ఒడిపిళ్ళు 33 వ భాగం

ధారావాహిక నవల

ఆకాశంలో మేఘాలు ఉరుము తున్నాయి. గోటీల గతం జ్ఞాపకాలు గుండెను కొరుకుతున్నట్టుగా మళ్ళీ బాధిస్తున్నాయి. వర్షం చిరుజల్లులుగా పడింది. చాలా రోజులుగా పెద్ద వర్షం కురిసిందే లేదు. ఇప్పుడు వర్షం కొనసాగుతోంది. ఆకాశం రోగిలా ఆకుపచ్చని బూడిద రంగులో ఉన్నది. సూర్యుడు కనిపించడం లేదు.

గోటీలందరూ ఒక్క చోట గుంపులుగా చేరి బాధాకరమైన వర్షంలో ఆశ్రమంలో ముడుచుకొని వణుకుతూ ఉన్నారు. వరద గుడిసెల ముందు ఉద్ధృతంగా ఉరకలు వేయడాన్ని వారంతా గట్టు మీద కూర్చుని వర్షపు నీటి చూస్తున్నారు. వారు కాలుస్తున్న చుట్టల పొగ నల్లటి మేఘంలా కనిపిస్తుంది. కొన్నిసార్లు వర్షం వెలిసినట్లు అనిపించినా, నీటీలో ఆకృతులు వికృతంగా సుడిగుండాల వంటి ఆ నీటిలో కొత్త రూపాలను సృష్టిస్తున్నాయి. వర్షం చేస్తున్న సవ్వడి ఎడతెగకుండా వారి చెవుల్లో మారుమోగుతోంది. కూర్చున్న చోటు నుండి కదలకుండా వారు ముచ్చట్లు పెడుతున్నారు. ఎవరూ కూడా తమ భవిష్యత్తు గురించి ఊహించలేకపోతున్నారు. ఈ వర్షం ప్రతిదానిని మసకగా మార్చి తికమక పెడుతుంది.

ఆకాశం మొత్తం కిందికి దొర్లుతున్నట్టు అనిపిస్తోంది. రోజంతా మసక వెలుతురుతో ప్రకృతికి దయ్యం పట్టినట్టుగా ఉన్నది. మధ్యాహ్నానికి సాయంత్రానికి విడిగా తేడా కనిపించడం లేదు. అంతా కలిపి దూరంగా వర్షం నృత్యం చేస్తున్నట్టుగా ఉన్నది. నింగీ నేలా కలిసిపోయి కుండపోతగా వర్షం అలలు అలలుగా కురుస్తోంది. కొండలపై ఎటుచూసినా వర్షం అల్లుకొని కొండ శిఖరాలపై కొత్త ఆవిరి వెండి తెర

కప్పినట్టుగా మేఘాలు కనిపిస్తున్నాయి. కొన్నిసార్లు వర్షం తగ్గినట్టు అనిపించి ఏటవాలుగా జల్లు చిమ్ముతోంది. వర్షం ఒక వెండి పరదాలా చుట్టుకుని ముందుకు సాగుతున్నట్టున్నది. వర్షం కోసం ఎదురు చూసిన వారికి అంతు లేని ఒక రోదన భూమి నుండి ఎగిసినట్టు, నిట్టూరుస్తూ మొదలై దేనినో వెతుకుతున్నట్లుగా ఎడతెగని వర్షం వేధిస్తున్నట్టు ఉంది వాన. చినుకులు పెద్ద పెద్ద చెట్ల నుండి ఆకులతో సహా రాలుతున్నాయి.

ఈ వాతావరణంలో కూడా గోటీలందరికీ విశ్రాంతి లేదు. వారంతా గుంపులు గుంపులుగా నానిన భూమి మీద పని చేస్తున్నారు. బురద అంతా వారి శరీరాల మీద చిమ్ముతుంది. గిరిజనులంతా వారి చర్మాలకు మొక్కల నూనెలను అడవి మందులను రాసుకుంటారు. అవి వారిని ఆ చలి నుండి కాపాడుతాయి అని నమ్ముతారు. వర్షం నుండి రక్షణ కోసం తాటి ఆకులు ఖర్జూర ఆకులతో కొప్పెర వంటి దానిని కప్పుకున్నారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఆ భయంకరమైన వర్షం నుండి వారిని తడవకుండా కాపాడలేక పోతున్నాయి.

