1. సోమనాథేశ్వర జ్యోతిర్లింగము
సోమనాథేశ్వర జ్యోతిర్లింగము గుజరాత్ ప్రభాసక్షేత్రములో ఉన్నది. దక్షప్రజాపతి బ్రహ్మ మానస పుత్రుడు. ఆయన గొప్ప భక్తి తత్పరుడు, శక్తి సంపన్నుడు. ఆయనకు 60 మంది కుమార్తెలు పుట్టారు. వారిలో మొదటి 27 మంది నక్షత్రాలుగా అనగా అశ్విని నుండి ప్రారంభమై రేవతి వరకు గల పేర్లతో మానవుల స్థితిగతులను మారుస్తూ ఉంటారు. ఈ 27 మంది అమ్మాయిలు పెరిగి యుక్త వయస్సుకు వచ్చారు. ఒకరోజు తండ్రి గారి వద్దకు వచ్చారు. దక్షుడు వారిని చూసి పిల్లలు యుక్త వయస్సుకు వచ్చారు వీరికి వివాహం చేయాలి అనుకొని ఆ మాటే వారితే అన్నాడు. వారు సిగ్గుపడుతూ, “నీకు అల్లుళ్ళను వెతికే శ్రమలేకుండా మేమందరము చంద్రుడుని ప్రేమించాము. చంద్రుడు కూడ మమ్మల్ని ప్రేమించాడు. కావున మాకు ఆయనతో వివాహం జరిపించమ”ని కోరారు. “ఇంతమంది ఒక్కరినే వివాహం చేసుకోవడం వలన భవిష్యత్తులో సవతి పోరుతో దెబ్బలాటలు వస్తాయి. ఇప్పుడు ఉన్నట్లు అన్యోన్యం గా ఉండలేరు”. అని వారికి నచ్చచెప్పాలని చూసాడు. “లేదు నాన్న గారు! ఇప్పుడు ఎలా ప్రేమగా, అన్యోన్యంగా ఉన్నామో అట్లే పెళ్ళి అయిన తర్వాత కూడ ఎప్పటికి దెబ్బలాటలు లేకుండా ఉంటాము” అన్నారు. చంద్రునితోనే మా అందరికి వివాహం జరిపించమని కోరగా, దక్షుడు చంద్రుని పిలిపించాడు..
చంద్రుడు వినయంగా దక్షుని దగ్గరకు వచ్చి తనను పిలిపించిన కారణం, తనకు తెలియనట్లే అడిగాడు. ”
నా కుమార్తెలు నక్షత్రాలు 27 మంది నిన్ను ప్రేమించామని, నీవు కూడా వారికి ప్రేమించినట్లు చెప్పారు. కావున నా కుమార్తెల కోరిక మేర వారిని నీకిచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను. కాని నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. వివాహం అయిన తరువాత నా 27 మంది కుమార్తెలను సమంగా ఏ పక్షపాతం లేకుండా అందరిని ప్రేమించి సంతోష పెట్టాలి” అని చెప్పాడు. దానికి చంద్రుడు అంగీకరించడంతో చంద్రునికి, తన కుమార్తెలకు వివాహం జరిపించాడు. వివాహం అయిన కొంతకాలం వరకు అందరి కుమార్తెలతో బాగానే ఉన్నాడు. ఇలా కొంతకాలం తరువాత తన 4 వ భార్య యైన రోహిణి పట్ల ఎక్కువ ప్రేమ కలిగి మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు. మిగిలిన కుమార్తెలందరు బాధపడి తండ్రి దక్షుడు దగ్గరికి వెళ్ళి తమ బాధను వెళ్ళక్కారు.
