ఒక పండితుని యింట పుట్టి , ఒక పండితుని యింట మెట్టి , ఒక పండితుని చేపట్టిన
వీణాగాన విశారద శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి.

1955వ సం॥లో జన్మించిన జయలక్ష్మి గారు వైణిక విద్వాంసులైన శ్రీ పప్పు సోమేశ్వరరావు
గారి కుమార్తె . ఇంటిలో స్త్రీలు విద్య నేర్చినట్లయితే పిల్లలు కూడా నేర్చుకుని ప్రవీణులవుతారని ,తద్వారా పారంపర్యమైన వీణా వాద్య విద్య కుటుంబంలో నిలిచి యుండి భావి తరాలలో కొనసాగాలనే ఉన్నతమైన ఆశయం గల కుటుంబం వీరిది . వీరి కుటుంబంలో అందరూ వీణాగానంలో ఉన్నత శ్రేణి కళాకారులే. పిన్న వయసు నుండి వీణావాదనం వింటూ పెరగటం వలన జయలక్ష్మిగారికి వీణ యందు అభిరుచి, అధ్యయనము నందు ఆసక్తి కలిగాయి .
జయలక్ష్మిగారు వివాహమునకు పూర్వం తండ్రిగారి వద్ద వీణావాద్యంలో ప్రాధమికమైన శిక్షణను పొందారు.
ప్రఖ్యాత వీణావిద్వాంసులైన శ్రీ అయ్యగారి సోమేశ్వరరావు గారి జ్యేష్టపుత్రుడు, ప్రముఖ వీణా విద్వాంసులు అయిన శ్రీ అయ్యగారి శ్యామ సుందర్ గారితో జయలక్ష్మిగారి వివాహం జరిగింది .
వివాహానంతరం భర్త గారి వద్ద వీణా గానము నభ్యసించి అన్ని మెళకువలూ క్షుణ్ణంగా నేర్చుకుని ఉన్నత శ్రేణి కళాకారిణి గా రూపొందారు . కుమార్తె కళ్యాణిని ,కుమారుడు ఆదిత్యని మంచి కళాకారులుగా తీర్చిదిద్దారు .వీరిరువురూ అమెరికాలో వీణా వాద్యమును వ్యాప్తి చేయుచున్నారు . మనుమరాండ్రు లాస్య , శ్రియ ఇరువురూ వీణను అభ్యసించుచూ చురుకుగా ముందుకు సాగుచున్నారు.
జయలక్ష్మిగారి పుట్టినింట , మెట్టినింట అందరూ వీణావిద్వాంసులగుట విశేషము.
వీణావాద్య విద్యా సముపార్జనలోనూ , శిష్యులకు శిక్షణ నిచ్చి కళాకారులుగా తయారు చేయుటయందును దీక్ష కలిగినవారై , వీణావాదనమునందు ప్రత్యేకమైన స్థానముకలిగిన విజయనగర బాణీ వీణను ముందు తరాల వారికి అందించుటకు
వీరు చేయుచున్న కృషి శ్లాఘనీయము.
జయలక్ష్మిగారు భర్తగారైన శ్యామసుందర్ గారికి అనేక ప్రదర్శనలలో సహకార వాద్యాన్ని అందించి అపారమైన కచేరీ అనుభవాన్ని సంపాదించారు . ఆల్ఇండియా రేడియో లో ఉన్నత శ్రేణి కళాకారిణి గా అనేక మారులు రాగం , తానం, పల్లవి కార్యక్రమంలో వాయించి మెప్పు పొందారు.
భర్తగారితో కలిసి జంటగానూ , విడిగానూ ఆకాశ వాణి లోనూ , దూరదర్శన్ లోనూ అనేక మార్లు వాయించారు . అనేక బిరుదులను పొందారు.
గురువుగారి పట్ల మిక్కిలి శ్రద్ధా భక్తులు కలిగిన జయలక్ష్మి గారు శిష్యులందరికీ మార్గదర్శకులై యున్నారు .
వీణ నేర్చుకునే విద్యార్థులకు జయలక్ష్మి గారి సూచనలు ఇలా చెపుతూఉంటారు .
‘వీణా విద్యాభ్యాసంలో తలిదండ్రుల ఆసక్తి , సహకారము చాలా అవసరం.ఇవి ఉన్నప్పుడు విద్యార్థులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో పట్టు వదలని శ్రద్ధతో సాధన చేయడానికి అవసరమైన వాతావరణం ఏర్పడి వారు శీఘ్రగతిలో ముందుకు సాగుతారు.

