పసిదనంతో ప్రయాణం (కాలమ్)

బుజ్జి కన్నమ్మ – బుజ్జి మేక

ఓ బుజ్జి కన్నమ్మ నాతో ఓరోజు వాళ్ళ అమ్మా నాన్న తనకు ఓ బుజ్జి మేక ఇచ్చారని చెప్పింది.ఇక్కడో ముచ్చట చెప్పుకోవాలి. బుజ్జి కన్నమ్మ వాళ్ళకు కొన్ని మేకలు ఉన్నాయి. వాళ్ళ నాన్న వాటిని రోజూ అడవికి తీసుకుని వెళ్తాడు. వాటిల్లో ఓ మేకకు పుట్టిన మేక పిల్లను మన బుజ్జి కన్నమ్మకు ఇచ్చి ఇది నీదే అని చెప్పారంట.
రోజూ దాని కబుర్లే చెప్పేది. పాలు మరిచి ఆకులు తినడం దగ్గర నుంచి అది తనతో ఎలా ఆడుకుంటుందో కథలు కథలుగా చెప్పేది. కళ్ళు గుండ్రంగా తిప్పుతూ ఆ మేకతో తాను ఆడుకునే ముచ్చట్లు చెబుతుంటే ఇంకా ఇంకా వినాలనిపించేది. నేనూ ఓ బుజ్జి మేకనైతే బాగుండేది అనిపించేది.
అలా బుజ్జి మేక, బుజ్జి కన్నమ్మ పెద్దవుతున్నారు. అప్పుడప్పుడు బుజ్జి మేక కోసం ఇంటర్ వెల్ లో బడి గ్రౌండ్ లో ఆకులు కోసుకొని బ్యాగ్ లో దాచేది. అది చూసింది గమనించి మా బుజ్జి మేకకు ఈ ఆకులు ఇష్టం టీచర్ అన్నప్పుడు నాకు భలే ఆశ్చర్యం. బుజ్జి మేకకు కూడా మనలా ఇష్టాలు ఉంటాయనే ఆ చిట్టితల్లి గమనింపు చూసినప్పుడు తనలో ఓ అమ్మ మనసు, ఓ ప్రియమైన దోస్తు కనిపించింది. ఇది కదా బంగారు మనసున్న బాల్యం.
ఇలా ఈ బుజ్జి కన్నమ్మ పెద్దవుతూ వస్తోంది.బుజ్జి మేక కూడా పెద్దదయ్యింది.

ఆ ఊరిలో బొడ్రాయి వేస్తున్నారు. ఊరు ఊరంతా హడావుడి.పుట్టింటికి ఆడబిడ్డలతో పాటు చుట్టాలు పక్కాలు రావడంతో ఎటు చూసినా సందడే సందడి. ఊరిలో చేస్తున్న యజ్ఞ యాగాలతో ఊరంతా పండుగ వాతావరణంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఆ సమయంలో బుజ్జి కన్నమ్మ ఎంతో ప్రేమగా పెంచుకున్న మేకను బలి ఇవ్వాలని ఇంట్లో తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారట. ఆ విషయం తెలిసిన బుజ్జి కన్నమ్మ పసి మనసు ఎంతగా తల్లడిల్లి పోయిందంటే…నా దగ్గరకు వచ్చి విషయం చెప్పి భోరు భోరున ఏడ్వడం మొదలుపెట్టింది.

“టీచర్! టీచర్! మా అమ్మోళ్ళకి నా మేకను బలి ఇవ్వొద్దని మీరన్న చెప్పండి టీచర్! అది నా దోస్తు
దాన్నేం చెయ్యొద్దని చెప్పండి టీచర్!” అనుకుంట ఒకటే ఏడుపు. కన్నమ్మను అలా చూస్తుంటే గుండెను పిండేసినట్టు అనిపించింది. ఆ కన్నమ్మ బాధను చూడలేక పోయాను.వాళ్ళ అమ్మను పిలిపించి బుజ్జి కన్నమ్మ పడుతున్న బాధ గురించి చెప్పాను. “ఆ మేకను దేవుని కోసమే ప్రత్యేకంగా పెంచాం.కాబట్టి బలి ఇవ్వక తప్పదు.అలా చేయకపోతే అపచారం అవుతుంది మేడం” అంది.

