గునాసారి గున్నమ్మ

ఈ బుజ్జి కన్నమ్మ ముచ్చట చదివితే పెదాలపై నవ్వు విరబూయకమానదు. అదీ కదా పసిదనం అని అనిపించకా మానదు. అంతే కాదు మన బాల్యం కళ్ళముందుకొచ్చి అందులోకి మనల్ని పరకాయ ప్రవేశం చేయించకా మానదు. ఇంకెందుకు ఆలస్యం ఆ బుజ్జి ముచ్చట కళ్ళతో చదువుతూ మనసుతో విందాం.హృదయంతో వీక్షిద్దాం.
బూరెల్లాంటి బుగ్గలు, ఆకర్షణీయమైన ముఖము.రంగురంగల గౌను.చూడగానే బుట్ట బొమ్మనా? కొండపల్లి బొమ్మనా అనిపించేంత చక్కదనం. గునగున బడికి నడిచి వస్తుంటే భలే ఉండేది.
ఆ బుజ్జి కన్నమ్మ భుజానికో సంచి. అందులో భద్రంగా దాచుకున్న పలక, బలపం ముక్కలు.

బొద్దుగా ముద్దుగా కనిపించే ఆ పసిమోమును దగ్గరకు తీసుకొని పాల్గారే, గులాబీల్లా మెరిసే ఆ పసిబుగ్గల్ని తడమాలని, ప్రేమతో సాగదీయాలని ప్రతి టీచర్ కి అనిపించేది.అలా దగ్గరకు పిలిచి సాగతీసేవారు కూడా.
ఓరోజు మా టీచర్లకు ఆ బుజ్జి కన్నమ్మ బూరె బుగ్గల రహస్యం సరదాగా తెలుసుకోవాలనిపించింది.
ఇంటర్వెల్ లో చెట్టు కింద కూర్చున్న మేము ఆ బుజ్జి తల్లి అటుగా వెళ్తుంటే పిలిచాం.
“బుజ్జి బంగారూ ! రోజు ఏం తిని బడికొస్తవ్?”అడిగాం. “ఒక్క ముద్ద తినొత్త టీచర్”అంది ఒక్క ముద్దనా? ఆశ్చర్యపోతూ “ఎన్ని సార్లు తింటావురా బంగారూ?” అన్నాం.
చెప్పింది భలే ముద్దు ముద్దు మాటలతో…” పొద్దున్నో ముద్ద తింటనా…మల్ల బడికొచ్చేటప్పుడు ఓ ముద్ద తింటనా…మద్దేనం ఓ ముద్ద తింటనా.. ఇంటి బెల్లు కొట్టంగనే ఇంటికెళ్ళి ఓ ముద్ద తింటనా…ఇంగ రాత్రి కాంగనే ఓ ముద్ద తింటనా…గంతే టీచర్. తిన్నప్పుడల్లా ఒక్క సారే తింటా టీచర్! అంటుంటే నవ్వుకుంటూ ‘తిన్నప్పుడు ఎన్నిసార్లు తింటారేం? అంటే “నేను ఒక్కసారే తింట టీచర్!” అంటుంటే మా టీచర్లందరికీ నవ్వు ఆగింది కాదు. బల్లగుద్ది మరీ చెప్పినట్టుగా”ఒక్క సారే తింటా టీచర్! అని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తుంటే లయబద్ధంగా కాళ్ళపట్టీల చప్పుడు వీనులకు విందుగా.అబ్బో ఈ బుజ్జి కన్నమ్మ గునాసారి గున్నమ్మే… అనుకున్నాం. పసితనంతో మన ప్రయాణం ఎంత మధురంగా ఉంటుందో ఇలాంటి ముచ్చట్లే చెబుతాయి.