వారి కాళ్లు చేతులు యాంత్రికంగా కదులుతున్నాయి. వారి ఆలోచనలు బురద జిగటతో కలిసి ఉన్నాయి. తీగకు వేలాడగట్టి గుంజుతున్నట్టు నొప్పి కొన్నిసార్లు వారిని బాధిస్తుంది.

సోమ్లా తన కొడుకు భూక్యాతో “చూడు కొడుకా! ఈ భయంకరమైన వర్షంలో నీ చెల్లెళ్ళు తడిసి ముద్దయి ఉంటారు” అన్నాడు.

“వాళ్ళ గురించి మనం ఏం చేయగలం ? నాన్నా” అని కొడుకు సమాధానమిచ్చాడు.

“నేను దాని గురించే ఆలోచిస్తున్నాను భూక్యా, షావుకారుతో మరొకసారి మనం మాట్లాడితే బాగుంటుంది” అన్నాడు తండ్రి.

“భూమి గురించేనా ?-మనం ఇంతకు ముందు చాలాసార్లు ఆ పని చేసాం. ఇప్పుడు వద్దు కానీ, నా వద్ద మరొక మంచి ఆలోచన ఉన్నది. మనం మాహువా పూలతో (ఇప్ప పూలతో) సారా బట్టి పెడదాం. ఈ వాతావరణంలో దానిని అమ్మడం సులువుగా ఉంటుంది. కావలసినంత సురక్షితం కూడా, ఈ వర్షంలో ఎవరూ వచ్చి మనని పట్టుకోలేరు” అన్నాడు భూక్యా.

“మూర్ఖంగా ఆలోచించకు. ఇంతకు ముందు జరిగింది సరిపోలేదా భూక్యా? నువ్వు మళ్ళీ అదే ప్రయత్నిస్తే మన తండా బారిక్ లు ఎవరో ఒకరు నీ గురించి చెప్తారు. వద్దు కొడుకా, కేవలం ఆ భూమి మాత్రమే మనను ఈ కష్టం నుండి బయటపడటానికి సాయం చేస్తుంది. భూమి మాత్రమే జీవితం కాదు. పోతే పోనీ ఆ భూమిని. అన్నింటినీ పోగొట్టుకున్నా మనమంతా మన సొంత గుడిసెలో కలిసి ఉండాలి. ఆ ఆనందమే వేరు. మనం మన ఇంట్లో ఉపవాసాలు ఉంటామని కాదు. కానీ ఇప్పుడు చూడు మనం ముగ్గురం ఇక్కడ, ఉన్నాము బానిసలుగా కాళ్లు చేతులు కట్టబడి. పాపం ఆడపిల్లలు అక్కడ ఆకలితో చస్తున్నారు. నేను మళ్ళీ ఒకసారి షావుకారు దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను” అన్నాడు సోమ్ల.

“మంచిది నాన్న” అన్నాడ భూక్యా. ఇంక ఆ రాత్రికి మాట్లాడడానికి ఏమీ లేదు. ఎవరికి వారు తమ ఆత్రుతలు వెంటాడుతుండగా ఆలోచనలలో ప్రయాణించారు.

టిక్యా ఒక్కడే ఏ చింతా లేకుండా తాను పరుచుకున్న గడ్డి పడకమీద వెచ్చగా నిద్రించాడు.

మరుసటి రోజు ఉదయం సోమ్లా షావుకారు దగ్గరికి వెళ్ళాడు ఆరోజు నాటవలసిన మొక్కజొన్న విత్తనాలను అడగడానికి. కొంత మొహమాటంతో ఇబ్బంది పడుతూ మాటలు కొనసాగించి చివరికి ధైర్యం చేశాడు..

“నా భూమి గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా షావుకారు” అన్నాడు.

“ఏ భూమి” అని షావుకారు మెల్లకన్నుతో పద్దులు చూస్తున్న పుస్తకము నుండి పైకెత్తాడు చూపును.

“ఓ నీవు అంటున్నది నీ భూమి తనఖా పెట్టుకోవడం గురించా ? ఎందుకు తొందర. అంతేకాక నాకెందుకు ఇంకా ఎక్కువ భూమి” అన్నాడు.

“అంటే నీవు నా భూమిని తనకా పెట్టుకోవడానికి అంగీకరించడం లేదన్నమాట” అన్నాడు సోమ్లా.

“నా ఉద్దేశం ఏమిటంటే నీతో వాదనకు నా వద్ద సమయం లేదనీ. నీ పని చూసుకో పో వెళ్ళి” అన్నాడు షావుకారు.

