లలితలావణ్యం – గాన మాధుర్యం

ఒక మనిషిలోని నైపుణ్యం, మదిలో కదలాడే ఆలోచనలు, అంతరంగ సంద్రంలో అలలై ఎగిసిపడే భావోద్వేగాలు కాగితంపై అక్షరమై, స్వరంలోని వరమై, శిలను మలిచిన శిల్పమై ఇలా పలు విధాలుగా వ్యక్తమవుతూ ఉంటాయి. మనిషిలోని ఈ సృజనాత్మక వ్యక్తీకరణనే కళలు అంటారు. ఇవి దృశ్య, ప్రదర్శన, సాహిత్యం అని మూడు భాగాలుగా వర్గీకరించబడినవి. ప్రదర్శన కళల్లో ఒకటైన నాట్యం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం.

పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే , నంది,పలు జాతీయ ఫిలిం ఫేర్ అవార్డులతో కళామతల్లి గళాన్ని అలంకరించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ గారు దర్శకత్వం, సి.హెచ్. వి. అప్పారావు నిర్మాతలుగా , సిరివెన్నెల సీతారామశాస్త్రి (గీత రచయిత), ఇళయరాజా(స్వరకర్త) వెంకటేష్ , భానుప్రియ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రం దక్షిణాది ఫిలింఫేర్, సినిమా ఎక్స్ప్రెస్ , స్వర్ణనంది పురస్కారాలను అందుకోవడమే కాకుండా దర్శకనిర్మాతలు, నటీనటులు, గీత రచయితలకు కూడా పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందించి భారతీయ చలనచిత్ర వినీలాకాశంలో ధ్రువతారగా వెలిగింది. ఇక మాధుర్యాన్ని ఆస్వాదిస్తే……

పల్లవి:

కొత్తగా రెక్కలొచ్చెనా…… గూటి లోని గువ్వపిల్లకీ
మెత్తగా రేకు విచ్చెనా……
కొమ్మ చాటునున్న కన్నెమల్లికీ

ప్రఖ్యాత నాట్యాచారుని కూతురైన కథానాయిక తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించిన నాట్యకళలో చక్కని ప్రతిభను కలిగి ఉన్నప్పటికీ, నాట్యంపై విముఖంగా ఉంటుంది. ఆమెలో దాగి ఉన్న కళను గుర్తించిన చిత్రకారుడైన కథానాయకుడు ఎన్ని విధాలుగా ఆమెను ప్రోత్సహించినప్పటికీ కూడా ఏ విధమైన ఆసక్తిని కనబరచదు. ఆమెలో నిద్రాణమై ఉన్న కళను జాగృత పరచడానికి సామదానభేదదండోపాయాలను ప్రయోగించి ఎట్టకేలకు విజయం సాధిస్తాడు.

నాట్యం అంటే ఏమాత్రం గిట్టని ఆ అమ్మాయి ఒకనాడు తనకు తానుగా నదీ తీరానికి వెళ్లి, ప్రకృతి ఒళ్లో నాట్యసాధన చేస్తూ ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసిన ఆ కళారాధకుడు మెల్లిమెల్లిగా ఆమె మనసు నాట్యం వైపు మళ్ళు తోందనే ఆనందంతో ఈ పల్లవిని (కొత్తగా రెక్కలొచ్చెనా) అందుకుంటాడు. కాస్త ఆటపట్టిస్తున్న ధోరణి ధ్వనించడంతో, స్నేహపూరిత ఉక్రోషంతో నిలదీస్తుంది. దానికి సమాధానంగా అతను ఆమె గంధపు చెక్కైతే తాను రాయి లాంటి(ఒక ఉన్నతుడైన వ్యక్తి ఎప్పుడూ తాను ఉన్నతుడిననే భావాన్ని వ్యక్తపరచడు, ఒప్పుకోడు. అది అతనిలోనే వినయ సంపన్నతకు నిదర్శనం)వాడిని అంటాడు.ఆమెలో నిక్షిప్తమై ఉన్న నాట్యసంపద గంధపు చెక్కైతే, ఆ చెక్కను అరగదీసే సాన అతడు. భగవదారాధనలో సానకు విశిష్ట స్థానం ఉంది. సానకు సరితూగే స్థానం అతనిది. ఇకపోతే ఏ కళకైనా సాధన అనేది శ్వాసచక్రం లాంటిది. నిత్యనిరంతర సాధనే ఒక సాధారణ వ్యక్తిని సాటిలేని కళాకారుడిగా వేదికపై నిలబెడుతుంది. ఐతే ఎంత గొప్ప కళాకారుడైనా, దానిని అంచనా వేయగలిగే, ఆస్వాదించగలిగే కళారాధకులు ఉన్నప్పుడే అతని సాధనకు ఒక విలువ, ఒక గౌరవం.
కళాసాధన కనువిందు చేసే రంగుల పువ్వైతే, ఆ పువ్వునంటి పెట్టుకొని ఉన్న పరిమళమే కళారాధన.

