భారత దేశంలో ఆసేతు హిమాచలం ఒకే రోజు ఒకే పద్ధతిలో చేసుకునే ఒకే ఒక పండుగ దీపావళి . రంగు, రంగుల రంగవల్లులతో, ప్రతి ఇంటి ఆవరణ దీపాల వరుసలతో అందంగా, ఆహ్లాదంగా, కుల మత, ధనిక, పేద విచక్షణ లేకుండా సంబరంగా టపాకాయలు కాల్చుకుంటూ ఆనందించే పండుగ దీపావళి.
దీపావళి గురించిన పురాణ కథలు అందరికీ తెలిసినవే ….దీపావళి మూడు రోజుల పండుగ ధన్వంతరి త్రయోదశి , నరక చతుర్దశి, దీపావళి.
రాక్షసులు దేవతలు అమృతం కొరకు క్షీరసాగరమథనం జరిపినపుడు సాగర గర్భం నుండి లోక కళ్యాణం కొరకు ఉద్భవించిన అనేక దైవిక వస్తువులతో పాటు ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఔషధులతో ధన్వంతరి ఉద్భవించాడు ఆరోజును ధన్వంతరీ త్రయోదశిగా జరుపుకుంటారు . ధనత్రయోదశి గా కూడా విశిష్టత వుంది .
వింత వరాలతో ప్రపంచాన్ని వణికిస్తున్న నరకాసురుని శ్రీకృష్ణుని ప్రియ సతి సత్యభామ యుద్ధం చేసి ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున వధించి ప్రజలకు , దేవతలకు ఆనందం చేకూర్చిన సందర్భంగా ఆమె విజయానికి సంకేతంగా మరుసటి రోజు ఆశ్వయుజ అమావాస్య రోజు “చెడు పై మంచి పొందిన గెలుపు” గా అమావాస్య చీకటిలో పున్నమి వెలుగులు పంచే విధంగా దీపాలు వెలిగించి భూమండలమంతా వెలుగు నింపి విజయోత్సవం జరుపుకున్న రోజుగా ప్రతి సంవత్సరం ఆరోజున” దీపావళి “ గా జరుపుకుంటారు.
ఇది ఒక కధ అయితే …
క్షీర సాగర మధనంలో ఉద్భవించిన కల్పతరువు, కామధేనువు , చంద్రుడు, ఐరావతం, ధన్వంతరీ ఇలా మొదలైన అనేక వాటితో పాటుగా ఐశ్వర్యాధి దేవత
శ్రీ మహాలక్ష్మీ కూడా ఆశ్వయుజ అమావాస్య రోజు ఆవిర్భవించటం గొప్ప విశేషం .
ముఖ్యంగా సర్వ సంపదలకు అధిష్ఠాన దేవత శ్రీ మహా లక్ష్మి. అష్టలక్ష్మీ స్వరూపంగా అష్టైశ్వర్యాలు ప్రసాదించ వలసిందిగా అమ్మ దయ కోరి ప్రార్థిస్తూ శుభప్రదంగా దీపాలు వెలిగించి తీపి పదార్థాలు నైవేద్యం పెట్టి శ్రీ మహాలక్ష్మిని ఆహ్వానిస్తూ పూజలు చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు.
రావణ సంహారం చేసి శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా జగత్కల్యాణ మహోత్సవానికి నాంది పలుకుతూ అయోధ్య తిరిగి వచ్చిన సందర్భంలో ఈ పండగ చేసుకున్నట్లు ఇతిహాసం చెప్తుంది. టపాసులతో రావణాసురుని బొమ్మచేసి, రామలక్ష్మణులు అలంకారంలో యుద్ధం చేస్తున్నట్లుగా ఆ బొమ్మను కాల్చే సందర్భాన్ని చాలా గొప్పగా “రామలీల” అనే పేరుతో అయోధ్య లో అంబరాన్నంటే సంబరంగా జరుపుతుంటారు.
మూడు కారణాలుగా పురాణాల ప్రకారంగా ఈ పండుగకు దీపానికి అత్యుత్తమ స్థానం ఇవ్వటం విశేషం. మన హిందూ సంస్కృతి లో దీపం యొక్క విశిష్టత తెలియచేస్తుంది .
దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించుకుని నమస్కరిస్తాము .
*“దీపం జ్యోతి పర బ్రహ్మం దీపం జ్యోతి జ్జనార్ధనః
దీపోహారతు మే పాపం దీపజ్యోతిర్నమోస్తుతే।।*
అని వేదాలలో దీప ప్రాముఖ్యత చెప్ప బడింది.
నూనెతో వెలిగించిన దీపాన్ని తదేకంగా చూస్తే అందులో మూడు రంగులు కనిపిస్తాయి . ఎరుపు, పసుపు , తెలుపు .ఈ మూడు రంగులు ముగ్గురు దేవతలు
లక్ష్మీ, పార్వతి, సరస్వతులకు ప్రతిరూపంగా ముగ్గురు అమ్మలు కలిసిన శక్తి స్వరూపిణి దీపాన్ని పరిగణించి కొలుస్తాము .