“అయితే నన్ను ఒక రెండు రోజులు మా ఊరికి వెళ్ళనివ్వండి. అప్పుడు నేను వేరే వారితో మాట్లాడి ఆ భూమిని గురించి నిర్ణయిస్తాను షావుకారూ” అన్నాడు సోమ్లా.

“మంచిది దాని గురించి తరువాత ఆలోచిద్దాం. ముందు నువ్వు పని లోకి వెళ్లి పని చూడు” అన్నాడు.

సోమ్లా వాడిపోయిన ముఖంతో, బరువెక్కిన హృదయంతో పనిలోకి వెళ్ళాడు.

షావుకారు ఏదో ఒక రకంగా నిర్ణయం తీసుకుంటాడు భూమిపట్ల ఉదాసీనతను నటిస్తూ చాలా సమయాన్ని వృధా చేశాడు. ఇప్పుడు వెళ్లి ఆ భూమిని చూడాలనుకున్నాడు. వాస్తవానికి తనకు కావలసినంత భూమి ఉన్నప్పటికీ, వేరే భూములను పొందాలని అనుకుంటాడతను. ఆ భూమి కొండ పక్కన ఉన్నది కనుక నారింజ తోటలు, కాఫీ తోటలు ఇంకా కూరగాయలు పండించడానికి చాలా అనువైనది.

ఆ రోజు సాయంత్రం డోంబ్ బారిక్ ను పిలిచి సోమ్లా పొలాన్ని చూసి రమ్మని పురమాయించాడు. భారిక్ తిరిగి వచ్చి “అది చాలా విలువైన పొలం. దాన్ని పోనివ్వకండి షావుకారూ” అన్నాడు.

మరుసటి రోజు పొద్దున షావుకారు సోమ్లాను పిలిపించాడు “చూడు సోమ్లా నేను ఏమి అనుకుంటున్నాను అంటే ఒకసారి వెళ్లి నీపొలాన్ని నేను చూడాలి నాతోపాటు మీరు కూడా వచ్చి మీ పొలాన్ని చూపించండి. కానీ ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను భూమిని కోరుకోవడం లేదు. ఒకవేళ నీ భూమిని తీసుకున్నా కొద్ది మొత్తాన్ని మాత్రమే నీకు అప్పుగా ఇవ్వగలను” అన్నాడు .

సోమ్లా చాలా సంతోషించాడు.

“విన్నావా భూక్యా! షావుకారు బహుశా మన భూమి కావాలనుకోవడం లేదు. కానీ ఒకసారి చూస్తాడట. తరువాత తప్పనిసరిగా దస్తావేజులు రాసుకుని భూమి తనకాతో ఎంతోకంత డబ్బు ఇస్తాడు. దానితో నా బిడ్డలను ఇంటికి తీసుకు రాగలను” అన్నాడు సోమ్లా కొడుకుతో.

ఆ రాత్రంతా అనూహ్యంగా పెద్ద వర్షం కురిసింది. దట్టమైన చీకటి ముంచివేసింది. గాలి ఊల పెడుతూ గోటీలు ఉండే గుడిసెలోకి దూరుతోంది. గోటీలు నక్కలు తమ బొరియల్లో దూరినట్లు వారి గుడిసెల్లో దూరారు. అందులో వెలుగుతున్న దీపాలను గాలి మలిపేసింది. పొయ్యిల్లో నుండి మిణుగురులు గాలికి లేసి అటు ఇటు ఎగురుతున్నాయి.

సోమ్లా ఆనందంతో రాబోయే కాలాన్ని గురించి ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత నిద్ర పోయాడు టిక్యా నిద్రలో గురక పెడుతున్నాడు. కానీ భూక్యా మేల్కొని అన్నింటిని అవగాహన చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తప్పనిసరిగా తమ భూమిని షావుకారు ఏదో ఒక రకంగా తీసుకుంటాడు. ప్రతి ఒక్కరూ తమ భూములను అతనికి ఇచ్చిన తర్వాత ఒక అంగుళం కూడా తిరిగి పొందలేరు. ఇంకా ఎప్పటికీ బానిసలుగానే శారీరక శ్రమ చేయాలి. అయితే షావుకారి దగ్గర, లేదంటే తమ గ్రామాల్లో.

