నేలతల్లి నవ్వింది – 1

“నేల తల్లి నవ్వింది ” కొత్త సీరియల్ నవల ప్రారంభమైంది…. ‘తరుణి’ పత్రిక పాఠకులకోసం! చదవండి చదివించండి.
– సంపాదక వర్గం

 

ప్రకృతికి చెందిన అన్ని కార్యాలలాగా కొన్ని నియమాలను అనుసరించి సాగుతాయి . ఆ నియమాలు అతిక్రమించలేము . ప్రకృతి నియమాలు అతిక్రమించడానికి ప్రయత్నిస్తే క్షణకాలంలో నే ఈ సృష్టి అంతమైపోతుంది. ఆ తర్వాత ఏమి మిగలదు” –
                                                                                                                        – స్వామి వివేకా నంద

“ప్రకృతి మనిషి అవసరాలను తీర్చగలదు . అంతేకానీ అతని దురాశని కాదు”- మహాత్మా గాంధి.
“నేలతల్లి నవ్వింది” నవలలోని ముఖ్య విషయం ప్రకృతి. ఈ ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఈ నవల కథా పరంగా ఏమి జరిగిందో ఎందుకు? ఎలా జరిగిందో భూమాతకు నష్టం వాటిల్లకుండా ఎవరు ఎట్లా ప్రయత్నం చేసారో ఈ ధారావాహిక నవల చెబుతుంది. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి.
                                                                                                 – దేవులపల్లి విజయలక్ష్మి, రచయిత్రి.

 

అయ్యగారు! అయ్యగారు! అంటూ కోలాహలంగా ఎన్నోగొంతుకల పిలుపులు ఆర్తనాదనంలా శివరామకృష్ణ చెవులకి తాకింది.

దేవునికి నివేదన చేసి, మంత్రపుష్పం చెప్పి, మడిబట్ట మార్చుకుని పైజామాలాల్చిధరించి బయటికివచ్చిన శివరామకృష్ణకి ఊరిలో సగం జనం తన ఇంటిముందు నిలబడి ఉండటం ఒకింత ఆశ్చర్యంకలిగింది. ఇంతలో పంచాయతీ ప్రెసిడెంట్ రామనాథం, ఆర్.ఎమ్.పి డాక్టర్ సీతారామయ్య కూడా రావటం చూసి శివరామకృష్ణ ఏదో పెద్దవిపత్తే అని అంచనావేశాడు.

“రండి! రండి! రామనాథం గారు! సీతారామయ్య గారు!కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా! శ్రమతీసుకుని వచ్చారు. దాహం పుచ్చుకుంటారా!” అంటూ, అమ్మా రాధా రెండు గ్లాసుల మజ్జిగ తీసుకురామ్మా! అంటూ పురమాయించారు శివరామకృష్ణ.

“పర్వాలేదు శివరామకృష్ణ. వారమంతా
ఎనిమిదిగంటల నుండి ఐదుగంటల వరకు స్కూల్లో అవిరామంగా ఉండే నిన్ను ఆదివారం కూడా ఇబ్బంది పెట్టటం ఇష్టంలేదు. కానీ గొంతు మీద గొడ్డలిపెట్టు పరిస్థితి రావడంతో మీసహాయం సలహాగురించి వచ్చాం. ఇంతకు ముందు ఎన్నో ఆపదలను మనం గవర్నమెంట్ కు ఫిర్యాదు ఇవ్వకుండా పరిష్కరించుకున్నాం. కానీ ఇది చాలా జటిల సమస్యగా ఉంది. ఒత్తిడిలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.” అంటూ ఆగాడు రామనాథం.

