అమ్మగారింటికి దారేది?..

     “ వెంకటయ్య! పిల్లలందరూ బతుకమ్మ పండక్కి వస్తున్నారు. పువ్వు తీసుకుని రా” అంటూ వంటింట్లోకి వెళ్ళింది అమ్మ. సరేనన్నాడు వెంకటయ్య. ‘దసరా పండక్కి ఈ చొక్కా వేసుకో’ అంటూ నాన్న, అప్పటికే బజారు నుండి కొనుక్కొని తెచ్చిన చొక్కాను ఇచ్చాడు పాలేరు వెంకటయ్యకి.

             బతుకమ్మ పండగ వచ్చిందంటే ముందు నుండే సన్నాహాలు ఇంట్లొ ప్రారంభమయ్యేవి . ఇల్లు బూజులు దులుపుకోవడం, ఎర్రమన్నుతో మనసాలలు అన్నీ అలికి, బియ్యం నానబెట్టి రుబ్బి, ఆ పిండితో ముగ్గులు తీర్చడం… ఇవన్నీ మహాలయ అమావాస్యకు ముందు రోజు జరిగేవి. అటకపైనున్న స్తంబాలాన్ని తీసి చింతపండుతో తోమించి, బతుకమ్మను పేర్చడానికి సన్నద్ధం చేసేది అమ్మ. పిల్లలకి చిరిదిండ్లు ఇష్టమని చేగోడీలు, కారప్పూస (తేనె తెరలు) చేసి ఉంచేది. అక్కచెల్లెల్లు, తమ్ముడు కలిసి చేనుగట్టుకు వెళ్లి, ఇంకా పువ్వులు కావాలని గునుగు, ఉప్పుపువ్వు గడ్డిచేమంతులు తెచ్చి రంగులద్ది పెట్టేవాళ్ళు. రాత్రి అందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటూ ముందు మనసాల్లో చాపలు వేసుకొని పడుకున్నాము.

         ఉదయాన్నే కోడికూతతో లేచి, పెరట్లో గాడిపొయ్యిలో కాచె పాలవాసన, మల్లెపూల వాసనలో, వేప పుల్లలతో, పిడక బొగ్గుతో పళ్ళు తోముకొని, అమ్మ ఇచ్చిన మీగడ పాలు తాగుతూ ముచ్చట్లాడుతూ పనులు చేసుకుంటున్నాం. ఒకరు వాకిట్లో పేడతో పచ్చగా చల్లితే, మరొకరు పసుపుతో గడపలను చక్కగా అలంకరించారు. మరొకరు వాకిట్లో ముగ్గు వేయడం, ఇల్లును శుభ్రపరిచేవారు. నలుగురు అక్కచెల్లెళ్లు నాలుగు పనులతో, పనులను పూర్తి చేశారు. ఈపాటికే అమ్మ కొప్పెరలో  నీళ్లు కాచి పెట్టింది. నూనెతో ‘అమ్మ కడుపు చల్లనా, అత్త కడుపు చల్లనా’… అంటూ వరుసగా అందరికీ మాడకంటింది.  కుంకుడుకాయల రసంతో, సున్నిపిండితో తలంటు స్నానాలు పూర్తిచేసింది. నాన్న గుళ్లో నైవేద్యం పెట్టిన దద్దోజనం ప్రసాదం అందరమూ తిని బతుకమ్మనిపేర్చడానికి కూర్చున్నాం. అమ్మ చిన్న గౌరమ్మను నాలుగు పూలతో పీట మీద చిన్న పళ్లెంలో పెట్టి పులిహోర, పెసరపప్పు నైవేద్యం పెట్టింది. పిల్లలంతా ఈత చాప కింద అంచుల్లో తంగేడు గునుగు (రంగులు అద్దినవి) ఉప్పు పువ్వుల కట్టలను పెట్టి, బతుకమ్మ పేర్చడయానికి తయారు చేసాము. భోజనాలు చేసి ఒక పీట మీద స్థంబాలన్ని ఉంచి, గుమ్మడి ఆకులు అడుగున వేసి, వరుసగా బతుకమ్మను అన్ని పూలతో అందరూ కలిసి పేరవడం పూర్తి చేసాక, వంటింట్లో దేవుడి గట్టు కింద ఉంచాము. అప్పుడే ‘గాజులు పూసలు, ముత్యాలు, వచ్చాలు’…… రాగం తీస్తూ వచ్చిన బాలమ్మను ఆపి, పిల్లలందరికీ నాన్న చేతి నిండా గాజులు వేయించారు. అమ్మకుట్టిన లంగాలు ,జాకెట్లు వేసుకొని,జడలనిండా పూలు పెట్టుకొని,  కొత్త బట్టలతో అందంగా తయారయ్యాం అక్కాచెల్లెళ్ళము. అమ్మ పెట్టెలోనుండి పట్టుచీర తీసి తాను కట్టుకుంది. సాయంకాలం నాలుగు గంటలకల్లా వాకిట్లో నీళ్లు చల్లి, ముగ్గేసి బతుకమ్మలను పెట్టి, ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’…. అంటూ అందరూ కలిసి ఆడము. ఆవాడ నుండి అందరూ ఆడవాళ్లు బతుకమ్మలతో బయలుదేరి, కచేరి దగ్గర ఊర్లోని మహిళలందరూ కలిసి చెరువుగట్టుకు వెళ్లి ఆడి పాడాము. మగవాళ్ళంతా నిండిన చెరువును చూస్తూ, మత్తడి పారుతుంది అంటూ.. చెరువు గట్టుపై తిరిగాడారు.మేము  స్నేహితులంతా కలుసుకొని ఆడి, పాడి, చప్పట్ల మేళవింపుతో ఆనందంగా గడిపి చీకటి పడ్డాక ఇల్లు చేరాము. గౌరమ్మను స్మరిస్తూ దారిలో కూడా తమ పాటలను వినిపించారు. తొమ్మిది రోజులు కొత్త కొత్త పాటలతో ఆడి, చివరి రోజు సద్దుల బతుకమ్మను కొలిచి “పోయిరా గౌరమ్మ !పోయిరా”… అంటూ సాగనంపాము.