కాసింత ప్రేమ, కొండంత సహనం ఉంటే చాలు…
**
కాసింత ప్రేమ, కొండంత సహనం ఉంటే చాలు కొంతలో కొంతైనా ఎదుటివారిని మార్చగలం అనేది నా బలమైన అభిప్రాయం. పెద్దలంటే ఏమో చెప్పలేం.ఎందుకంటే వాళ్ళ మనసుల్లో కొన్ని అభిప్రాయాలు కరడుగట్టి ఉంటాయి. కళ్ళముందు తమ అభిప్రాయాలు ఎంత తప్పో, ఎంత మూర్ఖంగా ఆలోచిస్తారో వారి అంతరాత్మ చెబుతున్నప్పటికీ ఒప్పుకోవడానికి సిద్ధపడరు.
కానీ పిల్లలు చిన్ని చిన్ని మొక్కలు. మైనపు బొమ్మలు. మన మంచి మనస్సుతో మార్చడానికి ముందుకు వస్తే మారుతారు. ఇక విషయంలోకి వెళ్తే…
ఆ రోజు బాగా జ్ఞాపకం.నేను దిగాల్సిన ఊరు వచ్చింది. మరో రెండు నిమిషాల్లో దిగబోతూ ఉన్నా.అంతలోనే డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి ఇక్కడ టీచర్లు ఎవరో వాడిని బడిలో చేర్చుకుంటే ఈ టైం లో ఇలా బస్సుకు అడ్డం రాకుండా ఉంటాడు కదా! కొంచమైతే బస్సు కింద పడి చచ్చేవాడు “అన్నాడు. నాకు ఆ మాటలు సూటిగా తాకాయి. నేనేమో ఆ స్కూల్లో కొత్తగా జాయిన్ అయ్యాను. ఆ పిల్లవాడి విషయం నాకు తెలియదు.
తీరా నేను దిగి వెళ్లేలోపు అక్కడ సన్నివేశం భయం గొలిపే విధంగా ఉంది.పిల్లలు వాడి మీద రాళ్ళు విసురుతూ ఉన్నారు.వాడేమో వాళ్ళ మీదకు ఉరికి ఉరికి వస్తున్నాడు.ఏమిటిదంతా అసలేం అర్థం కాలేదు.
పిల్లలను దగ్గరకు పిలిచి అడిగితే వాడు” పిచ్చోడు టీచర్ ” మేం దొరికితే రక్కుతాడు,కొరుకుతాడు అన్నారు. పిచ్చోడైతే మాత్రం చెవులకేమైంది బస్సు హారన్ వినిపించదా ?జంతువులు కూడా పెద్ద శబ్దానికి భయపడి అటూ ఇటూ పరుగెత్తుతాయి. అదే విషయం పిల్లల్ని అడిగా. వినిపించవు టీచర్ అందుకే మేం వెనక నుంచి కూడా రాళ్ళు విసుర్తం అనే సరికి మనసు కలుక్కుమంది. అందుకే కాబోలు బస్సు డ్రైవర్ హారన్ కొట్టినా వినిపించలేదు.”అయ్యో పాపం బిడ్డడు” అనిపించి హృదయం ద్రవించింది.

అంతలోనే వెంటనే పిల్లల్ని అలా వాడిని కొట్టొద్దని వారించాను. వాడిని అలా కొడితే ఊరుకోను అని కూడా చెప్పాను.పిల్లలు ఔను కాదు అని ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. వాళ్ళకు నా మాట నచ్చనట్టు అనిపించింది.
ఎప్పుడైనా ఎక్కడైనా బలహీనులను చూస్తే బలవంతులకు చులకనే కదా అనిపించింది.
నేను వాడి వైపు ఆత్మీయంగా, ప్రేమగా చూడటం మొదలు పెట్టాను. దగ్గరకు రమ్మని సైగ చేసాను. మొదట్లో నా మీద నమ్మకం కలగలేదు.’గుర్రుగా చూడటం కొడతా అని బెదిరిస్తూ చెయ్యి ఎత్తడం’ …అయినా నవ్వుతూ రమ్మని పిలుస్తుంటే తనను ఏమీ చేయను, తనకు హాని కలుగదు అన్న నమ్మకం కుదిరిన తర్వాత నెమ్మదిగా నా దగ్గరకు వచ్చి నిలబడటం మొదలు పెట్టాడు.
వాడిని బడిలోకి రప్పిస్తున్నానని తెలిసి పిల్లల తల్లిదండ్రులు వ్యతిరేకిస్తూ “వాడు బడికి వస్తే మా పిల్లలను పంపము. ఇంతకు ముందు చాలా మందిని గాయపరిచాడు” అన్నారు.
“అయ్యో! ఇదేమిటి!” అనిపించింది. తల్లిదండ్రులకు నచ్చ చెప్పాను.”పిల్లలకు ఏమీ జరగకుండా చూసే పూచీ నాది” అని చెప్పిన తర్వాత “ఏదన్నా జరిగితే అప్పుడు చూద్దాం అనుకున్నారు కాబోలు” నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు.
ఇక ఈ కన్నయ్య మొత్తానికి నా పక్కన వచ్చి కూర్చునేలా చేశాను.(అన్నట్టు మరిచాను.ప్రాథమిక పాఠశాల బోధన మొత్తం దాదాపుగా కింద చాప మీద కూర్చుని విద్యార్థులను చుట్టూ కూర్చోబెట్టుకొనే బోధన చేసేదాన్ని.బోర్డు అవసరమైతే తప్ప లేచేదానిని కాదు.)
అలా బుజ్జి కన్నయ్య ఎవరి జోలికి పోకుండా బుద్దిగా ఉండటం నేర్చుకున్నాడు.ఇక మిగతా బుజ్జి కన్నయ్యలు,కన్నమ్మలకు భయం పోయింది.అందరూ వాడితో స్నేహంగా మెలగసాగారు. అప్పుడు అనిపించింది. మొదట్లో అనుకున్నట్టు కాసింత ప్రేమ కొండంత సహనం ఉంటే చాలు.అలా మనం కొంచెం సమయం కేటాయిస్తే ఇలాంటి శాపగ్రస్త చిన్నారులు కూడా మారుతారు.సందేహం లేదు.నిరూపణ అయింది కదా!

Written by Urimalla Sunanda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గడ్డిపూవు

నీవే నా ప్రాణం