శుభ ముహూర్తం -4వ భాగం

ధారావాహికం

జరిగిన కథ

“మా మనసు అన్యాక్రాంతమని” తమను పాణిగ్రహణం చేసుకున్న మగధ దేశాధిపతి విక్రమసింహకు చెప్పిన, విదర్భ రాకుమారి కోరిక మేరకు, అంతఃపురాన్ని ఆమె పర్యవేక్షణలో ఉంచడమే కాకుండా, ఆమెకు యుద్ధ విద్యలు నేర్పేందుకు సర్వ సైన్యాధిపతి అనంతుడిని నియమించాడు విక్రమసింహ. వారిద్దరి మధ్య, అంతరముందని మొదటి రోజే గ్రహించిన అనంతుడు, రాకుమారి ధ్యేయాన్ని అనుమానిస్తూనే, ఆమె సౌశీల్యానికి ముగ్ధుడవుతూ శిక్షణనిస్తున్నాడు. శిక్షణలో ఆమె పరిపూర్ణత సాధించిందనిపించగానే, విక్రమసింహకు తెలియపరచడంతో, మారువేషంలో వచ్చిన విక్రమసింహ, ఆమె ప్రతిభకు అచ్చెరువొంది, ఆమెకు విద్య నేర్పే బాధ్యతను తీసుకుంటానని మాటిచ్చాడు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం రండి…

ఇక చదవండి
ఈ మధ్యకాలంలో ఎవ్వరికీ… ఆఖరికి మహారాజ మందిరంలోని పరిచారకులకు కూడా అనుమానం రాకుండా, మహారాజు మహాద్వారం గుండా అంతఃపురానికి వెళ్లడం… మహారాజుకి తప్ప ఇతరులకు తెలియని వేరే మార్గం ద్వారా తన మందిరానికి చేరుకోవడం జరుగుతుంది. అందరి దృష్టిలో వారిద్దరూ భార్యాభర్తలు. ఎవరికీ తెలియదు అనుకుంటున్నాడు మహారాజు. తనకు తెలుసనే విషయం మహారాజుకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు అనంతుడు. ప్రతిరోజూ మహారాజును అంతఃపురానికి తోడ్కొని రావడం, మరల మహారాజు తన మందిరానికి చేరుకునే వరకు, మహారాజుకు తెలియకుండా అనుసరించడం చేస్తున్నాడు అనంతుడు.

అంతఃపుర రక్షణబాధ్యతను విదర్భదేశం నుండి వచ్చిన పరివారమే నిర్వహించడం చేత, మగధ రాజ్యపు చెలికత్తెలెవరికీ ఈ విషయం తెలియదు. అందరూ మహారాజు, మహారాణి చాలా అన్యోన్యంగా ఉన్నారని అనుకుంటున్నారు. ఆ అభిప్రాయానికి లోటు రాకుండా ప్రమీలాదేవి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నది. మహారాణిగా నిర్వర్తించవలసిన కార్యక్రమాలను అతి జాగ్రత్తగా నిర్వహిస్తుంది.

పర్వదినాలలో, రాచకొలువులో పనిచేసే మంత్రులు, సేనాధిపతులు, మిగిలిన ఉద్యోగస్తుల కుటుంబాల స్త్రీలను, పూజలకు, వ్రతాలకు, వనభోజనాలకు అంతఃపురానికి ఆహ్వానిస్తూ, వారిని ఉచితరీతిలో గౌరవిస్తూ, అందరి మన్ననలూ అందుకుంటున్నది. గౌరీపూజ సమయంలో అందరికీ కానుకలు పంపిస్తూ వారి అభిమానాన్ని చూరగొంటున్నది. అన్ని విధాలా మహారాజుకు తగిన భార్య అన్న పేరు సంపాదించుకున్నది.

క్షత్రియధర్మం ప్రకారం, పట్టపురాణిని ఉద్వాహం చేసుకున్నాక, వేరే రాచకన్యలను పెళ్లి చేసుకుంటారు రాజులు. కాని, విక్రమసింహ ప్రమీలాదేవి ఒక్కరినే వివాహం చేసుకోవడం, వివాహమైనాక కనీసం వేట పేరుతోనైనా రాజధానిని విడిచి వెళ్లకపోవడం… మహారాణి పట్ల విక్రమసింహకు ఉన్న ప్రేమని వేనోళ్ళ పొగుడుతున్నారు ప్రజలు. మహారాణి ఎంత అనుకూలవతి కాకపోతే, మహారాజు ఆమెనంత ప్రేమిస్తాడని అనుకుంటున్నారు. మహారాజును రాముడిలా ఆరాధిస్తున్నారంతా. తమ కాబోయే భర్తలూ, అలాగే ఉంటే బాగుండునని కన్యలు కోరుకుంటున్నారు. అందరూ వారిద్దరినీ ఆదర్శంగా తీసుకుంటున్నారు.

వీలైనప్పుడంతా రాచకార్యాలనుండి తీరిక చేసుకుని వచ్చి రాకుమారికి యుద్ధవిద్యలు నేర్పిస్తున్నాడు విక్రమసింహ. నేర్పిస్తున్నది విక్రమసింహ అని ఆమెకు గాని, వేరెవరికి గాని తెలియకుండా, తగిన జాగ్రత్తలు పాటిస్తూ.

అర్ధాంగిగా కాకపోయినా, శిష్యురాలిగానైనా ఆమె సామీప్యాన్ని అనుభవిస్తున్నందుకు విక్రమసింహ మనసు పులకిస్తుంది. కాని, అదే సమయంలో ఆమె మనసును చూరగొన్న ఆ భాగ్యవంతుడు ఎవరో? ఎలా ఉంటాడో? తనకన్నా అందగాడా? మనసులో ఒక ప్రక్క అసూయ పొడ సూపుతుంది, సమీపంలోనే ఉన్నా, ఆమె మనసు తనకు అందనంత దూరంలో ఉందని.

ఇంకొక ప్రక్క వారిద్దరి వివాహము కాకపోవడానికి కారణమేమై ఉండవచ్చు? వారి వివాహం కాకపోవడానికి తను వారిమీద దండత్తడమే కారణమా? తన అనాలోచిత చర్యతో ఆమెకు శిక్ష వేశాడా? ఇటువంటి ఆలోచనలతో సతమతమవుతూనే, రాకుమారి ప్రావీణ్యతకు మెరుగులు దిద్దుతున్నాడు.

ఇలా గురుశిష్యుల్లా ఎంత కాలం? ఎంతకాలమని యిలా అందరినీ మభ్య పెట్టగలరు? తండ్రిలాగ తనను సాకిన మంత్రివర్యులు, సేనాధిపతి తను చెప్పబోయే శుభవార్త కోసం ప్రతిదినం సమావేశ మందిరంలో ఆశగా ఎదురు చూడడం మనసుకు తెలుస్తుంది.

చిత్రంగా అనంతుడు ఒక్క మాట కూడా, తన వైవాహిక జీవితం గురించి ఏ రోజూ తనను అడగలేదు. ప్రభువులమని సంశయిస్తున్నాడా! తామిద్దరే ఉన్నప్పుడు, తాను మహారాజునని అనంతుడెప్పుడూ సంశయించలేదే! మరి… ఒక్క క్షణం మహారాజు గుండె ఆగినట్లైంది. విషయం అనంతుడికి తెలుసా? తెలిసే అవకాశమే లేదే! అనంతుని ప్రవర్తనలో కూడా ఏ విధమైన మార్పూ లేదే!

వివాహానికి పూర్వం అనంతుడూ, తానూ కలిసే తిరిగేవారు. తామిద్దరి మధ్య యెప్పుడూ రాజ్య వ్యవహారాలకు సంబంధించిన విషయాలే కదిలేవి. ఎప్పుడైతే తాను విదర్భ రాకుమారిని చూశాడో, అప్పటినుండి తన సంభాషణలలో ప్రేమ కూడా అంతర్లీనంగా దొర్లేది. అదేమీ తెలియని అనంతుడు, మహారాజుల వారి మనసుకు కళ్లెం వేసే, మహారాణి ఏ కోటలో దాక్కున్నారో! మీరు ఊ! అనండి. రాయబారం చేసుకొస్తాను అనేవాడు సరదాగా. ఎప్పుడైతే విదర్భకు వివాహ రాయబారం వెళ్ళిందో, అప్పటినుండి వైవాహిక జీవితానికి సంబంధించిన సంభాషణలు తామిద్దరి మధ్య జోరుగా సాగేవి. ప్రమీలాదేవి పేరు చెప్పి తనను ఆటపట్టించేవాడు.

అటువంటి అనంతుడు మొదటి రోజు తర్వాత, ఇప్పటివరకూ ఎప్పుడూ మహారాణి గురించిన ప్రసక్తిని, తమ మధ్య తీసుకురాలేదు. ఇన్ని నెలలు గడిచినా ఏ ఒక్కరోజూ తన వైవాహిక జీవితం గురించి మాట్లాడలేదంటే… కారణమేమై ఉంటుంది? మహారాణికి విద్య నేర్పే బాధ్యతను అప్పచెప్పినప్పుడు, అనంతుడు తనతో చెప్పకపోయినా, ఆ విషయంలో సముఖంగా లేడనే విషయం తనకర్థమైంది. శిక్షణ పూర్తయిందనే, విషయాన్ని తప్ప, శిక్షణ ఏ రకంగా సాగుతుందనే విషయం కూడా తనతో ఏ రోజూ చర్చించలేదు. ఎందుకని? ఆమె మనసులో తాము లేమనే విషయం తెలిసిందా? తెలిస్తే ఏ రకంగా తెలిసింది?

తనకు తెలియనిది ఏదో జరుగుతుంది. ఏమిటది? ఒకవేళ… అలా జరిగే అవకాశం లేదు. కాని, జరగకూడదనే నియమం కూడా లేదు. ఒకవేళ… ఆమె మనసులో ఉన్నది… అనంతుడా? అందుకేనా? ఆరోజు బహుమతిగా తానిచ్చిన మణిహారాన్ని అనంతునికి ఇచ్చింది. కోపంతో కళ్ళు ఎరుపెక్కుతున్నాయి. నాసికాపుటాలదురు తున్నాయి. ఒక ప్రక్క ప్రియమిత్రుడు, ఇంకొక ప్రక్క వలచిన వనిత… వారిద్దరి గురించి అలా ఊహించుకోవాలంటేనే ప్రాణం పోతున్నట్లుంది.

చిన్నప్పటినుండి తనతో తిరిగిన అనంతుడు ప్రాణాలైనా ఇస్తాడు గాని, ఆమె ప్రేమను స్వీకరించడని బుద్ధి హెచ్చరిస్తుంది. మనసు బుద్ధిని నమ్మనంటుంది. తాను ప్రేమించిన వాడు అనంతుడే అని ఇక్కడికి వచ్చిన వరకు రాకుమారికి కూడా, తెలిసి ఉండకపోవచ్చు. ఇద్దరూ తనకు ప్రేమ పాత్రులే! ఒకవేళ తన అనుమానమే నిజమైతే తన ముందున్న కర్తవ్యమేమిటి?
*
ఎంత ఆలోచించినా పరిష్కారమేమిటో దిక్కుతోచడం లేదు. ఈ ఆలోచనలతో అనంతుడితో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు తాను. అనంతుడది గ్రహించాడా? తన ఆలోచనలేమిటో తెలిస్తే, అనంతుడు తనను క్షమిస్తాడా? ఇటువంటి ఆలోచనలతో రాచకార్యాల మీద కూడా శ్రద్ధ వహించలేకపోతున్నాడు.

ఈ ఆలోచనలకు చరమగీతం పలకాలంటే, ముందు ఆమె మనసులో ఉన్నదెవరో తెలుసుకోవాలి. తెలుసుకుని ఏమి చేస్తాడు తాను? ఒకవేళ ఆమె మనసులో ఉన్నది అనంతుడే అయితే, వారిద్దరిని కలపగలడా? అందుకు అనంతుడు అంగీకరిస్తాడా? రాజ్య ప్రజలు ఏమనుకుంటారు? ఏ రకంగా దీనిని పరిష్కరించాలి? ముందు ఆమె మనసులో వున్నవారెవరో కనుక్కోవాలి. ఆ తర్వాతే, ఏమి చెయ్యాలో ఆలోచించవచ్చు. ఈ నిర్ణయానికి వచ్చాక మనసు కాస్త తేలిక పడినట్లు అనిపించింది.
ఆ రాత్రి ఆమె ఇష్టసఖి ప్రియంవద ద్వారా, ప్రమీలాదేవికి కబురుపెట్టాడు మాట్లాడాలని.

మహారాజును తోడ్కొని వచ్చిన ప్రియంవద తలుపు దగ్గరే ఆగిపోయింది, వారిద్దరికీ ఏకాంతాన్ని కల్పిస్తూ. రాచకార్యాలలో అందరి ఎదుట భార్యాభర్తలుగా ఒకరికొకరు ఎదురుపడడం తప్ప, మొదటి రాత్రి, ఆ మరుచటి రోజు తప్ప మహారాణి మందిరంలోకి ఇప్పటివరకు అడుగు పెట్టలేదు విక్రమసింహ. ఒక ప్రక్కగా సాధారణ శయ్య. అది చూసి, మనసు కరిగిపోయింది. అయ్యో పాపం! అననుకోకుండా ఉండలేకపోయాడు. హంసతూలికా తల్పం మీద, విశ్రమించాల్సిన ఈ సుకుమారి, ఆ సాధారణ శయ్యపైనా…!

ఇదంతా తన వల్లనే కదా! తన అనాలోచిత చర్యకు తానే మార్గం వెతకాలనుకుని, మనసు దిటవు పరుచుకొని “మీ మనసులో ఉన్నవారెవరో మేము తెలుసుకోవచ్చా? వారు ఏ రాజ్యానికి చెందినవారు? వారి వివరాలు చెబితే, మేము మిమ్ములను వారి దగ్గరకు చేరుస్తాం” తన మనసులో సుడులు తిరిగే అనుమానాలను పక్కనపెట్టి, అనునయంగా అడిగాడు విక్రమసింహ.

చాలాసేపు నిశ్శబ్దంగా ఉండి, చివరకు “వారి చూపులు మా చూపులలో కలసిన క్షణమే, శుభ ముహూర్తంగా తోచింది. ఆ శుభ ముహూర్తానే వారే మాకు, మేమే వారికి అని మేం నిర్ణయించుకున్నాం. పంచభూతాలూ మమ్ము ఆశీర్వదించాయన్న అనుభూతి కలిగింది. నేను కొలిచే పరమేశ్వరుని సాక్షిగా, వారికి నా మనసును ఆ క్షణమే అర్పించుకున్నాను. అదే తొలిసారి, మలిసారి వారిని చూడటం. అంతకుమించి, వారి వివరాలేవీ మాకు తెలియదు.” ఎప్పటిలాగే విక్రమసింహ చరణాలను చూస్తూ చెప్పింది ప్రమీలాదేవి.

రాచకార్యాల దృష్ట్యా, యెప్పుడు విక్రమసింహ యెదురుపడినా, ప్రమీలాదేవి తలదించుకునే ఉంటుంది. విక్రమసింహ చరణాలను చూసే మాట్లాడుతుంది గాని, కన్నెత్తి కూడా ఆయనను చూడదు.

ప్రమీలాదేవి మాటలు విన్న విక్రమసింహకు తన విషయం గుర్తుకొచ్చింది. తాను కూడా ఆమెను చూసిన మరుక్షణం, ఆమెకు తన మనసును అర్పించుకున్నాడు. ఆమెను ఒడిసి పట్టుకున్నప్పుడే పాణిగ్రహణం చేశాననుకున్నాడు. ఆ రోజే ఆమె మూర్తిని హృదయంలో ప్రతిష్టించుకున్నాడు. కాని, యివేవీ ఆమెకు తెలియదు. తన మనసు ఆమెకు అర్పించుకున్నట్లు, ఆమె మనసును ఆమె వేరొకరికి అర్పించుకుంది. తన మనసర్పించుకున్న స్త్రీమూర్తి తన ఎదురుగా ఉంది. మరి ఆమెకో… ఎవరో తెలియని మనిషికి మనసర్పించి ఎదురుచూస్తున్న ప్రమీలాదేవిని చూసి విక్రమసింహకు జాలి వేసింది.

ఐనా, తన అనుమానం నివృత్తి చేసుకునేందుకు, మరొక్కసారి అడిగాడు,”వారిని ఎప్పుడూ, ఎక్కడా, మలిసారి చూడలేదా” అని.
“లేదు” అని చెప్పేటప్పుడు ఆమె ముఖంలో ఎంత దైన్యమో!

ఆమె మనసులో ఉన్నది అనంతుడు కానందుకు, విక్రమసింహ మనసులో పన్నీరు చిలికినట్టు అయింది. లేకుంటే ప్రాణ స్నేహితుడిని పోగొట్టుకునేవాడే!
“ఇంకే ఆనవాళ్లైనా చెప్పగలరా?” అడిగాడు. తల, అడ్డంగా ఊపింది.

“సరే” అని వెనుదిరగ బోతున్న విక్రమసింహను చూసి, “ప్రభూ! మాదొక చిన్న మనవి.” ఈమధ్య విక్రమసింహను ప్రభూ అని సంబోధిస్తూ ఉంది ప్రమీలాదేవి.
“సెలవియ్యండి”

“మీరు మమ్ములను క్షమించాలి. మీ మనసును గాయం చేసినందుకు,” అని ముందుగా క్షమాపణలు కోరి, “మీవంటి యోగ్యులు, ధర్మనిరతులు, పరిపాలనా దక్షులు, ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడే రాజులు, ఈ చుట్టుపక్కల దేశాలలో ఎవ్వరూ లేరు. అటు రాజనీతిజ్ఞతలో, యిటు ధనుర్విద్యా నైపుణ్యంలో మిమ్మల్ని పడగొట్టే మొనగాడే లేడని, కథలు కథలుగా ఎంతోమంది రాజకుమారులు చెప్పుకోవడం మా చెవులారా మేము విన్నాం. ఎందరు రాకుమార్తెలు మిమ్ములను వివాహం చేసుకోవాలని ఉవ్విళ్ళూరారో మాకు ఎరికే. ఇప్పటికీ వారిలో చాలా మందికి అదే కోరిక. వారిలో ఏ ఒకరినైనా… మీరు ఊ అనండి చాలు. నేనే దగ్గరుండి ఈ వివాహం జరిపిస్తాను” అని ఇంకా ఏదో చెప్పబోతోంది.

ఆమె మాట పూర్తికాకుండానే, తన మనసులోని సంచలనం బయటపడకుండా, అంతఃపురం బయటకు వడివడిగా అడుగులు వేశాడు విక్రమసింహ. కోరి వలచిన కన్య, “మీరు ఇంకొకరిని మనువాడండి” అని చెబితే సహించలేకపోయాడు. ఎన్ని కలలు కన్నాడు ఆమెను పెళ్లి చేసుకోవాలని. ఎన్ని ఊహలలో తేలిపోయాడు ఆమెను వివాహం చేసుకునే సమయం దగ్గర పడుతున్నప్పుడు. తమ వైవాహిక జీవితం గురించి ఎంతందంగా ఊహించుకున్నాడు. ఆమె స్థానంలో ఇంకొక స్త్రీనా! అది అసంభవం. ఆమె తనను ప్రేమించక పోవచ్చుగాక. కాని, తన మనసులో ఉన్నది ఆమె మాత్రమే. వేరే ఎవరికీ స్థానం లేదు.

క్షత్రియధర్మం ప్రకారం రాజు ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. తన వివాహ సమయంలో ఎంతోమంది మహారాజులు వారి కన్యలను తనకు ఇవ్వచూపారు. పట్టమహిషి స్థానం కాకపోయినా పర్వాలేదు. కనీసం, వారి కుమార్తెలను వివాహం చేసుకుంటే చాలని. కాని, తన మనసు నిండా ప్రమీలాదేవే. అందుకనే వేరే ఏ కన్యనూ వివాహం చేసుకోలేదు. అందుకని చాలా మంది రాజులకి కోపం వచ్చి, తనపై యుద్ధానికి, వారంతా కలిసి సన్నద్ధం అవుతున్నారని వేగులవారి నుండి అందిన సమాచారం. వారు యుద్ధానికి సన్నద్ధం కాకముందే, తానే జైత్రయాత్రకు వెళ్లాలని సర్వమూ సిద్ధం చేస్తున్నాడు. తీర్థయాత్రలకు వెళ్లిన తన గురువుగారు, నారాయణాచార్యుల వారు వచ్చి ముహూర్తం పెట్టే సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.

అసలు ప్రమీలాదేవి అంటే తనకు ఇష్టమెలా ఏర్పడింది? గతంలోకి జారుకుంది మనసు…

సశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నీ జతగా నేనుండాలి

అయితే మీరే..(భుజాలు తడుముకుంటున్నారుగా!)..5వ, భాగం