           కొన్ని రోజుల తర్వాత…

        (అక్కచెల్లెళ్ల అందరికీ పెళ్లిళ్లు కావడం, వారికి సంతానం కలగడం జరిగింది)

“అమ్మా !బతుకమ్మ పండక్కి షాపురం ఎప్పుడు పోతున్నాం? ఈసారి ఎవరెవరు వస్తున్నారు?” అంటూ అడిగారు అలేఖ్య, అభిజ్ఞలు నన్ను. ‘సద్దులకి నాలుగు రోజుల ముందు వెళ్తున్నాం’ అన్నాను. పిల్లల సంతోషానికి అవధులు లేవు. (యదు) తమ్ముడు మారుతి వ్యాన్ లో అందరం కలిసి (సరిపోకుంటే కొందరం బస్సులో) బయలుదేరాము. అమ్మ వారం రోజుల ముందే వెళ్లి, ఇంటిని శుభ్రం చేసి, పిల్లలకు ఫలహారాలు చేసి పెట్టింది. దారిలో పూలను కొనుక్కొని, షాపురం చేరాము. పిల్లలందరూ అమ్మమ్మ గారి ఇల్లు చేరి ఉప్పొంగిపోయారు. తాత,… అమ్మమ్మ… అంటూ వాళ్ళు సాధించినవి, చూసినవి ముచ్చట్లతో వాళ్లను మురిపించారు. అమ్మమ్మ ఇచ్చిన చేగోడీలు తింటూ, తాత ఇచ్చిన (గగ్గ )మిశ్రిని, జీడిపప్పును ఆస్వాదిస్తూ ఆడుకుంటున్నారు. చెల్లి కరుణ,తమ్ముడు యదు ఊరు చూడడానికి, చిన్నప్పటి మిత్రులను కలవడానికి వెళ్తే, నేను , కళ్యాణి (మరదలు) అమ్మకు సహకరిస్తున్నాము. సీతాఫలాల గంప కొని, ఆ పళ్ళను అందరూ కలిసి తింటూ ముచ్చట్లాడారు. పిల్లలందరూ వాకిట్లో అరుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. రాత్రి ముందు మనసాల్లో ఫ్యాన్ కింద చాపలపై దుప్పట్లు పరచి పిల్లలను పడుకోబెడితే , టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పెళ్లి అరుగు మనసాల్లో పెద్దలు పడుకుని ముచ్చట లాడుతూ పడుకున్నాం.