ఉన్నట్టుండి ఆ రాత్రి తనకు ఊపిరాడకుండా అయినట్లు అనిపించింది అతనికి. వర్షపు గాలి అతని శరీరాన్ని కొరికేస్తోంది. కమ్లీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ భూమి ఉంటే మాత్రం ఇంట్లో కూడా ఇక్కడిలానే నేల మీద పడి మెలుకువతో దొర్లుతూ ఉండాలి. లేదంటే యువకుల డార్మెటరీ లోకి వెళ్లి డుంగుడుంగా వాయిస్తూ గడపాలి. అప్పుడు కమ్లీ తిరిగి వస్తుందా తన వద్దకు. ఆ వాయిద్యం మోతకు మేల్కొని తన దగ్గరగా వచ్చి, తన ఒడిలో ఒదిగి , తన వాయిద్యానికి అనుగుణంగా కూని రాగాలు తీస్తూ, తన మామూలు ఫిర్యాదులను తన చెవిలో గుసగుసలాడుతూ “నన్ను ఎప్పుడు వివాహం చేసుకుంటావు భూక్యా, నీ ప్రమాణాలన్నీ అబద్ధాలే” అంటుందా.

ఎంత భయంకరమైనదా రాత్రి అతని చెవిలో వేలకొద్ది శబ్దాలు మారుమోగుతున్నాయి. ప్రపంచమంతా నిద్రలోకి జారుకున్నది. నిలకడలేని అంతంలేని పీడకలలు అతన్ని చుట్టుముట్టాయి. కానీ అతని కంటికి ఏమీ కనబడలేదు. అతని జ్ఞాపకాల లోతుల నుండి, కమ్లీ బయటకి వస్తోంది అతడు లేచి కూర్చుని తడుముతూ ఆ చీకట్లో తన డుంగుడుంగా మీటుతూ పాడడం మొదలు పెట్టాడు:

“ఓ నా ప్రియమైన జాయ్ పుష్పమా

నాజూకైన నా ప్రియురాలా

నాకు ప్రియమైన మల్లె మొగ్గా

తళుకులతో పరిమళాలతో

నల్లని నిగనిగలాడే దట్టమైన

నీ కురులలో అల్లుకుపోయి

నక్షత్రాల వంటి

తెల్లని పువ్వులు ధరించి

నువ్వు నాకోసం తిరిగి వస్తావు

నాకు తెలుసు”

అతని స్వరం చాలా వింతగా ఆర్ద్రంగా వర్షాన్ని మించిన శబ్దంతో సాగుతోంది. అతని కన్నులు అరమోడ్పులై ఆనందాన్ని పొందుతూ, అతని ముఖం చిరునవ్వుతో వెలిగిపోతోంది. అతను పాడుతున్న పాట పాత జ్ఞాపకాలను కదిలిస్తూ ఆనందాన్ని కలిగిస్తోంది. అందరి ప్రేమికుల ప్రణయ కలహాలు, రహస్య కలయికలతో, కమ్లీతో తను కలిసిన తీరు. అన్నీ కలవరించాడు.

పాట అయిపోయింది అతని స్వరం కొంచెం కొంచెంగా తగ్గిపోతూ గుసగుసలాడుతూ కమ్ల నామస్మరణ చేస్తూన్నది.

ఆ వర్షపు రాత్రి నల్లటి చీకటిలో దడ దడ లాడే ఉరుములలో ఒంటరిగా మిగిలిపోయాడు. కమ్లీ అతడిని మోసగించి వెళ్ళిపోయింది. అతను వాన శబ్దాన్ని వింటూ కూర్చుండిపోయాడు. అతని గుండెలో నుండి దుఃఖం తన్నుకు వచ్చింది. ఉరుములతో పాటు వర్షంలో అతని హృదయం చేసే శోకరాగం కలిసిపోయింది. మళ్లీ కమ్లీ ముఖం కళ్ళముందు కదలాడింది. ఆమె సుపరిచితమైన నవ్వు అతనిని మరింత గాయపరిచింది. ఇంకా ఎక్కువగా ఏడ్చాడు. తర్వాత అతని ఆలోచనలు అన్నీ మారిపోయాయి.

పోనివ్వు భూములు, ఇళ్లు, మిగిలినవన్నీ షావుకారు తన సొంతం చేసుకోనీ. అతని సంతోషమంతా అంతమై పోయింది. కమ్లీ ఇక ఎప్పటికీ తనది కాదు. అని నిరాశలో మునిగిపోయాడు.

