జాతీయాల్లో వింతలు

మన సంభాషణల్లో అలవోకగా కొన్ని మాటల్ని,పాతతరం వారినుంచి అనూచానంగా వాడుతూ ఉంటాం.మరి వాటి అర్థం కూడా తెలుసుకొని వాడితే,అర్థవంతంగా ఉంటుంది కదా మన సంభాషణ.
అందుకు ఉదాహరణగా ఈ సంభాషణలు చూడండి…

నీ గొంతెమ్మ కోరికలకు అంతు లేకుండా పోతోంది!

నా అత్తెసరు జీతంతో నీ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేను తల్లీ!

మా బాస్ గొంతెమ్మ కోరికలు తీరిస్తేగానీ,నాకు ప్రమోషన్ వచ్చే ఛాన్స్ కనిపించటం లేదురా!

అసలు ఎవరీ గొంతెమ్మ…?!

కుంతీదేవికి తెలుగు పేరే గొంతి ఆసక్తికరంగా ఉంది కదూ?అసలు విషయం తెలుసుకుందాం.
తీరని,అసాధ్యమైన కోరికలను ఆమె కోరుకుంది.అటు పాండవులూ,ఇటు కర్ణుడూ బతికివుండాలని కోరుకున్నది. ఆఖరి క్షణం దాకా కర్ణుడిని తన కొడుకని చెప్పకుండా దాచి,కర్ణార్జునుల్లో ఎవరో ఒకరు మాత్రం బతుకుతారనే నిర్ణయానికి వారిద్దరూ వచ్చిన తరువాత ఇద్దరూ బతకాలని కోరుకోవడం సాధ్యమయ్యే పని కాదు.అలా వీలుకాని,ఎప్పటికీ తీరని కోరికలనే
గొంతెమ్మ కోరికలం టారు.

ఇలాంటి జాతీయమే ఇంకొకటి..
దారినబోయే దానయ్య
ఎవరా దానయ్య..?ఏమా కథా కమామీషు?!తెలుసుకుందాం.
అతన్నే పిలిచి అడిగి తెలుసుకుందామా!

ఆ సంగతి దారినబోయే దానయ్యని పిలిచి వివరంగా అడగాలా, ఏమిటి?

ఇలా దారినబోయే దానయ్యలకు ఆస్తి అంతా దోచిపెడితే,ఇక మనకూ,మన పిల్లలకూ ఏం మిగులుతుందండీ..?!
అంటూ సాధించే భార్యల భాగోతాల్ని మన ఇరుగింట్లోనో,పొరుగింట్లోనో చూస్తుంటాం.

ఆ దారినబోయే దానయ్యతో అంతసేపు ముచ్చట్లేవిటే..? అంటూ సణిగే బామ్మల్ని,అమ్మమ్మల్నీ చూస్తుంటాం.

ఇతగాడి పేరు పాత పుస్తకాల్లో కనిపించదు.దారి శబ్దంలోని దా తో యతి కోసం దానయ్య పుట్టాడన్నా వింత కాదు.తెలుగులో దానయ్య అనే పాత్ర ఉన్న కథలు అనేకం పందొమ్మిదో శతాబ్దిలో పుట్టాయి.ఇరవైలో నాటకాలు కూడా వెలిసాయి.బాటసారి అనే అర్థంలో,దేశదిమ్మరి అనే భావంతో ఈ పేరు పెట్టారు.ఎవరు పెట్టారో చెప్పలేం.ఫలానా అని స్పష్టంగా తెలియని వ్యక్తిని దారినబోయే దానయ్య అంటాం.అతనివల్ల మనకు లాభనష్టాలు రెండూ లేవు.అపకారి కాడు.ఉపకారి కూడా కాకపోవచ్చు.కొత్త మనిషిని,తెలియని వ్యక్తిని ఆ పేరుతో వ్యవహరిస్తుంటాం.

ఇక పాత సంగతులను
తూర్పారబట్టుదామా!

ఇరు రాజకీయ పార్టీలు ఒకరినొకరు తూర్పారబట్టసాగారు.

అసలు సంగతేవిటో తెలుసుకోకుండా అలా తూర్పారబట్టేసావేమిటే..?!
అని స్నేహితురాళ్ల సంభాషణల్లోనూ..

అసెంబ్లీ అంటే ఒకరినొకరు పెద్దగా అరుచుకుంటూ,తూర్పారబట్టడం ప్రస్తుతం మామూలైపోయింది!
ఇలా వార్తల్లోనూ వింటూనే ఉంటాము కదా!

అసలది తూరు, పారు, పట్టు అనే మూడు విడిపదాల కలయిక.తూరంటే తాలు, తబుకు. పారబట్టు అనేది సమాపక క్రియ.పొయ్యేటట్లు పట్టుకోవటమని అర్థం.తేలికపాటి,గింజబట్టని పొల్లును తొలగించటానికి చేసే పని అది.ఈ పని చేయకుండానే,వ్యక్తిలోని లోపాలను బయటపెడుతూ తిట్టడాన్ని తూర్పారబట్టడమంటున్నాం. పాతసంగతులను,తగాదాలను గుర్తుకుతెచ్చుకుంటూ చెడతిట్టడాన్ని ఈ మాటకు అర్థంగా భావించి,ప్రయోగిస్తున్నాం.

ఇంకా మరికొన్ని జాతీయాల విశేషాలు మరోసారి మీ కోసం!
************

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అత్తారిల్లు

మానవత్వమా… నీ చిరునామా ఎక్కడ?