ఎంత ఎత్తుకి ఎగిరినా
జీవం కోల్పోయాక
క్రింద పడి
మట్టిలో కలవాల్సిందేనని
తారాజువ్వ సందేశం!
పలకరింపు కొద్దిసేపైనా
చిరునవ్వుల వెలుగులు
పంచమని
చిచ్చుబుడ్డి ఆదేశం
శబ్దం పెద్దదయితే
పెనవేసుకున్న బంధం
తునాతునకలైపోతుందని
బాంబు చేస్తుంది హెచ్చరిక
పనిగట్టుకొని వెలిగిస్తే
మన చుట్టే తిరుగుతుంది
భూచక్రం
అనుబంధాల్ని పలకరించమని
దాని సంకేతం!
నిశ్శబ్దంగా
వెలుగు జిలుగుల
ఆనందం వెదజల్లమని
కాకర పువ్వొత్తు
అభిభాషణం !
కారణాలు ఎన్ని వున్నా
కారు చీకట్లు తొలగించాలని
వెన్న ముద్ద అనుశాసనం !
బాణాసంచాలో
అనల సందేశం దాగి వుంది
తత్వం బోధపడితే
వ్యక్తిత్వం విప్పారుతుంది !