ఇంతలో వచ్చిన జనంలో  ఒక  వయసైన రాజన్న అనే రైతు ఇలా అన్నాడు, “అయ్యా మేమంతా రైతులం. తూర్పున ఉన్న పొలాలు కొండగట్టు వరకు
సాగుచేసుకుంటున్న రైతులం. సస్యశ్యామలంగా ఉండే భూమిని గవర్నమెంటువారు ఏదోమందుల ఫ్యాక్టరీ పెడతామంటూ  పొలాలని అడుగుతున్నారు. వేల ఎకరాల సాగుభూమిలో ఔషధపరిశ్రమ పెడతారట. కలెక్టరుగారు వచ్చి పొలాలను చూసి పోయారు.అయ్యా! కొండవతల సీతారామపురంలోని అడవులను కూడా తీసేస్తారంట. ఈ చుట్టుప్రక్క వాళ్ళ పొలాలు కూడా తీసుకుంటారట. దాదాపు ఐదువందల మంది రైతులం. మేం ఏడ బోయేది సామి? భూమిని నమ్ముకున్నోళ్ళం.” అన్నాడు రాజన్న.

“తిండికి గింజలులేక మలమల మాడితే తెలిసి వస్తాది. నాయాల్ది పొలాన్ని తాకాల ఓరు కానీ కత్తికో ముక్క సేయనా! అంటూ వీరా వేశంతో కుర్రవాడైన నాగరాజు ఊగిపోయాడు.

“అయ్యా! పడమటి దిక్కు మా అన్నదమ్ములందరిది
ఒక వందఎకరాల మామిడితోట ఉంది. మాది రావులపాలెం ఆనుకునే అడవుంది సామి. దానిని ప్లాట్లు చేసి అమ్ముతాడట. మన ఊరికి మందులు ఫ్యాక్టరీ వస్తే గొప్పోళ్లంతా ఇళ్ళు కట్టుకోవడానికి స్థలాలు కావాలంట. అందుకు మమ్మల్ని ఆ పొలాలు అమ్మమని ఒత్తిడిచేస్తున్నారు. మీరు అమ్మకపోతే ఎలా మీచేత అమ్మించాలో తెలుసని సవాలు చేసి పోయినాడు సామి రియల్ ఎస్టేట్ భద్రయ్యంట.”
అంటూ శేషయ్య మొరపెట్టుకున్నాడు.

అవ్! అవ్! అంటూ ఇంకో పది గొంతుకలు వంతపాడాయి.

ఇంతలో స్కూటీచప్పుడికి అందరూ వెనక్కిచూశారు అప్పుడే వచ్చిన బృంద చిరునవ్వుతో అందరినీ పలకరించుకుంటూ వచ్చి శివరామకృష్ణకి పాదాభివందనంచేసి, రామనాధానికి సీతారామయ్యకి కూడా నమస్కరించింది.

“ఏమిటి ఏదోపెద్దచర్చే జరుగు తున్నట్లుంది. ఊరి జనం, పెద్ద వాళ్ళందరూ ఒకేచోట చేరారు.” అంది చిరునవ్వుతో .

“ఏముందమ్మా బంగారుబాతుకథ అయింది. ప్రశాంతంగా ఉండే పల్లె ప్రజలకి జీవన్మరణ సమస్య వచ్చింది.ఒక్క నిమిషం ఉండమ్మా!” అన్నాడు శివరామకృష్ణ.

ఎంతో దీనంగా నుంచున్న  రైతులను ఉద్దేశించి,
“మీబాధ ఆందోళన నాకుఅర్థమైంది. ఇది మీఒక్కరి సమస్యకాదు. ఇది రామగిరి, లక్ష్మణగిరిల సమస్య. ఒక్కరోజులో ఈ సమస్యకి పరిష్కారం రాదు. ఎదుటివారు అత్యంత బలవంతులు. వారిని ఎదిరించలేము. కానీ విజ్ఞతతో ఈ సమస్య మెరుగుపరచుకోగలమని ఆశిద్దాం. మీరు మీఇళ్లకు వెళ్లి ప్రశాంతంగా ఉండండి. మేము ఏమిచేయాలనేది చర్చించుకుంటాం.అంటూ వేదనాభరితులైన ఆ బడుగు రైతన్నలకి ఓదార్పు వాక్యాలుపలికి, వారికి ధైర్యవచనాలు పలికి, ఇళ్ళకి పంపాడు శివరామకృష్ణ.

