హరి చందన – భాగం -8

“చెప్పండి డాడీ!”
“ఈ పరిచయాలు మితి మీరకుండా చూసుకోండి… ఇన్ని సార్లు చెప్తున్నా అనుకోవద్దు. ఈరోజుల్నిబట్టి ఇలా చెప్పవలసిన వస్తోంది”
అన్నాడు.
” ష్యూర్ డాడీ…. మీకు చెప్పకుండా నేనెలాంటి నిర్ణయాలుతీసుకోను. ఆ విషయం మీరేమి వర్రీ కావద్దు ”
స్పష్టం చేసి మెట్లెక్కి గదిలోకి వెళ్ళిపోయింది.
******-******-

వాన్ దిగి, కాళ్ళు కడుక్కుని అందరూ లోపలికి వచ్చారు.
“మా నాన్న గారు రామ్ ప్రసాద్, అమ్మ సీతమ్మ, వీరు మా బాబాయ్ కృష్ణ ప్రసాద్, మా పిన్ని రుక్మిణి. వీళ్ళు ముగ్గురు అక్కాచెల్లెళ్లు, ముగ్గురు అన్నతమ్ములు.”
.
“నాన్న గారూ!వీళ్ళందరూ నాతో పాటు మన ఆఫీస్ లో పనిచేస్తున్నారు.. ఇతను రమేష్, శివ, కార్తిక్, చందన, శైలజ, సోనీ” అంటూ అందరినీ పేరు పేరునా తండ్రికి,మిగిలిన వారికి పరిచయం చేశాడు హరి. అందరూ ఇంటి వారికి మర్యాదగా నమస్కరించారు.
“ఆంటీ “అంటూ బంటీ వచ్చి చందన చెయ్యి పట్టుకున్నాడు.
” అరే బంటీ!ఎలా ఉన్నావ్.? బాగా చదువుకుంటున్నావా? ” మోకాళ్ళ మీద కూర్చుని బంటిని ముద్దు పెట్టుకుంది చందన.
“వాళ్లందరికీ కావలసిన ఏర్పాట్లు చూడండి.”భార్య, మరదలు వైపు చూస్తూ చెప్పి, తన గదిలోకి వెళ్లిపోయారు రాంప్రసాద్.
“పదండి మీకు పరిచయం చెయ్యాల్సిన ముఖ్య వ్యక్తులు ఇంకా లోపల ఉన్నారు “అంటూ ఎడమ చేతి వైపున ఉన్న గది వైపు దారి తీశాడు.
అందరూ అతన్ని అనుసరించారు.
పండుముసలి వ్యక్తి మంచం మీద దిండుకి ఆనుకుని కూర్చుని పుస్తకం చదువుతూ ఉన్నారు.
” మాతాతయ్య హరీశ్చంద్ర ప్రసాద్ గారు! ఆయన పేరేనాకుపెట్టారు.
ఆవిడ మా నానమ్మ పేరు మహాలక్ష్మి.లాస్టుఇయర్ నూరేళ్లు పూర్తి అయిన సందర్భంగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. ”
“సాక్షాత్తు లక్ష్మి నారాయణుల్లా ఉన్నారు.మమ్మలినిఆశీర్వదించండి
తాతయ్యగారు “చందన,ముందుకి వెళ్లి బెడ్ మీదఉన్న తాతగారికి, పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్న నాయనమ్మగారికి పాదాలoటి నమస్కరించింది.
అందరూ ఆమెని అనుసరించారు.
వయసు మీద పడినా ఆ ముఖం లో తేజస్సు, కళ్ళల్లో కాంతితగ్గలేదు.నుదుటిమీద విభూది రేఖలు, మధ్యలో గంధం చుక్క దానిమీద కుంకుమ బొట్టు., మెడలో బంగారంతో చుట్టిన రుద్రాక్షల సిద్ధమాల,కుడిచేతికి బంగారపు కoకణం, కుడిచేతి ఉంగరపు వెలికి దర్భ ముడి ఉంగరం, తలమీద తెల్లగా వెండి తీగల్లా మెరుస్తు అక్కడ అక్కడ ఉన్న వెంట్రుకలుతో ముఖం చిరునవ్వుతో కళకల్లాడుతోంది.