*** *** *** *** ***

జూన్ నెల సగం గడిచి పోయింది. షావుకారు తన చిన్న గుర్రంపై సోమ్లా పొలాలను తనిఖీ చేయడానికి బయల్దేరాడు. అతని వెనకాల సోమ్లా, భూక్యా అనుసరిస్తున్నారు. అది వారికి చాలా బాధాకరమైన అవమానం, ఆ విధంగా గ్రామానికి తిరిగి రావడం. ఒకప్పుడు వారు తల పైకెత్తి గౌరవంగా నడిచేవారు. ఇప్పుడు వారి అడుగులు చాలా నెమ్మదిగా, భుజాలు కుంగిపోయి, ముఖం కిదకు దించి నడుస్తూన్నారు. కానీ వారు వాటిని భరిస్తూ చివరి వరకు నడవాలి.

సోమ్లా చాలా ఆసక్తిగా ఉన్నాడు. తన ఇంటిని చేరుకోవడానికి కలిగిన అవకాశం ఇంతకుముందు ఒకసారి ఇతరుల వల్ల జారిపోయింది. ఇప్పుడా ఇల్లు కాళీగా పై కప్పు ఖాళీలు చిల్లులు మడి, మట్టి గోడలు ముక్కలు ముక్కలుగా రాలి, నేలంతా కలుపు మొక్కలు గడ్డి పెరిగిపోయి ఉన్నది.

ఇంటి మీదికి ఏదో తుఫాను వచ్చి పోయినట్టు కనిపిస్తున్నది. బాధతో శోకిస్తూ రాగం పెడుతున్నట్టు ఉన్నది.

ఇరుగుపొరుగువారు అతనిని చూసి పలకరించడానికి వచ్చారు. కానీ షావుకారును ఎందుకు తీసుకొచ్చావు అని అడిగారు. అతడు తన పొలాల్లోకి నడిచాడు. అతని వెంట ఆసక్తిగా వ్యాఖ్యానాలు చేస్తూ మిగిలిన వారు అనుసరించారు. కొందరేమో తనకు తాను తెచ్చుకున్న కష్టాలకు తృప్తి పడకుండా మనకు కూడా కష్టాలు తెస్తూన్నాడేమో అన్నారు.

షావుకారు పొలమంతా కలయే తిరుగుతూ చాలా తెలివిగా అంచనా వేసుకున్నాడు. అవును ఏటవాలు పొలం అద్భుతంగా ఉంది నారింజ పండ్ల తోట వేయడానికి. పీఠభూమి వంటి మైదాన ప్రాంతం గోధుమ పండించడానికి ఉత్తమమైనది. లోతుల్లో తేమ కలిగిన భూమి చెరకు పంటకు అనువైనది అనుకున్నాడు.

ఉన్నట్టుండి షావుకారు సోమ్లా, భూక్యాల వైపు తిరిగి,

“వంచకులారా ” అంటూ అరుస్తూ “ఈ భూమిని చూడడానికా నన్ను ఏబది మైళ్ల ఈడ్చకొని వచ్చారు. ఇక్కడ చూస్తే ఏమీ లేదు” అన్నాడు.

“కానీ షావుకారు భూమి చాలా మంచిది. మేము అబద్ధం చెప్పలేదు” అన్నాడు సోమ్లా శాంతంగా.

పొలం నుండి బయటకు వచ్చి తన గెలుపును చాటడానికి. షావుకారు పాదయాత్రగా గ్రామంలో ప్రవేశించాడు. అతని చేతివేళ్ళు తన మీసాలు చివరలను సూదిమొన లాగా సన్నగా మెలి పెడుతూ ఉన్నాయి. అతని కళ్ళు అవిశ్రాంతంగా అందరి ఇళ్ళ గోడల వైపు పరిశీలిస్తున్నాయి. గ్రామంలోని స్త్రీలు ఆగి ఆ కొత్త మనిషిని చూస్తున్నారు. షావుకారు కొందరిని వెనుకకు తిరిగి తదేకంగా చూస్తున్నాడు. కొంతమంది పిల్లల గుంపు షావుకారు గుర్రం వెనుక పరుగులు పెడుతున్నారు.

కమ్లీ ఏం జరుగుతుందో చూడడానికి, బయటకు వచ్చింది. భూక్యాను చూసి పరిగెత్తుతూ వచ్చి, అతని వైపు చూసి నవ్వింది. కానీ భూక్యా నోరు తెరిచి, ఆమెను గుర్తించనట్టు చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడైన షావుకారు ఆగిపోయి. చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. తన నాలుకతో పెదవులను తడి చేసుకుంటూ షావుకారు భూక్యాను అడిగాడు.

