ధనుర్మాస వైభవం

సూర్యభగవానుడు ఏరాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలోనికి సంక్రమణం అంటారు. నెలరోజులకు ఒక రాశిలోకి మారే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన రోజును ధనుస్సంక్రాన్తి అంటారు. ఈ రోజు నుంచే ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం ధనుర్మాసం డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14 (మకర సంక్రాంతి) వరకు.
ధనుర్మాసం శ్రీవిష్ణుభగవానునికి ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో దేశంలోని 108 ప్రముఖ వైష్ణవ క్షేత్రాలలో (దివ్యదేశములు) శ్రీమహావిష్ణువుకి ప్రత్యేక ఆరాధనలు, తిరుప్పావై పారాయణం, గోదాదేవి కళ్యాణం పరమభక్తితో సందడిగా జరుగుతాయి.
ఈ మాసంలో ప్రతి ఉదయం, సాయంత్రం స్త్రీలు శుచియై దీపారాధన చేయటం వలన శుభం జరుగుతుంది, శ్రీ విష్ణుభగవానుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ ఎగిరిపోతుంది. విష్ణువుని పూజించి, చెక్కర oపొంగలి, పులగం, దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి. తిరుప్పావై వ్రతం ఆచరించాలి.


రంగవల్లులు లేదా ముగ్గులు. మన సంప్రదాయంలో ముగ్గులకు ప్రత్యేక స్థానం ఉంది. ధనుర్మాసంలో దేవాలయ ప్రాంగణంలో మరియు ముంగిళ్ళలో రంగు రంగుల ముగ్గులు వివిధ ఆకృతులతో తీర్చిదిద్దుతారు. పద్మాలు, సహస్ర కమలాలు, తులసి కోటలు, వైకుంఠ వాకిళ్ళు, రధాలు, నాగకంకణాలు ఇలా..
గోదా దేవి లేక ఆండాళ్ అమ్మవారు. లక్ష్మీ దేవి అవతారము. ఈమె శ్రీవిల్లిపుత్తూరులోని విష్ణుచిత్తునికి తులసివనంలో చిన్ని శిశువుగా లభించింది. దైవప్రసాదంగా భావించి ఆమెను అల్లారుముద్దుగా పెంచాడు. గోదా చిన్న వయసునుంచే తన తండ్రి ఆరాధించే శ్రీరంగనాధునిపై మనసుపడి, ఆయననే తన భర్తగా భావించింది. తండ్రి విష్ణుచిత్తుడు శ్రీవిల్లిపుత్తూరులోని శ్రీరంగనాధుని దేవాలయంలో అర్చకుడు. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తులసీమాలలు చేసి దేవాలయానికి తీసుకువెళ్లే వాడు. ఆ సమయంలో, గోదా, తండ్రికి తెలియకుండా, ఆ మాలలను తాను ధరించి బావినీళ్లలో తన ప్రతిరూపం చూసుకునేది. తాను ధరించిన మాలను దేవునికి సమర్పించినది కనుక ఆమెకు ఆముక్తమాల్యద (చూడికుడుత నాంచారి) అనే పేరు వచ్చింది.
గోదాదేవి శ్రీవ్రతం ఆచరించి శ్రీవిష్ణుభగవానుని భర్తగా పొంది ఆయనలో ఐక్యమైంది. శ్రీవ్రతం అంటే తిరుప్పావై. రోజుకొక పాశురం చొప్పున 30 రోజులు 30 పాశురాలను రచించింది. ఈ 30 పాశురాల సంపుటాన్నే తిరుప్పావై అంటారు. చాలా చిన్న గ్రంధమైనా దీనికి దివ్య ప్రబంధ హోదా దక్కింది. ఇది తమిళ సాహిత్యంలో అనర్ఘరత్నం. ధనుర్మాసంలో స్త్రీలు ఈ పాశురాలను భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తారు. చివరిరోజు గోదా కళ్యాణం చేస్తారు.
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. ఇది శ్రీవైష్ణువులకు ప్రధానమైన 108 దివ్యదేశములలో ఒకటి. ఇక్కడ ప్రతిరోజూ ఉదయం దేవునిముందు శ్రీవెంకటేశ్వర సుప్రభాతం గానం చేస్తారు. కానీ, ధనుర్మాసం అంతా తిరుప్పావై మాత్రమే గానం చేస్తారు. సుప్రభాతం ఉండదు. ఇది గోదా అమ్మ తిరుప్పావై ప్రత్యేకత.
ధనుర్మాసం, తిరుప్పావై వ్రతం తమిళ దేశంలో బాగా విస్తరించింది. బహుకాలం ఆంధ్ర ప్రాంతం అరవదేశంలో కలిసి ఉండటం వలన తెలుగు మహిళలకు తమిళం, తిరుప్పావై బాగా పరిచయం ఉంది. తెలుగువారైన శ్రీవైష్ణవులకు తప్పనిసరిగా తమిళం వస్తుంది. ఎందుకంటే ముఖ్యమైన వైష్ణవ సాహిత్యమంతా తమిళ భాషలోనే ఉంది.
గోదా తల్లి రచించిన తిరుప్పావై ఉత్తమ భక్తి కావ్యం కాగా, ఆ గ్రంధంపై ఎంతోమంది విద్వాంసులు వేలకొద్దీ వ్యాఖ్యాన గ్రంధాలు వ్రాసారు. దీనివల్ల మూల గ్రంధం యొక్క ప్రాముఖ్యతను అర్ధం చేసుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు ఏకంగా ఆముక్త మాల్యద అనే కావ్యాన్నే వ్రాసాడు. కూచిమంచి తిమ్మకవి అనే ఆయన నీలాసుందరి పరిణయం అనే కావ్యాన్ని అచ్చతెనుగులో వ్రాసాడు.
గోదా అమ్మ జన్మస్తానమైన శ్రీవిల్లిపుత్తూరులో గోదా రంగనాధుల భవ్యమందిరం ఉంది. గోదా తల్లి, రంగనాధులు మనకు, మన రాష్ట్రానికి, మన దేశానికి సర్వశుభాలను అనుగ్రహించెదరుగాక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఖుద్ధనికాయ జాతకకథలు

ఎడారి కొలను