“మాస్టారు ఈ అమ్మాయిలో ఆయుర్వేద ఆచార్యులు మణికంఠగారి పోలికలు ఉన్నాయి.”  అన్నాడు రామనాథం.

వినయంగా నమస్కరించింది బృంద. ‘అవును తాతగారు నేను మణికంఠగారి కుమారుడు సుశృత గారి కుమార్తెను.”

“ఎవరు సుశృత కూతురా? మీనాన్న మీ తాతగారిని ఎంతటిక్షోభ పెట్టాడో. ఆరోజు నుంచి ఈరోజువరకు వైద్యం చేస్తున్నాడు అన్నమాటేగాని మనిషిలో జీవం లేదు. ఎంతటి విజ్ఞానఖని మీతాత. చరకసంహితని అవపోసన పట్టిన సాక్షాత్తు ఆచరకుడే. మీ నాన్నకి ఆయుర్వేదం అంటే చిన్నచూపు.అందుకని ఆంగ్ల వైద్యం చదివి ఇంగ్లీషుడాక్టర్ అయ్యాడు. మంచిపేరే సంపాదించాడని విన్నా. పెద్దసర్జనట కదా సుశృత.” అన్నాడు రామనాధం.

“అయినా మీతాత పిచ్చిగాని ఇంకా ఆకుపసర్లు, మూలికలు, వేళ్ళుఅంటే ఎవరికి నమ్మకం. సుశృత అని పేరు పెట్టినందుకు కార్డియాక్ సర్జన్ అయ్యాడు. అందుకు నాకు సంతోషంగా ఉందమ్మాయి. ఇంతకు నువ్వేం చేస్తుంటావు? పెళ్లయిందా?” అని ప్రశ్నలు పరంపర కురిపించాడు సీతారామయ్య.

అన్ని ప్రశ్నలు విని చిరునవ్వుతో వినయంగా సమాధానమిచ్చింది బృంద .

“నేను మానాన్నగారిని ఎదిరించి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద జైపూర్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ చేశాను. ఇప్పుడు ఎం.డి ఆయుర్వేదంలో చేరాలి. ఈలోగా తాతయ్య దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా ఆయన అనుభవాన్ని కొంతవరకు నేను తెలుసుకోవాలి. ఆయనకు మూలికలు మీద వాటిని గుర్తు పట్టడం ఔషధాలను తయారు చేయటం మీద ఉన్న పట్టు ఏ యూనివర్సిటీ కాలేజీలోనూ చదివినా అంత తేలికగా అర్థమవ్వదని కొన్నాళ్ళు తాతయ్య దగ్గర చూసి నేర్చుకుందామని వచ్చాను. నాకు మీదీవెనలు సహకారం ఎంతో అవసరం.
పడమట లక్ష్మణగిరిని ఆనుకుని ఉన్న అడవులలో ఆయుర్వేదంలో అత్యంత అరుదైనమూలికలు లభ్యమవుతాయని అక్కడ యూనివర్సిటీ వాళ్ళు చెప్పడంతో  మణికంఠ తాతయ్య దగ్గరికి వచ్చాను. తాతయ్య ఒకసారి శివరామకృష్ణ తాతయ్యని కలవమంటే ఇటు వచ్చాను. అనుకోకుండా మీలాంటి పెద్దలందర్నీ కలిశాను. చాలా సంతోషం. మరినేను వెళ్లివస్తా.” అంటూ శివరామకృష్ణకి నమస్కారం పెట్టింది.

“అభీష్టఫల సిద్ధిరస్తు.” అని ఆశీర్వదించారు శివరామకృష్ణ.
★★★

“అవును శివరామకృష్ణా! ఈ అమ్మాయి ఇక్కడ ఏవో అద్భుతమైన ఆయుర్వేద మూలికలు ఉన్నాయి అంటుంది అంటే లక్ష్మణగిరిని ఆనుకున్న అడవులలో అన్నమాట. శేషయ్య చెప్తున్నది ఆ అడవులను ఎవరో రియల్ ఎస్టేట్ బ్రోకరు ఆక్రమించుకుంటున్నాడు‌ అని అన్నాడుకదా!”  అన్నాడు ప్రెసిడెంట్ రామనాథం.