మహాలక్ష్మి గారు పేరుకు తగ్గట్టు లక్ష్మిదేవిలా నుదుట పావలా కాసంత కుంకుమ బొట్టు, దానికింద పూజా కుంకుమ ధరించినట్లు కనుబొమల మధ్యలో చిన్న కుంకుమ బొట్టు,ముగ్గుబుట్టాలా ఉన్న తలకట్టు, రెండుచేతులకి మట్టి గాజుల మధ్యలో మెరుస్తున్న బంగారు గాజులు, చెవులకి వజ్రాల దుద్దులు, ముక్కుకి ముక్కుపుడక, పచ్చని శరీరఛాయతో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది.
“వీళ్ళందరూ ఏంచదువుతున్నార్రా చిన్నా ” బోసినోరు అవడం వల్ల మాట స్పష్టంగా లేదు గానీ అందరికీ అర్ధం అయింది.
“ఇంజనీరింగ్ అయిపొయింది తాతయ్యా. మేమందరం ఒకే ఆఫీసులో ఉద్యోగం… అదే నేను సొంతoగా ఆఫీస్ పెట్టనుగా అందరం కలిసి పని చేస్తున్నాం. సంక్రాంతి పండుగ పల్లెటూళ్లలో బాగా జరుపుపుకుంటాం అంటే చూడడానికి వచ్చారు.రెండు రోజులు ఇక్కడే ఉంటారు “చెవులు వినిపించవని దగ్గరకు వెళ్లి చెవిలో గట్టిగా చెప్పాడు.
“మంచిది…”మళ్ళీ చేతుల్లో ఉన్న పుస్తకంలోకి తలదూర్చారాయన.
నూరేళ్ళ వయసులో కూడా కళ్ళజోడు లేకుండా పుస్తకం చదువుతున్న ఆయన్ని వింతగా చూశారoదరు.
వత్తులు చేస్తున్న లక్ష్మమ్మ గారినీ చూసి “ఆయ్. ఎంత బాగా చేస్తున్నారు బామ్మా ” ముచ్చట పడ్తూ, మోకాళ్ళ మీద కూర్చుని చూసింది శైలజ.
ఎడమ చేతిలోగింజలు తీసిన పత్తిని చేతికి తెల్లని విభూదిని అద్దుకుని దూది అంచుని పట్టుకుని మెలి తిప్పుతుంటే సన్నని దారంవస్తోంది. మూరెడు పొడుగు అయ్యాక మధ్యలోని మూడువేళ్ళకి మూడు చుట్లు తిప్పి పుట్టిక్కున తెంపేసింది ఆవిడ.
రెండు అంగుళాల మూడు పోగుల వత్తి తయారైంది.
అలాంటివి కొన్ని కలిపి కట్టిన కట్టలు రెండు పక్కన పెట్టి ఉన్నాయి.
“మీ చేతుల్లో ఏదో మేజిక్ ఉంది బామ్మా “అంది సంబరంగా.
“చేతుల్లో దూది, ఎదురుగా విభూది తప్ప నా చేతుల్లో మేజిక్కు ఏముందే పిల్లా! ఒకసారి ప్రయత్నిస్తే నువ్వు కూడా చెయ్యచ్చు. కానీ, బయట తిరిగి వచ్చిన గుడ్డల్తో ఇప్పుడు వద్దు. రేపు స్నానం చేశాక చేద్దుగానీలే “అందావిడ బోసినోటితో ముసిముసిగా నవ్వుతూ.
“సరే బామ్మా, రేపు నేను మీదగ్గర వత్తులు చెయ్యడం నేర్చుకుంటాను.” అంది,లేచి నిలబడుతూ.
“చినబాబూ!వాళ్ళని మేడమీద గదుల్లోకి తీసికెళ్ళు. కాఫీ ఫలహారాలు పంపిస్తాను “వెనుకనుంచి చెప్పింది తల్లి సీతమ్మ.
“ఫలహారాలు ఇప్పుడేమి వద్దులేమ్మా. చీకటి పడుతోందిగా ఏకంగా కాసేపు ఆగి భోజనాలు చేసేస్తాం. మధ్యలో విజయవాడలో ఆగి, కనక దుర్గమ్మ దర్శనం చేసుకుని, వాడపల్లి వెంకన్నని ర్యాలీ జగన్మోహని కేశవ స్వామిని దర్సించుకుని వచ్చాం. దారిలో ఏదో టిఫిన్ తిన్నాం గానీ భోజనం చెయ్యలేదు. అందుకే పెదరాళేతినేస్తాం” తల్లితో చెప్పి “పదండి ఫ్రెండ్స్ “మేడమీదికి తీసికెళ్ళాడు హరి. ఒకగదిలో మగవాళ్ళు ముగ్గురికి, మరో గదిలో ఆడవాళ్లు ముగ్గురికి మడత మంచాలు వేసి, తెల్లని పక్కలు పరిచి ఉన్నాయి.
