వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)

ఉసిరి కాయ తో ఉప్పావ

ఉప్పావ అంటే ఎంత మందికి తెలుసు!
కొంత మంది నువ్వుల ఆవ అంటారు.

మనము ఎక్కడికి వెళ్లి వచ్చినా, ఎన్ని రకాల ఆహార పదార్థాలను రుచిచూసినా, నోట్లో నీరు ఊరేది మాత్రము ఆవకాయను చూస్తే మాత్రమే కదా! ఇక ఏ వంటకమైనా దీని మీదికి వస్తుందా?

నాలుగైదు రోజులు ఏ ఊరికైనా వెళ్లి ఇంటికి వస్తే, గబగబా అన్నం వండేసుకుని ఇంట్లో ఉన్న ఆవకాయ వేసుకుని తింటే ఆహా! ఇంకేం కావాలి? అనిపిస్తుంది

మరొకటి ఆవకాయ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు. అవన్నీ పిచ్చి మాటలు పట్టించుకోవద్దు. అది నిలువ ఉండటం మూలాన దానిలో మంచి బ్యాక్టీరియా పెరిగి, జీర్ణక్రియకు కూడా ఉపయోగపడుతుంది.

మరొకటి మనం ఆవకాయ కలుపుకోగానే ఫస్ట్ నోట్లో నీళ్లు ఊరుతాయి. అందులో డైజెస్టివ్ ఎంజైమ్స్ చాలా ఉంటాయి. అవి జీర్ణక్రియకు ఉపయోగపడతాయి. కాబట్టి మొదట ఆవకాయ అన్నం తినడం శ్రేష్టం. మన శాస్త్రంలో భోజనం చేసే క్రమాన్ని చక్కగా వివరించారు.

ఆవకాయ తర్వాత, పప్పు కూర రసం చివరగా పెరుగు. ఇవి తిన్న తర్వాత వేరే వాటి మీదకి దృష్టి వెళ్తుందా! మళ్ళీ రాత్రి వరకు కడుపులో హాయిగా ఉంటుంది.

సరే విషయానికి వస్తాను. ఉసిరికాయలతో మామూలు ఊరగాయ అందరూ పెట్టుకుంటారు. కానీ నేను ఉప్పావని ట్రై చేశాను.

ఉప్పు అంటే ఉప్పు ఒకటే కాదండోయ్! అన్ని వివరించాల్సి వస్తుంది..

ఉసిరికాయలు మీ ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని తీసుకోండి. అర కేజీ అనుకోండి.

నువ్వుల పొడి తయారు చేసి పెట్టుకోండి. అలాగే ఆవాల పొడి, ఉప్పు ఇంట్లో ఉంటుంది దానికి కొత్తగా చెప్పనవసరం లేదు. కాకపోతే అయోడైజ్డ్ ఉప్పు వాడకూడదు. నూనె పోపు దినుసులు ఇవి చెప్పాలా!

ముందుగా బాణలి పెట్టుకుని కొంచెం నూనె వేసి, ఉసిరికాయలు వేసి మూత పెట్టి మగ్గించాలి. చిదిమితే మెత్తగా అవ్వాలి.

ఇప్పుడు దాన్ని చల్లార్చనిచ్చి అందులో చిన్న గ్లాస్ నువ్వుల పొడి అంతే సమానంగా ఉప్పు, ఆవాల పొడి, కొంచెం జీలకర్ర మెంతిపొడి వేసి బాగా కలిపి, నూనె కాచి చక్కగా ఇంగువ వేసి పోపు వేయండి.

మూడు రోజులు అలాగే ఉంచి తర్వాత జాడీలో పెట్టుకోవచ్చు.

పిల్లలు కారం తినరు కాబట్టి పిల్లల కోసం ఇది తయారు చేసుకోవచ్చు. నేను మా మనవడి కోసం తయారు చేశాను. మీరు ఎవరైనా చేసుకుంటారనీ అలా ఉసిరికాయ ఆవకాయ చూపిస్తున్నా. మీరు కూడా ఉసిరికాయ ఆవకాయ పెట్టుకోండి కొసిరికొసిరి కాదు.. వలసినంత పెట్టుకోండి సూపర్ అంటే సూపర్..

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Happy Women’s Day

పసిదనంతో ప్రయాణం (కాలమ్)