నిజానికి దీపం అంటే ఒక్క వెలుగే కాదు…ఆశ ,శక్తి కూడా…
మన హిందూ నిత్య జీవన విధానంలో అంధకారం అనేది ఒక భయంకరమైన ప్రస్తావన. అలాంటి చీకటిని ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని భవిష్యత్తును బంగారుమయంగా చేయమనే ఆశతో భగవంతుని ముందు ఉదయం , సాయంత్రం దీపం పెట్టి చేతులు జోడించి నమస్కరిస్తాము. ప్రతి పూజలోను దీపానిది ప్రముఖ స్థానం .
దీపావళి తర్వాత రోజునుండి పావన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసమంతా కూడా దీపానిదే ప్రాముఖ్యత .కార్తీక దీపంగా ప్రసిద్ధి.శివ కేశవులిద్దరికీ భేదం లేకున్నా ఈ మాసంలో శివుని ప్రాశస్త్యం ఎక్కువ. బ్రహ్మ ముహూర్తంలో లేచి కొత్త నీరుతో కొండలపైనుండి ఓషధ గుణాలను నింపుకుని ప్రవహించే నదులలోను , సముద్రంలోను స్నానం చేసి తులసి ముందు దీపం వెలిగించడం ఆరోగ్యకరం . అలాగే సాయంత్రం కూడా సంధ్య దీపాన్ని పెట్టటం ఒక దివ్య సాంప్రదాయం .
ఈ నెలలో తులసి ప్రాముఖ్యత కూడా ఎక్కువ. కార్తీక మాసం చివరి రోజున అరటి దొన్నెలలో దీపాన్ని వుంచి నిండుగా ప్రవహించే నదుల్లో వదలటం అందమైన ఆనందకరమైన ఆనవాయితీ .
శాస్త్రీయంగా చూసినపుడు తులసి ఒక పరమ ఔషధి .
మట్టి ప్రమిద లో నువ్వుల నూనె పత్తి తో చేసిన వత్తిని వేసి వెలిగించిన దీపం పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది .
నిజానికి ఈ పండుగ, కార్తీకమాసం అంతా కూడా శాస్త్రీయత నింపుకున్న మాసం . ఆశ్వయుజ మాసం విపరీతమైన వర్షాలతో ప్రకృతి వాతావరణం చాలా చెమ్మగా వుంటుంది, ఆ తడికి క్రిమి కీటకాలు పుట్టి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. చెట్లు చేమలు విపరీతంగా పెరుగుతాయి ఆ పొదల మధ్య విష పురుగులు చేరటం కూడా జరుగుతుంది. చెరువులు చెలమలు నిండి బురదతో నీరు కలుషితం అవుతాయి అంటు రోగాలు, చర్మ వ్యాధులు కూడా ప్రబలుతాయి .
దీపావళి రోజు దివ్వెలు వెలిగించడం వలన దీప కాంతికి పురుగులు దీపాల దగ్గర జేరతాయి . టపాసులు కాల్చటం వలన వచ్చే పొగకు కీటకాలు చనిపోతాయి. ఆ శబ్దాలకు పాములు లాంటి విష కీటకాలు దూరంగా పారిపోతాయి. కార్తీక మాసంలో ఔషధ మొక్కలు కూడా బాగా పెరిగి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. తులసి బాగా పెరుగుతుంది…ఆ సమయం లో తులసి దగ్గర ఎక్కువ సమయం గడిపితే ఆరోగ్యానికి మంచిది .
మన హిందూ పండుగలలో ప్రతి పండుగకు ఒక సశాస్త్రీయ కోణం వుంటుంది. దీపావళి పండుగ నరకాసుర వధ ద్వారా సత్యభామ విజయం మహిళాశక్తిని కూడా మహిమాన్వితం చేసిన పండుగగా గొప్పగా చెప్పుకోవచ్చు. దీపాన్ని శక్తి స్వరూపంగా మహిళాశక్తికి ప్రతి రూపంగా తలుచుకుంటాము .
దీపావళి పండుగ మూడవ రోజు “ భగినీ హస్తభోజనం “ అన్నా చెల్లెళ్ళ మధ్య ఆత్మీయత పెంచేందుకు చెల్లెలి చేతి భోజనం తింటే కీడు తొలగి మంచి జరుగుతుందని ఒక నమ్మకం. నమ్మకం ఎలాంటి దైనా ఆత్మీయత పెరుగుతుందనేది సత్యం . మనుష్యుల మధ్య ఆత్మీయతలు , అనుబంధాలు , స్నేహాలు
పెంచుకోవటం కొరకే ఈ పండుగల సాంప్రదాయాన్ని పురాణాలు సుహృద్భావంతో సృష్టించాయని చెప్పవచ్చు.