అప్పుడు దక్షుడు చంద్రుని పిలిచి “నేను ముందే చెప్పాను నా కుమార్తెలందరినీ నిష్పక్షపాతంగా చూడాలని, కాని నీవు నీ మాటను నిలబెట్టుకోలేదు. రోహిణి తప్ప మిగిలిన వారందరు దుఃఖిస్తున్నారు”. అనగా చంద్రుడు, “నా అపరాధాన్ని క్షమించండి. ఇకపై అలా జరుగదు. అందరినీ సమానంగా చూసుకుంటాను” అని మాట ఇచ్చాడు. కొద్ది రోజులు మాత్రము అందరిని ప్రేమగా చూసి మరల రోహిణి మీద మాత్రమే ఎక్కువ మక్కువ కలిగి మిగిలిన వారిని అసలు చూడడం మానేశాడు. కుమార్తెలందరూ మరల దక్షుని దగ్గరకు వెళ్ళి తమ గోడు చెప్పుకున్నారు. దక్షుడు కోపంతో చంద్రుని క్షయరోగగ్రస్తుడవై పొమ్మని శాపం ఇచ్చాడు. చంద్రుని కళలు తగ్గిపోయి బక్కచిక్కి క్షీణించి పోయాడు. చంద్రుడు రోగగ్రస్తుడైనందు వల్ల లోకంలో చీకట్లు కమ్ముకున్నాయి. పంటలు పండలేదు. వర్షాలు కురవ లేడు. భూగర్భ జలాలు ఎండిపోయాయి. ఔషధులు పండలేదు.
పత్తి పంట ఎండిపోయింది. వస్త్ర ములు చేయడానికి ప్రత్తి లేకుండా పోయింది. సోమలతలు పెరగక పోవడం వలన యజ్ఞంలో త్రాగే సోమరసం లేకుండా పోయింది. ఋషులు యజ్ఞాలు, యాగాలు మానేయడం వలన దేవతలు సకాలంలో వర్షాలు కురిపించలేకుండా పోయినందువల్ల క్షామం ఏర్పడింది. భూమి మీద తాపం ఎక్కువైపోయింది. మానవులు, దేవతలు, ఋషులు నీరసించి పోయారు.
దేవతలందరు బ్రహ్మ దగ్గరకు వచ్చి దక్షుడు చంద్రునికి ఇచ్చిన కోపం వలన లోకాలకు అంధకారం ఏర్పడింది. దీనికి తరుణోపాయం చెప్పమనగా …
“దక్షుడు నా భక్తుడు. భక్తుడు ఇచ్చిన శాపాన్ని వెనక్కుతీయలేను. చంద్రుడు కూడా కొన్ని తప్పులు చేసాడు. ఆతని శాపం తీర్చగల శక్తి శివునికి మాత్రమే ఉన్నది. పశ్చిమ సముద్రతీరంలో ప్రభాసక్షేత్రము ఉన్నది. అక్కడ మట్టి ఇసుక కలిపి పార్ధివ లింగము చేసి, ప్రతిరోజు సముద్రస్నానంచేసి, సముద్ర జలంతో పార్ధివలింగాన్ని అభిషేకించి తపస్సు చేసి నిరంతరాయంగా పూజ చేసి ఈశ్వరుని మెప్పించి నట్లయిన చంద్రునికి క్షయవ్యాధి తగ్గుతుంది”. అని చెప్పాడు.
వెంటనే దేవతలు చంద్రుడిని తీసుకొని ప్రభాస క్షేత్రమునకు వచ్చి ఒక చెరువు తవ్వి అందులో చంద్రుని చేత స్నానం చేయించి, పార్ధివలింగము తయారు చేయించి సముద్రజలంతో అభిషేకం చేస్తూ, అక్కడే ఉన్న ఇసుకతో పూజ చేస్తూ, ఈశ్వరుని మెప్పించి శాపవిముక్తి పొందమని చెప్పి వారి లోకాలకు వారు వెళ్ళిపోయారు. చంద్రుడు నిరంతరాయంగా ఆరునెలలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈశ్వరుని ఆరాధించాడు.
