జరిగిన కథ
రాగమాల కెమిస్ట్రీ ఎగ్జామ్ వద్దని వ్రాయనని మోహన్ కి చెప్తుంది. మోహన్ ఎంత చెప్పినా కూడా వినదు . మోహన్ కూడా రాగమాల కోసం పరీక్ష రాయకుండా వస్తాడు. తనకోసం అతను పరీక్ష రాయకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది రాగమాలకి. అనుకోని సంఘటనల చివరి సంవత్సరం రాగమాల చదువుకు ఆటంకం కలుగుతుంది. అది ఎలా పరిష్కరింప పడుతుందో చూద్దాం
ఊరికి చేరుకున్నారు రాగమాల, వసుంధర. ఇన్ని రోజులుగా వసుంధర ఇంట్లో లేకపోవడం వల్ల ఇల్లంతా చిందరవందరగా ఉంది. అసలే వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఈ నెల రోజులు రాగమాల అక్క మాలతి వచ్చి ఇక్కడే ఉంది. దక్షిణామూర్తి గారికి వేరే ఊరిలో ఉద్యోగం. వచ్చిపోయే అతిథులతో మాలతికి తీరిక లేకుండా అయిపోయింది.
కొన్ని విచిత్రాలు జరుగుతాయి అనడానికి ఉదాహరణనే ఈ సంఘటన. మోహన్ తండ్రికి రాగమాల వాళ్ళ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. కొద్ది రోజులు అతను రాగమాల వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. దక్షిణామూర్తి గారు, వసుంధర అతనిని ఎంతో మర్యాదపూర్వకంగా చూసుకున్నారు. అతనికి ఇల్లు దొరికిన తర్వాత వెళ్ళిపోయారు.
అప్పుడప్పుడు మోహన్ తండ్రి కోసం వచ్చినట్లుగా వచ్చి, రాగమాలను కలిసి వెళ్లేవాడు.
మాటల సందర్భంలో పెళ్ళికి వెళ్తున్నానని చెప్పింది రాగమాల. అది కూడా మోహన్ వాళ్ళ పక్క ఊర్లోనే పెళ్లి. వసుంధర మేనమామ కూతురు పెళ్లి.
మోహన్ కుటుంబానికి కూడా వాళ్ళు పరిచయమే. వాళ్ల తాతల ఊళ్ళు ఒకటి కావడమే దీనికి కారణం. పాత తరాల వాళ్లంతా పరిచయస్తులే .ఈ కొత్త తరానికి మాత్రమే ఎక్కువగా తెలియదు.
రాగమాల బంధువుల ఇంటి పెళ్లికి ఒక నాలుగు రోజులు ముందుగానే తల్లి, అక్కలతో కలిసి వెళ్ళింది. అప్పుడప్పుడే చీరలు కట్టుకోవడం మొదలుపెట్టిన రాగమాల పెళ్లి కోసం ఒక పింక్ కలర్ చీర కూడా కొనుక్కుంది.
అది చిన్న పల్లెటూరు. తాతల ఇళ్లన్నీ పక్కపక్కనే ఉన్నాయి. పాతకాలం నాటి ఇల్లు వసుంధర అమ్మమ్మ గారి ఇల్లు కూడా ఆ ఇళ్లను ఆనుకునే ఉంటుంది. చిన్నప్పుడు వసుంధర పుట్టి పెరిగిన ఇల్లు అదే.
రాగ మాల వయసు పిల్లలు, ఇంకా తనకన్నా చిన్నవాళ్లు ఎంతోమంది పిల్లలు ఉన్నారు. అందరూ కలిసి ఎన్నో రోజుల తర్వాత హాయిగా ఆడుకున్నారు.
తాత కూతురు రాగమాల కన్నా వయసులో కొంచెం చిన్నది. పెళ్లికూతురును చేయవలసిన బాధ్యత రాగమాలకు అప్పగించారు. అప్పటివరకు అలాంటివి తెలియని రాగమాల, ప్రయత్నం చేసి చక్కగా పెళ్లి కూతురుకి పెళ్లి బొట్టు తీర్చిదిద్ది, కళ్ళకు కాటుక, బుగ్గన చుక్క, కాళ్ళకు పారాణి అన్ని ఎంతో తెలిసి నట్లుగా చేసింది. అదంతా రాగమాలకి కూడా ఎంతో ముచ్చటగా అనిపించింది.