“ఇదేదో చిన్నసమస్యలా లేదు. తూర్పు పొలాలని చూడటానికి స్వయంగా కలెక్టరే వచ్చాడంటే అదీ ప్రెసిడెంట్ అయిన మీకు మాటమాత్రం చెప్పకుండా!” అంటూ సీతారామయ్య తన అనుమానాన్ని వ్యక్తపరిచాడు.

“అవును. ఇది చాలాపెద్ద రాజకీయ వ్యూహంలా ఉంది. పడమటిఅడవులను కొట్టి ప్లాట్లు అంటున్న ఆ రియల్ ఎస్టేట్ వ్యక్తి ఎవరో ముందు తెలుసుకోవాలి. తప్పక ఆవ్యక్తికి రాజకీయనాయకుల మద్దతు ఉండి ఉంటుంది. ఈ సమస్యని ఎటునుంచి నరుక్కురావాలో,  మనం ఆచితూచి అడుగులు వెయ్యాలి. ఈ సమస్య ఒక కొలిక్కివచ్చేవరకు మనం తరచూ కలుసుకుంటూ ఉండాలి. మీకు ఏమైనా ఉపాయంకానీ, ఆలోచనకానీ, సూచనగాని తట్టితే వెంటనే తెలపండి. నాకు కొన్నిఅనుమానాలు ఉన్నాయి. అవి నిర్ధారించుకొని మనంమళ్లీ బుధవారం కలుసుకుందాం. అన్నాడు శివరామకృష్ణ.

★★★

భర్త అభిషేక్ గత వారంరోజులుగా పరధ్యానంగా ఉండటం గమనించింది ప్రియంవద. ప్రియంవదకు ఇది అలవాటే ఏదైనా మనస్సాక్షికి వ్యతిరేకంగా పనిచేయాల్సి వచ్చినప్పుడు అభిషేక్ మథనపడటం.
ప్రియంవద నెమ్మదిగా భర్తను చేరింది.

ప్రియంవద ఎన్వైర్నమెంటల్  సైన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్. అభిషేక్ కలెక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి  కలెక్టర్ అయ్యాడు. కానీ కలెక్టరు రాజకీయ నాయకులకి అడుగులకి మడుగులొత్తితేనే మనుగడ అని తెలుసుకుని చాలానిరాశ చెందాడు. తాను చేస్తున్న ఏ పని చట్టబద్ధంగాకంటే రాజకీయ రాకాసుల కబంధహస్తాలలో ఉందని గ్రహించాడు. అప్పటినుంచి పాముచావకుండా కర్రవిరగకుండా చాకచక్యంగా రాజకీయ నాయకులకి తందానా అంటూ సాధ్యమైనంత వరకు ప్రజలకి అనుగుణంగా పనిచేసుకుంటూ తన ఆశయాలని కొంతవరకు సాధిస్తున్నాడు.

“అభి ఏమిటీ ఆలోచిస్తున్నావు?” మళ్లీ ఏదైనా సమస్యా?

