హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఏ విషయం రాయబోతున్నానో దానికి ముందర ఈ ఉపోద్ఘాతం మీ ముందు ఉంచుతున్నాను. అదేంటంటే నేను కొన్నేళ్ళగా మా ఇంట్లో, డ్రాయింగ్ రూమ్ లో బుద్ధుడి విగ్రహం పెట్టాను. కారణం….! ఏదో ఒకనాడు నాకు కూడ ఆయన లాగా జ్ఞానోదయం కలగకపోతుందా అన్న ఆశతో నన్న మాట. అలా కొన్నేళ్ళు గడిచిపోయాయి. ఉన్నట్టుండి ఓ రోజు నాకు జ్ఞానోదయం లాంటిదే ఓ ఆలోచన వచ్చింది. హా ఈ ప్రపంచంలో ఆడవాళ్లకి ఎంత అన్యాయం జరిగిపోతోంది, అన్న ఆలోచన అన్నమాట. ఇంతకీ ఏమిటా అన్యాయం ఏమా కథ అంటున్నారా…! ఆగండాగండి అంత తొందర అయితే ఎలా అక్కడికే వస్తున్నా. కానీ తీరా చెప్పాక ఆఁ ఇదేం కొత్త విషయమా మీరు జ్ఞానోదయం లెవెల్‌కి తీసుకెళ్లారు , ఇదెప్పటినుంచో చర్విత చర్వణం అయిన విషయమే కదా అని సన్నాయి నొక్కులు నొక్కకుండా నేను చెప్పేది వినండి ఏం..?సరే ఇక అసలు విషయానికి వద్దాం! మన యేషియన్ కంట్రీల్లో ముఖ్యంగా మన దేశంలో ఈ పక్షపాత దృక్పథం అంటే మగవారికో రూలు ఆడవారికి ఓ రూలు అనాదిగా నిర్ణయింపబడిపోయాయి. ఆడవాళ్లు కూడా ఈ అన్యాయానికి అలవాటు పడిపోయారనే చెప్పాలి. నాకీ ఆలోచన వచ్చాక నాకు అత్యంత సన్నిహితురాలైన మా నిర్మల పిన్నితో మాట్లాడాను. తన వయసు 70 ఏళ్ళు మా బాబాయ్ కి 75 ఏళ్ళు. మా బాబాయ్ 60 ఏళ్ళ వయసులో రిటైర్ అయ్యారు. అప్టటినుంచీ ఆయన తన రిటైర్డ్ లైఫ్ ని రికామీగా ఏ టెన్షన్స్ లేకుండా ఖాళీగా గడుపుతున్నారు. కానీ మా పిన్నికి 70 ఏళ్ళు వచ్చినా రిటైర్మెంట్ లేదు. ఇప్పటికీ ఆవిడ వంట తనే చేస్తుంది. ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. మా బాబాయ్ ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకుంటాడు ఇంటికి పెద్ద కాబట్టి. నేను మా పిన్నిని అడిగాను నువ్వు ఈ అన్యాయాన్ని ఎలా సహిస్తున్నావు అని? దానికి ఆవిడ “ అది కాదు రూపా మగవారు 60 ఏళ్ళు పనిచేసి చేసి చాలా స్ట్రెస్ కి గురవుతారు . అందుకే వారిని రెస్ట్ తీసుకోండి అని చెప్తారు. ఆడవారికి ఇల్లు మ్యానేజ్ చేయటం ఆఫీసులో పని చేయడమంత స్ట్రెస్ ఫుల్ కాదు అని జనరల్ ఒపీనియన్. “ అంది
“ అయితే మాత్రం నీకు మాత్రం ఈ వయసులో ఇంటిపని వంటపనీ చేయడం ఏమైనా ఆషామాషీ వ్యవహారమా..?“ అన్నాను. దానికి మా పిన్ని “ అది కాదు రూపా పనిమనిషి ఎలాగో ఉంది కదా ఇకపోతే వంట…మీ బాబాయి అంటూనే ఉంటారనుకో వంటమనిషిని పెట్టుకోవోయ్ నీకూ వయసైపోతోంది అని, కానీ నేనే ఆ పనికూడా లేకపోతే కాలక్షేపం ఎట్లా పిల్లలు కూడా లేరాయే అని నేనే పెట్టుకోవటం లేదు “ అన్నది. అబ్భ ఆ కాలం వాళ్ళు ఎంతటి పతివ్రతలో…భర్త మీద ఈగ కూడా వాలనీయరు అనుకున్నాను. అప్పుడు నేను అన్నాను, “ అదిసరే పిన్నీ నువ్వు ఉద్యోగం చేయలేదు కదా అందుకే అలా అంటున్నావు. మరి ఉద్యోగం చేసి రిటైర్ అయిన ఆడవాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంది కదా మరి దానికేమంటావ్…?”అని ఒకళ్ళిద్దరి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మా పిన్ని ఈ పాయింట్ కి జవాబు ఇవ్వలేక నీళ్ళు నమిలింది. చూసారా ఫ్రెండ్స్ నిజం పట్తే ఈ ప్రశ్నకి ఎవరి దగ్గరా సమాధానం లేదు , ఉండదు కూడా! ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆడవారి బలహీనత. అనాదిగా ఈ రకమైన మానసిక బానిసత్వానికి మనమంతా అలవాటు పడి పోయాం! స్త్రీ శారీరకంగా పురుషుడి కన్నా బలహీనురాలవడమే దీనికి ప్రధాన కారణం! ఈ విషయమై స్త్రీలు కొన్ని దశాబ్దాలుగా నినదిస్తున్నే వచ్చారు కాదనలేం. ఇటీవల సుప్రీం కోర్టు కూడా గృహిణులు చేసే ఇంటి పనికి కూడా వెలకట్టాలనీ నిర్ణయించింది. ఎంత అరిచి గీ పెట్టినా పురుషుల మరియు కొంత వరకు స్త్రీల ఆలోచనా విధానం లోనూ, దృక్పథంలోను మార్పురానంతకాలం ఈ వివక్ష ఇలాగే కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదేమో!!!