ఒక పక్కగా నాలుగు కుర్చీలు, మరోవైపు బేగ్స్ పెట్టుకోడానికి పొడవాటి చెక్కబల్ల ఉన్నాయి. దానిమీద వాళ్ళ తాలుకు బేగ్ లు పెట్టి ఉన్నాయి. అటాచ్డ్ బాత్ రూమ్ తలుపు తెరిచి చూపిస్తూ,”లోపల రాడ్ మీద టవల్స్, అద్దం పక్కన సోప్స్ ఉన్నాయి. వెళ్లి ఫ్రెష్ అయి రండి. మళ్ళీ కాఫీ చల్లారిపోతుంది ” చెప్పాడు.
అన్నట్లుగానే పదినిముషాల్లో ఫ్రెష్ అయ్యారు
“అన్నయ్యా!పెద్దమ్మ కిందకి రమ్మంటోంది అందరినీ “అంటూ సుమారు పద్దేనిమిది, పంతోమిదేళ్ళున్న అమ్మాయి వచ్చి పిలిచింది.
“ఫ్రెండ్స్!మా చెల్లెలు సుశీల డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.”అందరికీ పరిచయం చేశాడు.
అందరికీ నమస్కరించి చందన దగ్గరగా వచ్చి “మా బంటీ రోజు మీ గురించి చెప్తుంటాడు,పార్క్ లో ఆంటీ అంటూ.. గ్లాడ్ టూ మీట్ యూ “చెయ్యి అందుకుంది.
చందన సుశీల చేతిని నొక్కుతూ”డిగ్రీ అంటే బికామ్…………….. బి యస్సీనా?” అడిగింది.
“బి యస్సీ…యమ్మేస్సీ చేసి లెక్చరర్ అవ్వాలని నా కోరిక ”
“ఓ! నైస్ ఛాయస్ “అని శైలజ సుశీల భుజమ్మీద చెయ్యివేసి నొక్కుతూ.
“థాంక్స్! రండి కింద అందరూ ఎదురు చూస్తున్నారు “.
ఆమె వెంట అందరూ కింద హాల్లోకి వచ్చారు.
సీతమ్మ పెట్టిన చెగోడీలు, జంతికలు పూతరేకులు తిని, కాఫీ తాగారు. చీకటిపడడంతో చలి కాస్త పెరిగింది.
కబుర్లు చెప్పుకుంటూ అక్కడే కూర్చున్నారు.
ప్రధాన ద్వారం నుంచి ఎదురుగా కనిపిస్తున్న పాతబడినట్లుగా ఉన్న ఇంటిని చూపుతూ “సార్!అదేంటీ పాత బడినట్లుగా ఉంది?అందులో ఎవరూ లేరా “అడిగాడుకార్తీక్.
“సార్ కాదు,ఇది ఆఫీస్ కాదు కదా. పేరుపెట్టి పిలవచ్చు.
అదీ మాదే. మా తాతయ్య గారి తండ్రి కట్టించిన మండువా ఇల్లు. మాతాతయ్యకి ఉన్నంత వయస్సు దానికీ ఉంది.”
“మండువా ఇల్లా? అంటే? అడిగింది సోనీ.
హరి నవ్వి” రేపు పగలు తీసికెళ్లి చూపిస్తాను.మా తాతయ్య, నానమ్మ దాన్ని కూలగొట్టడానికి ఒప్పుకోకపోతే, ఎదురుగా ఉన్న ఇక్కడ ఈ మేడ కట్టించ్చారు నాన్న. అది పాతది అవడం, బాగా పల్లానికి ఉoడడం వల్ల వర్షం వస్తే మురుగు నీరు, నీటితోపాటు పాములులోపలికి వచ్చేసేవి. అందుకే ఈ ఇల్లు కట్టించారు. ”
అలా కాసేపు కబుర్లు చెప్పుకుoటూ ఉంటే….
“కబుర్లు ఆపి, వెళ్ళి పడుకోండి. “అని,రామ్ ప్రసాద్ హెచ్చరించడంతో పైకి వెళ్ళ బోతుంటే……..

( సశేషం )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఓ ప్రేమ కథ (మోహన రాగం) 5 వ భాగం

“ఎవరి జీవితానికి వారే”