మన మహిళామణులు – ఆచార్యా సరస్వతి నిమ్మ

సంస్కృతమే జీవితం, వేదగురుకులమే స్వప్నం

1978 సంవత్సరంలో హైదరాబాద్‌లో జన్మించిన ఆచార్యా నిమ్మ సరస్వతి గారు, భారతీయ సంస్కృతి, సంస్కృత భాష, వేద సంప్రదాయాల పరిరక్షణ మరియు ప్రచారానికి తన జీవితాన్నే అంకితం చేసిన విద్యావేత్త, సంస్కృత అధ్యాపకురాలు, వైదిక పురోహితురాలు, ప్రేరణాత్మక వక్త. ఆమె తండ్రి ప్రముఖ హోమియో వైద్యులు డా. ఎ.ఎన్. నరసింహ గారు, తల్లి శ్రీమతి సత్యవతి గార్ల చిన్నకూతురు సరస్వతి గారి బాల్యం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది.
ఆమెకు కేవలం ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే తండ్రి మరణించడం కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయితే ఆ లోటు ఆమె జీవితాన్ని నిరాశ వైపు నడిపించలేదు. విద్యనే జీవితానికి మార్గదర్శకంగా స్వీకరించి, జ్ఞానసాధననే తన జీవిత ధ్యేయంగా చేసుకున్నారు. చిన్నప్పటి నుంచే సంస్కృతంపై ఏర్పడిన ఆసక్తి ఆమెను అసాధారణమైన విద్యా ప్రయాణం వైపు నడిపించింది.

వారి అన్నయ్యల ప్రోత్సాహంతో వేద విద్యను అభ్యసించేందుకు కాశీకి వెళ్లే అదృష్టం ఆమెకు లభించింది. అక్కడే సంస్కృత విద్యాప్రయాణానికి నిజమైన పునాది పడింది. రెండు సంవత్సరాల తరువాత ఢిల్లీ సమీపంలోని హర్యానా సరిహద్దులో ఉన్న నరేలా గురుకులంలో చేరి సుమారు నాలుగున్నర సంవత్సరాలు గురుకుల విద్యను అభ్యసించారు. అక్కడ సంస్కృతంతో పాటు ఇతర విషయాలను కూడా బోధించినప్పటికీ, ఆమె మనసు మాత్రం పూర్తిగా సంస్కృత శాస్త్రాలపైనే కేంద్రీకృతమైంది.
“నేను ఇంత దూరం వచ్చింది సంస్కృతాన్ని లోతుగా నేర్చుకోవడానికే. ఇతర విద్య ఎక్కడైనా లభిస్తుంది. కానీ సంస్కృత శాస్త్రాల అసలు సారం వేదగురుకులంలోనే లభిస్తుంది” అనే ఆలోచన ఆమె జీవితానికి మార్గనిర్దేశం చేసింది.
అదే సమయంలో శ్రీ శ్రీ శ్రీ మునికల్ప ఆచార్య ఆనందప్రకాశ్ గారి వద్ద కేవలం శాస్త్రాధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చే గురుకుల విధానం ఉందని తెలిసింది. కుటుంబ సభ్యుల అనుమతితో వారి శిష్యరికంలో దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు శిక్షాశాస్త్రం, వ్యాకరణశాస్త్రం, ఛందశాస్త్రం, నిరుక్తశాస్త్రం, వివిధ దర్శనశాస్త్రాలను లోతుగా అభ్యసించే అరుదైన అవకాశాన్ని పొందారు.
ఆ కాలంలో కుటుంబంలో ఇద్దరు అన్నయ్యల వివాహాలు జరిగినప్పటికీ, విద్యాభ్యాసానికి భంగం కలగకూడదనే సంకల్పంతో ఆ వివాహాలకు కూడా హాజరుకాలేదు. విద్యను ఆమె కేవలం ఉపాధి సాధనంగా కాకుండా తపస్సుగా భావించారు. గురువుల అనుగ్రహం, క్రమశిక్షణ, అంకితభావంతో సాగిన ఆ విద్యాసాధనే నేడు ఆమె వ్యక్తిత్వానికి బలమైన పునాదిగా నిలిచింది.