    తెల్లవారకముందే పాలేరు వెంకటయ్య ‘చిన్నమ్మగార్లు వచ్చారని’ కేంద్రంలో పాలు పోయకుండా మా కోసం తెచ్చి పోసాడు. కొన్ని ఎక్కువ పాలుకొని, చిక్కగా కాచి మీగడపాలను పిల్లలందరికీ పోసింది అమ్మ. పిల్లలకు తెల్లని పాలు తాగరని రంగు కోసం ఛాయ చుక్క వేసింది.  చేగోడీలు తింటూ, పాలు తాగారు పిల్లలు. అందరం కలిసి నిమ్మ బావికి ఈత కొట్టడానికి పిల్లలతో పెద్దవాళ్ళము వెళ్ళాము( మాకు చిన్నప్పటినుంచి ఈత అలవాటు). బావి అంతా అల్లకల్లోలం చేసాము. పొలం గట్టులు, చెరువుగట్టుకు మా పొలాలన్నీ తిరిగి ఇంటికి చేరుకున్నాం. అమ్మ చేసి ఇచ్చిన ఉప్మాను  మోదుగాకులలో తిని కడుపు చల్లబరుచుకున్నాం. నాన్న గుళ్లో పూజలు చేస్తుంటే వెళ్లి, ఆ వేంకటేశ్వర దర్శనం చేసుకున్నాం. ప్రసాదాలు తిని, ఇంటికి వచ్చి ఆనందోత్సాహాల మధ్య భోజనాలు ముగించాము. పిల్లలందరికీ ఇష్టమైన గడ్డ పెరుగుతో కొసరి కొసరి వడ్డించింది అమ్మ. సద్దుల రోజు పిల్లలు తాత కొనిచ్చిన గాజులు వేసుకుని (తర్వాత మామ) ముస్తాబయ్యి, పెద్దగా పేర్చిన బతుకమ్మలతో చెరువు దగ్గరికి చేరి, ఆటలాడుతూ, పాటలు పాడుతూ ప్రసాదాలు పంచుకొని తింటూ… బతుకమ్మను సాగనంపి, ఇంటికి వచ్చాము.

           తెల్లవారి తిరుగు ప్రయాణం. పిల్లలంతా మళ్ళీ బతుకమ్మ ఎప్పుడు వస్తుందో?… అంటూ చిన్నబుచ్చుకున్న మనసులతో బయలుదేరారు. నాన్న అల్లుళ్లకు లుంగీలు కొనిచ్చారు. మాకు చీరలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చారు. బరువైన గుండెలతో.. అమ్మానాన్నల ఆశీర్వాదాలు తీసుకుని పట్నం బయలుదేరాము.

     

 మరికొన్ని రోజుల తర్వాత….

        “ఏమండీ ! సద్దులకు పిల్లలతో మనం షాపురం వెళ్దాం” అన్నాను. చిన్నప్పటినుండి బతుకమ్మకి షాపురం వెళ్లడం అలవాటైన నా  మనసు కోరుకుంది. అశోక్(మావారు)  కూడా ఊరంటే ఇష్టం. అందుకే  సరేనన్నాడు. షాపురంలో ఇంట్లో అద్దెకు ఉండే రాజేశ్వరికి (రాధ అమ్మా నాన్న చనిపోయారు) ఫోన్లో సమాచారం ఇచ్చి ఇల్లుని శుభ్రం చేయించమంది. ఇంటి నుండే పూలు, అక్కడికి వంటకి అవసరమైన సామగ్రిని, పిల్లలకు అవసరమైనవి కొనుక్కొని తయారు చేసుకుంది. అక్క గిరికి, చెల్లెలు కరుణకి, తమ్ముడు యదుకి ఫోన్ చేసి, ఎవరెవరు వస్తున్నారు? అంటూ వాళ్ళని సంసిద్ధం చేసుకుని, ఖిలాషాపురం చేరుకుంది. తన చేతితో అందరికీ భోజనం ఏర్పాటు చేసి, ఊర్లో అంతా తిరిగి, అందర్నీ పలకరించి, చిన్ననాటి స్నేహితులను కలుసుకొని  ఆనందంగా చెల్లెలు, తమ్ముడు పిల్లలతో గడిపింది. సాయంకాలం బతుకమ్మలతో చెరువు దగ్గరికి వెళ్లి ఆడి, పాడి ఆనందం నిండిన మనసులతో చీకట్లో పట్టణానికి పయనించారు అందరూ…

 క్రితం సంవత్సరం….

