కొత్తలోకం కావాలి

కవిత

నాకిప్పుడు
ఓ కొత్త లోకం కావాలి

సుఖాలను నియంత్రించి
కాలాన్ని కష్టంతో లెక్కించగల
అడుగులను నేను చూడాలి

అధికార మదాన్ని అణచి
స్వేచ్ఛావిహంగమై ఎగరడానికి
ఆసరానిచ్చే చేతులను
నేను స్పృశించాలి

పవిత్రతకు మారు నిలిచి
ఆదర్శాల ఆచరణతో
పచ్చగా పండించుకునే జీవితానికి
విలువలు నేర్పగల బోధనకు
మురిసి పరవశించాలి

కళ్ళను ఆల్చిప్పలు చేసి
మనసంతా జ్ఞానాన్ని అపేక్షిస్తూ
చేరడేసి చెవులతో
ఆదరంగా పాఠాలను వినే
విద్యార్థినై తరించాలి

పెంచిన మొక్కను తుంచేయకుండా
మమకారపు పేగుతో చుట్టుకునే
మాతృత్వపు నీడలో
నన్ను పెరగనివ్వాలి

సుకుమార లతికా లావణ్యంతో
ప్రేమైకజీవన మాధుర్యాన్ని
సమాజానికి అందించే
స్త్రీతత్వాన్ని అనుభూతి చెందాలి

కంచే చేను మేసినట్లు కాక
చంటిపాపలను
కంటిపాపల కింద కాపాడుతూ
ఒడిలో లాలించే
పితృవాత్సల్యతను చవి చూడాలి

త్యాగాలకు విలువలేక
సహనాన్ని బలహీనతగా భావించే
అహంకార ప్రదర్శన లేని
సప్తపదుల సహజీవనాన్ని
తనువంతా నింపుకోవాలి

ఇంద్రియాల గుర్రాలకు కళ్ళాలు వేసి
నమ్మకాలను మోసం చేసే
అవాంఛనీయతలు లేని
స్నేహ మధురిమను ఆస్వాదించాలి

మానవతా వృక్షం కింద
కష్టానికి అర్థం తెలియని
జీవితాన్ని గడిపేందుకు
మరో కొత్త లోకం నాకు కావాలి
దురాశ అంటారా దీన్నెవరైనా??
ఇవ్వగలనంటారా ఒక్కరైనా??

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అయితే మీరే..(భుజాలు తడుముకుంటున్నారుగా!)..5వ, భాగం

హరి చందన -4