మూడవ అంతర్జాతీయ తెలుగు రచయిత్రుల మహాసభలు విజయవాడ కేబీఎన్ కళాశాల ఆవరణలో, యద్దనపూడి సులోచనారాణి సభా ప్రాంగణంలో 2026 జూలై 11, 12 అంటే.. శని ఆదివారాలలో మండలి వెంకటకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా అత్యంత వైభవోపేతంగా జరిగాయి. 600 కు పైగా కవయిత్రులు, రచయిత్రులు పాల్గొన్న ఈ సభలు రెండు రోజులు శ్రవణానందకరంగా సాహిత్య విలువలను ప్రోది చేసి చూపాయి. 60 మంది రచయిత్రుల పరిశోధనా వ్యాసాల “ప్రమదావనం” అనే ఆకర గ్రంథాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష, సాహిత్యము, సంస్కృతుల అభ్యున్నతికి రచయిత్రుల పాత్ర ఎంత విశిష్టమైనదో ఈ సభలు చెప్పాయి. చాలా ఆనంద కరమైన విషయం ఏమిటంటే, కళా ప్రపూర్ణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కళా ప్రపూర్ణ తెన్నేటి హేమలత,ఇల్లందుల సరస్వతీదేవి, బండారు అచ్చమాంబ వంటి ప్రతిభా మూర్తుల రచయిత్రుల పేర్లను సభా మంటపాలకు, సభా వేదికలకు పెట్టడం. అంతేకాదు, వేదికలమీద కేవలం స్త్రీలే ఉంటారు అంటూ రచయితలెవరూ జోక్యం చేసుకోకపోవడం ముదావహం. “ఇవి కేవలం సమావేశాలు కావు, అనుభవాల సంగమాలు. సృజనాత్మక శక్తుల సమాగమాలు” అంటూ ఈ కార్యక్రమ అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి వి పూర్ణ చందు గారు ఆహ్వాన పత్రికలో వ్రాయడం ఎంతో సమున్నతంగా ఉన్నది.
మహిళాభ్యుదయం- కవిత అనే సదస్సు, కవిసమ్మేళనాలు, బాల సాహిత్య సదస్సు , మహిళాభ్యుదయ సాహిత్యం- కథ ,నవల సదస్సు , మహిళాభ్యుదయ సాహిత్యం- వివిధ ప్రక్రియల సదస్సు, సాహితీ సంస్థల ప్రతినిధుల సదస్సు, పరిశోధనా రంగ సదస్సు, విద్యారంగ సదస్సు, రాష్ట్రేతర ప్రతినిధుల సదస్సు, సాంస్కృతిక రంగ సదస్సు, తెలుగు భాషాోద్యమ సదస్సు వంటివి ఈ సాహిత్య సభలోని విశేషమైన విషయాలు. ఈ సదస్సులలో రచయితలు పాల్గొని వారి ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు.
ఈ మూడవ అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభల నిర్వహణ సారధ్య సంఘ సభ్యులు అయిన మండలి బుద్ధ ప్రసాద్ గారు గౌరవ అధ్యక్షులుగాను, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు గౌరవ కార్యనిర్వాహకులుగాను వ్యవహరించారు. సమన్వయకర్తలుగా తేళ్ల అరుణ, కరెడ్ల సుశీల, నూనె అంకమ్మరావు, కరణం విమల గార్లు బాధ్యతలను నిర్వర్తించారు. పైన చెప్పిన సాహిత్య కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అలరించాయి. తదనంతరం పురస్కార సమారోహ సభ నుండి పురస్కార ప్రధాన సభ, సమాపన సభ వరకు అన్ని కార్యక్రమాలు ఎంతో ఆలోచనాత్మకంగా, ప్రేరణాత్మకంగా నడిచాయి. వేల ఏళ్ల క్రితమే తెలుగు భాషా సాహిత్యం పురుడు పోసుకున్నది. ప్రాచీన కవయిత్రులైన బ్రహ్మ యజ్ఞంలో పాల్గొన్న విదుషీమణి,తత్వవేత్త ప్రాచీన భారతీయ రుషిక గార్గి వాచక్నవి, ఆత్మజ్ఞానమే శాశ్వతం అని చెప్పిన మైత్రేయి, దేవి సూక్తాన్ని దర్శించి విశ్వం యొక్క అంతిమ సత్యం అహం అంటే శక్తి అని స్పష్టం చేసిన వాక్ అమ్బ్రిణి , తత్వ శాస్త్ర విదుశీ ఋగ్వేద మంత్ర బోధకురాలు లోపాముద్ర , ఋగ్వేద సూక్తంలో శ్లోకాలను రచించిన ఘోష , ఋగ్వేదంలో సూక్తాన్ని రచించిన అపాల, యజ్ఞయాగాదులను నిర్వర్తించగలిగే శక్తి సామర్థ్యం కలిగిన విశ్వవార వంటి మంత్ర ద్రష్టలు, బ్రహ్మవాదినులు సంచరించిన నేల మన భారతావని.
అణులచ్చి, అసులద్ది, పహాయి, ఖేజ్జా, మాధవి, రేవా, రోహ , వద్దావహి , నోహ ,సఘిప్సహా అనే రచయిత్రులు గాథా సప్తశతిలోని రచయిత్రులు. స్త్రీ హృదయాన్ని సాక్షాత్కరించే కథలను రచించిన సాహిత్య క్షేత్రం మనది తొలి కావ్యకర్త్రిగా పేరొందిన మొల్ల గొప్ప కవయిత్రి. కవిత్వం అల్లడంలో మొల్ల అద్వితీయురాలు. తెలుగు భాషలోకి రామాయణాన్ని రచించిన కవులలో మొల్ల ద్వితీయురాలు. కానీ, రామాయణం రచించిన రచయిత్రుల్లో ప్రథమ గణ్యురాలు. కుప్పంబిక, తాళ్లపాక తిమ్మక్క వంటి పూర్వ రచయిత్రుల నుండి స్త్రీవాద అభ్యుదయ వాద ధోరణిలో రచించిన బండారు
అచ్చమాంబ వరకు ఎందరో కవయిత్రులు రచయిత్రులు వాళ్ళ కలాలను కరవాలాలు గా చేశారు.
స్త్రీల మనసు లోతులు పసిగట్టడం కష్టం అనే రచయితలు, సామాజికులు ఉన్నంతవరకు సమాజంలో సంసారం అనే రైలు బండి సమాంతర రేఖలపై పరుగులు తీసి,చేరాల్సిన గమ్యం చేరినా ఎక్కేదిగే ప్రయాణికులలా ఎన్నో అనుభవాలు స్త్రీల పక్షాన కఠినంగానే వ్యవహరిస్తాయి. తప్పించుకునే ఉద్దేశ్యం తో స్త్రీలు మాత్రమే స్త్రీల హృదయాలను సరిగా ఆవిష్కరిస్తారని ఓ వాక్యాన్ని సాహిత్యం ముఖాన పడవేశారు పెద్దలు. ఇది ఎంతవరకు సబబు? పురుషుడికైనా స్త్రీ కైనా హృదయం ఉంటుంది. ఆకలి దప్పులు, కష్టసుఖాలు సమానంగా ఉంటాయి. శారీరకంగా కొంత కష్టం ఎక్కువ ఉన్న ఆమె ల మనసులను అర్థం చేసుకోవడంలో వీళ్ళకేం కష్టం? వీళ్ళకేం నష్టం?
అయితే కవయిత్రులుగా నిలదొక్కుకోవడం ఎప్పుడైతే సవాలుగా నిలుస్తుందో అప్పుడు చాతుర్యాన్ని ప్రదర్శంచాలి. నీరు జాలును బట్టి ఎలా ప్రవహిస్తుందో అలా మార్గాలను వెతుక్కోవాలి. “కృషితో నాస్తి దుర్భిక్షం” అని మనవాళ్లు ఊరికే అనలేదు. సాహితీవేత్తలుగా నిలదొక్కుకోవాలని అనుకునే ప్రతి ఒక్కరు చేయాల్సిన కృషి .
ఈ సభలలో లబ్ధ ప్రతిష్టులైన కవయిత్రులు, రచయిత్రుల నుండి వర్ధమాన రచయిత్రులు, కవయిత్రుల వరకు అందరూ తమ బాధ్యతను రచనల ద్వారా నిరూపించినట్టుగా ఆయాసభల్లో జరిగిన విశేషాలను బట్టి తెలిసింది.
సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వచ్చిన, వస్తున్న పరిణామాలు అర్థం చేసుకుని తదనుగుణంగా కవిత్వం రాయాలి. ప్రాచీన సాహిత్యంపై ఎట్లా అవగాహన ఉన్నదో అట్లాగే ఆధునిక సాహిత్యం పైన ఉండాలి అట్లాగే కేవలం ఆధునిక సాహిత్యంపైన అవగాహన ఉంటే సరిపోదు . ప్రాచీన సాహిత్యం కూడా చదివి ఉండాలి .సంప్రదాయ జానపద కళల వల్లనే సంస్కృతి సంస్కరణల పథంలో వెళుతున్నది. గ్రామీణుల వల్లనే జానపద కళలు బ్రతికాయి. ఈ జానపద సాహిత్యాన్ని ప్రాచీన సాహిత్యాన్ని సాహితీవేత్తలు విద్యావంతులు ముందుకు తీసుకెళ్లి ప్రాచుర్యం కలిగించారు. గ్రంథస్తం చేసి, మనకు అందించారు. ఇది ఎన్నటికీ మరవకూడదు. ఇప్పుడు ఆధునికత పెచ్చుమీరడంపై ఉన్న గమనింపుతో మన వైపు తిప్పుకొని, కొత్త తరానికి అవగాహన కలిగించాలి. మనవైన పద్ధతులను ఆచార వ్యవహారాలను భూస్థాపితం చేస్తున్న వైనాన్ని ఎత్తిచూపాలి. ఇది కవిత్వం చేయవలసిన పని. ధనికులైనా, పేదవాళ్ళైనా తమ పూర్వీకుల మంచి అలవాట్లను అలవర్చుకోకుండా తమను తాము మార్చుకొని దురలవాట్లను నేర్చుకుంటున్న వ్యవస్థ పై డేగ కన్ను వేసి, పరిస్థితులను తెలుసుకొని సమాజానికి కవిత్వంగా కథలుగా, వ్యాసాలుగా రచించి చూపాలి . ఆధునిక పోకడలకు అనుగుణంగా మార్పును స్వాగతించినా, ఒకప్పటి జీవన విధానంలోని మంచిని ఎందుకు విస్మరించాలి? ఈ పోకడల సమన్వయము కవుల కవితల్లో ప్రతిబింబించాలి .
చాలా అద్భుతమైన సాహిత్యం వస్తున్నది. ఎవరికి తీసిపోకుండా ,ఎక్కడ పట్టు సడలకుండా, ప్రతిభా వ్యుత్ప్యభ్యాసాలతో రచనలు చేస్తున్నారు కవయిత్రులు రచయిత్రులు . ఈ సభల్లో వాళ్లు రచించిన పుస్తకాలను ఒకరికొకరుకు ఇచ్చుకోవడం, అందర్నీ పరిచయాలు చేసుకోవడం, వాళ్ళ భావనలను పంచుకోవడం వంటి ఉల్లాసవంతమైన సన్నివేశాలను చూసాం.
కాని,బారెడు సమాస పదాలనే కాదు మెరుగైన ఒక చిన్న పద చిత్రాన్నైనా వేయకుండానే కవిత్వం రాస్తున్నారు కొందరు. పస లేదు అంటున్న వాళ్లకు ధీటుగా కవిత్వం రావాలి. ఈ ఛాలెంజ్ కవి హృదయానికి ఉండాల్సిన కనీస లక్షణం. ..రాసిన కవిత్వాన్ని ఒకటికి రెండు సార్లు మళ్లీ మళ్లీ చదువుకొని సవరణలు చేసుకొని, కవితా శిల్పం పైన దృష్టి పెట్టి చక్కని ప్రతీకలతో , పద బంధాలతో , పద చిత్రాలతో ఉన్న కవిత్వాన్ని మాత్రమే లోకానికి వదలాలి. ఇది నేర్చుకున్నప్పుడు కవయిత్రులు ఈ పోటీ ప్రపంచం లో నిలవ గలుగుతారు. దీనికోసం అభ్యసన చాలా ఎక్కువగా ఉండాలి . మన పూర్వకవుల రచనలను చదవాలి. ఆధునిక కవుల కవిత్వం, వచన కవిత్వంలోని మెలకువలను ఒడిసి పట్టుకోవాలి. ఎక్కువ నీళ్లలో ఉంటే చేప దాని కళలన్నీ చూపిస్తుంది . అదే ఒక గిన్నెడు నీళ్లలో ఉంటే ?
అట్లాగే సముద్రమంత సాహిత్యాన్ని మన ముందు ఉంచుకొని దాన్ని చదవకుండా , పరిశీలించకుండా పరిశోధించకుండా, పరామర్శ చేయకుండా, మనసుకు తోచింది గొప్ప భావమే అయినా మనం రాసిందే గొప్పది అనుకొని కవిత్వాన్ని రాస్తే వచన కవిత లక్షణాలకు సరిపడేలా లేకుంటే ఆ కవిత అకవిత అవుతుంది. ఇదే కథకూ, వ్యాసానికీ వర్తిస్తుంది. ఇదే సూత్రం ఏ కవికైనా ఏ రచయితకైనా వర్తిస్తుంది.
తాత్వికత నుండి తాత్కాలిక కాంక్ష వరకు రాసినవాళ్లే, మంచి కవులు. శ్రద్ధతో కావ్య అంశాలను ఆకళింపు చేసుకొని పటిష్టమైన కవిత్వ నిర్మాణంలో రచించిన వాళ్లే సాహిత్య రంగంలో నిలుస్తారు. గొప్ప శిల్పాన్ని పాటించాలి కవులు. స్ట్రక్చర్ ఆఫ్ పోయెమ్ పైన దృష్టి పెట్టాలి. కవిత్వం మొత్తం చదివించే రీతిలో ఉండాలి.
పూలచెట్లపైననే కాదు, కొట్టిపోయిన ఆవు, ఎండిన మోడు, ఎముకల గూళ్ళు కవుల దృష్టిలో పడాలి. ఆధ్యాత్మిక భావనతో రాసినా ఇటువంటివి కూడా సమభావ దృష్టి తో నూతన భావ ఉద్దేశ్యంతో, ఉద్వేగం తో రాయాలి .
భారతీయ మూలతత్వాన్ని విస్మరించకుండా కవితల్లో కవి భావం ప్రతిబింబించాలి.
మొత్తంగా తెలుగు భాషలో విశేషాలను, మాతృ భాష ప్రాముఖ్యతను ఈ నవతరానికి అందించే విధంగా చిన్న చిన్న కథల రూపంలో కవితల రూపంలో రాయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. సాంకేతిక విద్య అరచేతికి చేరినప్పటి నుండి ఎన్నో మాధ్యమాలు పిల్లల మనసును కలుషితం చేస్తున్నాయి. మనవైన భారతీయ కుటుంబ బంధాలు వీగిపోయే రోజుల్లో ఉన్నాం. విలువలను నేర్పడమంటే చెంచాతో నోటికి అందించడం కాదు. పరోక్ష పద్ధతిలో ఈ కథలను చదివితే సంఘటనలో, సందర్భాలో పాత్ర నడత ద్వారా బోధపడేలా రాయాలి.
ఈ సభలలో ప్రత్యేక భూమిక పోషించిన సాహిత్య సృజనకారులూ, నిర్వాహక బృందం, కార్యకర్తలూ అందరూ అభినందనీయులే. ముఖ్యంగా ఈ సభల ముగింపు సమావేశంలో ప్రభుత్వానికి, సాహితీవేత్తలకు, సమాజానికి వినతి పత్రం లో అందజేసిన అంశాలు చాలా ఆలోచించదగినవి అందరూ ఆచరించదగినవి. ఈ విధంగా కూడా ఒక ఉద్యమ స్ఫూర్తిని కలిగించినందకు విజయవాడ రచయిత్రుల సాహిత్య సభలు ముందువరస లో నిలుస్తాయి. తెలుగు భాషలోని తీయదనాన్ని అమ్మ ప్రేమతో పోల్చుకునే మనం, మనిషి విజయాలలో భాష సాహిత్యం సాంస్కృతిక విశేషాలు ఎంతో ప్రభావితం చేస్తాయి అని నమ్మే మనం తెలుగు భాష ప్రజ్వలనం కావడానికి వీలైనంత కృషి చేయాలి . ఇది మన అందరి బాధ్యత. ఈ తెలుగు సభలు ఇందుకు మంచి బీజాలనే వేసాయి. ఇవి అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా ఉన్నవి.