ఆరోజు గోరింటాకు తీసుకొచ్చి, పని వాళ్ళతో రుబ్బించి, అందరినీ పెట్టుకోమని ఇచ్చారు. పాత ఇంట్లో పిల్లలంతా కూర్చుని గోరింటాకు పెట్టుకుంటున్నారు. ముందుగా పెళ్లి కూతురుకి రెండు చేతులలో గోరింటాకు పెట్టింది రాగ మాల.
రాగమాల కి మోహన్ గుర్తుకు వచ్చాడు. “మోహన్ వాళ్ళ ఊరు పక్కనే ఉంది కదా!” అని అనుకుంది.
అందరూ గోరింటాకు పెట్టుకుని బయటకు వెళ్ళిపోయారు. రాగ మాల తుదిమెరుగులు దిద్దుతూ మోహన్ పేరు వచ్చేట్లుగా, చేతి మీద ’యం’ అనే అక్షరం రాసుకుంది.
అప్పుడే ఆ ఇంట్లోకి మోహన్ వచ్చాడు.
ఒక్కసారిగా రాగమాలకు వణుకు వచ్చింది.
’ఇక్కడికి కూడా తన కోసం వచ్చాడా ఏంటి?’ అనీ భయపడుతూ చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూసింది.
“మోహన్! ఇక్కడికి వచ్చావ్ ఏంటి”? అని అడిగింది కంగారుగా.
“నువ్వేం భయపడకు. మాకు కూడా వీళ్ళ ఇంటి నుంచి కార్డు వచ్చింది.మా వాళ్ళు ,వీళ్ళు అందరూ చాలా సన్నిహితులు అట.మనమే తెలియదు ఒకరికి ఒకరం. పెళ్లి రోజు మా నాన్నకి సెలవు లేదని ఈరోజు వెళ్దామని నాన్న అంటే, నాన్నతో పాటుగా వచ్చాను. నువ్వు ఎలాగూ ఇక్కడే ఉంటావని తెలుసు కదా! అందుకే తమ్ముళ్ళు ఎక్కడ నాన్నతో వస్తారో! అని ముందే నేను వస్తానని చెప్పాను”అన్నాడు నవ్వుతూ.
“అనుకోకుండా భలేగా కలిసావు. చాలా సంతోషంగా ఉంది. ఇదిగో ఇప్పుడే నిన్ను గుర్తు చేసుకొని నీ పేరు నా చేతిలో వేసుకున్నాను”అన్నది రాగమాల సంతోషంతో తన చేతులను చూపిస్తూ..
ఇంతలో అక్కడికి రాగమాల మేనమామ వచ్చాడు. మోహన్ ను ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు.
రాగమాలకు కొంచెం భయమేసింది .
“వెళ్ళిపో! మోహన్ బాగుండదు”అని చెప్పి బయటకు వెళ్ళిపోయింది రాగమాల.
మోహన్ బయటకు వెళ్ళిపోయి వాళ్ళ నాన్న గారితో కూర్చున్నాడు.
కాఫీ, టిఫిన్ అయ్యాక పెళ్లి కూతురికి కట్నం చెల్లించి వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు ఒక్కసారి లోపలికి వచ్చి, అలా కళ్ళతో చెప్పి వెళ్ళిపోయాడు మోహన్.
ఆమె ముందు కన్నా ఇంకా ఎక్కువ ఉత్సాహంగా పెళ్లిలో పాల్గొన్నది. అలా మోహన్ వస్తాడని అసలు ఊహించలేదు.
ఆర్భాటాలేవీ లేకుండా పెళ్లి సాధారణంగా,సాంప్రదాయంగా జరిగింది. ఇంటి ముందు వాకిట్లోనే పెళ్లి. చక్కని కొబ్బరి ఆకుల పందిరి.ఎక్కువ జనం కూడా లేకపోవడం వల్ల, అందరూ అన్ని వేడుకలను సంతోషంగా చూడగలిగారు.
పెళ్లి కూతురుతో పాటు అత్తవారింటికి వెళ్ళమని తాతగారు వాళ్ళు పట్టుబట్టారు. కొత్త ఇంటికి వెళ్లడం అలవాటు లేని రాగమాలకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కానీ ఇంచుమించు తన వయసే ఉన్న వేరే తాతయ్యల కూతుళ్లు వస్తున్నారని తెలిసి, వాళ్లతో కలిసి సంతోషంగా వెళ్ళింది.