సంగీత విద్యార్థులు నిరంతర సాధన తో పాటుగా సంగీత కచేరీలు వింటూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. గురువు పట్ల గౌరవాభిమానాలు శిష్యులను మెరుగుగా తీర్చి దిద్దుతాయి .
లలిత కళలను అభ్యసించడం వలన మనసు సున్నితంగాను మెదడు పదును గానూ తయారవుతుంది ‘.
గురువు ఎనలేని వాత్సల్యము, శిష్యులను అభివృద్ధి లోకి తేవాలన్న సంకల్పము కలిగి యుండాలంటారు ఆవిడ .
ఐదేళ్ళ వయసు లోనే వీణాభ్యాసం ప్రారంభించి పదవ తరగతికి వచ్చేవరకు సాధన చేసి పట్టు సాధించి ఒక దశకు రాగలిగితే తరువాత పిల్లలు తమంతట తామే అభ్యాసాన్ని కొనసాగించి అభివృద్ధి సాధించగలరని జయలక్ష్మిగారి అభిప్రాయం.
జయలక్ష్మిగారి సూచనలన్నీ అమూల్యమైనవి, అనుభవ పూర్వకమైనవి,ఆచరణీయమైనవి.
శిష్యుల పట్ల ఆవిడ మాతృవాత్సల్యము , స్నేహవాత్సల్యము గలవారై విద్యయందు వారి శక్తి యుక్తులను వెలికి తీసుకుని వచ్చి అనుక్షణం వారిని పై స్థాయికి తీసుకుని వెళ్ళడానికి నిరంతరం ఎనలేని కృషి సలుపుతూ ఉంటారు. శిష్యులకు విద్యా బోధన తో పాటుగా అన్ని విధములుగా సహాయ సహకారాలను అందిస్తూ ఆత్మీయమైన బంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు.

జయలక్ష్మిగారు స్నేహశీలి . ఆవిడ ఎప్పుడూ తన చుట్టూ వాతా వరణాన్ని ఆహ్లాద కరంగా ఉంచుతారు . తన జ్ఞాపకాల దొంతర నుంచి అనేక హాస్యభరిత సన్నివేశాలని అందరితో పంచుకుని ఆనందిస్తూ ఉంటారు . నవ్వుతూ నవ్విస్తూ
ఉండటం ఆవిడ సహజ లక్షణం. జీవితం భగవంతుడు ప్రసాదించిన వరంగా భావిస్తూ,
తృప్తిగా ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ ముందుకు సాగిపోయే అపురూపమైన వ్యక్తిత్వ సంపద కలిగినవారు జయలక్ష్మిగారు.
బంధుమిత్రులతో , శిష్యులతో సాదర భావంతో మెలగుతూ అందరికీ చేయూతనిస్తూ అందరి మన్ననలూ పొందుతున్న సద్గుణశీలి జయలక్ష్మి గారు . గాన కళావిపంచి జయలక్ష్మిగారు గృహిణి గా, భార్యగా ,తల్లిగా , శిష్యురాలిగా , గురువుగా , స్నేహితురాలిగా నిండైన వ్యక్తిత్వముతో, మెండైన గుణ సంపదతో అందరికీ ఆదర్శముగా నిలిచే మహిళామణి.