వేదవిద్య పూర్తయిన తరువాత సమాజంలో వేదగురుకులాల విద్యకు సరైన గుర్తింపు లేదనే విషయాన్ని ఆమె గమనించారు. వ్యాకరణాచార్య, నిరుక్తాచార్య వంటి విద్యార్హతలను చెప్పినప్పుడు చాలామంది వాటి విలువను అర్థం చేసుకోలేక “బి.ఏ చేశారా? ఎం.ఏ చేశారా?” అని ప్రశ్నించేవారు. దీనిని ఒక సవాలుగా స్వీకరించిన ఆమె, వేదవిద్యతో పాటు విశ్వవిద్యాలయ విద్యను కూడా అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. అనంతరం మైసూరు విశ్వవిద్యాలయం మరియు కాకతీయ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో పీజీ పూర్తి చేసి గురుకుల విద్యా సంప్రదాయాన్ని ఆధునిక విద్యతో సమన్వయం చేశారు.
2002 సంవత్సరంలో డిగ్రీ కళాశాల అధ్యాపకురాలిగా ఆమె బోధనా జీవితం ప్రారంభమైంది. గత ఇరవై మూడు సంవత్సరాలుగా సంస్కృత అధ్యాపకురాలిగా సేవలందిస్తూ వేలాది మంది విద్యార్థులకు సంస్కృత భాష, భారతీయ సంస్కృతి, వేద సంప్రదాయాలు, భారతీయ శాస్త్రాల విలువలను పరిచయం చేశారు.
కళాశాల బోధనకు మాత్రమే పరిమితం కాకుండా సంస్కృత ప్రచారాన్ని జీవిత లక్ష్యంగా స్వీకరించారు. సంస్కృత శిక్షణా కేంద్రాల ద్వారా పిల్లలు, యువత, మహిళలు, పెద్దలకు సంస్కృతాన్ని మాట్లాడటం, చదవడం, రాయడం ఎంతో సరళమైన పద్ధతిలో బోధించారు. పాఠశాలల్లో పనిచేసే సంస్కృత ఉపాధ్యాయులకు చిన్నపిల్లలకు సంస్కృతాన్ని ఆసక్తికరంగా బోధించే విధానాలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు.
ఆమె వద్ద సంస్కృతం అభ్యసించిన అనేక మంది విద్యార్థులు నేడు సంస్కృతంలో పీజీ పూర్తి చేసి వివిధ విద్యాసంస్థల్లో అధ్యాపకులుగా సేవలందిస్తున్నారు. తన శిష్యులు గురువులుగా ఎదిగి మరెందరికో సంస్కృతాన్ని బోధించడం ఆమె దృష్టిలో అత్యంత గొప్ప గురుదక్షిణ.
ప్రతి సంవత్సరం షామీర్‌పేట్ మండలంలోని అలియాబాద్‌లో ఉన్న ఆర్షశోధ సంస్థానం (కన్యా గురుకులం)లో నిర్వహించే వేసవి శిక్షణా శిబిరాల్లో సేవలందిస్తూ సంస్కృతంతో పాటు భారతీయ సంస్కృతి, సంస్కార విలువలను బోధిస్తున్నారు. అంతేకాక భారతీయ ప్రాచీన యుద్ధ విద్యలైన కర్రసాము, కత్తిసాము వంటి విద్యలను కూడా నేర్పిస్తూ శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందేలా శిక్షణ అందిస్తున్నారు.
ఆమె దృష్టిలో విద్య అంటే కేవలం పుస్తక జ్ఞానం కాదు; సంస్కారం, క్రమశిక్షణ, సేవాభావం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం కలిసినప్పుడే అది సంపూర్ణ విద్యగా మారుతుంది.
కరోనా అనంతరం విద్యారంగంలో వచ్చిన మార్పులను అవకాశంగా మలుచుకొని ఆన్‌లైన్ బోధనను ప్రారంభించారు. దేశ విదేశాల్లోని విద్యార్థులకు సాంకేతికత ద్వారా సంస్కృతాన్ని చేరవేస్తూ తన విద్యాసేవను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేసారు. 2023 అగస్ట నుండి కేరళలోని బాలికల వేద గురుకులంలో ప్రధానాచార్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తూ వేద–సంస్కృత విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అదే సమయంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో వివిధ వయస్సుల విద్యార్థులకు సంస్కృత భాష, వ్యాకరణం, శాస్త్రాలను బోధిస్తూ నిరంతర విద్యాసేవ కొనసాగిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సంస్కృతాభిమానులను చేరుకోవాలనే లక్ష్యంతో “Samskrita Dhara” యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి సంస్కృత వ్యాకరణం, శ్లోకాల వివరణలు, భారతీయ సంస్కృతి, శాస్త్రాలు, సనాతన ధర్మం వంటి అనేక అంశాలపై నిరంతరం వీడియోలను అందిస్తున్నారు.
