శశిమోహన కాంతికిరణం. (కాలమ్)

కానివాని తోడఁ గలసి మెలఁగుచున్నఁ
గానివానిగానె కాంతు రవని
తాటి క్రింద పాలు ద్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ!
మానవుడు సంఘజీవి. సమాజంలో బ్రతికే ప్రతి ఒక్కరూ తోటి మనుషులతో సంబంధాలను ,స్నేహాలను కలిగి ఉంటారు. అయితే మనం ఎంచుకునే స్నేహితులు లేదా మనం ఎవరితో కలిసి తిరుగుతున్నాం అనే అంశం సమాజంలో మనకి గౌరవాన్ని గుర్తింపును నిర్ణయిస్తుంది.

ఈ పద్యం ద్వారా వేమన సత్సంగతి దుస్సంగతి ప్రభావాన్ని తెలియజేశాడు.

ఒక మనిషికి ఇంకొక మనిషి తోటి సహవాసం ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేశాడు.
ఒక మంచివాడు దుష్టుల గుంపులో ఉన్నప్పుడు అతడు ఎంత నీతిమంతుడైనా సమాజం అతన్ని కూడా ఆ దుష్టులలో ఒకడిగానే లెక్కిస్తుంది తప్ప ,అతని మంచితనాన్ని గుర్తించడానికి ప్రయత్నించదు. మంచినీరు మురికి కాలువలోకి కలిస్తే అది కూడా మురికి నీరు గానే మారుతుంది. అంతేగాని దాని స్వచ్ఛత కనపడదు. దుష్టులతో స్నేహం చేయడం వల్ల ఒక్కోసారి మనకు తెలియకుండానే మనం నేరాలు లేదా తప్పుడు పనుల్లో భాగస్వామ్యం అయ్యామని నిందలు మోయాల్సి వస్తుంది. సమాజానికి , కుటుంబానికి మన మీద ఉన్న నమ్మకం పోతుంది.

చెడ్డవారితో తిరిగితే ,అలా తిరిగేవాడిని వారిని ప్రజలు చెడ్డవాడిగానే చూస్తారు అని ఆయన ఉద్దేశం. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ..సమాజం అతని స్నేహితులను సహచరులను బట్టి కూడా అంచనా వేస్తుంది అందుకే మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో అనే విషయంలో ఎంతో జాగరూకతతో ఉండాలి. మనం ఎంత పవిత్రంగా ఉన్నాం అన్నది ఎంత ముఖ్యమో మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అంతే ముఖ్యం సత్పురుషులతో సాంగత్యం మనిషికి సమాజంలో సముచితమైన స్థానాన్ని గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. అంతే గాదు ఒక్కసారి మంచివాడు చెడ్డ వారితో తిరిగేటప్పుడు వారిని మార్చటానికి వారితో తిరిగినా ,మెల్లమెల్లగా వారి అలవాట్లు ఆ మంచి వాళ్లపై ప్రభావం చూపిస్తాయి. మొదట్లో తప్పుగా అనిపించే విషయాలు నిరంతరం వారితో ఉండటం వల్ల సాధారణ విషయాలుగా కూడా అనిపిస్తాయి.

అంటే… పనికిరానివానితో తిరిగిన వారిని అందరూ పనికిరానివానిగానే చూస్తారు. తాటిచెట్టు కింద కూర్చొని పాలు త్రాగినప్పటికీ , అతను కూర్చున్న స్థలం కారణంగా కల్లు త్రాగినట్లుగానే అందరూ భావిస్తారు. అదేవిధంగా చెడ్డ వారి మధ్యలో ఉండే మంచి వారిపై కూడా ఇతరులకు అనుమానం కలుగుతుంది.

ఇది ఈరోజుల్లో సర్వ సాధారణమైన విషయం.
కొందరు వారెంత మంచివారైనా దుష్టులతో స్నేహం చేస్తూ వారితో తిరుగుతుంటారు.ఏదో కారణానికి.అందరూ ఆ దుష్టులకు పనికిమాలిన వారిగా చూస్తారు.అప్పుడు మంచివాడు కూడా పనికిమాలిన వానిగానే భావించబడటమే కాక వీడికేమి మాయరోగంరా ఇలా తయారయ్యాడు అనిపించుకుంటాడు.ఒక గొప్ప ఉదాహరణ..మహాభారతంలో కర్ణుని చూడండి. ధర్మాత్ముడు.మహాదాత. సకల సద్గుణమూర్తి.సాక్షాత్తు ఇంద్రునికే తన ప్రాణాలను సైతం లెఖ్ఖ చేయక తన సహజ కవచ కుండలాలను దానమిచ్చిన ధీశాలి.ఎంతటివాడైనా గానీ దుర్యోధనుని ప్రాపకంలో ఉండటం వల్ల అతనికి దుష్ట చతుష్టయంలో ఒకడిగా గుర్తింపు వచ్చింది.అలాగే ద్రోణుడులాంటి మహా వీరులు కూడా దుర్యోధనుని పంచన ఉండటం వల్ల సరైన గుర్తింపును పొందలేకపోయారు.

అలాగే తాటిచెట్టు క్రింద కూర్చుని పాలు త్రాగినా చూసేవాడికి నమ్మకం కలుగదు.వాడు త్రాగింది కల్లే అనుకుంటాడు.బార్ కి పదే పదే పోయేవాడు తాగకున్నా తాగుబోతు అనే అంటారు.కానిచోటికి పొరపాటున తెలియక పోయినా తప్పుడువాళ్ళ గానే చూస్తారు.
కనుక మిత్రులారా !మనం ఎక్కడ వుంటున్నాము,ఎవరితో వుంటున్నాము అన్నది కూడా జీవితంలో చాలా ముఖ్యమైన విషయం.గుర్తు ఉంచుకోండి..

వేమన రాసిన ఈ పద్యం ద్వారా సత్సంగతి మనిషిని ఉన్నతునిగా తీర్చిదిద్దుతుంది అసలు మంచి పేరును కూడా దెబ్బతీస్తుంది అనే శాశ్వత సత్యం జాతికి అందించబడింది.

చివరిగా చెప్పేది ఏంటంటే మనిషి జీవితంలో పేరు ప్రతిష్టలు ఎంతో విలువైనవి వాటిని సంపాదించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది కానీ ఒక చెడు సహవాసం వాటిని క్షణాల్లో చెడగొట్టగలదు.
మంచి వ్యక్తిత్వం ఉంటే మాత్రం సరిపోదు మంచి పరిసరాల్లో ఉండటం కూడా ఎంతో అవసరం ఎందుకంటే సమాజం మన ప్రవర్తన కంటే మన సహవాసాన్ని ముందుగా గమనిస్తుంది.

కుటుంబ సభ్యులు పిల్లలకు చిన్నప్పటినుండి సత్సంగతి విలువను నేర్పాలి. మంచి పుస్తకాలు చదవడం, సద్గురువుల సాన్నిధ్యం ,సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అలవాట్లు మంచి వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాయి.

మంచితనం కాపాడుకోవాలి అంటే మంచి సహవాసాన్ని ఎంచుకోవడం ఎంతో అవసరం అనే సత్యాన్ని అందరూ గ్రహించాలి.

అందుకే మిత్రులారా!!!!

* దుష్టులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం *

Written by Shasi Bala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

‘ఆమె’

ప్రాణప్రతిష్ట