21.హెచ్చెం మేడం గారికి తోడు…
***
పిల్లలు వాళ్ళవి పసిమనసులు వాళ్ళకు నిజంగా ఏమీ తెలియదు అని మనం తరచుగానే కాదు ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. మనం అలా అనుకున్న ప్రతి సారీ వాళ్ళకు తెలిసిన విషయాలు విని అబ్బుర పడుతుంటాం. ఆ చిట్టి చిట్టి బుర్రల్లో ఇన్ని తెలిసిన విషయాలు ఉన్నాయా? మనం కూడా ఇంత దూరం ఆలోచించలేదే అనుకుంటూ ఉంటాం. అలాంటి విషయమే చెబితే నేనెంతగా ఆశ్చర్యపోయానో మీరు అంతకంటే ఎక్కువగా ఆశ్చర్యపోతారు.
ఆ రోజుల్లో ఒకానొక సమస్య 317 ఉపాధ్యాయులను కుదిపేస్తున్న భయంకర సమస్య. అది నన్ను కూడా స్థిమితంగా ఉండనీయని పరిస్థితి. ఇంటర్ వెల్, లంచ్ సాయంత్రం ఇలా ఏమాత్రం ఖాళీ దొరికినా ఆ సమస్య మీదనే చర్చ. ఇదే జిల్లాలో ఉండేవాళ్ళు నిశ్చింతగా ఉన్నా నాలాంటి ముప్ఫై ఏళ్ళ సర్వీసు ఉండి కూడా ప్రమోషన్ లో జూనియరై ఇతర జిల్లాలకు వెళుతున్న వారి బాధ వర్ణనాతీతం.
ఇవన్నీ మా చుట్టూ ఎప్పుడూ తిరిగే బుజ్జి కన్నయ్యలు కన్నమ్మల బుర్రలోకి కూడా చేరాయి. నా ట్రాన్స్ఫర్ విషయం దాదాపుగా అందరికీ తెలిసిపోయింది. లోలోపల ఎంత బాధగా వున్నా పిల్లలకు పాఠాలు కావాలి.వారికి సంబంధించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తేనే వృత్తికి సంబంధించిన తృప్తి ఉంటుంది.

ఆ క్రమంలోనే ఓ రోజు తరగతిలో పాఠం చెప్పాను.చెప్పడం అయిపోయిన తరువాత ఓ బుజ్జి కన్నమ్మ లేచి అడిగిన ప్రశ్నకు అవాక్కయ్యాను. బుజ్జి కన్నమ్మ అంత లోతుగా ఆలోచిస్తుందని ఊహించలేదు.
“టీచర్! మీరెళ్ళిపోతే మన హెచ్చెం మేడం గారు ఒక్కరే అవుతారు కదా టీచర్. మీ ప్లేస్ లో మళ్లీ టీచరే వస్తే బాగుంటుంది. అప్పుడు మీలాగే హెచ్చెం మేడం గారికి తోడుగా ఉంటారు.” అంది.
ఆ బుజ్జి బుర్రలో ఉన్న అమ్మ మనసుకు నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే. ఎంత గొప్పగా ఆలోచిస్తారో అనుకుంటుండగానే ” మీరు వెళ్తుంటే మాకు చాలా బాధగా ఉంది టీచర్. మీరు ఇక్కడ ఉండాలన్నా మిమ్మల్ని ఇక్కడ ఉంచరటగా టీచర్! అంది.
” అవునురా బంగారూ! తప్పదు వెళ్ళాల్సిందే ” అన్నాను.
” టీచర్! మీరు వెళితే మాతో కవితలు, కథలు ఎవరు రాయిస్తారు టీచర్? తెలుగులో చాలా పోటీలు పెట్టి బహుమతులు ఇస్తారు. చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, సెల్ఫ్ గవర్నమెంట్ డే టైం లో మా అందరికీ రకరకాల కార్యక్రమాలు పెడతారు. మీరు లేకపోతే ఎవరు పెడతారు. వొచ్చేది కొత్తసారునో టీచరో ఇవన్నీ పెడతారో లేదో అని ఆరిందలా అంటుంటే తనలోని సునిశిత పరిశీలనకు ఆశ్చర్యం ఆనందం కలిగింది.
ఇలాంటి బుజ్జి కన్నమ్మలకు చిన్నప్పటి నుంచే మంచి ప్రోత్సాహం, శిక్షణ ఇస్తే ఒక్క చదువే కాదు సమాజాన్ని కూడా అర్థం చేసుకోవడంలో ముందుంటారు.తప్పకుండా ఉన్నతస్థాయికి ఎదుగుతారు.అలా ఎదగాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఆ బుజ్జి కన్నమ్మకు నా దీవెనలు, ఆశీస్సులు ఫలించాలి.