ఆశుతోషుడైన శివుడు చంద్రుని యొక్క భక్తికి మెచ్చి, కరుణించి వరాలు ఇచ్చాడు ఆతని క్షయరోగం తగ్గి పోయింది. తిరిగి చంద్రునికి కాంతి వచ్చింది. “నీ శాపాన్ని పూర్తిగా పోగొట్టలేను. నీ చంద్రకళలు పెరుగుతూ, తరుగుతూ ఉంటాయి. అమావాస్య తరువాత పాడ్యమి నుండి 15 రాజులు కళలు పెరుగుతూ శుక్ల పక్షమి గాను, పౌర్ణమి తరువాత పాడ్యమి నుండి 15 రోజులు కళలు తరుగుతూ.. కృష్ణ పక్షమిగాను ఉంటుంది”. అని చెప్పాడు. ఆ విధంగా అవకళ కొన్ని అమావాస్యల్లో కనపడుతుంది. కొన్ని అమావాస్యల్లో కనబడదు కొంచెం కళ కనబడే అమావాస్యను ‘సినీవాలి’ అని, కటిక చీకటి అమావాస్యను ‘కుహూ’ అని అంటారు. వృద్ధి చెందునపుడు అనగా శుక్ల పక్షమిలో తపస్సు బాగా లాభిస్తుంది. కృష్ణపక్షంలో జపం చేసేవారికి బాగా లాభిస్తుంది. కొన్ని ఉపాసనలు శుక్ల పక్షమిలో ఫలిస్తాయి . వివాహాదులు శుక్ల పక్షములో లాభిస్తాయి.
అప్పుడు దేవతలందరు అక్కడకు వచ్చి ఈశ్వరుని స్తుతించి తిరిగి లోకాలకు కాంతినిచ్చినందుకు చాలా సంతోషించి, ఈశ్వరునితో “నీవు పరమ దయగలవాడవు, చంద్రునికి శాప విముక్తి కలిగించి అన్ని లోకాలను రక్షించిన వాడవు. దేవతలను, మానవులను, ఋషులను అనుగ్రహించుటకు, ఈ పార్ధివ లింగములో నీ జ్యోతిని ప్రసరించి, కలియుగాంతం వరకు ప్రభాసక్షేత్రములో జ్యోతిర్లింగముగా అవతరించమ”ని కోరారు. ఈశ్వరుడు తథాస్తు అని దీవించి చంద్రుడు తపస్సు చేయడం వలన చంద్రునికి కూడ కీర్తి లభించేటట్లు సోమనాథ జ్యోతిర్లింగముగా అవతరిస్తానని తెలిపాడు.
“ఈ లింగము దర్శనం వలన క్షయ, కుష్టు, పాండు, బొల్లి మొదలగు రోగాలన్నీ పోతాయని, తీవ్రమైన రోగాలైతే ఆరు నెలలు ఆ క్షేత్రంలో నివసించి ప్రతిరోజు సముద్రంలో స్నానంచేసి సోమనాథ లింగమును దర్శించుకోవాలని చెప్పాడు. భక్తితో ఈ క్షేత్ర దర్శనం చేసుకొని అటు ఇటు నడిస్తే చాలు భూపరిభ్రమణ ఫలితాన్ని ఇస్తానని తెలిపాడు. ఈ క్షేత్ర దర్శనం వలన
సకల తీర్ధములు దర్శించిన ఫలితం వస్తుంద”ని తెలిపి అదృశ్యమైనాడు. ఈ విధంగా సోమనాథ జ్యోతిర్లింగం వెలిసింది.
