హాస్టల్ గదిలో ఓమూల నక్కిన గంగ వెక్కి వెక్కి ఏడుస్తోంది.లంగా అంతా రక్తపు మరకలు! పొద్దుటే పెద్ద మనిషైంది. వంటామె పోచమ్మ గమనించి ఆమూల కూచోబెట్టింది.హాస్టల్లో చిన్న పిల్లలంతా”అక్కా! నీకేమైంది?” అని పలకరించు పోతున్నారు.వార్డెన్ వచ్చి నాల్గురోజుల తర్వాత పంపుతాను. బస్సు ఎక్కి ఎక్కిస్తాను. ఓ రెండు గంటల ప్రయాణం కదా?” అంది.అప్పటికింకా సెల్ఫోన్ లేని రాని కాలం.సెలవుల్లో అమ్మాయిలు దగ్గర ఊర్లవారే కాబట్టి బస్సులో వెళ్లిపోయేవారు. కొంత మంది అమ్మనాన్నలు వచ్చి తీసుకుని పోయేవారు. ఆరోజు మూడు గంటల బస్సు ఎక్కింది గంగ.సరిగ్గా ఐదు కల్లా ఇంట్లో ఉంటుంది తను.ఏదో బెరుకు సిగ్గు ఆపిల్లని చుట్టేస్తున్నాయి. ఆలోచనలతో ఆపిల్ల చుట్టు పరిసరాలను చూస్తోంది.
అయ్య పొలం నుంచి వచ్చేస్తాడా? ఈరోజు తాగి వస్తాడా? ఇలా తాగి ఒళ్లు గుల్ల చేసుకుంటున్నాడని అమ్మ రోజూ అరుస్తుంది.ఆఅరుపులు భరించలేక గంగ ఏడ్చేది. అయ్య మంచాడే! కానీ చాకిరీకి అలిసి తాగుతాడు.చదువు కోసం అమ్మ నాన్నల కి దూరంగా ఉన్న గంగ కోసం తల్లి మురుకులు మొక్కజొన్నపొత్తులు సకినాలు చేసి పంపితే ఓవారందాకా తన ఫ్రెండ్స్ ఇద్దరితో కలిసి పంచుకొని తినేది.అమ్మ కూడా ఎంతో కష్టపడుతుంది. మిషన్ కుడ్తుంది.ఆఊరి పెద్ద ఇంట్లో బాసాన్లు తోముతుంది.తను వెళ్లగానే అమ్మ ఒడిలో తలదూర్చి పెద్దగా ఏడ్వాలి.
ఆలోచనలో కొట్టుమిట్టాడుతున్న గంగ ” ఠాప్” అన్న పెద్ద శబ్దంకి ఉలిక్కిపడింది.బస్సుటైర్ పంచరైంది అని తెలుసుకున్న జనం విసుక్కుంటూ దిగిన మగాళ్ల ను చూస్తున్న గంగ పక్కన కూర్చున్న అవ్వ పలకరింపుతో ఉలిక్కిపడింది.”అవ్వ! అప్పుడే చీకటి పడిందేంటి?”శీతకాలం పొద్దు బిడ్డ! ఏడకెల్తుండావ్? ” ” సర్వేల్” ఇద్దరూ కబుర్లలో పడ్డారు.”అవ్వ!పాస్ పోసుకుని వస్తా” అని చెప్పి కిందకి దిగిన గంగ బస్సు వెనుక కి వెళ్ళింది.కాస్త దూరంలో పెద్ద చెట్లు తుప్పల్లోకి వెళ్ళిన ఆపిల్ల తిరిగి వస్తున్నప్పుడు ఏదో బలమైన చెయ్యి ఆమె నోరుని గట్టిగా నొక్కేసి భుజాలపై మోస్తూ తీసుకువెళ్లింది.ఆచీకటిలో ఆక్రమించిన ఆశరీరం ఓపావుగంటకి ఎత్తుకొని బస్సు వెనక పడుకోబెట్టింది రోడ్డుపైనే.ఓపావుగంటకి టైర్ కొత్త ది వేయటం డ్రైవర్ హారన్ మోగించటం కండక్టర్ అరవటంతో పాటు జనాల సందడికి గంగ తేరుకుంది. నీరసంగా తోటకూర కాడలా పడుందాపిల్ల
“వాయ్యో! డ్రైవరన్నా! నాపక్కన కూకున్న పిల్ల రాలేదు.జర ఆపు” అంతా ఆపిల్ల నీకేం అవుతుంది ఏడకెల్లింది అని ప్రశ్నల జడివాన కురిపిస్తుంటే” సర్వేల్ పోతుండా అమ్మ అయ్య కాడికి అని చెప్పింది.ఇస్కూల్ ఆష్టల్ల ఉంటాదిట .” అంతా ఆపిల్ల కోసం వెతకసాగారు. చలికాలపు చీకటి చెట్ల నీడల్లో బ్యాటరీలైట్ తో కండక్టర్ తో పాటు కొంతమంది దిగారు.ఓయువకుడు తలకి మఫ్లర్ చుట్టుకుని వెతికి బస్సునీడలో పడున్న గంగని మోసుకొచ్చి అవ్వపక్కన కూలేసి” ఈపాపేనా అవ్వా?” అని ప్రశ్నించాడు. ” శానా మంచోడివి కొడుకా! సల్లంగుండు” అవ్వ దీవెన కు పొంగిపోతూ” అయ్యయ్యో! బుగ్గలమీద గాట్లు! రక్తపు మరకలు లంగాపై!” అని పెద్దగా అరుస్తూ మంచినీటి సీసా అందుకుని ఆపిల్ల నోరుతెరిచి చుక్క చుక్క తాగిస్తున్న ఆయువకుని వెయ్యినోళ్లతో పొగుడుతుండగా బస్సు కదిలింది. చాయ్ చాయ్ తాగించాలి అని కొందరు అరిచారు.ఇప్పటికే లేటైంది అని అంతా విసుక్కోటం చౌటుప్పల్ రాగానే అవ్వ చేతిలో వంద రూపాయలు పెట్టి” అవ్వ! పాపం ఆపిల్ల సంగతి చూడు” అని బస్సుదిగి మాయమైనాడు. కూతుర్ని తీసుకువెల్దామని వచ్చిన గంగ అమ్మ నాన్నల మాటలు వినబడి తేరుకున్న ఆపిల్ల” అమ్మా!” అంటూ భోరున తల్లిని వాటేసుకుని కుళ్లి కుళ్లి ఏడ్వసాగింది.డ్రైవర్ కండక్టర్ అవ్వ ద్వారా విషయం తెలుసుకున్న వారు బొమ్మల్లా నిలబడ్డారు.దవాఖానాకి తోల్కపోండి ఎనిమిదిగంటలకి సర్వేల్ బస్సుంది” అని అందరి సలహాతో గంగను తీసుకెళ్లారు.బిడ్డను కాపాడిన బస్సులోకి మోసుకొచ్చి మంచినీరు తాగించి వంద రూపాయలిచ్చిన ఆయువకుడు ఓ ఆపద్బాంధవునిగా దేవునిగా మిగిలాడు.అది వింటూ దేవుడు” నిజం నిలకడమీద తెలియు” అని నవ్వుకొన్నాడు.