అది ఇంకా చిన్న పల్లెటూరు. ఆ ఊరి పేరు చుక్కా పురం. ఎత్తు మీద ఉన్న పెద్ద ఇల్లు. ఇంటి నిండా బంధువులు. గాడి పొయ్యిల మీద వంటలు. అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించింది.
తెల్లవారి సత్యనారాయణ వ్రతం. అప్పుడు కూడా పెళ్లి కూతురును చేసే బాధ్యత ఆమెకు అప్పగించారు.
రాగమాల వయసున్న పిల్లలందరూ, చక్కగా లంగా ఓణీలు వేసుకొని, ఇంటికే నిండు దనం తీసుకొచ్చారు.
కొత్తవాళ్లతో ఎక్కువగా మొహమాట పడే రాగ మాల అందరితో బాగా కలిసి పోయింది .
సత్య నారాయణ స్వామి వ్రతం అయ్యాక, తీర్థ ప్రసాదాలు తీసుకుని, భోజనం చేసి తన ఊరికి వెళ్ళింది. అప్పటికే తల్లి, అక్క ఊరికి వెళ్ళిపోయారు.
ఊరికి వెళ్ళే సరికి మోహన్ దగ్గర నుండి పోస్ట్ లో రెండు ఉత్తరాలు వచ్చాయి .తీరికగా చదువుకుని ,జవాబు వ్రాసింది రాగ మాల.
సెలవులు అయిపోతున్నందు వల్ల, రాగ మాలను దక్షిణా మూర్తి గారు తన స్నేహితుడు మరియు బంధువు అయిన వాళ్ళింట్లో చదువు కోసం ఉంచాలని అనుకున్నాడు..
అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో! అని ఆలోచించ సాగింది.
మరో వారం రోజుల్లో కాలేజీలు మొదలవుతాయి .డిగ్రీ ఫైనల్ ఇయర్ కి వచ్చారు రాగమాల, మోహన్.
ఆ ఊరిలో ఉన్న ఒకే ఒక్క థియేటర్లో ఎప్పుడో ఒకసారి మంచి సినిమాలు వస్తాయి. స్నేహితురాలు కరుణతో కలిసి సినిమాకు వెళ్ళింది.
అనురాగ్ కు జాబ్ వచ్చింది. జాయిన్ కావడానికి నెల రోజుల సమయం ఉంది. అందుకని అతను కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఎందుకో అతనికి రాగమాల ప్రవర్తనలో తేడా కనిపించింది. ’ఎక్కువగా పోస్టులో లెటర్స్ వస్తున్నాయి. ఎవరు రాస్తున్నారో అర్థం కావడం లేదు’ అని అనుకున్నాడు. అదే సమయంలో పోస్ట్ మాన్ ఒక లెటర్ తెచ్చి ఇచ్చాడు.
ఉత్తరం తెరిచి చదవడం సంస్కారం కాదనీ అనుకున్నాడు.కానీ చెల్లి భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా! అని అనుకొని ఆ ఉత్తరం తెరిచి చదివాడు .
మోహన్ ఎక్కువగా కవితలు రాసే వాడు. అందుకని అతను తన కలం పేరు “తరంగిణి”. ఆ ఉత్తరంలో కూడా కింద తరంగిణి అని ఉంది.
’ఎవరీ అబ్బాయి ?ఎలా తెలుసుకోవాలి? ఇద్దరి మధ్య ప్రేమ ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది. అది ఎటు దారితీస్తుందో !చెల్లి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత నాకుంది కదా!
ఎలా తెలుసుకోవాలి’?అని ఆలోచించగా ఒక ఆలోచన స్ఫురణకు వచ్చింది.
వెంటనే వసుంధరతో..
“అమ్మా! నేను బయటకు వెళుతున్నా! వచ్చేవరకు ఆలస్యం అవుతుంది”అన్నాడు అనురాగ్.
“భోజనం చేసి వెళ్ళు రా” అన్నది వసుంధర.
“వద్ధమ్మా! ఆకలిగా లేదు” అంటూ డ్రెస్ వేసుకుని బయటకు వెళ్లాడు.
బస్టాండ్ కు వెళ్లి మోహన్ వాళ్ళ ఊరి బస్సు ఎక్కాడు.
’మోహన్ చెల్లి క్లాస్ మేట్ కదా! అతన్ని అడగాలి.చెల్లితో ఎవరు క్లోజ్ గా ఉంటున్నారో! అతన్ని అడగడమే మంచి ఉపాయం’అనుకున్నాడు అనురాగ్.