2. శ్రీశైల మల్లికార్జున జోతిర్లింగము
శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగము ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉన్నది. శివ పార్వతుల కుమారులు గణపతి, కుమార స్వామి ఈ ఇద్దరిలో ఎవరికి గణాధ్యక్ష పదవి ఇవ్వాలనే ప్రశ్న వచ్చినపుడు ఎవరు భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి ముందు వస్తే వారికి ఇవ్వాలి అనుకున్నారు. కుమారస్వామి భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండగా, గణపతి తల్లితండ్రులకు ప్రదక్షిణ చేసి భూప్రదక్షిణ చేసిన ఫలితం పొంది శివపార్వతుల మెప్పు సంపాదించి గణాధ్యక్ష పదవిని కూడా పొందాడు. కుమారస్వామి తిరిగి కైలాసం చేరకుండానే వివాహం జరిగి ఇరువురు కుమారులు క్షేముడు, లాభుడు అనేవారు పుట్టారు. నారదుడు కుమారస్వామిని కలిసి “నీవు ఇక్కడ భూప్రదక్షిణ చేస్తూనే ఉన్నావు కానీ నీ అన్నగారు గణపతి మీ తల్లితండ్రులకు ప్రదక్షిణ చేసి గణాధ్యక్షపదవి పొందడమే కాకుండా, వివాహం కూడ చేసుకొని ఇద్దరు కుమారుల తండ్రి అయ్యాడు. నీకు మాత్రము విషయం చెప్పలేదు” అని అన్నాడు. కోపోద్రిక్తుడైన కుమారస్వామి కైలాసం వచ్చి తల్లితండ్రులకు నమస్కరించి “అన్నగారికి గణాధ్యక్ష పదవి ఇచ్చినపుడు గానీ వివాహం చేసినపుడు గానీ నాకు ఏ విషయం తెలియకుండా చేసారు. మీకు నేనంటే విముఖతగా ఉన్నది”. అని అలిగి తల్లితండ్రులు పిలుస్తున్నా వినకుండా భూలోకంలోని క్రౌంచ పర్వత ప్రాంతంలో ఉన్న అడవులకు వచ్చి సాధారణ మానవుని వలె జింక చర్మము కట్టుకొని జంతువులను వేటాడుతూ అడవిలో ఉన్న ఒక గుహలో ఉన్నాడు. ఆ అడవి అంతా రెల్లుపొదలతో, కౄరమృగాలతో భయంకరంగా ఉంది.
ఇప్పుడు ఆటకేశ్వర లింగము ఉన్నచోట కొంతమంది గిరిజనులు నివసిస్తూ ఉండేవారు. వారు జింకలను, అడవి పందులను వేటాడి వాసి మాంసం తింటూ వాటి చర్మాలు కట్టుకొని జీవించేవారు. ఒకరోజు కుమారస్వామి వేటాడుతూ ఈ గిరిజనులు ఉన్న ప్రాంతానికి రావడం తటస్థించింది. అక్కడ ఒక అందమైన గిరిజన స్త్రీని చూసాడు. ఆమెను చూడగానే ఆమె అందానికి ముగ్ధుడై “సుందరీ నీవెరవు? ఇక్కడ ఉన్న గిరిజనులలో మణిలా దేదీప్యమానంగా పెరిగిపోతున్నావు”. అని అడుగగా ఆమె ‘ఈ గిరిజన నాయకుడైన కిరాతరాజు పుత్రికను” అని అన్నది. “నీపేరేమి? నీలో నీతండ్రి పోలికలు ఏమీలేవు”
అని ప్రశ్నించగా “నాపేరు వల్లి . నేను ఆయన పెంపుడు కూతురును. ఆదిశేషుని కుమారుడైన కుముదుడి కుమార్తెను. కిరాత రాజు ఆదిశేషుని భక్తుడు. అతని భక్తికి మెచ్చి నన్ను కిరాతరాజు పెంచుకొనేందుకు ఇచ్చాడు ఆదిశేషుడు. నిన్ను చూడగానే నీతో ప్రేమలో పడ్డాను. నన్ను వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా” అని అడుగగా కుమారస్వామి ఇష్టమేనని చెప్పాడు. ” అయితే నా తండ్రి కిరాతరాజు దగ్గరకు వెళ్ళి ఆయనను ఒప్పించి నన్ను వివాహం చేసుకో” అని చెప్పింది.
కుమారస్వామ, కిరాతరాజు ఒప్పుకుంటాడో లేదో అనే దిగులుతో గుహకుచేరి అక్కడి నుండి 2,3 రోజులు బయటకు రాలేదు. విషయం అంతా తెలుసుకున్న ఈశ్వరుడు పార్వతితో “కుమారస్వామిని ప్రసన్నం చేసుకొనే సమయం ఆసన్నమయిందని, నేను ముందుగా వెళ్ళి సమయం చూసి నిన్ను పిలుస్తాను అప్పుడు నువ్వు రా” అని పలికి ఒక వృద్ధుడి వేషంలో కుమార స్వామి ఉండే గుహలోకి వచ్చి “ఏమి నాయనా? నిన్ను చూస్తే దేనికో దిగులుగా ఉన్నట్లు కనిపిస్తున్నావు విషయం చెబితే ఏదైనా సలహా ఇవ్వగలను” అనగా కుమార స్వామి తన ప్రేమ వృత్తాంతము తెలిపి “ఆమె తన తండ్రి అనునుతిలో మాత్రమే వివాహం చేసుకోవాలని చెబుతున్నది. కిరాత రాజు నాకు తన కూతురును ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకుంటాడో లేదోనని భయంగా ఉంది”
అన్నాడు.
అప్పుడు ఈశ్వరుడు “నీ నక్షత్రం కృత్తిక ఈ రోజు నీకు క్షేమతార కావున నీవు వెళ్ళి కిరాత రాజును కలిసి వల్లినిచ్చి వివాహం చేయమని అడుగు” అని చెప్పాడు. సరేనని కుమారస్వామి కిరాతరాజును కలిసి వల్లినిచ్చి వివాహం చేయమని అడిగాడు. “నీ తేజస్సు, నీ సుందర రూపం చూస్తే నువ్వు గొప్పవంశానికి చెందిన వాడివని నా కుమార్తెకు సరియైన జోడీ అని అనిపిస్తోంది. కానీ నా కూతురును నీకిచ్చి వివాహం చేయడానికి కొన్ని షరతులు ఉన్నాయి. వాటికి ఒప్పుకుంటే వివాహం చేస్తాన”ని చెప్పాడు. “ఏమిటా షరతులు?” అని అడుగగా కిరాత రాజు ఈ విధంగా చెప్పాడు… 1.”నీవు గిరిజన జాతిలోకి మారిపోవాలి నీ కట్టు బొట్టు అన్నీ మార్చుకోవాలి 2. నీ భాష, సంస్కృతి మార్చుకొని మా భాషను నేర్వాలి 3. నీ తల్లి తండ్రులు వచ్చి ఆక్షతలు వేసి దీవిస్తే గాని పెళ్ళి చేయను” అన్నాడు.
కుమారస్వామి తన కట్టు బొట్టు మార్చుకొని గిరిజన యువకుడిగా మారిపోయాడు. వల్లి కూడ ఒక షరతు పెట్టినది. “మేము నాగులము. నాగామృతం త్రాగినవారము. కావున నీవు కూడ నాగు
పాముగా మారితే వివాహం చేసుకుంటాను” అన్నది. దానికి కూడ సరేనని వెంటనే ఆరు తలలతో సుబ్రహ్మణ్యేశ్వరునిగా మారిపోయాడు. కాని తల్లి తండ్రులను ఎలా తీసుకురావాలనే ఆలోచనలో పడ్డాడు. వృద్ధ ఈశ్వరుడు మరల విచారంగా ఉన్న కుమారుని చూసి “ఏమి నాయనా? ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు. కిరాతరాజు పిల్లను ఇచ్చి వివాహం చేయడానికి ఒప్పుకోలేదా?” అని అడిగాడు. “నా తల్లితండ్రులు వచ్చి వివాహం జరిపిస్తే గాని పెళ్ళి చేయను అంటున్నాడు ఏమి చేయాలో తెలియడం లేదు” అని అన్నాడు. ‘నీ తల్లితండ్రులు వస్తారు’ అని చెప్పాడు.
