి తనయ.

వారి భర్తగారి ఉద్యోగరీత్యా ప్రస్తుతం ఖతార్ దేశంలో ఉంటున్నారు. అక్కడ ఒక అంతర్జాతీయ పాఠశాలలో ఏడేళ్లు ఉపాధ్యాయునిగా చేశారు.

2022 జనవరి నుండి రచనా వ్యాసంగం మొదలుపెట్టారు.

పోటీకి పంపిన మొదటి కథకు, మొదటి నవలకు, మొదటి కవితకు బహుమతులు రావడం దేవుడి దయగా నమ్ముతారు.

ఉషా పత్రిక నిర్వహించిన నవలల పోటీలో పదివేల రూపాయల బహుమతి లభించింది.
ఈనాడు ఆదివారం అనుబంధంలో కథ ప్రచురితం అయ్యింది.
ఇప్పటివరకు షార్వాణి, సహరి, విశాలాక్షి( 3 సార్లు), మాధురి, తపస్వి మనోహరం( 3 సార్లు), సంచిక, సుమతి, శ్రీశ్రీ సాహిత్య సమితి, వంశీ - సాహితీ కిరణం సంస్థ ... పత్రికల పోటీలలో బహుమతులు పొందగా మరికొన్ని పోటీలలో సాధారణ ప్రచురణకు ఎంపికయ్యాయి.

ప్రత్యేకంగా ముద్రించిన పలు పుస్తకాలలో వారి కథలు, కవితలు, వ్యాసాలు చోటు చేసుకుంటున్నాయి.

వారి మొదటి పుస్తకం 'శరణు శరణు ' జనవరి 2023 లో వెలువడింది.
వంశీ రామరాజు గారి సంస్థ ద్వారా రవీంద్ర భారతిలో సన్మానం అందుకున్నారు.

2024 నవంబర్ లో Qatar లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనే అవకాశం దక్కింది.
అంతర్జాతీయ పాఠశాలలో జరిగిన కెరీర్స్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

వంటలు చేయడం ఇష్టం. వంటల పోటీలలో పలు బహుమతులు పొందడమే కాకుండా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.

వివిధ కూరగాయలతో చేసే ' vegetable carving' లో ప్రథమ బహుమతి పొందారు.

అలాగే ముగ్గుల పోటీ, బాడ్మింటన్, త్రో బాల్ ఆటల్లో కూడా బహుమతులు అందుకున్నారు.

వివిధ కార్యక్రమాలకు యాంకరింగ్ చేశారు.

రెండు యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి.

వివిధ materials తో క్రాఫ్ట్స్ చెయ్యడమంటే ఇష్టం.
సామాజిక కార్యక్రమాలు అంటే ఆసక్తి.
అంతర్జాతీయ Toast masters club లో పది ఉపన్యాసాలు ఇచ్చారు.

అలాగే వారు ఉంటున్న కాలనీలోని పిల్లలకు తెలుగు ఉచితంగా నేర్పించడంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయించారు.
Qatar
+974 33952728
+91 8143602038

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శిఖరానికి ఆఖరి మెట్టు

ఓమంచి పుస్తకం