పాడనా తెనుగు పాట…పరవశనై…

పాట ఒక సంబరం. పాటది అంబరం. కొన్ని పాటలు శబ్దంతో, సంగీతంతో, కొన్ని అర్థసౌకుమార్యంతో, కొన్ని అనుభూతిధారతో సాగి మనల్ని అలరిస్తాయి. ఆకట్టుకుంటాయి. ఇన్నింటి మేళవింపుల రసరాగమాల ఈ గీతం. కృష్ణశాస్త్రిగారి కలంనుంచి కురిసిన కమ్మనైన పదాల మరందం. అచ్చతెలుగు పదాలలో మెరిసిన అరవిందం.

తెలుగు భాషా సోయగాన్ని వర్ణిస్తూ రచించిన సినీ గీతాలలో ఈ పాటకొక ప్రత్యేక స్థానం. శారదాదేవి కనుసన్నల నుండి విరిసిన ఈ అక్షరకుసుమాన్ని మనసారా ఆస్వాదిద్దాం ఆఘ్రాణిద్దాం.

విదేశీ ప్రయాణం, విదేశాలలో చదువుకోవడం ఇదంతా అరుదుగా జరిగే ఒకనాటి కాలంలో అక్కడ చదువుకుని అక్కడే పరిచయమైన యువతిని వివాహం చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన ఒక యువకుడు. ఎదిగి వచ్చిన దారుల్ని మరిచిపోని ఆ యువకుడి కథే కాకుండా, తనను కోడలుగా అంగీకరించని అతని కుటుంబసభ్యులకు ఓరిమితో ఇష్టంగా-ప్రేమగా తనను తాను చేరువ చేసుకున్న ఆ యువతి కథ కూడా ఈ ‘అమెరికా అమ్మాయి’ చిత్రం. చిత్రంలో అపరిమితంగా ప్రాచుర్యం పొందిన ఈ పాట మన భాషలోని సొబగును నింగి అంచుల దాకా వెదజల్లిన భావన.

పల్లవి : పాడనా తెనుగు పాట
పరవశనై…నే పరవశనై…
మీ ఎదుట మీ పాట…
పాడనా తెనుగు పాట…

అక్కడ పుట్టి పెరిగిన యువతి ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల మీద మక్కువతో పాడిన ఈ గీతం ఆమెలోని నిర్మలమైన హృదయానికి, సంప్రదాయ భావాలకు నిలువెత్తు దర్పణం. మీ ఎదుట మీ పాట అంటూ ఆలపించడం సున్నితమైన ఆమె సంస్కారాన్ని తెలియజేస్తుంది.

1చ : కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మోపులపైన
మసలే గాలుల గుసగుసలు
మంచి ముత్యాలపేట
మధురామృతాల తేట…
ఒక పాట పాడనా తెనుగు పాట…

ఎంత హృద్యమైన భావావేశం. కోవెల గంటల నాదం గోదావరి గలగలలు…ఓహ్…తెలుగు భాష ఒడిలో భావాలు, భావాల తెమ్మెరలో అక్షరాలు చైతన్యం పొందినట్టనిపిస్తుంది. ఈ పాట కేవలం చిత్రానికి చిత్రంలోని సందర్భానికే కాదు తెలుగు భాషలోని సౌందర్యానికి రసహృదయాలు దోసిలి పట్టినట్టుగా, తెలుగువారి ముంగిట ముచ్చటైన ముగ్గు పెట్టినట్టు, నీరెండ కిరణాలలో నింగి తలవాల్చినట్టు అపురూపమైన అనుభూతి. అంతేనా! మన సంప్రదాయానికి పట్టుచీర కట్టి మువ్వల పట్టీలతో అలంకరించిన భావన.

ఒక ఆధునిక యువతి పల్లె పరిమళాలను నింపుకున్న ఈ భావాలను గానం చేయడం చాలా అరుదైన విషయం. అపురూపమైన ఆనందం.

2చ : త్యాగయ క్షేత్రయ రామదాసులు
త్యాగయ క్షేత్రయ రామదాసులు
తనివితీర వినిపించినదీ…
నాడు నాడులా కదిలించేది
వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట
చిక్కని తేనెల ఊట
ఒక పాట పాడనా తెనుగు పాట…

ఎందరో మహానుభావులను ఈ వేదిక మీద నిలిపారు శాస్త్రిగారు. వారికి సవినయంగా సభక్తికంగా నీరాజనాలర్పించింది సుశీలమ్మ గళం. వాడవాడలా కదిలించేది అంటూ దిగంతాలకు తాకిందీ పాట. ఒక విదేశీయువతి వారిని స్మరించడంతో వేదిక కరతాళధ్వనులతో నిండిపోయినట్టే చూసే మన హృదయాలూ ఆనందంతో ఉప్పొంగిపోతాయి.