ఈశ్వరుడు, పార్వతితో నువ్వు భూలోకానికి వచ్చే సమయం ఆసన్నమైనదని తెలిపాడు. దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కాలంలో అరుణాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మను గూర్చి తపస్సు చేసి మరణం లేని వరం ఈయమని కోరాడు. భూమి మీద పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని ఇంకేమయినా కోరుకోమనగా “ఆరు కాళ్ళు కలిగిన స్త్రీ జంతువు తన చెలికత్తె లయిన ఆరు కాళ్ళ స్త్రీ జంతువులతో కలిసి పెద్ద శబ్దం చేస్తూ ఉంటే నేను భరించలేనపుడు మాత్రమే ఆరుకాళ్ళ స్త్రీ జంతువు తనను చంపగలిగే వరాన్ని ఇవ్వమ”ని కోరాడు. అప్పటికి (6) ఆరు కాళ్ళ జంతువు పుట్టలేదుకదా అన్న ధీమాతో ఆ వరాన్నికోరాడు.
పార్వతీదేవి భూమి మీదకు వచ్చుటకు ఈ కారణాన్ని ఎంచుకొని ఆరు కాళ్ళ భ్రమర రూపం పొంది తన చెలికత్తెలైన భ్రమరాలతో ఝుమ్మని నాదాలు చేస్తూ అరుణాసురుని చుట్టూ తిరిగాయి. అరుణాసురుడు ఆశబ్దాన్ని భరించలేకపోయాడు. అతని చెవుల నుండి రక్తం స్రవించసాగింది. అదే సమయంలో పార్వతీదేవి భ్రమర రూపంలో అరుణాసురుని గొంతు కొరికి చంపివేసినది. అరుణాసురుని భవనంతో ఎత్తైన భవంతిలో అమ్మ ఉండిపోయినది. వృద్ధ ఈశ్వరుడు భ్రమరాంబగా వెలసిన పార్వతీదేవిని తన దగ్గరకు రమ్మని కోరగా మీరే పైకి రండి ఎవరైనా పైకిరావాలని కోరుకోవాలి గాని, నన్ను కిందకి రమ్మని అడగవద్దు అన్నది.
కుమారస్వామి క్రౌంచ పర్వత శిఖరం మీద కూర్చొని తల్లితండ్రులను భక్తితో ప్రార్ధించాడు. వెంటనే వృద్ధ ఈశ్వరుడు కోయరూపంలోను, పార్వతీదేవి గిరిజన యువతిగాను ప్రత్యక్షమైనారు. “నేను నా తల్లితండ్రులను పిలిస్తే మీరు వచ్చారు ఏమిటి?” అని అడుగగా, “ఇంతకి నీ పెళ్ళికి కిరాతరాజా- ఒప్పుకున్నాడా?” అనగా “నా తల్లి తండ్రులకే మొదటి శుభలేఖ ఇవ్వాలట అందుకే వారికోసం ప్రార్థిస్తున్నా.” అన్నాడు. అప్పుడు వృద్ధ ఈశ్వరుడు యువకుడిగా మారి, పార్వతీదేవితో కలిసి దర్శనం ఇచ్చాడు. కుమారస్వామి వారితో వెళ్ళి కిరాత రాజులను కలిశాడు. కిరాతరాజు తన కుమార్తె, వల్లి ఆదిశేషుని మనుమరాలు • ఇప్పుడు అల్లుడు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు అని తెలిసికొని ఎంతో సంతోషంతో వివాహం చేయడానికి ఒప్పుకొన్నాడు. వివాహం చేయడానికి కిరాతరాజుకు భార్యలేదని శివుడు తన వామ భాగం నుండి ఒక కిరాతస్త్రీని సృష్టించి వారికి వివాహం చేసి మీరిద్దరు ఇప్పుడు ఇష్ట కామేశ్వరి ఉన్న అలక ప్రాంతాన్ని ఏలుకో మని చెప్పాడు.