“అవును ప్రియంవదా! ఇప్పుడు గవర్నమెంట్ వారి కన్ను సస్యశ్యామలంగా ఉన్న రామగిరి, లక్ష్మణగిరి మీద పడింది. అక్కడ కొన్నివేలఎకరాల సాగుభూమి ఉంది. అయితే దానిని ఆనుకొని కొండలు అక్కడ నుంచి అడవి. ఇది క్రమేపి నల్లమలఅడవులకి కలుస్తుంది. ఈ అడవులు వన్యప్రాణుల నివాసమైతే లక్ష్మణగిరి ప్రాంతపుఅడవులు ఆయుర్వేద వృక్షాలకి చెట్లకి చాలా ప్రసిద్ధి. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మణికంఠ ఆచార్యులవారు వారి ఆయుర్వేద చికిత్సకు కావలసిన ఆకులు, అలములు, మూలికలు అన్ని ఆయన స్వయంగా ఆ అడవుల నుంచి సేకరించేవారు. ఇప్పటికీ ఒక్కొక్కకాలంలో ఒక్కొక్క రకమైన ఆయుర్వేదానికి ఉపయోగించబడే
ఔషధీచెట్లు అక్కడ లభ్యమవుతాయని విన్నాను. ఇప్పుడు స్వార్థపూరితమైన విషపూరితమైన వ్యక్తుల దృష్టి వ్యవసాయ భూములను దాన్ని కలిపేఅడవుల మీద కేంద్రీకృతమై ఉంది. ఆ పచ్చని పొలాల వెనక రైతన్నల కష్టం కళ్ళకి కట్టుతోంది. స్వయంగా అక్కడి పొలాలని ఎస్టిమేషన్ వేస్తుంటే వారికళ్ళల్లోని భావాలని చదవలేక దోషిలా తలవంచుకున్నా.
నాఅంచనాలో ఇప్పటికే ఈ విషయం మీద ప్రెసిడెంట్ తదితర ఊరిపెద్దలు చర్చల్లో ఉండిఉంటారు. చూడాలి నేను ఏమైనా వారికి సహాయం చేయగలనేమో!” అన్నాడు అభిషేక్.

★★★

తాతయ్య దగ్గర ఉన్న ఆయుర్వేదగ్రంథాలని ఒక్కొక్కటిగా చదువుతూ తాతయ్య సహాయంతో అర్థంచేసుకుంటోంది బృంద.

బృంద రాకతో మణికంఠకి  పోయిన శక్తి మళ్ళీతిరిగి వచ్చినట్టయింది. తరతరాలుగా వస్తున్న ఆయుర్వేద వైద్యం తనతో అంతరించి పోతుందేమో అన్న మణికంఠ ఆచార్యుల దిగులు బృందరాకతో చిగురు తొడుగు తోంది.

తాతయ్యా! బామ్మ! అంటూ తిరుగుతున్న బృందని చూస్తుంటే మాణిక్యాంబకి పేదకిపెన్నిధి దొరికినంత సంబరంగా ఉంది.

“తాతయ్యా! నువ్వు ఈ ఔషధీ మొక్కల్ని గుర్తుపట్టి దట్టమైన అడవులనుంచి ఎలాతెచ్చేవాడివి?” కుతూహలంగా అడిగింది బృంద.
“బృందా నాకంటే విద్వత్తు ఉన్నవాళ్లు చెంచులు, ఎరుకలు, లంబాడీలు, కోయలు, గోండ్లు. వీరికి ఈ ఔషధీమొక్కలు గుర్తుపట్టటం ఉపయోగించటం కూడాతెలుసు. ఎటొచ్చి వారికి సరి అయిన రోగనిర్ధారణ శక్తిలేక వారిచేతిలో ఉన్న మందుని సరియైనరీతిలో, సరియైన మోతాదులో ఉపయోగించుకోలేరు. నేను వారి సహాయంతో ఆయుర్వేద మూలికలను అడవినుంచి తెచ్చేవాడిని. ఇప్పుడు వారు తెలివిమీరారు. వారేతెచ్చి నాకు అమ్ముతున్నారు. అయితే అది సరయినదా?  సరి అయినది కాదా! అని గుర్తుపట్టవలసిన బాధ్యత మనది.” అంటూ నిట్టూర్చాడు మణికంఠ.

“తాతయ్యా! నన్ను అడవికి తీసుకు వెళ్లి ఆ మూలికలు చెట్లు గుర్తుపట్టడంనేర్పుతావా అంది ఉత్సాహంగా బృంద.

