పుష్యమాసంలో వచ్చే సంక్రాంతి పండుగకు ఒక విశిష్టత ఉంది. ఆరు నెలలు దక్షిణ దిక్కులో పయనించే సూర్యుడు తన దిశను ,గమనాన్ని మార్చుకుని ఇప్పటినుండి ఉత్తర దిక్కులో ప్రయాణం చేస్తాడు.ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యతిథిగా పెద్దలకు తర్పణాలు వడలడమే కాకుండా తెలంగాణలో ప్రత్యేకంగా ముత్తైదువలు భర్త పిల్లలు ఆరోగ్యముగా,ఆనందంగా వుండాలని సంక్రాంతి నోము నోచుకుంటారు.
భోగభాగ్యాలు ఇచ్చే భోగితో మొదలై కనుమ ముక్కనుమ వరకు మూడు,నాలుగు రోజులు చేసుకునే పండుగ.
భోగి మంటలు వేయడం అంటే పాత సామాను కాల్చడం ఒక్కటే కాదు పిచ్చి ఆలోచనలు కాల్చేయాలి.హిమం ఎక్కువుంటుంది కాబట్టి వేడి కోసం తెల్లవారుఝామున భోగి మంటలు వేస్తారు.హరిదాసు కీర్తనలు,కష్టపడి దున్నిన ఎడ్లను పూజించడం అదే గంగిరెద్దులకు ఆటవిడుపు ఇవన్నీ ఈ పండుగ దినాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి.
నేను చిన్నగున్నప్పుడు మా ఊరు ఏదులాబాదలో మా అమ్మ సంక్రాంతి నోము చేసుకునేది.ఎందుకు చేస్తారమ్మ ఈ నోము అంటే ఆమె సమాధానం.యమధర్మరాజు భార్య పగిలిన పుచ్చెలతో ఈ వ్రతం చేసేది.పండుగకు ముందు చాలా ప్రాణాలు పోతాయి.అందుకని అకాల మరణం కలగకుండా ఈ నోము చేస్తే పూర్ణాయుష్షుతో ఆనందంగా వుంటారు అని చెప్పింది.అందుకనే కొత్తకుండలు యైదు ,చిన్న గురిగిలు ఐదు కంచుళ్ళు అంటే మూతలు ఐదు తెచ్చి దానికీ పసుపు కుంకుమ బొట్టు పెట్టి,నువ్వుల ఉండలు పెట్టి,జాకెట్ బట్ట ముత్తైదువులకు వాయినం ఇచ్చేది.
గోదాదేవి వ్రతం,కల్యాణం కూడా చేస్తారు ఈ నెలలో.
ధనుర్మాసం అని పిలుస్తారు కదా.ఎందుకంటే హేమంత ఋతువు ,చలి విపరీతంగా ఉంటుంది. ధనుర్మాసంలో సకలప్రాణులు చలికి తట్టుకోలేవు.మనుష్యులైతే ధనుస్సు లాగా ముడుచుకుని పడుకుంటారని మా నాన్న ఆయుర్వేద వైద్యుడు చెప్పేవారు.
చలికాలంలో వచ్చే పండుగ సంక్రాంతి.పంట చేతికొచ్చిన వేళ కొత్త పెట్టడం అనే ఆనవాయితీ ఉంది మన తెలంగాణలో.
పెసరపప్పు, మిరియాలు,జీరకర్ర వేసి కొత్త బియ్యంతో వండి పులగం చేయడం ఆనవాయితీ.భోగి రోజు కట్టె పొంగల్ అంటే ఉప్పు వేసి చేస్తారు.సంక్రాంతి రోజు నువ్వులు,బెల్లం వేసి నువ్వుల పులగం చేస్తారు.
అసలు ఇలా ఎందుకు చేస్తారంటే మనం చేసుకునే ప్రతి పండుగ వెనక పరమార్థం ఉంది.ఆరోగ్య రహస్యం ఇమిడి ఉంది.
మన పెద్దవాళ్ళు చెప్పిన ,ఆచరించిన సంస్కృతి సంప్రదాయాలు ప్రజల ఆరోగ్యం,ప్రకృతి పరిరక్షణ,సకల ప్రాణికోటి శ్రేయస్సును కాంక్షించి చేసినవే.
చలికాలం కబట్టు వంట్లో వేడిని కలిగించేందుకు,కాల్షియం పెంచేందుకు,రక్తప్రసరణ సరిగా జరగడం కోసం నువ్వులు,బెల్లం బియ్యంతో చేసిన సకినాలు చేసి తినేవారు.ఇప్పటికి తెలంగాణలో ఈ సంప్రదాయం,వైవిధ్యం రుచికరం,ఆరోగ్యవంతమైన వంటలు తెలంగాణకే ప్రత్యేకంగా నిలిచాయి.
పిల్లలు హాయిగా ఎండలో తిరిగితే డి.విటమిన్ తో పాటు శారీరక వ్యాయామం చేయడం అనేది సమైక్యంగా ఉండడం అనేది పతంగులు ఎగురవేయడం వల్ల కలిగే ప్రయోజనం.
ఇంటిముందు రంగవల్లులు, గొబ్బెమ్మలు ప్రకృతిలో అన్ని వస్తువులు పూజనీయమే అని చెప్పడం.దసరాకు పూలతో బతుకమ్మను చేసి పూలను పూజిస్తే ఇప్పుడు సంక్రాంతి వేళలో ఆవు పెండతో గోపురం లాగా చేసి గరిక,పూలతో అలంకరించి పసుపు,కుంకుమ,అక్షతలు వేసి ఇంటి వాకిట్లో గొబ్బెమ్మగా చేసి పెట్టి కొలుస్తాము.ఆవుపేడ ఆరోగ్యదాయిని.నువ్వులు బియ్యం వేయడం వలన,బియ్యం పిండితో ముగ్గు వేయడం వలన పిట్టలు,చీమలకు ఆహారం
మనం ఎంతో వేడుకగా ఇంటిల్లిపాది కాదు ఊరు వాడ అందరూ కలిసి చేసుకునే పండుగలో జాతీయ సమైక్యత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యరక్షణ దాక్కుని ఉందన్న సత్యాన్ని గ్రహించి భవిష్యత్తరాలకు పండుగలు చేయడం ఎందుకో తెలిపితే బాగుంటుంది.
తెలంగాణలోనే కాకుండా భారరదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా వేరు వేరు పేర్లతో సంక్రాంతి జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు .