ఇంతవరకు జరిగిన కథ: ఆమని మనవడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మైథిలి, మాలినిలు ఆ వేడుక పూర్తి కాగానే అదే ఊళ్లో ఉంటున్న పద్మిని ,హాసిని ,చంద్రికలను కలుస్తారు. వీరంతా ఒకప్పుడు విజయవాడలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో కలిసి పని చేసినందున వీరి మధ్య గాఢమైన స్నేహం అల్లుకుంటుంది. పద్మిని, హాసిని ,చంద్రికలకు ప్రభుత్వ కొలువులు దొరకటంతో వారు ఆయా ఊళ్లకు వెళ్లిపోతారు. ఉద్యోగాలపోటీని తట్టుకోలేని మైధిలి ,ఆమని, మాలినిలు అవే ప్రైవేటు ఉద్యోగాలతో కుస్తీ పడుతుంటారు . గట్టి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత ఉన్న మైధిలి కూడా అలాంటి అవకాశాన్ని దొరకపుచ్చుకోలేక ఇటు ఇంట్లోనూ అటు సమాజంలోనూ వివక్షకు గురవుతుంది .ఏ కాలమైతే ఆమని భర్త రామారావు గారిని ఉన్నతమైన మనిషిగా మలిచిందో అదే కాలం మాలిని పట్ల నిర్దాక్షిణ్యంగా పసుపు కుంకుమలకు దూరం చేసి పరోక్షంగా ఒంటరిని చేయటం , హాసిని పట్ల ఆమె భర్త ప్రవర్తించే వైఖరిలాంటి దుఃఖపూరిత విషయాలు తెలుసుకున్న మైధిలి బాధతో కదిలిపోతుంది. మేమంతా నీకు అండగా ఉంటామని ధైర్యం చెప్తారు హాసినికి మిత్రురాండ్రంతా .భర్త యొక్క అనుమానపు జబ్బును తట్టుకోలేక విసిగి వేసారిన సువర్ణ బెంగుళూరులో వుంటున్న తన పిల్లల దగ్గరకు వెళ్లిపోయి బొటిక్ పెట్టుకోవాలనే స్థిరనిర్ణయానికొచ్చేస్తుంది.కాలం నేర్పిన అనుభవపాఠాలతో తీర్చిదిద్దబడిన వ్యక్తి ఆమని భర్త రామారావు గారు.ఈ దంపతుల జీవితాన్ని కమ్ముకున్న శిశిరం తొలగి వసంతం తొంగి చూస్తుంది.బాధ్యతలన్నీ తీరిపోయాయనే సాకుతో మళ్లీ మొదటికొచ్చిన భర్త దురలవాట్ల వైఖరికి మ్రాన్పడిపోతారు శాలిని మేడమ్.
ఇక చదవండి
శుభ్రంగా ఉంటుంది వాకిలి గాని, పెరడుగానీ. ఇలా ఎలా సాధ్యమని అడిగితే, రెండుపూటలా శుభ్రంగా ఊడుస్తానని చెప్తే, నాకెంతో ముచ్చటేసేది. అట్లా అన్ని పనులూ చేసి, తనను ఉదయం తినటాన్కి, తాగటాన్కి కావలసినవి సిద్ధం ఏసి చెప్పి వచ్చినా ఆరోజు ‘‘ఏంటే ఇంత ఆలస్యమయింది? ఆ జుట్టంతా రేగిపోయి
ఉందేంటి? ఎక్కడ పడుకుని వచ్చావు ముండా’’ అని బూతులు తిడుతూ గొంతును పిసకబోయాడట. తన మెడచుట్టూ బిగుసుకుంటూన్న వాడి రెండు చేతులనూ ఎట్లాగో బలవంతంగా విడదీసుకుని నేను గదిలోకి పోయి చాలాసేపటిదాకా తలుపులేసుకున్నా భయంతోటి’’ అని సువర్ణ చెప్తుంటే తనగుండె వేగంగా ఎగిరిపడటాన్ని గమనించా. మొహమంతా బాధతోటి వివర్ణమైపోయింది.
‘‘ఇంతకుముందు అనుమానంగా చూసేవాడు, కోపంతో టీకప్పు విసిరేసేవాడు, టీ బోగోలేదంటూ. కూరలు ఎంత రుచిగా వండినా కుదరలేదు, నీ ధ్యాస ఎక్కడ ఏడుస్తోందని చాలా చులకన చేసి మాట్లాడేవాడట. అప్పుడు పిల్లలుండేవారట. ఎందుకు డాడీ అనవసరంగా మమ్మీని తిడుతున్నారని పిల్లలు గట్టిగా నిలదీస్తే, తన గదిలోకి పోయి ఆరోజంతా అలకపాన్పు ఎక్కేవాడట. ఎన్నిసార్లు పిలిచినా భోజనానికి రాకపోతే, చివరికి తనే ఉసూరనిపించి భోజనం ప్లేట్లో పెట్టి, గదిలో టీపాయ్ మీద పెట్టి వచ్చేదట. సువర్ణ మంచినీళ్లు, పెరుగు, రసంతో సహా. మళ్ళీ మధ్యలో తనెళ్లి కనబడితే ఎక్కడ మధ్యలో అహంతో చెయ్యి కడిగేసుకుంటాడోననే జాలితో. ఇదిగో ఇదే వీక్‌పాయింట్ ఆడాళ్లందరిదీ. మన తప్పులేకుండా తిట్లుపడటం, ప్రతి చిన్నదానికి సాకులు పెట్టి హేళనగా మాట్లాడే మాటల్ని భరించటం. మన కుటుంబాలే ఇలా ఏడ్చాయా? లోకంలో ఉన్న కొంపలన్నీ ఇట్లాగే తగలడ్డాయా? లేదా మన కొంపల్లోనే ఇలా ఉంటాయా అన్పిస్తుంటుంది ఒక్కోసారి ఇలాంటివన్నీ వింటుంటే.
మళ్ళీ సువర్ణ ఏమనేదో తెలుసా ‘‘మైథిలీ… ప్లేటు మొత్తం ఖాళీ చేసేశాడు, ఒక్క చుక్క కూడా విడవకుండా పెరుగు మొత్తం తాగేసేవాడట. దొంగపిల్లి నాకినట్లుగా వుండేదట ఆ ఖాళీ అయిన పెరుగు కప్పును చూస్తుంటే అని చెప్పి నవ్వేది తర్వాత. అది దొంగపిల్లి కాదు, బలిసిన పెద్ద గండుపిల్లి. జంగు పిల్లి’’ అని నేను తిట్టుకునేదాన్ని మనసులో.
‘‘ఆకలైతే వాడే తింటాడులే అని ఈసారి నేనేం పట్టించుకోలేదు. ఈరోజు నా ధర్మంగా నేను అన్నం, కూరా వండి పెట్టాను టేబుల్ మీద. నన్ను నేను సమాదాయించుకుంటూ చెయ్యని తప్పుకు నేనెందుకు కడుపు మాడ్చుకోవాలని ఓ రెండు ముద్దలు పెట్టుకుని తిని చెయ్యి కడుక్కున్నాను. ఈసారి నాకు తినమని కూడా అడగాలనిపించలేదు. నా దారిననే వెళ్ళి పిల్లల రూమ్‌లో పడుకున్నాను. తర్వాత రెండు రోజులదాకా నాకు చాలా డిప్రెషన్‌లాగా అనిపించింది’’ అంటూ ఎంతో బాధతో చెబుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోయింది తన బాధాపూరితమైన మాటలు వింటుంటే.
‘‘మరి ఆ రెండు రోజులూ ఏం చేశాడు మీ ఆయన? తిండి తిన్నాడా? లేదా’’ అని అడిగా… ఒకింత బాధతో మిళితమయిన కోపంతో’’
‘‘ఆ… ఎందుకు తినలా! శుభ్రంగా మెక్కాడు. నంగనాచిలా ఆ మరుసటిరోజే చికిన్ తెచ్చి, నాకు కనబడేటట్లు టేబుల్ మీద పెట్టాడు. వండు అన్నట్టు. నా బాధను, కోపాన్ని తమాయించుకుని వండి పెట్టాను. శుభ్రంగా తిన్నాడు సిగ్గులేకుండా’’ అన్నది. తన మనసు ఎంత వేదనకు గురయితే ఈ మాట వచ్చిందోనని అనుకున్నా.
‘‘మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? మానేశావా యోగాకి వెళ్ళటం? మీ ఇంటి దగ్గర ఉన్న విమలా, రత్నమ్మ గార్లతో కలిసేగా వెళ్ళేది, వచ్చేదీ’’ అన్నా.
‘‘అవును, అయినా వాడికి అనుమానం పొరలు కమ్మి, కండ్లు కనబడని గుడ్డోడవుతాడు. అదే మావాడి స్పెషాలిటీ’’ అంది విరక్తిగా.
‘‘ఆ… ఎందుకులే పెంటగోల అని మానేశాను. యోగాకు వెళ్లట్లేదంది. ఇట్లా బాధపెట్టి బెదిరించి, మాన్పించాలనేగా వాడి ప్లానంతా. వాడనుకున్నది సాధించుకున్నాడు. చివరికి నన్ను నాల్గు గోడలకి బందీ చేసి’’ అన్నది మళ్ళీ కోపంగా.
ఇదివరకు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంతలో కొంతవరకు నయం. ఆలోచించేవాడు మాట వదలాలంటే. ఇప్పుడు వాళ్ళిద్దరూ బెంగుళూరులో
ఉంటన్నారుగా ఉద్యోగాల్లో. ఇక వీడు మరీ పేట్రేగిపోతున్నాడు. ఒక్కోసారి ఏం వాగుతున్నాడో కూడా తెలవట్లేదు. ఆనోటికి హద్దూపద్దూ ఉండట్లేదని వాపోయింది సువర్ణ.
అందంగా పుట్టడం సువర్ణ చేసుకున్న పాపమా? అందంగా ఉన్న తమ కూతుర్ని, ఉద్యోగస్తుడూ… లక్షణంగా పెండ్లాన్ని చూసుకుంటాడని నమ్మి ఇతగాడికిచ్చి కట్టబెట్టిన తల్లిదండ్రులదా?
మగడు ఏదన్నా పడుండాలి. వాడికి కోపమొస్తే భరించాల్సిందేనమ్మా అంటూ సాగదీసే సదరు అత్తగారి టెంపరితనమా?
నిజంగానే ‘కాకి ముక్కుకు దొండపండు’ అనే సామెతకు నూటికి రెండొందల శాతం కరెక్టు సువర్ణ భర్తగారి విషయంలో. నాకు ఆ పేరెత్తి ఇదీ అని చెప్పాలన్నా కంపరమెత్తుతుంది ఇప్పటికి కూడా.
ఇలా చాలా విషయాలు తెలుస్తుంటాయి అప్పుడప్పుడు తన ద్వారా. అందుకే నాకు సువర్ణ భర్త అంటే ఏవగింపు. తను కూడా ఇంతకు మునుపు ఎంత బాధలో ఉన్నా మా ఆయన, మావారు అని సంబోధించేది నాతో మాట్లాడేటప్పుడు. ఎంత బాధ సలుపుతుంటే, మనసులో ఎంత విరక్తి పుడితే వాడు, వీడు అని తిడ్తుంది భర్తను. నాకు తప్పులేదనిపించింది. మరి తక్కువ పనులు చేశాడావాడు అని పిలవబడుతున్న సదరు సువర్ణ గారి మొగుడుగారు.

నువ్వు తెల్లగానే ఉంటావు గదా, నీకెందుకు క్రీములు, పౌడర్లు అని సాధించేవాడట. కొత్త బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేడట. మంచిగా తల దువ్వి జడ వేసుకున్నా అనుమానమేనట… ఎవరన్నా ఇంటికి అతిథులు వస్తే, అందులో
వాళ్ళు పురుష పుంగవులైతే తనను మంచినీళ్ళు కూడా తేనీయడట. ఒకసారి అలాగే టీ పెట్టి పట్టుకెళితే, నానా బూతులూ తిట్టాడట వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇక అప్పట్నుంచి అతగాడికే టీ కప్పులు ట్రేలో పెట్టి అందిస్తే తీసుకెళ్లి వాళ్లకిస్తాడట. దొడ్లో అంట్లు తోముతుంటుంటే రోజూ కుర్చీ వేసుకుని కూర్చొని, ఆ సమయానికి పేపరో, పుస్తకమో చదువుకుంటున్నట్లు నటిస్తాడట. మొదట్లో అర్థమయ్యేది కాదట సువర్ణకు. దొడ్డివైపు తలుపులు వేసేవుంటాయట. తియ్యరట ఎప్పుడూ. అయినా వాడికి అనుమానమేనట. ఒకసారి పౌడర్లో సున్నం కలిపాడట. మామూలుగా రోజూ రాసుకున్నట్లు రాసుకుంటే, మొహమంతా పొక్కిపోయి ఎలర్జీ వచ్చి, ఆసుపత్రికి వెళితే ఆ పౌడరును చూసి అందులో సున్నం కలిసిందని చెప్పారట డాక్లర్లు. మళ్ళీ ఇంకోసారి స్ప్రే బాటిల్లో హ్యాండ్ వాష్ లాంటిది కలిపాడట. ఇదీ వాడి నిర్వాకమేనని తెలిసి వాళ్ళ పెద్దబ్బాయికి చూపిస్తే ‘నిజమే మమ్మీ ఇందులో హ్యాండ్ వాష్ కలిపాడు అని తండ్రిని ఛీత్కరించుకున్నాడట.’ వాళ్ళ డాడీ వెలగబెట్టే నిర్వాకాలన్నీ తెలుసు పిల్లలకు. వాళ్ళేం చిన్నవాళ్ళు కాదుగా! అందుకే ఏదన్నా శుభకార్యానికి వెళ్ళాలంటే ఆ… డాడీ ఎందుకు మమ్మీ? మనమే వెళ్లొద్దాం అంటారట. తండ్రి అంటే అతను చేసే పనుల వల్ల ఎంత విలువ తగ్గిపోతోంది తండ్రిగా తనకు అని ఒక్కోసారి చెప్పి నిట్టూరుస్తూంటుంది సువర్ణ.
‘ఇన్ని చేస్తున్నా, మావారంటే నాకు చాలా ఇష్టం మైథిలీ’ అంటుంది నాతో ఒక్కోసారి.
‘‘కానీ నా ప్రేమను గుర్తించడు. ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాడు సూటీ పోటీ మాటలు వదలటానికి’’ అన్నది మళ్ళీ.
నమ్మకం లేనిచోట ప్రేమ ఉండదంటారు నిజమే. భార్యమీద, ఆమె నడత మీద అస్సలు ఏమాత్రం నమ్మకం లేదు. అందుకే అంత ఆవేదన సువర్ణకు.
అభద్రతా భావంలో కూరుకుపోయిన వాడి చెవులకు ‘రామా’ అన్నా బూతుమాటే. వాళ్ల చూపులకు, వాళ్ల బుద్ధులకు కూడా పచ్చ కామెర్ల రోగమే నన్నడిగితే.
‘‘అమ్మా కథ పూర్తయింది. అందరూ వచ్చి స్వామివారికి దండం పెట్టుకోండి’’ అన్న పంతులుగారి పిలుపుకు మేము కూర్చున్న చోటు విడిచి వ్రతం జరిగే దగ్గరకొచ్చి దండం పెట్టుకుని, హారతి అద్దుకుని ప్రసాదం తీసుకున్నాము. గిఫ్ట్‌లు ఆ దంపతుల చేతుల్లో పెట్టి భోజనాలు ముగించుకుని, ఆటో ఎక్కి ఎవరి వీధి మలుపు వరకు వాళ్ళని దింపేటట్లుగా ఆటోవాలాతో మాట్లాడుకున్నాము.
‘‘ఏ విషయంలోగానీ, ఏ సందర్భంలోగానీ నువ్వసలు డిప్రెస్ అవ్వకూడదని, నీ పిల్లలు కూడా ఎదిగి, ప్రయోజకులై, స్వతంత్రంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నువ్వేమీ బెంగపడకు’’ అని సువర్ణకు ధైర్యం చెప్పాను నేను.
‘‘అవును నా ధైర్యం నా పిల్లలే. కొద్దిరోజులే ఇక, ఓపిక పడతా. లిమిట్స్ దాటి పూర్వంలాగా బాధలు పెడితే మాత్రం నా కొడుకుల దగ్గరకు బెంగుళూరుకు వెళ్ళిపోతాను’’ అని చెప్పింది నిశ్చయంగా, స్పష్టంగా సువర్ణ.
‘‘మరి ఇవే మాటలు మీ ఆయనతో కూడా చెప్పకపోయావా?’’ అన్నా.
‘‘అతగాడు పాముతో సమానం. చెబితే కాచుక్కూచుంటాడు పోనీయకుండా! మళ్ళీ ఏదో ఓ సందర్భం సృష్టించుకుని చెలరేగిపోడూ… అప్పుడు నేనే ఆ అనుమానపు పడగను నా కాళ్ళతో అణిచి పారేస్తానంది’’ ధృఢ నిశ్చయంతో.
‘‘మరి అక్కడికి కూడా వస్తేనో?’’ అన్నా సందేహంగా.
‘‘రాడు. ఏ మొహం పెట్టుకుని వస్తాడు. వాడికి ఎన్ని గుండెలు?’’ అంది ధృడ చిత్తంతో నవ్వుతూ.
ఆ నవ్వు చూసి ‘స్థిమిత పడిరదిలే… హమ్మయ్యా’ అనుకున్నా…
‘‘మరి ఇప్పుడంటే వాళ్ళు సింగిల్స్. రేపు వాళ్ల పెండ్లిండ్లయితే ఎలా? మళ్ళీ ప్రశ్నార్థకం కాకుండా చూసుకోవాలిగదా నీ భవిష్యత్తును’’ అన్నా సువర్ణతో.
దానికి తన భవిష్యత్ ప్రణాళికని కూడా చెప్పింది.
ఓటమి నుంచే పట్టుదల, పట్టుదల నుండి సాధించాలనే తపన, ఆ తపన నుండే గెలుపుదారులు తెరుచుకుంటాయనుకుంటా.
‘‘పెండ్లప్పుడు వాళ్ళ పుట్టింటివాళ్లు పెట్టిన బంగారం పదితులాలదాకా ఉంటుందట. దానిమీద తనకే గానీ వేరే ఎవ్వరికీ హక్కు లేదన్నది’’
‘‘ఆ పది తులాల బంగారం అమ్మేసి, నేను బొటిక్ పెట్టుకుంటా’’నంది.
సువర్ణ మంచి టైలరమ్మ. కచ్‌వర్క్, ఎంబ్రాయిడరీ, వెరైటీ వెరైటీ మోడల్స్‌లో బ్లౌజులు బాగా కుడుతుంది. ఫ్రాకులు, శారీఫాల్సు, పంజాబీస్ కూడా బాగా కుడుతుందని పేరుంది వాళ్ల వీధిలో. తనను కాదని స్టిచ్చింగ్‌కి బైటకి వెళ్ళరెవరూ.
ఈ అనుమానం రోగం బాగా ముదిరిన తర్వాత ఏదో కొద్దిగా సుస్తీ చేస్తే ఆ వంకతోటి ఆ టైలరింగ్‌నీ అటకెక్కించాడని మొత్తుకుంది ఓసారి.
‘‘మరి నీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్ళీ అడగకపోయావా?’’ అన్నాను.
‘‘కుట్టుకుంటానని అంటే లేనిపోని ప్రేమంతా నామీద ఒలకబోసి నీకెందుకు నేనున్నానుగా! ఏది కావాలంటే అది కొనిపెడతా. డబ్బులు అవసరమైతే నేనిస్తాగా? అంటే సరేననుకున్నా. ఆ టైలరింగ్‌కు సంబంధించిన మిషను వగైరాలన్నీ అమ్మేశాడు. నేనూ నమ్మాను. ఒక సంవత్సరం అన్నట్లుగా అన్నీ చేశాడు. తరువాతి నుంచి మొండిచెయ్యే చూపేవాడట. కావలసినవి సమకూరుస్తాడు. కానీ పైసా కూడా చేతికి చిక్కనివ్వడు’’ అని చెప్పింది గతకాలపు చేదును గుర్తు చేసుకుంటూ’’ సువర్ణ.
ఆర్థిక స్వాలంబనను అటకెక్కేట్లు చేసి తమపైనే ఆధారపడేట్లు చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడిచే అవకాశం లేకుండా చేయటం. ఇది ఒక రకపు టాలెంట్. ఇలా రెక్కలు విరిచి వేయబడిన సువర్ణలెందరో ఈ సమాజంలో.
***
కొందరు వైట్ కాలర్స్ టాలెంటెడ్ పర్సన్సు, వీరి దర్జా, ఠీవి… ఆ తీరేవేరు. భార్యల ఎ.టి.ఎమ్. కార్డులు వారి జేబులోనే నివాసముంటాయి. ‘సొమ్మొకడిది సోకొకడిది’ అంటే ఇదేనేమో ననిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు.
పండక్కో, పబ్బానికో ఏ చీరో కొనటం, పెద్ద మొత్తంలో ఏరియర్స్ లాంటివి ఏవో రావటంతో ఓ చిన్న నగలాంటి ఉంగరమో, బొంగరమో లాంటిది కొని, ఇదుగోనోయ్ నీకు గిఫ్టు అంటూ మురిపించటం. ఇంకో విడ్డూరమేంటంటే వాళ్ళ అప్ అండ్ డౌన్ బస్ ఛార్జీల డబ్బు వాళ్ళ మొహాన కొట్టటం. ఇంతే ఇక కష్టపడి సంపాదించుకున్న జీతపురాళ్లను పూర్తిగా ఏనాడు చూసిన పాపాన పోని వాళ్ళు ఎంతమందో ఈ మాయదారి ఏ.టి.ఎమ్. లొచ్చాక. పే బిల్స్‌లో చూసి మురిసిపోవటమే మన ఉద్యోగినుల పని.
ఇంత చేస్తున్నా గుర్తింపుకు నోచుకోని మహిళలెందరో. ఇటు ఇంట్లో, అటు బయటా చచ్చే చాకిరీ చేసి, అనారోగ్యంలోకి నెట్టివేయబడుట, కృంగిపోయేవారు మరెందరో. ఇలా ఆలోచిస్తే నా బుర్రలో ఠక్కున హాసిని సంసారం గుర్తుకొస్తుంది. తనదే జీతమెక్కువ. ఇంట్లో పని కూడా తనకే ఎక్కువ. పెండ్లైన క్రొత్తలో ఏదో ప్రైవేటు డిగ్రీ కాలేజీలో ఆఫీస్ వర్క్ చేసేవాడట భర్త. చాలాచోట్ల మారాడట. ఎక్కడా స్థిరత్వం ఉండదట. ‘ఏదన్నా చిన్న తేడాలు వస్తాయి. వదులుకుని ఇంట్లో కూర్చుంటే ఎలా అనే ఆలోచన కూడా ఉండదు మైథిలీ’ అని వాపోతుంటుంది ఒక్కోసారి నాతో.
‘‘మరి వేరే ఎక్కడైనా ట్రై చెయ్యవచ్చుగదా? సిస్టమ్ వర్క్‌తో పాటుగా పి.జి.లో మ్యాథ్స్ క్వాలిఫికేషన్ వుందిగదా! ఖాళీగా ఉంటే ఏం తోస్తుందని’’ అడిగా.
‘‘ఎందుకు మైథిలీ… నా జీతం ఉందిగా! అతడిరక కష్టపడటమెందుకు, ఇలా ఉంటాయి అతగాడి భావాలు’’ అని చెప్పి బాధపడుతుంది.
‘‘నన్ను బస్టాండులో దింపటం, సాయంత్రం వచ్చి పికప్ చేసుకోవటం ఆయన పని. ఓ… దీనికే తెగ ఇబ్బంది పడిపోతుంటాడని’’ చెప్పింది వేదన స్వరంతో.
‘‘మరీ అలా రికామీగా ఉంటే ఎలా పొద్దుపోతుంది మీ ఆయనకి?’’ అని అడిగితే టైముకి అన్నీ తింటూ, టీలు తాగుతూ హ్యాపీగా కాలం వెళ్లదీస్తుంటాని’’ నవ్వురాక, ఏడ్వలేక చిన్నబుచ్చుకున్న ముఖంతో చెప్పింది.
హాసిని గూడా తెల్లగా అందంగా, బక్కపలచగా బాగుంటుంది. పి.జి. చేసింది. గవర్నమెంటు మహిళా కళాశాలలో వర్క్ చేస్తోంది లెక్చరర్‌గా.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? మన అగిడినవన్నీ ఇస్తే వాడు దేవుడు ఎందుకవుతాడు? ప్రతిమనిషి గుండెలో ఏదో ఒక బాధ మేకులా గ్రుచ్చుకుంటూనే ఉంటుందనుకుంటాను. గాయాలు చేసేది కాలమే. వాటిని మాన్పగల శక్తీ కాలానిదే. మరపునిచ్చేదీ కాలమేనంటాం. ఇది నిజమేనా? ఏమీ కాదనే నన్పిస్తుంది నాకు మనసుకు మాత్రం. అన్నీ మనకు మనమే చేసుకుని మన అనుభవాలను, అనుభూతులను కావాలని ఆపాదిస్తూ ఆత్మవంచన చేసుకుని బ్రతికేస్తున్నామేమో అనిపిస్తుంటుంది. కాలంలో కలిపి నడకసాగించలేని పరిస్థితులే ఇలాంటి ఆలోచనల పుట్టుకకు నాంది అనుకుంటాను.
లేకపోతే ఏమిటి? కాలం కుంటినడక నడస్తోందంటాం (మనం) కాలం నవ్వుతోందంటాం, పరుగులు పెడుతోందంటాం. ఒకింత గర్వంతో మనం విజయం చేపట్టిన వేళల్లో కాలాన్ని కట్టేస్తాననే ప్రగల్భాలు కూడా పలుకుతాం.
అంటే ఒక సందర్భాన్ని మన మనసు సంతోషంగా స్వీకరిస్తే నాకు కాలం కలిసివచ్చిందంటాం. దుఃఖపూరితమైన క్షణాల్ని యుగాలతో పోలుస్తాం. కానీ కాలం కాలమే. వీచేగాలి, పారేనీరు, కాసే ఎండ… వీటిల్లో హెచ్చుతగ్గులుండచ్చు. కానీ కాలం ఎప్పుడూ తన పంథాలోనే తన చట్రంలోనే చరిస్తుంటుంది. కాలానికి ఏ అనుభూతులూ, ఏ సంవేదనలూ, సంఘర్షణలూ, స్థాయీ బేధాలూ, ఉచ్ఛనీచాలూ, ప్రాంతీయ బేధాలూ ఉండవు. మనమెలాగూ ఆ చట్రంలో పడి నలుగుతున్నాం. కనీసం కాలాన్నైనా ఫ్రీగా వదిలేద్దాం.
కానీ కాలంలాగా మనం కూడా ఏ భావాలనూ తగిలించుకోకుండా ఏ వేదనలలో మునిగిపోకుండా కాలాన్నే ఊతకర్రగా చేసుకుని నడవ గలిగే స్థాయికి ఎదగగలిగితే జీవితమంతా ఆనందమయమేగదా! కానీ అలా ఉండలేమే! అదేగదా వచ్చిన చిక్కంతా!
కొన్నినాళ్లామె ఆమనిని మరచిన శిశిరం. కాకపోతే మిగతా ఋతువులన్నీ కూడా గ్రహణంలా ముసురుకున్న వేదనాభరితం. బాధలో ఉన్నా, దుఃఖాల్లో
ఉన్నా, కష్టాల్లో ఉన్నా నేనింతే, నా బ్రతుకింతేననే డిప్రెషన్‌లో పడి కృంగిపోవటం సహజం. కానీ అదే మారని పరిస్థితులలోనా ఓర్మితో, పిల్లల కోసమో, సమాజంలో పరువు పోతుందనే విజ్ఞతతోనే నడుచుకోగలిగిన ఇండ్లు భవిష్యత్తులో శిశిరాలను సైతం తొంగిచూడటానికి తావీయని పచ్చదనాలతో నిండిన వసంతాలే. ఇందుకు నిలువెత్తు సాక్ష్యమే. ఆమని, రామారావు అన్నయ్య గార్ల జీవితం. ‘భోగి కానివాడు యోగి కాలేడనే’ సామెత ఎంత నిజమో! అసలు ఈ సామెతలు, నానుడులు, హితోక్తులూ, ఛలోక్తులూ ఎంత విజ్ఞానాన్ని తాగి చిరయశస్సును పొందుతూ నేటికీ సజీవంగా మిలమిలలాడుతున్నాయోగదా!
తన చుట్టుపట్ల ఉండే వాతావరణం వాటిని అంటిపెట్టుకుని ఉండే పరిస్థితులు, మనుష్యులను చాలా ప్రభావితం చేస్తాయి.
రామారావుగారిది ఆఫీసర్ స్థాయి ఉద్యోగం. తిన్నగా ఉన్నా, ఉండనీయని స్నేహితుల బృందాలు. వాళ్లల్లో వాళ్ళ సహ ఉద్యోగులు కూడా ఉండచ్చు. అవసరం కోసం మచ్చిక చేసుకుని మనమేలు కోరుతున్నట్లు నటిస్తూ ఎంతోమంది పబ్బం గడుపుకుంటున్న వాళ్ళే ఈ రోజుల్లో. అలాంటి పబ్బపు మేఘాలకు చిక్కిన వారి కుటుంబం చాలా రోజుల వరకు తారల మిలమిలలు లేని నింగిలా, మబ్బులు కమ్మిన జాబిలిలా వెలవెలా బోవటం నేను కళ్లారా చూసినదాన్ని. కానీ ఏనాడూ ఇలా అని తనకు తానుగా ఎవరికీ చెప్పుకోని స్వాభిమాని నా ఫ్రెండ్ ఆమని ఆనోటా ఈ నోటా తెలిసిందేంటంటే ఫ్రెండ్సుని నమ్మి వారికి ష్యూరిటీ సంతకాలు పెట్టటం, ఈయన మెతకదనాన్ని చూసి వాళ్లు సకాలంలో బ్యాంకులో కట్టాల్సిన వాయిదాలు కట్టకపోవటం… అందుకుగాను అన్నయ్యగారి జీతం చాలావరకు కట్టయి పోవటంతో కష్టాలు మొదలయ్యాయని ఆమని ఒకసారి నాతో చెబుతూ నువ్వు విన్నది నిజమే మైథిలీ అన్నది.
‘‘మా వారికి పేకాట రాదు. అయినా బలవంతంగా కూర్చోపెట్టే వాళ్లట ఆయనను స్నేహితులు. ఆటరాదు, డబ్బులన్నీ పోయేవి. పోనీ ఆపేసి వచ్చేయొచ్చు కదా ఈయన. రాకుండా తెల్లవార్లూ కూర్చొని ఆరోగ్యాన్ని, నిద్రను, డబ్బును అన్నీ పోగొట్టుకొని వచ్చేవారు.
దానితో నాకు బాగా కోపం వచ్చేది. మనస్పర్థలు మొదలయ్యేవి. అవి మర్చిపోవాలనే సాకుతోనో, లేదా ఫ్రెండ్స్‌కు కంపెనీ ఇచ్చే నెపంతోనో, లేదా ఎలా ఉంటుందో రుచి చూద్దామనే వంకతోటో మొదలౌతాయి వ్యసనాలన్నీ. నేను చాలా పరిధిలో ఉంటాను. అస్సలు లిమిట్స్ దాటవనే సమర్థింపులు చేస్తూ, చేసిన తప్పులు కప్పిపుచ్చుకోనే ఇలాంటి పురుష పుంగవుల నైజాలు. వాళ్ళకేనా బాధలు, కష్టాలు… ఇంటా బయటా చచ్చే చాకిరీ చేసుకుంటూ నెలకు పట్టుమని రెండురోజులు కూడా సెలవు దొరకని ప్రైవేటు ఉద్యోగాలతో నలిగిపోతూ… ఆ దొరికే రెండు సాధారణ సెలవుల సౌకర్యాన్ని కూడా తాను వ్యక్తిగత ఇబ్బందులకు వాడుకోలేని అశక్తురాలు స్త్రీలు ఎప్పటికీ. ఆ రెండు సెలవుల్ని కూడా పిల్లలకి ఒంట్లో బాగోలేకపోతేనో లేదా అవసరాలు తీర్చుకోవటాన్కి ఇంటికొచ్చే చుట్టాల్ని చూసుకోవటానికో ఎగిరిపోతాయి. మరి ఇలాంటప్పుడు ఆడవాళ్లు కూడా తాగి తందనాలాడాలా? ఇబ్బందులు మర్చి పోవటాన్కి చీట్లపేక ఆడాలా? లేక బీడీలు, సిగరెట్లు తాగాలా?
నిజంగా కుటుంబపరంగా స్త్రీల సేవలు గుర్తింపుకు నోచుకోనివి. కనీసం ప్రేమకాదుగదా, కృతజ్ఞతాపూర్వక చూపులు కూడా తాకలేని దూరతీరమే వీరిది. పైగా ఇల్లాలంటే, ఆడదంటే ఇంట్లో పనులన్నీ వాళ్ళే చూసుకోవాలని ఉవాచలు. ఏం ఇద్దరూ ఠంచనుగా కొలువులకు పోవాల్సిన వాళ్ళేగదా! చెరోపని చేసుకుంటే తప్పేంటి? ఇలాంటి మాట లెప్పుడైనా స్త్రీ నోటివెంట వచ్చాయో! ఇక అగ్గి మీద గుగ్గిలాలే వేగుతాయి ఆ ఇండ్లలో. నూటికో, కోటికో ఉంటారేమో మరి పుణ్యమూర్తులు. భార్యలకు అన్ని పనుల్లో సాయపడుతూ. ఇలా జరిగితే స్త్రీ, పురుష వివక్ష అనే పదం ఈ రోజుల్లో వినపడేదికాదేమో. అంటే కచ్చితంగా ఇంటా, బయటా స్త్రీలు శ్రమించే శ్రమకు విలువ కనీస గౌరవం కూడా తక్కువే. మళ్ళీ పెద్ద సంస్కారపు రాయుళ్లలాగా మైకాసురులవుతూ స్త్రీ పురుష సమానత్వం గురించి తెగ లెక్చర్లు దంచుతారు. సమానమే గానీ, మాకంటే కొంచెం తక్కువగానే సమానమంటూ వింతైన కోర్కెను మనసులో నాటుకుని, దాన్ని పెంచి పోషిస్తున్న మేధావి వర్గముంది నేటి సమాజంలో ఎక్కువగా.
గట్టి ఎదురుదెబ్బలు రెండు, మూడు తగిలితేగానీ మనిషి స్వతహాగా మారడంటారు. ఇది చాలా వాస్తవం. ఇటు వాయిదాలు చెల్లించక తన జీతం కటింగ్‌లతో పోవటం, అటు వ్యసనాలకు అప్పగించిన దోస్తులు. ఇటు పిల్లలకు ఇంటర్ పూర్తయి సిటీకి పై చదువులకు పంపాల్సిరావటం, పై చదువుల కోసం పంపగలగాలంటే, డబ్బుల విషయంలో జాగ్రత్తపడకపోతే ఎన్ని ఇబ్బందులతో ఊపిరాడక నలిగిపోతామోననే విషయాలతో జ్ఞానోదయమైందనుకుంటా… ఆయనలో చిన్నచిన్నగా మార్పు రావటం మొదలైంది మైథిలీ అని అంటూ… ఎవరైతే తనను ఆర్థిక నష్టాలకు గురి చేశారో, వారికి దూరంగా ఉంటూ, అప్పోసొప్పో తెచ్చుకున్న డబ్బుల్తో పిల్లల్ని పై చదువులు చదివిస్తున్నామని అంటూ, రిటైర్మెంటుకు దగ్గరకు వస్తుంటే ఎవరైనా స్వంత ఇల్లు కట్టుకోవాలని లేదా భార్యకు నగలు చేయించాలనో అనుకుంటారు. నేనేమీ చేయించలేకపోయాను నీకంటూ అన్నారట ఆమనితో రామారావుగారు బాధపడుతూ.
‘‘మరి నువ్వేమన్నావ్?’’ అన్నాను నేను ఆమనితో
‘‘ఏమంటాను మైథిలీ! పూర్వపు మనిషిలా ఉంటే చెడామడా కడిగేద్దును. ఇప్పుడిప్పుడే ఎవరేంటో తెలుసుకుంటున్నారు. ఇలా మనిషిగా మారుతున్నారు గదా!
‘‘పోనీ ఒక వడ్డాణం చేయించమని అడగకపోయావా’’ అన్నా నవ్వుతూ.
ఇది హేళనగా అడిగిన ప్రశ్నకాడు సుమా… ఆమని గొంతు బాధతో కూరుకుపోయి ఉంది. కొంచెమైనా స్వస్థ పరచాలనే ఉద్దేశ్యంతో నవ్వుతూ అడిగాను.
సన్నగా నవ్వు విన్పించింది ఆమని మాటల్లో. హమ్మయ్యా అనుకున్నా నాలోనేను.
మళ్ళీ తనే ‘‘నాకు నగల సంగతేమోగాని, ఉన్న ఈ ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చేట్లుంది’’ అన్నది.
వాళ్ళు ఐదేళ్ళ క్రితం ఎలాగో ఐదు సెంట్ల భూమిలో ఒక మూడు గదుల ఇల్లు, విశాలమైన స్థలమూ ఉన్నది కొనుక్కుని అద్దె ఇళ్ల బాధను దాటుకున్నారు. అప్పుడు మా ఫ్రెండ్సంతా సంతోషించాము. కానీ ఆమని మాటలతో ఆ సంతోషం కాస్తా ఎగిరిపోయింది నాలో. ఇంకో రెండు మూడు నెలలో దిగిపోతారు. మరి అప్పుడెట్లాగా అని నా మనసు పీకులాడిరది.
అదే అన్నా తనతో ‘‘మరి ఎలాగా?’’ అని
‘‘ఏం చేయాలి మైథిలీ? ఇది తప్ప వేరే దారేలేదు. ఆ మాయదారి వాళ్ళకు షూరిటీలు పెట్టిన పాపానికి బాగా అప్పుల్లో పడిపోయాం. అదీగాక ముగ్గురి పిల్లల చదువులూ. నాది గొప్ప జీతమా అంటే అదీకాదు. అనామత్తే. బెనిఫిట్స్ ఎప్పటికొస్తాయో ఏమో! రిటైర్మెంట్ ఠంచనుగా వస్తుందిగానీ, రావాల్సిన డబ్బులు తొందరగా రావుగా అన్నది.
అదీ నిజమేననుకున్నాను మనసులో.
‘‘పోనీ ఆ వచ్చే డబ్బులతో ఉన్న అప్పుల్ని తీర్చేసి మీకు సరిపడా ఓ చిన్న ఇల్లు కొనుక్కోవటమో లేదా ఏదో అపార్టుమెంట కొనుక్కోవటమో చెయ్యొచ్చుగా?’’ అన్నా తనతో.
‘‘నిజమే గానీ పిల్లల చదువులకు చేసిన అప్పుల మీద వడ్డీలకు వడ్డీలు బాగా పెరిగిపోయాయి’’ అంటూ
‘‘అవన్నీ తీరిపోతే, పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడిపోతే చాలనుకుంటున్నాం ఇద్దరం’’ అంది.
‘‘మీరిద్దరూ ఓసారి కూర్చుని బాకీలు ఎంత ఉన్నాయి? ఎంత మిగుల్తున్నాయి? వచ్చేవాటిల్లో అని చూసుకుపోయారా?’’ అంటే
‘‘ఆ ముచ్చట కూడా అయింది. అంత పెద్ద మొత్తంగా ఏమీ మిగలవు. ఇల్లు కొనుకోవటాన్కి కూడా సరిపోవు’’ అన్నది.
ఇంకా మరీ లోతుగా తరచి అడిగితే తన మనసునింకా బాధపెట్టినట్లు అవుతుందని విరమించుకున్నాను నేను ఆ ప్రయత్నాన్ని.
పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమేదీ లేదంటారు పెద్దవాళ్ళు. ఇది నూటికి నూరుపాళ్ళూ నిజమేనని నమ్ముతాను నేను. అగ్నిలో పుటంబెట్టి పైకి తీసిన బంగారంలా తేలారు ఆమని వాళ్ళ ఆయన. ఆయన మాటతీరు, సరదాగా కలివిడిగా ఇంటికొచ్చిన మనుష్యుల్ని కలుపుకుని ఆప్యాయంగా మాట్లాడేతత్వం చూస్తుంటే, ఔరా! ఆయన ఈయనేనా? అని ఆశ్చర్యం కలగకమానదు చూసేవాళ్లకి. ఆమని అంటే అమితమైన ప్రేమ ఇప్పుడు కొట్టొచ్చినట్లు కన్పడుతోంది రామారావు గారిలో.
ఇప్పుడు మేమంతా అరవైని దిగ్విజయంగా దాటిన వాళ్ళమే. వయస్సు రీత్యా కొద్దో గొప్పో ఆరోగ్యంలో తేడాపాడాలు రావటం, వాటిని గీత దాటనియ్యకుండా చేయటం కోసంగా మందులు వాడుకోవటం తప్పనిసరిగా మారిపోయింది మా దినచర్యలో.
ఆమని ఎక్కడ మందులు వేసుకోవటం మర్చిపోతుందోనని ఎక్కువ శాతం రామారావు అన్నయ్యగారే టైమ్‌కు ఏ ఏ మందులు ఇవ్వాలో, వాటిని ఇవ్వటం, గ్లాసుతో మంచినీళ్ళు అందించటం… ఇంకా ఇవ్వేనా! ఇంటి పనులలో కూడా సాయం చేస్తున్నారట. ఇవన్నీ వింటుంటే ముచ్చటేసింది నాకు. ఎప్పుడు మనం వాళ్ళింటికి వెళ్ళినా ప్రక్కప్రక్కనే కూర్చొని ఆదిదంపతులలాగా అన్పిస్తారు నా కంటికి.
‘‘ఏమోయ్! మేమెళ్ళాక దిష్టి తీసేసుకోండి ఇద్దరూ’’ అంటే నవ్వటం తనవంతవుతుంది ఆమనికి.
పెళ్ళైన కొత్తలో ఎలాగైతే ఒకరికొకరుగా అన్యోన్యంగా మసలుకుంటామో మళ్ళీ పిల్లలకు చదువులయిపోయి, పెండ్లిండ్లయిపోయి ఎవరికి వాళ్ళు సెటిలయిపోయి వాళ్లవాళ్ల ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ల సంసారంలో వాళ్ళు కిందా మీదా పడ్తూ, వాళ్ళ కుటుంబాల్ని నడుపుకుంటున్నప్పుడు మళ్ళీ మనకు పూర్వస్థితే. గిద్దెడు బియ్యమే. వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్నామంటే మరో బాల్యంలోకి అడుగు పెట్టడమే. కాకపోతే ఆ బాల్యంలో మనకు జ్ఞానం లేదు, చీకూ చింత అసలే లేదు. మరి ఈ బాల్యంలో భర్తకి భార్య పసిపాప, భార్యకి భర్త పసిపిల్లాడు. మళ్ళీ ఆ గిద్దెడు గింజల్ని ఉడకేసుకుని తినటమే. కావలసినంత ఖాళీ సమయం. అప్పుడు ఏమైతే మనం కోల్పోయిన అభిరుచులున్నాయో వాటిని అప్పుడు తీర్చుకుంటే ఒక్కళ్లే ఉంటున్నామనే బెంగా ఉండదు. ఖాళీగా ఉన్నామనే చింతా ఉండదు. ఏమంటారు? అంతేగదా? నేను చెప్పింది రైటేనా? నాతో మీరు ఏకీభవిస్తారని భావిస్తా.
ఇవే మాటలు మా ఫ్రెండ్సంతా బైఠాయించినపుడు తన్నుకుంటూ తన్నుకుంటూ బైటికొచ్చేస్తుంటాయి ఆశువుగా.
‘‘అబ్బా నేను మాత్రం హాయిగా పుస్తకాలు చదివేస్తూ కాలం గడిపేస్తానన్నా’’ వాళ్ళతో ‘‘నేను పుస్తకాల పురుగుని. పుస్తకాల ముచ్చును’’ అన్నా సరదాగా నవ్వుతూ.
‘‘యూ ఆర్ ఏ వెరీ గుడ్డు బేబీ’’ అంది చంద్రిక.
‘‘చిత్తం… చిత్తం…’’ అన్నట్లుగా తలూపా నేను.
‘‘ఆ… నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, యోగాకి వెళ్తానంది’’ మాలిని కూడా నవ్వుతూ.
‘‘నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటానబ్బా… నాకిలాగే హాయిగా
ఉంది’’ అన్నది చంద్రిక.
తను ఇటీవలే రిటైర్డయింది. నాల్గు నెలలు కూడా అవ్వలేదింకా. ఆ మధ్యలో తను అనారోగ్యానికి గురై మెడికల్ లీవు కూడా తీసుకుంది. అందుకనే వేరే ఏమీ మాట్లాడలేకపోయాము మేము.
‘‘మరి నువ్వు’’ అన్నాము ఆమని వైపు చూస్తూ…
ఇప్పుడు నేను బొమ్మలు గీస్తాను. నా అభిరుచికి ప్రాణం పోస్తూ, మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభిస్తా’’ అంది.
‘‘బొమ్మలకు రంగులు కూడా వెయ్యమన్నాను’’ నేను తనతో సూచనగా.
అంగీకారంగా తల ఊపింది తృప్తిగా ఆమని.
‘‘పద్మిని మిగిలిందన్నట్లుగా తనవైపు చూశాము’’ మేము.
మేమేమడుగుతామో తనకు తెలుసు. మేము ప్రశ్నించే అవసరం లేకుండానే ‘‘మావారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చూస్తున్నారు గదా! కొద్దిగా పని ఎక్కువవుతోంది బిజినెస్ పెరగటం వల్ల. ఎవరైనా ఓ కుర్రాడిని చూసి సహాయంగా పెట్టుకోవాలన్నారు మావారు’’ అంటూ
‘‘ఓ ఐదారేండ్లు నేను హెల్ప్ చెయ్యగలను ఆఫీసు పనుల్లో. అలా చేస్తే నాకూ టైం పాసవుతుందిగదా! అన్నా మావారితో’’ అని నవ్వింది పద్మిని.
‘‘ఓ.కే.’’ అన్నాము మేమంతా. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్న ఫోజుతో.
‘‘మా ఇంట్లోనే ఓ గది ఆఫీసుకు కేటాయిద్దామనుకుంటున్నాను.’’ అంది పద్మిని.
తధాస్తు అన్నాము మేము. ఇక మిగిలినది హాసిని. ప్రస్తుతం మాకంటే కనీసం ఓ పన్నెండు, పదమూడేళ్ళ చిన్నది.
‘‘నిన్ను ఇప్పుడు అడగలేని పేదవాళ్ళం మేము’’ అన్నాను. పెద్దవాళ్లం అంటే అది రోటీన్. పేదవాళ్లం అన్నందుకు అందరూ మనఃస్ఫూర్తిగా నవ్వారు. వాళ్లతో నేనూ శృతి కలిపాను.
***
మాకు తెలిసిన వాళ్లింటికి వెళ్లాల్సొచ్చింది ఒకరోజు వారిని పలకరించటానికి. సరే. అదే దారివెంట వెళితే రెండో వీధిలోనే శాలినిగారూ
వాళ్లుండేది. చాలారోజులైంది ఆ మేడమ్‌ని చూసి అని… నన్ను వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేయండి’’ అని అన్నా మా వారితో. సరేనని నన్ను వాళ్ళింటి దగ్గర దింపి, మావారు బైట పనులున్నాయని వెళ్ళిపోయారు వెంటనే. నేను నెమ్మదిగా గేటు తీసుకుని లోపలికి వెళ్ళాను. ఆ ఇంటి వాతావరణం నాకెంతగానో నచ్చుతుంది. పచ్చగా ఉండే చెట్లు, పూలతో నిండుగా ఉండే పూలమొక్కలు, గేటు తీసుకుని లోపలికి వెళ్ళగానే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తాయి మనసుకు. దాన్ని ఆస్వాదిస్తూ నేను ద్వారబంధానికి ముందు అమర్చబడిన మెస్‌డోర్ లోంచి ఇంట్లోకి చూశా. ఏంటి అలికిడి లేదు? అని తేరిపార చూస్తే, లోపల హాల్లో ఒంటరిగా కుర్చీలో కూర్చొని ఉన్నారు శాలిని మేడమ్‌గారు. తను కూర్చున్న కుర్చీకి ఎదురుగా ఉన్న టేబుల్ మ్యాట్‌పై రెండు మోచేతులూ ఆన్చుకుని, ఆ చేతుల మధ్యలో తలపెట్టుకుని, కండ్లు మూసుకుని ఉన్నారు. ఏదో తదేక దీక్షలో ఉన్నట్లుగా.
‘‘మేడమ్‌గారూ బాగున్నారా?’’ అన్న నా పిలుపుకు ఉలిక్కిపడి లేచి, నెమ్మది నెమ్మదిగా అడుగులేస్తూ వచ్చి, మెస్‌డోర్ బోల్ట్ తీశారు. ఎప్పుడూ హుషారుకు ప్రతిరూపంగా ఉండే ఆవిడ, బాగా నీరసపడిపోయినట్లుగా ఉన్నారు. ఆ టేబుల్ మ్యాట్ మీద కొన్ని పాత మ్యాగజైన్లు. ఆరోజు దినపత్రిక చెల్లాచెదురుగా పడి
ఉన్నాయి.
‘‘ఏంటి నీరసంగా కనబడుతున్నారు? ఒంట్లో బాగోలేదా?’’ అని కుశల ప్రశ్న వేశాను. నాకు కూర్చోవటానికి సోఫా చూపించి, నా ప్రక్కనే వచ్చి కూర్చుంటూ ‘‘ఆ… అసలు బాగోటం లేదండీ వారం రోజుల్నుంచి. అమ్మా, నేనూ కలసి ఈ మధ్య ఊరెళ్తున్నాం అని చెప్పాగదా మీతో.’’ తను అక్కడే ఆగిపోయింది. ‘‘ఇంకొంత మంది బంధువులను కలవాలని. ఇంటికి తాళం పెట్టి వెళ్లాం. అసలే రోజులు బాగోలేదు. అందుకని ఇక నేను వెళ్లిన పని కాగానే వచ్చేశాను’’ అన్నారు నాతో డీలాపడ్డ స్వరంతో.
‘‘మీ అమ్మగారుండి ఉంటే బాగుండేది ఈ సమయంలో మీకు తోడుగా’’ అన్నా.
‘‘అవునండీ… కానీ తను నా దగ్గరకొచ్చి సంవత్సరం దాటిపోయిందిగదా! ఇక్కడుంటే తనూ, నేనూ ఇద్దరమే. బిక్కు బిక్కుమంటూ ఉండాలి. అక్కడైతే మా వాళ్లంతా దగ్గర్లోనే చుట్టుప్రక్కల ఊళ్లల్లో ఉంటారు. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడొచ్చి కలిసి వెళ్తుంటారు అమ్మా వాళ్ళని. పాపం నా దగ్గర చాలా రోజులుండిపోయిందిగదా. తనూ కొద్దిరోజులు, మా పిన్నిలు, బాబాయిలు, మా మామయ్యల దగ్గర ఉండొస్తుంది అని నేను వచ్చేశానండీ’’ అన్నారు మళ్లీ శాలినిగారు.
భర్తకీ, శాలినిగారికీ ఏవో మనస్పర్ధలున్నాయని తెలుసు నాకు లోపాయికారిగా. మాతో పరిచయమున్నప్పటి నుండి భార్యాభర్తలిద్దరూ ఫ్రెండ్స్‌లా కలిసిపోతారు. ఎక్కడకి వచ్చినా చక్కగా మాట్లాడతారు. అందరితో కలివిడిగా
ఉంటారు. మా ఇంటికొచ్చినప్పుడల్లా పిల్లలకు ఏవో ఒకటి తెచ్చేవాళ్లు తినటాన్కి. వట్టి చేతుల్తో అస్సలు వచ్చేవాళ్లుకారు. కానీ భార్యభర్తల మధ్య ఏముందో గానీ ఎక్కువశాతం ఎడమొగం, పెడమొగం గానే ఉంటారు. వాళ్ళకి బాగా తెలుసున్న వాళ్లుమటుకు ‘‘వాళ్ళమధ్య ఎప్పుడూ ఇగోల మాటలు చెలరేగుతుంటాయి’’ అంటారు.
కానీ చాలా రోజుల క్రితమే తెలిసింది. ఏ చెడు అలవాట్లు ఉంటే సంసారంలో కలతలు రేగుతాయో ఏమైతే ఉండకూడదో అలాంటి గుణాలే శాలినిగారి ఇంటాయనలో వాళ్ళ వేరు కుంపట్లవటానికి మూలమని. అవును ద్వేషించినా, సహించవచ్చునేమోగానీ పరాయి స్త్రీలకు అలవాటు పడ్డ భర్తలను ఏ భార్యలు భరించగలరు చెప్పండి? అసలే స్వాభిమానం పాళ్లు ఎక్కువ. స్వావలంబన కలిగిన మహిళ తను. అసలు వాళ్లు విడిపోవటాన్కి ఇదే సరైన కారణమని శాలినిగారి మాటల ద్వారానే తెలిసి చాలా బాధపడ్డాను.
ప్రస్తుతంలోకి వస్తూ ‘‘ఏంటి? ఏమైందని అడిగితే ఎలర్జీ వచ్చేసింది బాగా. గొంతుకు ఇన్ఫెక్షను వచ్చింది. దానితోబాటుగా జ్వరం తగిలింది. ఈరోజే కాస్త చారన్నం తిన్నానని’’ చెప్పారు. తన వాలకం చూస్తూంటే ఇంకో నాల్గురోజులైతే తప్ప తేరుకోలేరని తెలిసిపోతోంది.
కూర బాగోలేదని, అన్నం మాడిరదని, ఫ్రిడ్జ్‌లో వాటర్ బాటిల్సు పెట్టలేదనేవి కుంటి సాకులు మాత్రమే. మనమంటే అయిష్టత ఏర్పడినపుడు మనమెంత గొప్పగా రుచిగా చేసినా ఏవీ నచ్చవు, రుచించవు మగవాళ్ళకి. ఇలాంటి వంకలు చూపించి మనకు మనస్తాపం కలిగించి, మనమీదనే అలుగుతోందని, అఖాండాలు వేసి ప్లేటు ఫిరాయిస్తూ వాళ్ళను ప్రశ్నించలేని విధంగా తయారు చేస్తున్నారు ఆడవాళ్ళని మగజాతిలో చాలామంది. ఈ మందిలో శాలిని సదరు భర్తగారు కూడా ఒకరని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను.
వాళ్ళ వారి గురించి చెబుతూ మా ఆయనగా పిలవబడే ఇప్పటి జల్సారాయుడు రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు ఈయనగారి వయసు చూసి వస్తుందా ఏ ఆడదైనా. నిజమైన ప్రేమతో వస్తుందా? చెప్పండి డబ్బు ఆశకు కాకపోతే తప్ప?’’ అంటూ
‘‘ఇతగాడికింకా ఒళ్లూపై తెలవట్లేదు. ఆ పెన్షనూ, బెనిఫిట్లూ రాగానే ఆ ఉంచుకున్నది అన్నంలోనో, టిఫిన్‌లోనో ఇంత మందు కలిపిపెట్టడం, వాడు చావటం ఖాయం’’ అని విరక్తి నిండిన బాధతో అన్నారు.
నిజమే, డబ్బుకు ఆశపడి వచ్చేవాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం సమాజంలో నేడు. ఉంచుకున్న వాడిని హత్య చేసి డబ్బు, నగలతో పరారయ్యేవాళ్లు ఎంతమందిలేరు? శాలినిగారు బాధతో చెప్పినా వందశాతం వాస్తవ విషయమే అది.
‘‘నాకు నా పిల్లలిద్దరూ రెండు భుజాలండి. వాళ్ళు చాలు నాకు. నాకున్నదేదో వాళ్లిద్దరికీ ఇచ్చేస్తాను. నాకెందుకండీ ఈ నగలు, బంగారం అదీను’’ అంటే ‘‘కొద్దిరోజులుంచుకోండి. ఇప్పుడే ఎందుకు ఇవ్వటమ’’న్నాను నేను శాలినిగారితో. ‘‘ఏమోనండి. నాకు ఉండటానికి ఇల్లు ఉంది. పెన్షన్ డబ్బులు వస్తాయి. నా ఒక్కదానికి ఎక్కీ తక్కీ’’ అన్నారు వైరాగ్యంతో. అవును మేడంగారి పిల్లలిద్దరూ బంగారాలు. ఒక్కదానివి ఎందుకు అక్కడ? మాతో వచ్చి ఉండు’’ అని ఫోన్ చేసినప్పుడల్లా అంటుంటారట శాలినిగారు.
‘‘ఆ… ఇప్పట్నుంచే ఎందుకు? లేవలేనినాడు ఎటూ తప్పదు’’ అన్నారు.
అదీ నిజమే ననిపించింది నాకు. ఎందుకో ఈ రోజు శాలిని గార్ని చూస్తే పాత గాయాలన్నీ రేగినట్లన్పించసాగింది ఆవిడ వాలకం, మాటలు చూస్తుంటే. అందులోంచి ఆవిడను బదలాయించాలని, ‘‘ఈ పదవినోదం నింపుదాం రండి!’’ అన్నా సరదాగా. టేబుల్ పైనున్న ఈనాడు ఆదివారం అనుబంధ పుస్తకం చూపిస్తూ.
శాలిని గారికీ ఇష్టమే, ఇలాంటి పజిల్స్ నింపటమంటే. తను అంతకుముందే సగం పైగా పూర్తిచేశారు. మిగతావి ఇద్దరం కల్సి ఆలోచించి కంప్లీట్ చేశాము. ఇద్దరమూ కాసేపు బడిపిల్లలుగా మారిపోయాం. కొన్ని అతి చిన్న పదాలే. బుర్రలు బద్దలు కొట్టుకున్నంత పని చేస్తేనే గాని జవాబులు దొరకలేదు. ఇది తలచుకుంటూ తెగ నవ్వుకున్నాం ఇద్దరం.
‘‘టీగానీ, కాఫీ గానీ తాగుతారా?’’ అన్నారు శాలినిగారు నాతో.
‘‘ఏమ్మా బాగా హుషారొచ్చినట్లుంది మీకు’’ అన్నా నవ్వుతూ.
‘‘అవునండీ మైథిలీ… కొంచెం హాయిగా ఉంది ప్రాణానికి. మీరొచ్చి మాట్లాడుతూ, ఇద్దరం కలిసి పదవినోదం నింపుతుంటే సమయమే తెలియలేదని తనూ నాతో నవ్వారు. గంటన్నర దాటిపోయింది వచ్చి. ‘‘మళ్ళీ వస్తా’’నని చెప్పి నేను మావారికి ఫోన్ చేసి చెప్పా ‘‘రండి తీసుకువెళ్లండి’’ అని. కాసేపటికి బైట బైకు హారన్ వినపడగానే నేను బైటికి వచ్చి, శాలినిగారికి బై చెప్పి బండెక్కాను. తను కూడా మాకు బై చెప్పి ‘‘వస్తూండండి మైథిలిగారూ.. అప్పుడప్పుడు’’ అని మరీ మరీ చెప్పి లోనికి వెళ్ళిపోయారు గేటు వేసుకుని.
సశేషం