సంస్కృత బోధనతో పాటు వైదిక పురోహితురాలిగా వేదోక్త విధానంలో హోమాలు, యజ్ఞాలు నిర్వహిస్తూ షోడశ సంస్కారాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. అలాగే విద్యార్థులు, యువత, మహిళలు మరియు వివిధ వర్గాల ప్రజలకు భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, జీవన విలువలు, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం వంటి అంశాలపై ప్రేరణాత్మక ఉపన్యాసాలు అందిస్తూ సమాజంలో విలువలతో కూడిన జీవన విధానాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు.
ఆమె సంస్కృత సేవకు అనేక సన్మానాలు లభించినప్పటికీ, తన శిష్యులు సమాజానికి ఉపయోగపడే గురువులుగా ఎదగడమే తనకు అత్యంత గొప్ప పురస్కారమని ఆమె విశ్వసిస్తారు.
ఈ సేవా ప్రయాణంలో ఆమె కుటుంబం కూడా బలమైన అండగా నిలిచింది. భర్త శ్రీ నిమ్మ అరవింద్ రెడ్డి గారు, కుమారుడు నిమ్మ యశోవర్ధన్ రెడ్డి సంస్కృతం పట్ల విశేషమైన అభిమానం కలిగి ప్రతి కార్యక్రమంలో ఆమెకు సహకరిస్తూ, ప్రోత్సాహం అందిస్తున్నారు.
అయితే ఆచార్యా సరస్వతి గారి జీవితంలో ఇంకా నెరవేరాల్సిన ఒక మహత్తరమైన సంకల్పం ఉంది. భారతీయ ఋషులు నిర్మించిన గురుకుల విద్యా విధానాన్ని నేటి కాలానికి అనుగుణంగా పునరుద్ధరించడం ఆమె జీవిత లక్ష్యం. అయితే అది కేవలం వేద పఠనానికే పరిమితమైన వేదగురుకులం కాదు. ఆర్ష విద్యతో పాటు ఆధునిక విద్యను సమన్వయం చేసే ఒక ఆదర్శ వేదగురుకులాన్ని స్థాపించి, సంస్కృతం, వేదాలు, భారతీయ శాస్త్రాలు, యోగా, సంస్కారం, వ్యక్తిత్వ వికాసంతో పాటు ఆధునిక విద్యను కూడా బోధించి భారతీయ విలువలతో కూడిన భావితరాలను తీర్చిదిద్దాలని ఆమె ఆకాంక్ష.
ఈ మహత్తరమైన కార్యానికి సమాజ సహకారం, సంస్కృతాభిమానుల భాగస్వామ్యం, దాతల ప్రోత్సాహం అవసరమని ఆమె నమ్మకం. ఆధునికవేదగురుకుల స్థాపనకు అనువైన స్థలం, భవనం లేదా ఇతర రూపాల్లో సహకరించే వారు ముందుకు వస్తే, భారతీయ సంస్కృతి, ఆర్ష జ్ఞానం, ఆధునిక విద్య కలిసిన ఒక ఆదర్శ విద్యా కేంద్రాన్ని నిర్మించేందుకు తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఆచార్యా నిమ్మ సరస్వతి గారి జీవితాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే—”సంస్కృతం ఆమె వృత్తి కాదు; ఆమె జీవితం. నేర్చుకోవడం ఆమె తపస్సు, బోధించడం ఆమె సేవ, వేద సంప్రదాయాన్ని ఆచరించడం ఆమె ధర్మం, సమాజానికి స్ఫూర్తినివ్వడం ఆమె జీవిత సంకల్పం.”
భారతీయతను, వేదగురుకుల పరంపరను, ఆర్ష జ్ఞాన సంపదను భావితరాలకు సజీవంగా అందించాలనే ఈ మహోన్నత లక్ష్యంతో ఆమె విద్యాసేవ నిరంతరం కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)

ఒడిపిళ్ళు 33 వ భాగం