“ఆమె ఎవరు ?” అని.

కమ్లీ వెనుకకు తిరిగి గుంపు లోకి వెళ్ళిపోయింది.

షావుకారు దాదాపు గ్రామం చివరకు చేరుకున్నాడు. షావుకారును సోమ్లా ఒక రెండు రోజులు తన ఇంటి వద్ద ఉండేందుకు అవకాశం ఇమ్మని బ్రతిమిలాడాడు. ఊరి ప్రజల అందరి ముందు షావుకారును అడుగుతే తిరస్కరించడని ఆశతో. కానీ షావుకారు కనికరించలేదు. గ్రామస్తులంతా అతని వెంట ఊరి బయట వరకు అనుసరించారు.

ఊరు పెద్ద సోమ్లాతో “మంచి పని చేస్తున్నావు. ఏదో ఒక ఏర్పాటు మీ భూమి కోసం చేస్తున్నావు. కానీ గుర్తుపెట్టుకో భూమి పన్ను నువ్వే చెల్లించాల్సి ఉంటుంది” అన్నాడు.

“నేనేమి ఏర్పాటు చేయగలిగాను, ఖచ్చితంగా షావుకారు నా భూమిని తీసుకోడానికి అంగీకరిస్తాడని ఇంతవరకు నమ్మకమే లేదు. అయినా, నా భూమిని తనకాకు నువ్వే తీసుకోవచ్చు కదా” అన్నాడు సోమ్లా.

గ్రామ పెద్ద నిశ్శబ్దంగా తలాడించాడు.

తిరిగి తన ఊరికి వెళ్లి పోయిన తర్వాత షావుకారు సోమ్లాతో “సరే మంచిది నేను నీ భూమిని తీసుకుంటాను. కానీ నిబంధనల ప్రకారం మాత్రమే” అన్నాడు.

సోమ్లా తన షరతులను షావుకారుతో చెప్పాడు. ‘షావుకారు తన భూమిని తనకా కింద తీసుకొని, తమలో ఒకరిని విడుదల చేయాలి. దానిని రాతపూర్వకంగా రాసుకోవాలి. ప్రతి సంవత్సరం పది రూపాయల అప్పు చెల్లించాలి. మిగిలినది శారీరక శ్రమ ద్వారా గోటీలుగా ఇద్దరు పనిచేసి తీర్చుతారు’.

కానీ షావుకారు తిట్టడం మొదలుపెట్టాడు, అరిచాడు. సోమ్లా చెప్పినది అర్థవంతంగా లేదంటూ.

సాయంత్రం గడిచింది. ఒకరోజు గడిచింది. కొన్ని గంటలు, మాటలతో చర్చలతో గడిచిన తరువాత ఒక ఒప్పందం కుదిరింది. సోమ్లా విముక్తుడు అవుతాడు అతని కొడుకులిద్దరూ షావుకారు వద్ద గోటీలులుగా ఉంటారు. సోమ్లా ఇరవై ఐదు రూపాయలు చెల్లించిన తర్వాత భూమిని తిరిగి అప్పగించటం జరుగుతుంది. అప్పటివరకు అదంతా షావుకారి ఆదీనంలో ఉంటుంది.

అయితే రాతపూర్వకమైన ఒప్పందం ఏమీ జరగలేదు. గిరిజనుల పద్ధతిలో అంతా నోటి మాట పై జరిగింది. ఎవరూ సాక్షులు లేరు అక్కడ. షావుకారుకు పది మంది గోటీలు ఉన్నప్పటికీ. సోమ్లా ‘ధర్మూ’ అనే గోటీని పిలిచాడు, ఒకే ఒక్క సాక్షి అతడు. ఆ తర్వాత ‘భూమి దేవత’గా పిలవబడే ‘ధరిత్రిని’ సాక్ష్యంగా గిరిజన సంప్రదాయం ప్రకారం సోమ్లా బానిసత్వం ఆ క్షణం నుండి నిలిపివేయబడింది.

ఆ విధంగా ఒప్పందం చేయబడింది. కచ్చితంగా ఆ నిమిషం నుండి సోమ్లా పంట భూమి షావుకారు సొంతమైంది.

సోమ్లా లేచి బలిష్టమైన వెదురు కర్రను తన చేతి కర్రగా తీసుకొని, చీల్చబడిన వెదురు బద్దకు తనకు సంబంధించిన వస్తువులను వేలాడ గట్టుకొని ప్రయాణం చేసేందుకు సిద్ధపడ్డాడు.

ఇంటి ముఖం పట్టాడు. కానీ అతని గుండె బరువెక్కింది. ఏమి స్వేచ్ఛను పొందగలిగాను తాను అని ఆలోచించాడు. అతని కొడుకులిద్దరు ఇంకా రుణగ్రస్త బానిసలుగా మిగిలి ఉన్నారు.

అతని పంట పొలం షావుకారు పాలయింది. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. అతనికి ఎవరూ సహాయం లేరు. ఒంటరి వృద్ధుడిగా నిస్సహాయంగా శక్తినంతా కోల్పోయి మిగిలిపోయాడు.

*** *** *** *** ***

సోమ్లా ఇల్లంతా ఖాళిగా బావురుమంటున్నది. జడివాన కుండపోతగా కురుస్తూ కప్పు నుండి నీరు. కారుతూ ఉన్నది. అతడు తలదాచుకోను పొడినేల కరువైంది ఆ గుడిసెలో.

ఇంట్లో ఏమీ లేవు. కానీ కొన్ని పాత వస్తువులు, పగిలిన డుంగుడుంగాలు, చింపిరి గుడ్డలు, కొన్ని స్త్రీల దుస్తులు అన్ని బూజు పట్టి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఏ శబ్దాలు లేవు. కేవలం వర్షంలో తడిచిన గాలి చేసే మూలుగులు తప్ప. కనుచూపుమేర ఆకాశమంతా చీకటి వ్యాపించి, పగటిని కూడా మింగేసింది. కొన్నిసార్లు ఖాళీ వీధుల్లో ఒంగిపోయిన మనిషి ఏదో దొంగిలిస్తూ మసక చీకటిలో కలిసి పోయేవాడు. తడిచి చినిగిపోయిన పరుపును నేలపై పరుచుకొని సోమ్లా పడుకున్నాడు. తన చేతిని తలదిండుగా పెట్టుకొని. తనలో తాను నిరాశగా గొణుక్కుంటూ. ఒకవేళ వర్షం మధ్యలో ఆగినప్పుడు, అతడు లేచి పొయ్యి వెలిగించి తనకోసం తినడానికి ఏదైనా వండుకునే వాడు. లేదంటే చలిలో వణుకుతూ అలాగే పడుకొని ఉండేవాడు. అతన్ని చూసే వారెవ్వరూ లేరు ఒంటరిగా తన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉండేవాడు.

చాలా రోజులు గడిచాయి ఈ రకంగా. సోమ్లా తన బిడ్డలను ఇంటికి తిరిగి తీసుకొచ్చే వరకు సాగింది.

కానీ అతను ఏం చేయగలడు. తినడానికి ఏమి పెడతాడు. వాళ్ళు ఎలా బతుకుతారు. ఒకవేళ అతడు సాలీ, మాలీలను ఇంటికి తీసుకొస్తే, వాళ్లకు పంచడానికి ఆకలి బాధ తప్ప ఏమి మిగిలింది.

ఆ విధంగా అతడు చీకట్లో పడుకొని, ఆలోచిస్తూ ఉండగా సాయంకాలం నీడలు అతని ఆలోచనల్లో అల్లుకున్నాయి. అన్ని విధాల అతడు సరిచేయడానికి ప్రయత్నించాడు. కానీ విఫలమయ్యాడు, అన్నీ దుమ్ములో కొట్టుకుపోయాయి. కారణం ఏమిటో అతనికి అర్థం కాలేదు. ప్రతిదినం అతడు గిరిజన దేవతలను ప్రార్థించేవాడు. వారికి పావురాలను, కోళ్లను, మేకలను బలి ఇచ్చేవాడు. బలిపీఠం ముందు సాష్టాంగ నేల మీద పడి నమస్కరించేవాడు. పూజారులు అతని భక్తిని చాలాసార్లు మెచ్చుకున్నారు. అతనిని ప్రతి పండుగకు దీవించారు. ఏ విధంగా దేవుణ్ణి అతడు బాధపెట్టాడో, అతనికి అర్థం కాలేదు. కానీ దేవుళ్ళు అతనిని నాశనం చేశారు. ఇప్పుడు అతని అరుపులు వినకుండా, చెవిటి వాళ్ళ వలె ఉన్నారు. అతను మాత్రం తన కర్మకు ఒంటరిగా మిగిలి పోయాడు.

