
అందం ఎక్కడ వుంది
ఆనందం ఎక్కడ ఉంది
అనుభూతి ఎక్కడ ఉంది
ఆరోగ్యం ఎక్కడ ఉంది?
యంత్రంలా పనిచేసి వచ్చి
ఏదో విధిగా ముద్దులాడే
ఆ తల్లి దండ్రుల వదనంలో
అనుభూతి ఎక్కడ ఉంది?
చదివి చదివి అలసిపోయి
వ్రాసి వ్రాసి విసిగిపోయి
విధిగా తల్లి దండ్రుల చేరే
పసివాడని ఆ పసివదనాలలో
అనుభూతి ఎక్కడ ఉంది?
మంచమెక్కిన తల్లిదండ్రులు
మరీ మరీ విసిగిస్తుంటే
మనువు సంగతి విధిగా
ఆలోచించే వనిత సుందర నయనాలలో
అనుభూతి ఎక్కడ ఉంది?
నిరుద్యోగము, నిస్సహాయత
నిలువెల్ల కృంగదీస్తుంటే
నీరజాక్షి గురించి కలలు కనే
ఆ నిరుద్యోగి అంతరంగంలో
అనుభూతి ఎక్కడ ఉంది?
పొరుగుదేశాల బాధల సేవకు వెళ్లి
తన కుటుంబం గురిఁచి ఆలోచించే
సమయంలేని మన సిపాయీల
కళ్ళల్లో అనుభూతి ఎక్కడో ఉంది?
కూలిదొరకక, పైసలు రాక ఇంటికి వెళ్తే
పిల్లలు ఏం తెచ్చావు అయ్యా అని ఎదురొస్తే
జవాబు ఏం చెప్పాలో తెలియని ఆ కూలీ
కళ్ళల్లో అనుభూతి ఎక్కడ వుంది?
సేవచేసే వారే లేరని
ప్రేమతో పలుకరించే పిలుపే వినబడదన్న
చేదు నిజం తెలుసుకొని
విధిగా విధి ప్రకారం బ్రతుకే
శతవృద్ధుల కళ్ళల్లో అనుభూతి ఎక్కడ వుంది?
అందాలన్నీ, ఆనందాలన్నీ
ఆశలన్నీ, అనుభూతులన్నీ
పాతకాలం కవుల గుండెల కల్పనలు
విధికి ఎదురొడ్డి జీవించటమే
ఈ కాలం నగ్న సత్యం
ఈ నిజం తెలుసుకోగలిగితే
మనిషి హాయిగ, ఆశలు ఊహించక
కలల్లో తేలిపోక సత్యం తెలుసుకుని జీవిస్తాడు.