ఓ తల్లి పాడిన మనసులకు లాలి పాట…

పాటలు ఎన్నో రకాలు. వెతలు పెంచేవి. వేడుక పంచేవి. ఎన్నో దారుల్లో పాట చోటు చేసుకుంటుంది. ఎన్నో సందర్భాల్లోకి పాట ప్రయాణం చేస్తుంది.

ఒక పాట పుట్టుక సహజమైనది కాగా, మరొక పాట వెనుక ఎంతో వేదన, ఆపరేషన్ అవసరమయ్యేంత శ్రమ ఉంటుంది. బహుశా అంత బరువుగా వెలికి వస్తుంది కనుకనేనేమో అలాంటి పాటలు మనసును చీకటిలా అలుముకుంటూనే వెన్నెలలా నిదురపుచ్చుతాయి. అటువంటి పాటే ‘ఓ భార్య కథ’ చిత్రంలోని వేటూరి వారి యీ అక్షరమాలిక పదాలహారతి.

పల్లవి : మనసులకు లాలిపాట
మన కథల జాలిపాట
రెప్పలేని కంటిపాపకి నా పాపకి
దూరాన ఉన్న తల్లి
గారాల జోల పాట…
పిల్లలకు దూరమైన ఒక తల్లి వేదనకు అక్షరరూపం ఈ గీతం. ఓ మాతృమూర్తి మౌనంగా చేసే లోలోపలి ఆర్తనాదం. అనుకోని పరిస్థితుల్లో ఒక చోట ఒక తండ్రి ప్రాణాన్ని కాపాడేందుకు, అదే చోట తల్లిని కోల్పోయిన ఒక పసికందు ఆలన చూసేందుకు తన బిడ్డలను వదులుకుని మరో ఇంట చేరి, ఆ పసికందుకు లాలి పాడుతూ, ఆ లాలనలో తన బిడ్డలను తలుచుకుంటూ కళ్ళలో నింపుకుంటూ, తన పిల్లల కన్నీళ్లను మోస్తూ, తనను తాను ఓదార్చుకుంటున్న అరుదైన సంఘటన. అందుకే మన కథల జాలిపాట అంటుంది బేలగా అతి ఆర్ద్రంగా.

‘రెప్పలేని కంటి పాపకి…’ఎంత చక్కటి పోలిక. తల్లిఒడి దూరమైన పిల్లలు రెప్పలేని కంటిపాపలేగా!

1చ : ఏ దేవుడి చేరాతలో నా పాపగా నిన్నుచేసే
నా దేవుడే చేజేతులా ఈ అమ్మనే బొమ్మచేసే
నీ దిక్కుగా నేనుండగా నా దివ్వె నీలోన మెరిసే
కన్నీటిలో కమలాలకై ఏ తుమ్మెదో వేచి చూసే
నా గీత ఓ గీతమై నా కంటి జలపాతమై
నీ తల్లిగా జోల నే పాడనా నీ డోల నేనూపనా..
జో జో లాలీ జో హాయీ జోజో…

కథను వ్యధలో నడిపించడంతో ఆగిపోలేదు రచయిత కలం. సన్నివేశాన్ని, ఆ పాత్ర మనోగతాన్ని, క్షోభను ఒక్క వాక్యంలో చెప్పేశారు. నా దేవుడే చేజేతులా ఈ అమ్మనే బొమ్మ చేసే…తాళి కట్టిన తన దైవం కారణంగానేగా ఈ స్థితి, అందుకే తనను తాను ప్రాణం లేని బొమ్మగా ప్రకటించుకుంటుంది ఈ అమ్మ.

ఈ సందర్భం ఒక భర్త స్వార్థానికి బలి అయిన ఓ భార్యది. పిల్లల ప్రేమను తల్లికి దూరం చేసి, డబ్బుకు తలవంచిన అతనిది. భార్యగా హక్కులు, సౌఖ్యాలు ఏ స్త్రీ ఆశించదు. భర్త ప్రేమ చాలు. ఒక తల్లిగా తన బిడ్డల లాలనలో సర్వం మరచిపోవాలని కోరుకుంటుంది. దాని పేరు కూడా స్వార్థమే అయితే అది అందమైన స్వార్థం. ఆరోగ్యకరమైన స్వార్థం. ప్రతి తల్లీ కావాలనుకునే స్వార్థం. కోరుకునే స్వార్థం. కానీ ఈ స్వార్థంలో ఎన్నో జీవితాలు ఉంటాయి. ఎంతో మనుగడ ఉంటుంది.

తరువాత వాక్యం మరో అద్భుతం. ‘నా గీత ఓ గీతమై…’ తన నుదుటి గీత ఈనాడు సంబంధంలేని కొత్త బంధమై ఈ గీతం పాడేలా చేయటం వెనుక స్థితి. తన కంటిపాపలను తలుచుకుని జలపాతాలైనాయి ఆ కళ్ళు. ఎంత ఉన్నతమైన భావవ్యక్తీకరణ.

అంతేనా! తను కన్న పసివెలుగులను, మరో తల్లి కన్న పసికందులో మెరుపులే అనుకోవడానికి ఆ స్త్రీకి ఎంత ఔన్నత్యం, హృదయవైశాల్యం కావాలి.

2చ : ఏ జన్మకి స్త్రీ జన్మమే నీకొద్దు నా చిట్టి తల్లీ
ఏకాకిలా ఓ కాకిలా మారింది ఈ కన్నతల్లి
ఈ కోవెల నాకో వెల తెచ్చింది ఈనాడు తల్లీ
నా వెన్నెలే ఆవేదనై పొంగింది నా కంట మళ్లీ
వాల్మీకి వారించినా వగచింది ఆ జానకి
నీ జోల కావాలి ఈ అమ్మకి నా తల్లిగా జన్మకీ…
రెండవ చరణంలో కథను ఇంకా ముందుకు తీసుకువెళ్తారు రచయిత మరింత గాఢంగా. ‘ఏకాకిలా ఉండటం ఓ శాపం అయితే ఈ కోవెల తనకో వెలను తెచ్చిందిట.’ వేటూరి గారూ! మీలోని సాహితీ సరస్వతికి వందనం. మాత కదా అందుకే మీ చేత అలా వ్రాయించింది.’

పరిస్థితులు ఎటు మలుపు తిప్పినా అవతల వారి అవసరానికి తన జీవితాన్ని పణంగా పెట్టడానికి కారణం భర్తకు డబ్బు మీద ఉన్న మమకారం. అదే ఆమె భరించలేని విషయం. బాధించే విషయం. అదే తనకు ఈనాడు యిలా వెల కట్టినా, ఒక తండ్రికి కూతురిగా, ఒక బిడ్డకు తల్లిగా అనురాగాన్ని పంచుతున్న – పంచుకుంటున్న ఈ కొత్త బంధంతో తాను చేరిన ఆ ఇంటిని కోవెలగా అభివర్ణించడం వెలలేని రచయిత అక్షరలావణ్యం.

నిజానికి లోకంలో ఏ వ్యక్తీ చెడ్డవాడు కాదు. పరిస్థితులు, బలహీనతలు, అవసరాలు వారిని అలా తయారుచేస్తాయి. మరొకరి జీవితాన్ని ఇబ్బంది పెట్టేలా, ఒకోసారి బాధ పెట్టేలానూ ఉంటాయి.

మౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఓ భార్య కథ’ చిత్రంలోని బాధతప్తమైన యీ సందర్భానికి అక్షరాలను కన్నీటి ఉలితో చెక్కి మన హృదయాలను కన్నీటిమయం చేసిన వేటూరిగారికి మనసారా మరోసారి వందనం. ఈ పాటకు తొలి నాయకుడు వారేగా! తమిళ రచయిత్రి అనురాధా రమణన్ రాసిన నవలను అరుదైన చిత్రంగా మలిచే యీ అవకాశం తీసుకున్న నిర్మాత శ్రీ రామోజీరావుగారికి అభివందనం.

ఇక బాలుగారు చాలా ఆర్తిగా స్వరకల్పన చేసి ఈ పాటపై మనకు మమకారాన్ని మరింత నింపారు. మనసుల్ని తడి చేశారు. చిత్రంలో ఈ పాట బాలు పాడిన వెర్షన్ కూడా ఉంటుంది, కేవలం పల్లవి మాత్రమే. ఆ పాటలో శరత్ బాబు నటన నిండుగా, హుందాగా ఉంటుంది.

ఈ గీతాన్ని ఎస్ జానకి గారు మనసుతో ఆలపించి మన మనసులకు కన్నీటిలాలి పాడారు. అక్షరమక్షరంలోనూ ఒక అశ్రురాగం పలికించారు. వారు పలికిన ప్రతి పదం లలితంగా, మార్దవంగా హృదయాల్ని స్పృశిస్తుంది. ప్రత్యేకంగా ‘దూరాన ఉన్న తల్లి’ అన్నచోట దూరాన్ని అతి భారంగా పలికి మన మదికి ఆ తల్లి వేదనను మనోదర్శనం చేసిన అనుభూతికి గురిచేస్తారు.

వెరసి ఈ పాట పుట్టుక వెనుక, చిత్రీకరణ వెనుక ఉన్న ప్రతి ఒక్క సాంకేతిక నైపుణ్యానికి హృదయపూర్వక అభినందనలు.

ఇక నటిగా జయసుధ అభినయం తారాస్థాయిలో ఉంటుంది. ఎంతో మానసిక క్షోభను భరించే పాత్రలో ఆమె జీవించారు. పాత్రను ఎంతగానో సొంతం చేసుకుంటే తప్ప సాధ్యం కాదది. ఏమైనా ఈ చిత్రం అనుకోగానే ఈ పాట గుర్తుకొస్తుంది. అదీ పాటకున్న శక్తి. పాటతో మనకున్న అనురక్తి.

పాట మొదట్లో ఆలాపనే అపురూపంగా అమ్మలోకంలోకి తీసుకువెళ్ళేలా చల్లగా ఉంటుంది. మనసులకు లాలి పాడిన ఓ భార్యకు కాదు ఒక తల్లికి-అమ్మతనానికి కన్నీటివందనం. మనసులపై లాలి సంతకాన్ని చేసిన ఈ పాటకు లాలనగా లాలి. తెల్లవారినా జారిపోని వెన్నెలలాంటి ఈ గీతానికి ఆ దైవమే ఆ తల్లిని ఒడిని చేర్చి లాలించే భావనలోకి జార్చిన ఈ భావాలకు వేనవేల జేజేల ఙోలలు….

Written by Modili Padma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు 33 వ భాగం