తానొక యువకుడిననీ, తాను స్ఫూర్తి నింపాలని అనుక్షణం తపన పడుతున్నది ఒక యుక్తవయస్కు రాలిలోననే ఆలోచన ఒక క్షణం కూడా అతనిలో కలుగదు. అతనికి తెలిసిందల్లా ఒక్కటే. ఆమెలోని ప్రతిభను వెలికి తీయడం. అతను కోరేదల్లా ఒక్కటే, కళామతల్లి పాదాల చెంత ఆమెను ఒక సుగంధ కుసుమంగా సమర్పించడం. ఏ మాలిన్యం లేని ఆరాధన. ఏ మకిలి అంటని ప్రేరణ. అతనిలోని ఆ తపన, ఆరాధన చూస్తూ ఉంటే, సుమారుగా ఐదు దశాబ్దాల క్రిందటి ‘కళ్యాణి ‘ చిత్రంలోని ఆపాతమధురం ప్రేక్షకుల హృదయాలను సుతారంగా తడుముతూ ఉంటుంది.

లలిత కళారాధనలో ….వెలిగే చిరుదివ్వెను నేను..
మధుర భారతి పద సన్నిధిలో…. ఒదిగే తొలిపువ్వును నేను

ఔను, లలిత కళారాధనలోని ఈ చిరుదివ్వెలే ఆ శారదాదేవికి పట్టే మంగళహారతులు. ఔను, ఈ పూలు వెదజల్లే సుగంధాలే ఆ తల్లి మీటే తంత్రీ నాదాలై సుషుప్తిలోని కళలకు పాడే మేల్కొలుపు గీతాలు.

చరణం:

కొండ దారి మార్చింది…..
కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది…..
కలికి ఏటి నీరు
బండరాల హోరు మారి…
పంట చేల పాటలూరి
మేఘాల రాగాల మాగాణి ఊగేల
సిరిచిందు లేసింది కనువిందు చేసింది

 

సహజసిద్ధ నీటి వనరులైన వాగు వంకలు కొండలు అడ్డు రావడంతో వాటి ప్రవాహగతిని మార్చుకొని సాగిపోతూ ఉంటాయి.

తన అయిష్టతను వ్యక్తపరిచే తీరులో ఈమెలో కొంటెతనం (మువ్వలను తీసుకెళ్లి ఎవరూ చూడకుండా బావిలో పడేయడం, వేదికపై ప్రదర్శన నిస్తున్న సమయంలో ప్రవర్తించిన తీరు ) స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వాగు వంటి ఈ కొంటెకోణంగి ప్రయాణాన్ని తాను కొండనై దారి మళ్లించానని ఆనందంతో గంతులు వేస్తూ ఉంటాడు.