22.కారణం లేకుండా…
**
ఓ బుజ్జి కన్నయ్యను చూస్తే మిగతా అందరు టీచర్లతో పాటు నాకు కూడా చాలా అసహనంగా అనిపించేది. తరగతి గదిలో నా పాఠాలు ఇష్టంతో వినని విద్యార్ధులు ఉండరని నా ప్రగాఢ నమ్మకం.
నేను ఏది చెప్పినా చాలా వరకు బుద్ధిగా వినడం ఇచ్చిన హోం వర్క్ నోట్సులో రాసి చూపెట్టడం చేసేవారు. అందుకే ప్రతి పీరియడ్ ఇష్టంగా వెళ్ళేదాన్ని.
కానీ ఆ ఒకేఒక్క బుజ్జి కన్నయ్య నా నమ్మకం వమ్ము చేస్తూ ఉంటే తట్టుకోలేక పోయాను. వాడినైనా మార్చాలి నేనైనా మారాలి అనుకున్నా.
తరగతిలో పాఠాలు వినడం అంతంత మాత్రమే అని గమనించాను. ఇంటర్ వెల్ అయితే చాలు కంటికి కనబడే వాడు కాదు.పిరియడ్ మొదలవ్వగానే పిల్లిలా చప్పుడు చెయ్యకుండా క్లాసులోకి వచ్చి కూర్చునే వాడు.
నీతి పద్యాల పాఠం నడుస్తోంది. ఒక్కో పద్యాన్ని పదే పదే వల్లె వేయించి చూడకుండా చెప్పించడం నా అలవాటు.
అందరూ చక్కగా చెబుతుంటే ఈ బుజ్జి కన్నయ్య మాత్రం చెప్పకుండా దిక్కులు చూసేవాడు.
వాడి వైఖరికి కొట్టాలన్నంత కోపం వచ్చింది.కానీ కొట్టడం అనేదే నాకు ఇష్టముండదు.
అందుకే అందర్నీ అడుగుతూ ఆ కన్నయ్యను పూర్తిగా పట్టించుకోవడం మానేశాను. ఇంతకు ముందు చదువు గురించి ఎన్నో మంచి మాటలు చెప్పి మార్చాలని చూసిన నేను పట్టించుకోకుండా వుండటం తనకి అర్థమైంది.
ఓ రోజు ఇంటర్ వెల్ లో ఉన్నది పది నిమిషాలైనా ఏదో ఒక ఆటల్లో మునిగిపోవడం చూస్తూ ఉన్న నేను ఆ బుజ్జి కన్నయ్య వాళ్ళ మధ్య లేకుండా తూనీగలా పరుగులు తీస్తూ వెళ్ళడం చూశాను.
వాడి తరగతి అమ్మాయిని పిలిచి ఆ కన్నయ్య కనబడటం లేదు ఎటు వెళ్ళాడో చెప్పమన్నాను.
“వాడా టీచర్! వాళ్ళింట్లో మేకలకు ఆకుల కోసి మేతెయ్యడానికి వెళ్ళాడు” అని చెప్పింది. “ఇంట్లో ఎవరూ లేరా? వీడే ఆపని చేయాలా? కొంచెం కోపంగా అడిగాను. వాళ్ళ తాత నాయినమ్మ ముస్లోల్లు టీచర్! వాడి అమ్మ నాయిన బతక బొయ్యిండ్రు.ఇక్కడ లేరు అనగానే మనసు నిండా బాధ.ఆ చిన్నారి బాల్యానికి ఎన్ని బాధ్యతలు.వాళ్ళని చూసుకుంటూ వుంటే ఇంకా చదువు మీద ధ్యాస ఎలా వస్తుంది. కారణం లేకుండా పిల్లల్ని అపార్థం చేసుకోవద్దు అనుకున్నా.
మరుసటి రోజు తరగతి గదిలో దగ్గరకు పిలిచాను.హోం వర్క్ చెయ్యలేదు,పద్యం రాలేదు కొట్టండి టీచర్ అని చెయ్యి చాపుతుంటే నా కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి.
దగ్గరకు తీసుకొని నాన్నా! నీకు ఖాళీ పీరియడ్ లో నా దగ్గరకు వచ్చి చదువుకో.నీకు ఏది అర్థం కాకపోయినా నేను చెబుతాను అనే సరికి ఆ కన్నయ్య కళ్ళలో అంతులేని ఆనందం ఆశ్చర్యం.
పిల్లలు పాఠాలు వినడం లేదని, బడికి సరిగా రావడం లేదని అనుకోవద్దనీ తప్పకుండా ఏదో ఒక కారణం ఉంటుందని అర్థమైంది.

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పాడనా తెనుగు పాట…పరవశనై…

మోడై మ్రాన్పడి ఘోషిస్తున్న ఉసిరి