వాళ్ళకున్న నమ్మకాలను ఎన్ని ప్రయత్నాలు చేసినా సడలించలేమని,ఎంత చెప్పినా వినరని అర్థమైంది. ఆ బుజ్జి కన్నమ్మను ఎలా ఓదార్చాలో తెలియలేదు. వారం రోజులు జ్వరం కూడా వచ్చింది. ఆ పసి హృదయం చాలా గాయపడింది.మనిషి చాలా చిక్కి పోయింది. ఆ మూగ ప్రాణి గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని తలుచుకుని ఏడ్చేది. మళ్ళీ మామూలు మనిషి కావడానికి చాలా రోజులు పట్టింది.
పిల్లలకు సున్నితమైన మనసు ఉంటుందని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. తరగతి పాఠాల్లో మూగ జీవాలను ప్రేమతో దయతో చూడాలని చదువుకుని,వాటిని పెంచుకునే పిల్లలపై ఇలాంటి సంఘటనలు ఎలాంటి ప్రభావం చూపుతాయో అర్థమై ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు కలుక్కుమంటుంది.

చిట్టితల్లినే రాణిని చేస్తే…

కొంత మందికి నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి కాబోలు.ఎందుకంటే మా బడిలోని బుజ్జి బుజ్జి కన్నమ్మలలో కొందరు తమ చుట్టూ ఉన్న పిల్లల్ని,తరగతిలో ఉన్న పిల్లల్ని తమ కనుసన్నల్లో తాము చెప్పినట్లు వినేలా అందరినీ అదుపాజ్ఞలో పెట్టడం చూస్తుంటే రాబోయే తరానికి కాబోయే ఏ ఇందిరా గాంధీ, దుర్గాబాయి దేశ్ ముఖ్,సిరిమావో బండారు నాయిక లాంటి ఆనాటి మేటి నాయకురాలి వలె ఏ గొప్ప నాయకురాలో అవుతుందని అనిపించేది.
ఇంతకీ ఈ బుజ్జి కన్నమ్మ పేరు చెప్పలేదు కదూ! పేరు మానస.
నేను పనిచేసినది కాంప్లెక్స్ స్కూల్లో.కాబట్టి ఏదైనా అర్జెంట్ ఆఫీస్ వర్క్ ,సాలరీ బిల్స్ ,మధ్యాహ్న భోజన బిల్స్,మరింకేదైనా సమాచారం పంపే హడావుడి ఉన్నప్పుడు “పిల్లలు అల్లరి చేయకుండా చూడమని మానసకు చెబితే చాలు” అని మా టీచర్లు అందరం అనుకునే వాళ్ళం.

ఇంతకీ బుజ్జి కన్నమ్మ మానస పిల్లలు అల్లరి చేయకుండా ఏం చేసేదో చెబుతాను.పిల్లలలో ఓ మాదిరి తెలివితేటలు ఉన్న వారిని, అంతకంటే తక్కువగా ఉన్న వారిని జట్లుగా చేసి కృత్యాలు ఇచ్చి నోరెత్తి అల్లరి చేయకుండా హోం వర్క్ రాసుకుంటూ నిశ్శబ్దంగా ఉండేలా చూసేది.ఇలా అన్ని తరగతుల పిల్లలకు
మా ఉపాధ్యాయులకైతే తనో వండర్ కిడ్.పిల్లలను అలా కూర్చోబెట్టడం తనకు మాత్రమే సాధ్యమయ్యే పని.
అలా ఏడు తరగతుల విద్యార్థులను వారి తరగతుల్లోంచి కదలకుండా కొంచెమైనా అల్లరి చేయకుండా కూర్చోబెట్టడం గురించి మా టీచర్లం తరచూ మాట్లాడుకుంటూ ఆ అమ్మాయి బంగారు భవిష్యత్తును ఊహించుకునే వాళ్ళం.
ఆ బుజ్జి కన్నమ్మ ఇప్పుడు ఏం చేస్తుందో…ఎక్కడ ఉందో తలచుకున్నప్పుడల్లా కళ్ళ ముందు ఆ పసి రూపమే కదలాడుతూ ఉంటుంది.

Written by Urimalla Sunanda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)

మాతృమూర్తి వందనం