మనిషి సంఘజీవి
కానీ ఆ సంఘమో ఎండమావి
ఎక్కడికి పోతాడో ఆ తుంటరి
ఒక్కసారిగా అయిపోతాడు ఒంటరి
ఆ ఏకాంతం ఎంత క్షోభ..!?
ఏమైపోతుందో అప్పటిదాకా అనుభవించిన శోభ..
చచ్చీచెడి సంపాదించిన యశస్సు
వడివడిగా వచ్చి మింగేస్తుంది ఆ తమస్సు
నిన్నేగా మొదలైంది ఉషస్సు
అనుకునేలోగానే అయిపోతుంది ఆయుష్షు
కోరి పెంచుకున్న కుటుంబం
చూస్తుండగానే అస్తమించే రవిబింబం
దారి తప్పిన ధర్మాలు, అరాకొర క్రూర కర్మాలు
ఒంటిపైకెక్కి ఒడిస్సీ చేస్తుంటే
కనురెప్పలు బరువు, కన్నీటికి కరువు
పెదవులు కదపలేని పేదరికం
గొంతు దాటి, గుండెను చేరి
నిస్సహాయతతో కునారిల్లి కుంటిదై
కుమిలిపోతున్న ఆ క్షణాన
కర్కశంగా లాగే కబంధహస్తం
విలవిల్లాడుతూనే వీడ్కోలు తీసుకునే మస్తకం
రేపటి తరానికి పఠించవలసిన విలువైన పుస్తకం
అలా అప్రయత్నంగా ఆక్రమించే మృత్యువు
ఎన్నటికీ, ఎవ్వరికి అంతుపట్టని క్రతువు