వింత జాతీయాలు

 

జాతీయాల గురించి తెలుసుకుంటే మన సంస్కృతి,మన భాష ఔన్నత్యం అర్థమవుతాయన్నది మనం లోగడ చెప్పుకున్నదే.కొన్ని జాతీయాలు వినగానే,”అరె!వింతగా ఉందే!అదేమిటో,అర్థం ఏమిటో తెలిస్తే బాగుండును!”అనే ఆసక్తి సహజం మనకు.”తలలో నాలుక”,”గొంతులో పచ్చి వెలక్కాయ”లాంటి జాతీయాలు అలాంటివే!మరి ఆ “తలలో నాలుక” సంగతి చూద్దామా!

“వారి కోడలు, వారింటివారికి తలలో నాలుకలా మసలుకుంటుంది.”
“ఆ అబ్బాయి, వాళ్ళ ఆఫీసువారందరికీ తలలో నాలుకవంటివాడు”
అంటే ఏమిటంటే..మన దంతములలో కోరపళ్ళు, కొఱకుపళ్ళు,నమలు పళ్లు,విసరు పళ్ళు అనే రకాలు ఉంటాయి కదా..అవన్నీ ఆయుధాలవంటివే కదా!మరి కత్తులబోను వంటి వాటి మధ్యలో ఉండే నరం లేని మెత్తని నాలుక వాటి మధ్యలో నలిగిపోకుండా,గాయపడకుండా జీవితాంతం తప్పించుకుంటూ,ఆహారం నమలటానికి,మాట్లాడడానికి ఉపయోగపడుతూనే ఉండడం ఎంతటి అద్భుతం!అదుగో అలా రకరకాల మనుష్యుల మనస్తత్వాల మధ్య నొప్పించక,తానొవ్వక తప్పించుకు తిరుగుతూ,సర్దుకుపోతూ,అందరినీ మెప్పించేవారిని “తలలో నాలుక” అంటారన్నమాట!మన పూర్వీకుల జీవనానుభవం, జీవనాన్వయం ఎంత గొప్పవో కదా!ఒక్క చిన్న పదంలో బోలెడు అంతరార్థాన్ని పొదిగారు వారు.

“నాపసాని”

“బయల్దేరిందమ్మా పేద్ద.. నాపసాని..అందరికీ నీతులు చెప్పటానికి”
“ఏంటా మాటలు?ముదినాపసానిలా!” అని ఆడపిల్లల్ని అధిక్షేపించటం వింటూనే ఉంటాం.
ఈ జాతీయం ఎలా వచ్చిందంటే..పెండ్లి చివరిరోజు తంతుగా జరిగే నాకబలి/నాగవల్లి తంతులో మర్యాదలు జరపడం,వధూవరులను పీటలపై కూర్చోపెట్టడం, తాంబూలాలిప్పించటం,మంగళహారతులు పాడటం..ఇలా పెద్ద ముత్తయిదువలకు చాలా పనులకు ప్రాముఖ్యం ఉండేది.నాగసాని, నగవసాని,నాగప్పసాని అనే పర్యాయపదాలు ఈ నాపసానులకు ఉండేవి.జాణలయిన ముత్తయిదువలు ఈ తంతు నడిపేవారు. అందువల్ల “నాపసాని” అనే మాటకు కాలక్రమేణా జాణ, నేర్పరి,అనుభవజ్ఞురాలు అనే అర్థాలు వచ్చాయి.వయసులో పెద్దదై నాపసానిగా వ్యవహరించే ఆమెను ముదినాపసాని అనేవారు.వ్యక్తులు కాని ఆడపిల్లలు వినికిడి పాండిత్యంతో ఏవైనా సరససల్లాపాలు సాగిస్తే “ఎమ్మా,ముదినాపసానిలా మాట్లాడుతున్నావు?” అని అధిక్షేపించేవారన్నమాట!

“నాలుగు కాయలు”

“నీ కడుపున నాలుగు కాయలు కాస్తే చూసి,హాయిగా పోతానే”అంటుంది ఓ బామ్మ!
చెట్టుకు కాయ సంతానమేగా!అదే అర్థంలో పూర్వం పెద్దలు పెళ్లికూతుళ్లను ఆశీర్వదించేవాళ్ళు.ఈ కాలంలో ఒక్కరిని కనడం,పెంచడమే కష్టంగా ఉంది.ఇంక నలుగురు పిల్లలు,వారి స్కూల్ ఫీజులు,చదువులు..అయ్య బాబోయ్! అందుకే అలాంటి ఆశీర్వచనాలు ఇప్పుడెక్కడా వినపడడం లేదు.
************
చంద్రకళ.దీకొండ
హైదరాబాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

 కథలు  –  మనం