“చెంచు లింగమయ్య చాలా తెలివిగలవాడు. వాడిని పిలిచి వాడికి ఎప్పుడు వీలవుతుందో కనుక్కొని వెళ్దాం. నా భోషాణంలో ఎర్రగుడ్డకట్టిన ఒక గ్రంథం ఉంది. అది పురాతనచరకుడు వ్రాసిన ‘ చరక సంహితకి’ తెలుగు అనువాదం. చాలా పురాతన గ్రంథం. అది ఎక్కడ దొరకదు. అది నా పూర్వీకుల నుంచి నాకు సంక్రమించిన ఆస్తి. దానికి మీనాన్న వారసుడవుతాడు అనుకున్నా. పోనీలే ఆగ్రంథానికి వారసురాలు దొరికింది. ఆగ్రంథం నేను నీకు ఇచ్చే కానుక. అయితే అది చదివినంత మాత్రాన అర్థం కాదు. అందుకని ఇక్కడ ఉన్నన్నాళ్ళు అది చదివి అర్థంచేసుకో ప్రయత్నించు. అర్థం కాని విషయాన్ని మనం చర్చిద్దాం.” అన్నాడు మణికంఠ.

బృంద తను సాధించాలనుకున్న దానికి తన తాతయ్యే మార్గదర్శకుడవటం ఎంతో సంతోషాన్నిచ్చింది
★★★

పడక కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటున్న శివరామకృష్ణ “నమస్కారం మాస్టారు” అన్న గొంతుక విని పేపర్ లోంచి తలెత్తి పైకి చూశాడు. ఆరడుగుల ఆజానుబాహడు ఇరవై ఆరు ఇరవై ఏడేళ్ళ మధ్య యువకుడిని చూసి ఎవరా అన్నట్టు చూసారు.
“నేను రవీంద్రని, సైన్స్ మాస్టారు కృష్ణమోహన్ గారి కొడుకుని.” అంటూ చనువుగా కాళ్ళకిదండం పెట్టి అరుగు మీద కూర్చున్నాడురవీంద్ర.

“ఓరిని! రవీంద్ర వా! ఎంత పొడవు ఎదిగావు? నువ్వు హైదరాబాదులో టెన్త్ తర్వాత మీ మేనమామ దగ్గర ఉండి చదువుకుంటున్నావని తర్వాత పై చదువులకి ఆస్ట్రేలియా వెళ్ళావని తెలుసు. ఆపై నీ గురించి తెలుసుకోవటానికి మీ నాన్న లేకపోయారు.”అంటూ కళ్ళజోడు తీసి కంటి నీరు తుడుచుకున్నారు.
శివరామకృష్ణ .

ఏమిటి సంగతి? ఇలావచ్చావు. భోజనంచేసావా? బసఎక్కడ?” అంటూ ప్రశ్నలపరంపర కురిపించాడు శివరామకృష్ణ.

“నేను వనశక్తి ఎన్జీవో ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. నేను అనఫిషియల్ గా ఇక్కడ సర్వేకి వచ్చాను. నేను ఇక్కడ కొన్ని నెలలు ఉండాల్సి రావచ్చు. నాన్న అమ్మ వరదల్లో కొట్టుకుపోయారని తెలుసుకదా. దిక్కులేని నన్ను మా మామయ్య చేరదీసాడు. మా పెద్దతల్లి కొడుకు మాఅన్న నాకు మార్గదర్శకుడయ్యాడు. అద్దెకి ఇక్కడ ఏమైనా……..”

“నువ్వు నా మిత్రుడు నా సహోద్యోగి  అయినా కృష్ణమూర్తి కొడుకువి. అందునా మన పాఠశాల పాత విద్యార్థివి. మా ఇంట్లో ఒక గది ఖాళీగా ఉంది. అందులో ఉండు. భోజనం మాతోనే. ఒక మనిషికి భోజనం పెట్టలేనంత దీనస్థితిలో లేడు ఈ శివరామకృష్ణ.” అంటూ భుజం తట్టారు శివరామకృష్ణ.

సాయంత్రం ఐదు గంటలకి రామనాథం, సీతారామయ్య, శివరామకృష్ణని కలవడానికి వచ్చారు.

” ఏమో! శివరామకృష్ణా! రైతులు అల్లల్లాడి పోతున్నారు.  అటునుంచి జంగమయ్య రాత్రుళ్ళు అడవిలో చెట్లు కొడుతున్నారని వారిని ఎదుర్కోవాలంటే  వారిచేతుల్లో  పెద్దపెద్ద తుపాకులు ఉన్నాయని వాపోతున్నాడు.”  అన్నాడు రామనాథం.