వల్లీ సుబ్రహ్మణ్యేశ్వరుల వివాహానికి బ్రహ్మ, విష్ణువు, దేవతలు అన్ని లోకాల నుండి దిగివచ్చి ఆశీర్వదించారు. కుమారస్వామి, వల్లీ జంట నాగులుగా మారి ఆ అటవీ ప్రాంతము అంతటా తిరుగుతూ ఉండేవారు. దేవతలు యువకుడిగా మారిన శివుడిని మల్లికార్జునుడు పేరుతో సూక్ష్మ రూపంలో జ్యోతిర్లింగముగా అక్కడే కలియుగాంతం వరకు ఉండమని, అమ్మ అక్కడక భ్రమర రూపంలో వచ్చింది కనుక భ్రమరాంబ గా ఇక్కడ కొలువు చేయాలని కోరారు. ఈశ్వరుడు తథాస్తు అని జ్యోతిర్లింగంగా మారి, కలియుగాంతం వరకు స్వయంభూ లింగముగా శ్రీశైలంలో నిలిచాడు. భ్రమరాంబగా అమ్మవారు 108 శక్తిపీఠములతో అత్యంతశక్తి కలిగి శక్తిపీఠముగా వెలిసినది.
శివుడు వృద్ధ మల్లికార్జునుడుగా పౌర్ణమినాడు, యువకుడిగా అమావాస్యనాడు మారాడు. అందుకని పౌర్ణమినాడు అమ్మవారు, అమావాస్యనాడు ఈశ్వరుడు కుమార స్వామిని చూడటాని వెళతారు. మిగిలిన రోజులలో కుమారస్వామి తల్లి తండ్రుల దగ్గరకు వచ్చి వారిని సేవిస్తాడు. గంగా దేవి పరమేశ్వరుని విడిచి ఉండలేను, ఆయన దగ్గరకు వెళ్ళే మార్గము తెలుపమని విష్ణువును ప్రార్ధించగా “నా సుదర్శన చక్రాన్ని భూలోకానికి పంపుతాను దాని వెనుకే నీవు వెళ్ళి అది ఎక్కడ ఆగితే అక్కడ ప్రవహించు” అని తెలిపాడు. సుదర్శన చక్రం శ్రీశైలం కొండపై పడ్డది. దాని వెనుకనే వచ్చిన గంగ కొండపై నుండి క్రిందికి ప్రవహించి పాతాళగంగగా పేరు పొందింది.
రాముడు, సీత, లక్ష్మణుడు తమ అరణ్యవాస కాలంలో ఇక్కడకు వచ్చి లింగాలను ప్రతిష్టించారు. ద్వాపర యుగంలో పంచపాండవులు ప్రతిష్ఠించిన లింగాలు కూడ అక్కడ కనబడతాయి. శ్రీశైలంలో ఉన్న రాళ్ళన్నీ శివలింగాలని, అడవులలో ఉండే గిరిజనులందరు సిద్ధమునులని అంటారు.
పెళ్ళికానివారికి ఈ జ్యోతిర్లింగ దర్శనము వలన వివాహం జరుగుతుందని, తల్లితండ్రులకు ద్రోహం చేసిన పాపం ఈ జ్యోతిర్లింగ దర్శనమువలన నశిస్తుందని తెలిపారు. పెద్దలకు చేసిన అన్యాయం సకల పాపములు ఈ జ్యోతిర్లింగమును తాకిన పోతాయని తెలిపారు.
(సశేషం)