ఏ ఫలమాశించి మత్తకోకిల… ఎలుగెత్తి పాడునూ…..
ఏ వెల ఆశించి పూచే పువ్వూ..
తావిని విరజిమ్మునూ….
అవధిలేని ప్రతి అనుభూతికి
ఆత్మానందమే పరమార్థం

నిజమే, కోయిల గానాలైనా, వి రుల సోయగాలైనా ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించవు. అవన్నీ ఆ విధాత రచనలోని అద్భుతాలే! ఆ సృష్టికర్త కుంచెలోంచి జాలువారిన కళాఖండాలే ! కళాజలధికి ప్రతీకైన
అతని అంతరంగంలో అలలై ఎగిసిపడే అనుభూతులే ఆ కలవాణి కర్పించే కైమోడ్పులు.

చరణం:
వెదురులోకి ఒదిగింది…..
కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది……
మధుర గానకేళి
భాషలోన రాయలేని రాసలీల రేయి లోని
యమునా తరంగాల….
కమనీయ శృంగార….
కళలెన్నో చూపింది
కలలెన్నో రేపింది

తనలో దాగివున్న అసాధారణ ప్రతిభాపాటవాలను గుర్తించలేని ఆమెను కుదురు లేని గాలి అనీ, ఆ ప్రతిభను వెలికితీశాక గానీ విశ్రమించననే అతడిని వేణువనీ అంటున్నారు గీత రచయిత.
వెదురులోకి ఒదిగిన గాలి వేణువై
వేయి రాగాలు పలికించినట్లు, యమునా తటిపై రాధామాధవుల
కేళీవిలాసాలను, రసరమ్యంగా ఆవిష్కరించింది అంటున్నారు.

ఏ సిరి కోరి పోతన్నా…
భాగవత సుధలు చిలికించెనూ…
ఏ నిధి కోరి త్యాగయ్యా ….
రాగ జల నిధులు పొంగించెనూ…
రమణీయ కళావిష్కృతికి….
రసానందమే పరమార్థం

ఆధ్యాత్మిక సాగరాన్ని కవ్వమై కొందరు, సంగీత సాగరాన్ని కవ్వపు తాడై మరికొందరు ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండానే చిలికి అందుండి వచ్చిన భక్తి మకరందాన్ని, రాగ మాధుర్యాన్ని అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ భక్తకోటికి పంచి పెడుతూనే ఉన్నారు.

ఏ స్వార్థచింతన లేకుండా నిర్మలమైన హృదయంతో ఆమెలో నిద్రాణమై ఉన్న కళను తట్టి లేపుతూ ఉంటాడు.అతని పట్టుదల ఫలించి చిట్టచివరికి ఆమె అందులో తాదాత్మ్యం చెందుతుంది.

ఈ చిత్రంలోని ప్రతీ పాట పద సౌకుమార్యం, భాషా సుగంధాల్లో దేనికదే సాటి. ఇక భానుప్రియగారు కళ్లతో ప్రదర్శించిన హావభావ విన్యాసాలైతే ప్రేక్షకుల హృదయాలల్లో చెరగని ముద్ర వేశాయని చెప్పవచ్చు.

ఈ కథానాయిక వంటి వారు ఎంతో మంది మన చుట్టే ఉంటారు.
తమలోని ప్రతిభను తాము తెలుసుకోలేకా, గుర్తించి ప్రోత్సహించే వారు లేకా,ఆ ప్రతిభ వాళ్లలోనే ఉంటూ, ఏదో ఒక రోజు వాళ్లతోనే అంతమైపోతుంది. కొంతమంది తమను తాము తెలుసుకున్నప్పటికీ, దానిని నిరూపించుకునే ప్రయత్నంలో సరైన ఆదరణ లభించక నిరుత్సాహానికి గురవడమే గాకుండా, అవహేళనలపాలై కుంగుబాటుకు గురైన సందర్భాలు కూడా లేకపోలేదు.

మరుగున పడిన ప్రతిభను వెలికి తీయాలని ప్రయత్నించే ప్రతీ హృదయానికి (ఔన్నత్యానికి) నా ఈ రచన అంకితం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బాణాసంచా సందేశం

దీపం పరంజ్యోతి