“ఇది ఇలాగేజరిగితే రామగిరి, లక్ష్మణగిరే కాక మన చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిసి దాదాపు ముప్పైవేల మందిదాకా జనాభా గల్లంతవుతుంది. చీఫ్ మినిస్టర్ గారికి అప్పీలుచేస్తే ఎలా ఉంటుంది? లేదా
కలెక్టర్గారిని కలిస్తే బాగుంటుందా? ఎలా ప్రణాళిక వేయాలో వీలైనంతత్వరలో నిర్ణయించుకుంటే బాగుంటుంది.” అన్నాడు సాలోచనంగా సీతారామయ్య.

అక్కడే వీరి మాటలు వింటున్న రవీంద్ర అర్థమవనట్లు, “మీకూ అభ్యంతరం లేకపోతే మీ సమస్యకు నేనేమైనా సహాయ పడగలనా?” అన్నాడు.

“ఇతను ఎవరు?” అనుమానాస్పదంగా అడిగాడు రామనాథం.

రామనాథం అనుమానాన్ని అర్థం చేసుకున్న శివరామకృష్ణ, “ఇతను రవీంద్ర. మన పాఠశాలలో చదివిన విద్యార్ధి , నా సహోద్యోగి కృష్ణమూర్తి కుమారుడు. పర్యావరణ శాస్త్రంలో అధ్యయనం చేశాడు. ఎన్జీవో  ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాడు. ఇక్కడ పనిమీద వచ్చాడు.” అంటూ పరిచయం చేశాడు.

” చాలా సంతోషంబాబు. తప్పక మా సమస్యకి
దారి చూపుతాను అంటే చిన్నవాడివైనా నీకు నమస్కరిస్తాము. మా సమస్యకి ఎవరిని కలవాలో ఎక్కడ నుంచి నరుక్కురావాలో తెలియక అయోమయావస్థలో ఉన్నాం.” అన్నాడు రామనాధం.

“ఒక రకంగా చెప్పాలంటే మీ సమస్యే నాప్రాజెక్ట్. కొంతవరకు విషయం తెలుసు. అయితే ఇక్కడి అడవులు మహత్తరమైన ఆయుర్వేద మూలికలకి పుట్టినిల్లు అని మాకు సమాచారం ఉంది. అంతేకాదు ఇక్కడ అడవులనునరకటం వలన పర్యావరణానికి తీరనినష్టం వాటిల్లుతుంది.

“వ్యవసాయానికి  అనువైనభూమి, నీటివనరులు సమృద్ధిగా ఉన్న ఈ భూమిమీద ఎటువంటి పరిశ్రమలు రాకూడదు. నేను మీ వెంట వస్తాను ముందస్తుగా మనం జిల్లాకలెక్టర్గారికి విన్నవించుకుందాం. అక్కడ మనకి అనుకూలమైన స్పందన రానిపక్షంలో తర్వాత సంగతి ఆలోచిద్దాం.” అన్నాడు రవీంద్ర.
ఆ ముగ్గురి పెద్దలకు గుండె మీద బండరాయి దించినంత సంతోషం కలిగింది.

“నేను ఈలోగా ఇక్కడున్న అడవులను ఒకసారి పరిశీలించాలి. ప్రెసిడెంటుగారు! మీరు కలెక్టర్గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోండి.”అన్నాడు రవీంద్ర .

సశేషం.

Written by Devulapalli VijayaLaxmi

దేవులపల్లి విజయ లక్ష్మి
విద్యార్హత. Bsc.B Ed
వృత్తి. రిటైర్డ్ టీచర్ (st Ann's Taraka)
వ్యాపకాలు కవితలు,కధలు వ్రాయటం, చిత్రలేఖనం(తైలవర్ణ చిత్రాలు వేయటం.)పుస్తక పఠనం,అల్లికలు,సంగీతం ఆస్వాదించటం ,దేశం నలుమూలల పర్యటించటం మొదలైనవి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విషయసూచిక

శరణార్థుల కన్నీటి గాథ మరిచిన లోకం