3చ : ఒళ్ళంత వయ్యారి కోక కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్లకు పారాణి
మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లుఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడే
తెనుగుతల్లి పెట్టని కోట
తెనుగునాట ప్రతిచోట
ఒకపాట పాడనా తెనుగు పాట….

ఈ వాక్యాలతో తెలుగు సంప్రదాయానికి అక్షరాలచీర కట్టారు రచయిత. భావాల కాటుక దిద్ది, మోమునిండా భాషా సోయగాన్ని అద్ది తెలుగువారి లోగిళ్ళలో తోరణాలు కట్టారు. ఈ పాట చిత్రీకరణలో వెనుక గోడమీద కనిపించే చిత్రాలు కూడా అమూల్యమైన ఆనందాలు. మన భాష తెలియని నాయిక తెరమీద ఈ పాటను అభినయించడం, అందులోనూ భాష గొప్పతనాన్ని, సంప్రదాయ విలువలని వర్ణిస్తూ అభినయించడం మామూలు విషయం కాదు. నటింపజేసిన దర్శకుని ప్రతిభ అద్భుతం. ఇరువురికీ మనసారా అభినందనలు చెప్పుకుందాం.

ప్రాంతాలకు అతీతంగా మానవీయకోణంలో విశాల దృక్పథంతో తీసిన చిత్రం అమెరికా అమ్మాయి. సింగీతం శ్రీనివాసరావుగారు అందంగా తెరకెక్కించిన ఈ చిత్రం కోసం కృష్ణశాస్త్రిగారి కలం చిందించిన అక్షరలావణ్యమిది. జీకే వెంకటేష్ గారి సుమధుర స్వరధారలో తడిసి పి.సుశీలగారి గళమాధుర్యంలో తేనె చిందులు వేస్తూ రసహృదయాలపై చెరగని ముద్రవేసి తెలుగువారికే సొంతమైన అచ్చతెనుగు గీతం. కొబ్బరాకుల నీడన వెచ్చగా పలుకరించే మచ్చలేని మమకారపు గీతం.

పాట మొత్తంలో వినిపించే వీణానాదం ఒక కీర్తనను వింటున్న అనుభూతికి లోనుచేస్తుంది. జీకే వెంకటేష్ గారు స్వరం చేసిన గీతాలలో మకుటాయమానం ఈ గీతం అనుకోవటంలో సందేహం లేదు. ప్రత్యేకంగా పరవశనై అన్నచోట కాస్త ఆగి తీగలాగా సాగిన గానపరిమళం మనల్ని పరవశుల్ని చేస్తుంది.

సుశీలగారి గొంతులో ప్రతి పలుకు తీయగా జాలువారి మనసులకు అలౌకిక ఆనందాన్ని అందించటమే కాక పదాలలోని సౌకుమార్యాన్ని మరింత జాలువారుస్తుంది. పాట ఆరంభమే తెలుగుభాషా భాండాగారాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా గాఢమైన ఉద్వేగానికి లోనవుతాం.

మన దేశంలో పుట్టి పాశ్చాత్య పోకడలపై మోహితులవుతున్న సందర్భాలలో, ఆ దేశం నుంచి వచ్చి మన సంప్రదాయం మీద మక్కువతో, మన సంస్కృతిని, ఆచారాల్ని తెలుసుకుని ఇష్టంగా ఆచరించిన యువతి సంస్కారం ఈ చిత్రం. తన వస్త్రధారణను ఇతరులు గమనిస్తున్నారని తెలిసి, తప్పు వారిది కాదని గ్రహించి తనను తాను సరిచేసుకున్న యువతి నిండైన వ్యక్తిత్వం. ఆమె అభిప్రాయాలను గౌరవించే వ్యక్తిగా అనురాగ మాలికను అందుకునే భర్తగా శ్రీధర్ నిండుగా నటించారు.

వేదిక మీద ఈ పాటను అన్నా కొరియా (దేవయాని) ముచ్చటగా అభినయించగా, వేదిక దిగువన శ్రీధర్, రంగనాథ్, దీప తమ హావభావాలను చక్కగా చూపారు.

వెరసి తెలుగువారి ముంగిట పరుచుకున్న పచ్చదనం ఈ పాట. ముందు తరాలకు ప్రవహించే మన సంప్రదాయంలోనూ సాగిపోతూ ఉంటుంది అంతర్వాహినిలా నిర్మలంగా నిండుగా నిత్య వాసంతికా పరిమళంలా….పరవశమై పాడుకునే పాట…పరవశులమై ఆలకించే మన తెలుగు పాట….

Written by tharuni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నూర్జహాన్ పాలన – మొఘల్ సామ్రాజ్యంలో ఒక అసాధారణ మహిళా శక్తి