అతని శరీరము బుద్ధి మొద్దుబారాయి. గాలి గోల చేస్తున్నది. ఇంటి పై కప్పు గాలికి లేచి కింద పడి పోతున్నది. నిదురించిన అతను లేచి కూర్చున్నాడు. ఎవరైనా వస్తే బాగుండు అని ఆశపడ్డాడు. కానీ గోడలు కూలుతున్నట్టు డబ్బు మని శబ్దం వినపడింది. తుఫాన్ తన ఇంటిని కదిలించివేసింది. అతని పరిస్థితి వణుకు పుట్టిస్తోంది. తన శరీరాన్ని కాపాడుకోవడానికి మిగిలిన ఒకే ఒక్క ఇల్లు కూలిపోతూన్నది. అది కూడా తన శరీరంలో ఒక భాగం వంటిది. గాలి కొంచెం కొంచెంగా ఇంటిపై కప్పు గడ్డిని కొట్టుకు పోయేలా చేస్తోంది. అతడు కూర్చొని చూడడం తప్ప ఏమీ చేయలేక పోయాడు.

ఒక్కసారిగా అతడు లేచి కూర్చున్నాడు. ఏకాగ్రతగా వినడానికి ప్రయత్నించాడు. వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం గాలిలో తేలుతూ చీకట్లో చాలా దూరం నుండి ఏకాంత రాత్రి అతని వైపు వస్తోంది. చనిపోయిన తన భార్య గుర్తుకు వచ్చింది అతనికి. అది తప్పనిసరిగా ఆమె ఆత్మ రోదనే అనుకున్నాడు. అతడు తన నుదుటిని తడిచిన బురదనేలకు కొట్టుకున్నాడు. తన గొంతు బొంగురు పోయేలా గట్టిగా దేవుళ్లను ప్రార్థిస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు “మీరు ఎంత క్రూరమైన వాళ్ళు” అంటూ దేవుడిని నిందించాడు. కానీ పెద్ద శబ్దంతో గాలి మాత్రమే స్పందించింది.

*** *** *** *** ***

Written by Jwalitha

కవి, రచయిత, అనువాదకురాలు, ఫ్యామిలీ కౌన్సిలర్, సామాజిక కార్యకర్త, ప్రచురణకర్త, ప్రకృతి ప్రేమికురాలు, తెలంగాణ ఉద్యమ కారిణి అయిన జ్వలిత అసలు పేరు విజయకుమారి దెంచనాల.
‘బహళ’ అంతర్జాతీయ అంతర్జాల త్రైమాసిక మహిళా పత్రికను 2021నుండి నడుపుతున్నారు.
వీరి రచనలు-
కాలాన్ని జయిస్తూ నేను, సుదీర్ఘ హత్య, అగ్ని లిపి, సంగడి ముంత అనే నాలుగు కవితా సంపుటులు; ఆత్మాన్వేషణ, రూపాంతరం అనే రెండు కథల సంపుటులు; జ్వలితార్ణవాలు అనే సాహిత్య సామాజిక వ్యాసాల పుస్తకం; ఎర్రరంగు బురద, ఆత్మార్ణవం, జగన్నాటకం, ఒడిపిళ్ళు అనే నాలుగు నవలలు మొత్తం 11 పుస్తకాలు రచించారు. ముజహర్ నగర్ లో దీపావళి, ‘పరజ’ వంటి అనువాదాలతోపాటు, బహుజన కథయిత్రుల పరిచయం, మెరిసే అనువాదాలు, అనువాద నవలలు పేరుతో శీర్షికలను నిర్వహించారు.
స్వీయ సంపాదకత్వంలో ఖమ్మం కథలు, మల్లెసాల చేతివృత్తికథలు, కొత్తచూపు స్త్రీల కథలు, పరివ్యాప్త, సంఘటిత, రుంజ, కరోనా డైరీ, లేఖావలోకనం, గల్పికా తరువు, ఓరు వంటి పదో సంకలనాలను ప్రచురించారు. గాయాలే గేయాలై, పూలసింగిడి వంటి అనేక పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు.
మర్డర్ ప్రొలాంగేర్, వుండెడ్ లైవ్స్ పేరుతో వీరి కవిత్వం ఆంగ్లానువాద పుస్తకాలు వెలువడ్డాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు – ఆచార్యా సరస్వతి నిమ్మ

ఓ తల్లి పాడిన మనసులకు లాలి పాట…