అంతర్ముఖీనులు కావాలి

8- 3- 2025 తరుణి పత్రిక సంపాదకీయం

సహనం, ఓర్పు, ఓరిమి, క్షమ ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయపదాలు అయినట్టే వీటితో పాటు చేర్చగలిగిన మరో పదం స్త్రీ. అందుకే స్త్రీలను సహన శక్తిలో భూమాతతో పోలుస్తారు. ఒక భారతదేశమనే కాక ప్రపంచ వ్యాప్తంగా తరతరాలుగా స్త్రీలు పితృస్వామ్య వ్యవస్థల వల్ల తమ అస్తిత్వాన్ని కోల్పోతూ వచ్చారు. ఆయా దేశకాల రచనలు ఈ విషయాన్ని నిర్ధారించాయి.

భూమాత కూడా సహనాన్ని కోల్పోతే కంపించి విలయాన్ని సృష్టిస్తుంది. అదేవిధంగా అనేక హింసలు, అవమానాలు, అణచివేతలకు గురైన స్త్రీలు ఆ అసహనం నుండి ఉవ్వెత్తున ఎగసి తమలోని జ్ఞాన కాంతిని లోకానికి పంచారు. శారీరకంగా పురుషుల కంటే బలహీనులైన స్త్రీలు మానసిక పరిపక్వతలోను, మేధస్సులోను మగవారికి తీసిపోమని ఒక్కొక్క రంగాన్ని ప్రభావితం చేస్తూ వచ్చారు.

స్త్రీల అద్భుత నిర్వహణా దృక్పథ సామర్థ్యమే

మానసికంగానే కాదు శారీరకంగా కూడా వారితో సమానమేనంటూ వర్తమాన కాలం నిరూపిస్తున్నది.

“Women is the perfect architect of society”

గొప్ప నిపుణత కలిగిన శిల్పిగా సమాజాన్ని నిర్మించడంలో స్త్రీ పాత్ర అమోఘం. మరణయాతనను అనుభవిస్తూ ప్రాణాన్ని పణంగా పెట్టి సృష్టికి మూలమై, కుటుంబ వ్యవస్థలో అన్ని పాత్రల్లో తానై, నిరంతర సేవాపరాయణగా తన జీవితాన్ని త్యాగం చేస్తుంది. ఈ విషయంలో ఆమెకు ఆమే సాటి. అయినా ఇప్పటికీ అన్నింటా స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షత

ఎంత మాత్రం సమర్థనీయం కాదు. దీనికి ప్రభుత్వాలనో, రక్షణ వ్యవస్థనో, చట్టాన్నో తప్పు పట్టాల్సిన పనిలేదు. ఉద్యమాలు, విప్లవాలు కొంతవరకు మార్పు తెస్తాయేమో కానీ అవి తాత్కాలికమే. వ్యక్తిగతంగా మనుషుల్లో మార్పు రావాలి.

మరోవైపు… స్త్రీలే బాధలు పడుతున్నారా? స్త్రీల చేత బాధింపబడుతున్న పురుషులు కూడా లేరా? అనే ప్రశ్న ఉదయించక మానదు. అది నూటికి నూరుపాళ్లు నిజం. మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా, వార్తాకథనాల వల్ల ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తున్నాయి. స్త్రీలైనా పురుషులైనా వివేకం, విచక్షణ, మానవత్వం, ఆత్మగౌరవం, సమాజశ్రేయస్సుల గురించి ఆలోచించినట్లైతే అమానవీయ సంఘటనలు జరుగకుండా మనలను మనం, తరువాతి తరాలను

కాపాడుకోగలం. మనిషిలోని ఏదో ఒక బలహీనత సమాజంపై విపరీత ప్రభావాన్ని చూపి దుష్పరిణామాలకు దారితీస్తుంది. అందుకే ముందుగా ఎవరికివారు మనసు లోతుల్లోకి తొంగిచూసుకోవాలి. తనను తాను దుష్టమైన తలంపులకు దూరంగా ఉండాలి. తాత్కాలిక ప్రయోజనం, సుఖాల కొరకు మనసులో కలిగే బలహీనతలను జయించాలి. అప్పుడే శ్రేయస్కరమైన సమాజాన్ని చూడగలం.

మగువలూ ఆలోచించండి!! మీ అస్తిత్వానికి భంగం రాకుండా కాపాడుకుంటూ, మీ మేధస్సుతో అత్యుత్తమ శిఖరాగ్రాలను చేరుకుంటూనే…. త్యాగనిరతికి, సహనశీలతకు, ప్రేమైక మూర్తిమత్వానికి, అమృతమయమైన మాతృత్వానికి, విశిష్టమైన స్త్రీత్వానికి భంగం వాటిల్లకుండా అంతర్ముఖీనులై వ్యక్తిత్వ విలువలను కాపాడండి.

అందరికీ….అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు 18 వ భాగం

సుధీర