     “ షాపురంలో ఉండడానికి ఇల్లు లేదుగా,  ఎలా వెళ్దాం?బతుకమ్మ ఎలా ఆడుదాం?” అంటూ దిగులు పడుతున్న నన్ను -అశోక్, అభిజ్ఞలు ‘షాపురం వెళ్దాం’ అన్నమాట ఆనందం కలిగించింది. ఇక్కడే భోజనం తయారు చేసుకుని, బతుకమ్మ పూలు కొనుక్కొని, కారులో బయలుదేరాము. గుళ్లో పూజారికి ముందే ఫోన్ లో సమాచారం ఇచ్చింది రాధ. గుడికి వెళ్లి, పూజ చేయించారు. తర్వాత అభిజ్ఞ-నా చేయి పట్టుకొని ఊరంతా తిప్పి, అందరి ఆత్మీయ పలకరింపులు, ఆంజనేయుల గుడిలో దీవెనలు ఇప్పించింది. శిధిలావస్థలోనున్న ఇంటిలోకి వెళ్లి, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని, అమ్మానాన్నలను గుర్తుచేసుకొని చెమ్మగిల్లిన కళ్ళతో అరుగుపై ఆర్ద్రతతో కూర్చున్న నన్ను, ఓదార్చి ధైర్యం చెప్పింది అభిజ్ఞ. సాయంత్రం గుళ్లో పేర్చుకున్న బతుకమ్మని ఊరివారితో కలిసి, పాఠశాల ఆవరణలో ఆడుకొని, తృప్తిగా వచ్చాము.  ఊరి బస్టాండ్ లో గాజుల షాపులో అభిజ్ఞకు గాజులు పెట్టించాను. ఆ రాత్రికి హైదరాబాదు చేరుకున్నాం.

   

 ఈ సంవత్సరం…..

 నాకు బతకమ్మ పండక్కి సెలవులు ఇచ్చారు. బతుకమ్మ కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణలు, సాహితీ సంస్థల బతుకమ్మ ఆటలలో పాల్గొంటూ ఉత్సాహంగా గడిపాను. సద్దుల బతుకమ్మ రోజు ఉదయాన్నే లేచి, తలంటు పోసుకుని, ఇంటిని శుభ్రపరచాను. అమెరికాలో నున్న కూతురు అలేఖ్యతో, మనుమలతో మాట్లాడాను. షూటింగులోనున్న అభిజ్ఞతోను ఫోన్లో మాట్లాడాను. ‘అమ్మా ! షాపురం వెళ్లడం లేదా?” అన్న పిల్లల మాటలతో గుండె చెరువైంది.

         ఎలా వెళ్ళను? అక్కడికి వెళ్తే ఎక్కడుండాలి ?, శిథిలమైన ఇల్లు, పూజకి మాత్రమే తెరిచే గుడి, ఇంటింటికో వృద్ధాప్య జనం, చెరువు గట్టుపై ఆడకుండా.. డీజే లతో పాఠశాల ఆవరణలో ఆడే బతుకమ్మ ఆట, నిర్మానుష్యంగా మారిన మా వీధి, అమ్మ నాన్నల కరువైన ప్రేమ….. ఇలా భారంతో నిండిన గుండెతో, అపార్ట్మెంట్లో ఆడవాళ్ళతో, పాట చెబుతూ బతుకమ్మ ఆట ఆడాను. సద్దుల బతుకమ్మ ముగిసింది అనిపించాను.

              అందుకే మా కళాశాలలో నా విద్యార్థులకు ఈ సంస్కృతిని వారి హృదయంలో నాటే విధంగా బతుకమ్మలను పేర్చి,సెలవుల ముందురోజే ఆడుతూ, పాడుతూ తృప్తి పడతాను. అదే నేను ఆడే సంతృప్తి బతుకమ్మగా భావిస్తాను.. అప్పుడప్పుడు “అమ్మగారింటికి దారేది?” అంటూ నా మనసును ప్రశ్నిస్తాను…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*”తెలంగాణ వైభవం మహిళా చైతన్యం” వ్యాస సంకలనం పరిశోధకులకు కరదీపిక

కాగితం పడవ-1