ఇప్పటి అవసరం

13- 1- 2025 తరుణి సంపాదకీయం

సంక్రాంతి వస్తుందంటే క్రాంతిని కదా తేవాలి! క్రాంతి అంటే చైతన్యం.

కానీ భయం వేస్తోంది సంక్రాంతి కి విడుదల అయ్యే సినిమాలనూ, విడుదల సభలనూ చూస్తుంటే! అంటే  అంతకుముందు తీసే సినిమాలు అన్నీ బాగున్నాయి అని కాదు. గొప్ప గొప్ప సినీ నిర్మాతలు, గొప్ప గొప్ప సినీ దర్శకులు ఉన్నారు మనకు.కొన్ని విషయాలు చాలా బాధాకరంగా చిత్రిస్తున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సంపాదకీయం. స్త్రీ లంటే ఇంత చులకననా! ఎందుకు? సభ్య సమాజం తలదించుకునేలా ఆ పాటలు ఆ డైలాగులు . ఇది సినీ ఇండస్ట్రీని విమర్శించాలి అని కాదు! సినిమాలు అవసరం !!

సినిమాలు చూస్తే ఎంతో జ్ఞానం పెరగాలి. పెరుగుతుంది కూడా! ఎందుకంటే అన్ని మాధ్యమాల కంటే సినిమా అనేది చాలా ప్రభావితం చేసే మాధ్యమం. ఏయే తప్పులు సంఘంలో జరుగుతున్నాయో ఆ తప్పులు జరగకుండా చూపించడానికి సినిమాలు మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి సినిమాలు రావాల్సిందే.మేము అదే చేస్తున్నాం అంటారు వాళ్ళు .కానీ, తప్పు పని చేసిన వాళ్లకు శిక్ష అనేది  తప్పకుండా కలుగుతుంది అని చెప్పే దృశ్యాన్ని తీసినప్పుడు కూడా తప్పునే ఎంతో ఆసక్తికరంగా చిత్రిస్తున్నారు. దాంతో ఈ దేడ్ దిమాక్ అంటారే ఈ బుద్ధిలేని జనాలకి ఆ చెడును చూపించేదే నచ్చుతుంది. చెడు తర్వాత చూపించే మంచి ఈ ప్రబుద్ధుల తలకెక్కదు. జీవితం లో తప్పు చేసిన తర్వాత కలిగే శిక్ష ఏదైతే ఉంటుందో అది చాలా తొందరగా దృశ్యీకరణ చేసి తీసేస్తారు. కానీ ఒక హత్య , ఒక రేప్ సీన్ ను ఒక దొంగతనం చేయడం ఇలాంటి వాటిని మాత్రం చాలా ఇంట్రెస్ట్ గలిగేలాగా చిత్రీకరిస్తున్నారు. ఆ తప్పు పని చేసిన తర్వాత వాళ్లకు అనుభవించే శిక్ష అదే సమాజంలో శిక్షను కుటుంబంలో వ్యక్తులు వేసే శిక్షను లేదా భగవంతుని దృష్టిలో శిక్షను ఏదో ఒక శిక్ష వాళ్లకు పడుతుందే అని చూపిస్తున్నారు… కానీ, ఈ శిక్ష ను చూపించే విషయాన్నేమో క్లుప్తంగా చూపించి ఆ నేరాన్ని మాత్రం సుదీర్ఘంగా చూపిస్తూ ప్రజలను

అయోమయంలో పడేస్తున్నారు. ఆత్మ విమర్శ సందర్భాన్ని ఒక్క నిమిషం లో తీసేయడం, అంత ముఖ్యమై విషయానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఏంటి ఇదంతా?వాళ్ళ వేషధారణ వాళ్ళ సంభాషణ ఒకటేమిటి? అన్నీ…

నిజానికి  ఇలా హత్య లు చేస్తున్నారా? అలాంటి స్పెషల్ ఆయుధాలు వాడుతారా? రక్తం కారుతూ….

ఇక అమ్మాయిల విషయంలో మరీ వింత..

అన్నీ చెడు ఆలోచనలు రేకెత్తించే దృశ్యాలే! ఇట్లాగే ఉంటున్నారా? ఎవరు ఆపాలి? ఎలా ?

ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం.తెలుగు భాష నేర్పడానికి ప్రప్రధమంగా అక్షర మాల నేర్పిస్తారు. కానీ కేంద్రం అక్షరాలు నేర్పిస్తే భాష వస్తుందా? రాదు! గుణింతాలు నేర్పాలి .

గుణింతాలు రాకుంటే తెలుగు భాష వస్తుందా? రాదు! అందుకే గదా అక్షరాలు నేర్పగానే గుణింతాలు నేర్పిస్తారు. ఆ వెనువెంటనే ఒత్తులు నేర్పిస్తారు. అబ్బే ఎందుకండీ సరాసరి వాక్యాలు చెప్తేసరి అన్నట్టున్నది ఇప్పటి ఈ సినిమా లతో నేర్పిస్తున్నది  ఇదే!  సినీ నిర్మాతలు, దర్శకులు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు అవసరం.మేధావులు ఆలోచించి అర్థం చేయించడం మరీ అవసరం.ప్రజల ఆత్మవిశ్వాసం పెరిగేలా సినిమా లు రావాలి.

కొన్ని అసభ్యకరమైన సీన్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ సీన్స్ ని మా పిల్లలు, మా మనవలు, మా మనవరాలు చూస్తారు .నా భార్య ,నా కూతురు చూస్తారు ,నా బంధు వర్గం అంతా చూస్తారు. నన్ను నమ్ముకున్న ప్రజలు చూస్తారు .ఇది సమాజంపై ఏం  ప్రభావాన్ని చూపిస్తుందో ఏమో వద్దు… అని ఒక క్షణం ఆలోచిస్తే మనో విశ్లేషణ చేసుకుంటే ఇటువంటి అసభ్యకర దృశ్యాలు రావు అందరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ప్రస్తుతం.

– డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి పత్రిక ఎడిటర్

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంక్రాంతి పండుగలో పరమార్థం

సంక్రాంతి రాక