అరగంటలో మోహన్ వాళ్ళ ఊళ్లో దిగాడు. ఆ ఇంటి చిరునామా అడుగుతూ వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు.
మోహన్ వాళ్ళ ఇల్లు చాలా పెద్దది.మధ్య వాకిలి లో చుట్టూ అందమైన బాల్కనీ లా ఉంటుంది.కూర్చోవడానికి విశాలంగా, అనుకూలంగా ఉంటుంది. పాత కాలం నాటి చెక్క సోఫాలు వేసి ఉన్నాయి.
పెద్ద దర్వాజ నుండి లోపలికి వెళ్ళగానే ,మోహన్ బయట ఏదో వ్రాసుకుంటూ కనిపించాడు.
అనురాగ్ ను చూసి ఆశ్చర్య పోయాడు.
’ఇదేంటి!రాగ మాల వాళ్ళ అన్నయ్య వచ్చాడు’ అని అనుకుని..
“రండి! ఈ ఊళ్లో ఏదైనా పని మీద వచ్చారా!”అని అడిగాడు మోహన్.
“అవును,ఇక్కడ చిన్న పని ఉంటే వచ్చాను” అన్నాడు సోఫాలో కూర్చుంటూ..
“నేను మంచి నీళ్ళు తెస్తాను” అని మోహన్ లోపలికి వెళ్ళాడు.
ఇంతలో మోహన్ వ్రాసిన నోట్స్ చేతిలోకి తీసుకున్నాడు.వెంటనే తన జేబులో ఉన్న ఉత్తరం తీసి పక్క పక్కన పెట్టాడు.
“ఆహా! అనుమానమే లేదు.ఉత్తరాలు వ్రాస్తున్నది మొహానే” అనుకున్నాడు.
ఇంతలో మోహన్ వచ్చి. నీళ్లు ఇచ్చి “లోపలికి రండి.అమ్మమ్మ, తాత ఉన్నారు .వాళ్ళని పరిచయం చేస్తాను.అలాగే మా ఇల్లు చూడండి” అన్నాడు.
మోహన్ కు వాళ్ల ఇల్లు, కుటుంబం అంటే చాలా ప్రాణం .మాట్లాడిన పది మాటల్లో ఎనిమిది మాటలు ఇంట్లో వాళ్ళ గురించి ఉంటాయి.
అనురాగ్ ఇంట్లోకి వెళ్ళాడు.
వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యని పరిచయం చేసాడు.
“,మీ నాన్న గారి అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇదే బాబు. మీ నాన్న మా ఇంట్లో ఆడు కున్నాడు.మనం అంతా పాత వాళ్ళమే” అన్నాడు అనురాగ్ తాతయ్య.
అతనికి మనసులో మోహన్ ఉత్తరమే మెదులుతుంది.
వాళ్లతో మాట్లాడుతూనే ఉన్నా ఒక పక్క ఆలోచన కూడా ఎక్కువయ్యింది.
ఇంతలో మోహన్ అమ్మమ్మ ప్లేట్ లో తపాల రొట్టె పెట్టీ ఇచ్చింది.
“పాత కాలం వంటలు నాయనా! తింటావా? ఇది తెలుసా?” అన్నది అమ్మమ్మ.
“తెలుసు అమ్మమ్మ! మా నాయనమ్మ చేస్తుంది.మాకు కూడా ఇవన్నీ అలవాటే ” అంటూ అనురాగ్ తపాల రొట్టె తిని బయలు దేరాడు.
’విషయం తెలుసుకుందాం అనుకుంటే, విషయమే ఇక్కడుంది.ఏం చేయాలి’ అనుకున్నాడు అనురాగ్.
ఇక్కడ నాయనమ్మ వంటలను ఆస్వాదిస్తూ సెలవులను అద్భుతంగా గడిపింది.
టౌన్ కు బయలుదేరే ముందు..
మోహన్ కు, రాగ మాల ఉత్తరం రాసింది. “పది తర్వాత వచ్చే బస్సు ఎక్కుతాను.నువ్వు కూడా అదే బస్సు ఎక్కు.ఇప్పుడు ఉండేది బంధువుల ఇంట్లో.మనకి కలు సుకోవడం కుదరక పోవచ్చు” అని రాసింది రాగ మాల.
అనుకున్నట్లుగా ఇద్దరు బయలు దేరారు.
చిన్న సంఘటన బస్సులో జరిగింది.
సశేషం