చెప్పుకుంది తన గోడు
పాతిక సంవత్సరాలు
పచ్చనిదనం ఒంటినిండా కప్పుకొని
గుత్తులు గుత్తుల కాయలతో దర్శనమిస్తూ
ఎప్పుడూ నవ్వుతూ పలకరించి
కరాలూపుతూ స్వాగతం పలుకుతూ
కొమ్మ కొమ్మలుగా విస్తరించి
పూలు కాయలతో అలరారుతూ
కళకళలాడే ధాత్రీ వృక్షం
ఆరోగ్యాన్ని కాంక్షించే కనకమహాలక్ష్మీ
ఇంటి ఆనందం!!
ఒక్కసారే పక్కన చేరిన
ఐదు అంతస్తుల భవంతి సాక్ష్యంగా
ఉసిరికి ఉసురు తగిలింది
కాటు పడి కట్టెలా మిగిలింది
ఆత్మ నివేనద చేస్తూ
దీనంగా పలకరించింది
ఏమని చెప్పను నా ఆవేదన
ఎవరికి వివరించను అంటూ
చెప్పలేక పెదవి
వేదన భరించలేక
కుప్ప కూలిపోయింది!!
తన పంట చేత
ఎంతో మందికి రుచులు పంచి
పప్పు పచ్చడి ఆవకాయ జామ్ ఎండు ఒరుగు ఎన్నోవిధాలుగా
చేసి ఆనందించిన క్షణాలు
మరచిపోలేని ఆరోజులు!!
అందరికీ ఆనందాన్ని ఇచ్చి
మన్ననలు అనురాగాన్ని పొందిన
అందాల రాశి
మమతల వెల్లి
దిగులు పడి
కలత చెంది
ఇన్నాళ్ల ముచ్చటకు మూతపడి
ఒళ్ళంతా ఎండబెట్టి
ఆరునెలల తర్వాత అమెరికా నుండి వచ్చిన
నన్ను పలకరించి దీనంగా చూస్తూ
కుమిలిపోతున్న నా మది
బెంగను చూసి భంగం పడిన నా హృది!!
అన్నేళ్ల పచ్చదనానికి గండి
బాధతో చెప్తున్నా వినండి
తట్టుకోలేని మనసు
నిట్టూరుస్తున్న దీన స్థితి
మాటలు వస్తే చెప్పేదేమో
పాపం మా ఉసిరి సిరి
ఉసురుతీసిన ఆశల సిరి
భవంతి గురి
తల్లడిల్లే నా మది మరీ మరీ!!
పాతిక సంవత్సరాలు సేవల నందించిన సిరి
ఎంత మంది నోట్లో నాని ఇప్పుడు
పచ్చదనం వీడి
చేష్టలుడులిగి మ్రాన్పడి
బిక్కచిక్కిన దుస్థితి
చూడలేకపోతున్న దీనస్థితి
వదల లేక విడిచి వెళ్ళలేక
గుడ్లు వెళ్ల బెట్టి
కళ తప్పి కలకల పడి
నా వైపు దీనంగా చూస్తూ
వద్దు వద్దంటున్న మనిషి తాను
బ్రతుకుతున్న కాంక్రీట్ వనంలో
స్వార్థపు ముసుగులో..
* * *
