నాన్న మాట

కథ

ఉదయం ఎనిమిది గంటలకు విక్రమ్ బైక్ స్టార్ట్ చేశాడు.

“ఎక్కడికిరా ఇంత పొద్దున్నే?” తండ్రి రాఘవయ్య గేటు దగ్గర అడ్డుపడ్డాడు.

“నాన్నా! ఫ్రెండ్స్ తో ట్రిప్… గోవా. మూడు రోజులు. ఇప్పుడే కదా జాబ్ వచ్చింది. ఎంజాయ్ చేయాలి” అన్నాడు.

“వారం రోజుల్లో జాయినింగ్. ఇప్పుడు గోవానా? డబ్బు ఎక్కడిది?” అన్నాడు రాఘవయ్య.

“నా ఫ్రెండ్ కార్డు వాడతాను. జీతం రాగానే ఇచ్చేస్తా. నువ్వెప్పుడూ అడ్డే.”
(రాఘవయ్య దంపతులకు విక్రమ్ ఒక్కడే సంతానం. వ్యవసాయ కుటుంబం వీరిది. ఐనా రాఘవయ్య ఆ కాలంలోనే బి.ఏ. పట్టభద్రుడు.తెలుగు, ఆంగ్లం, హిందీ భాషలలో మాట్లాడడమే కాకుండా మంచి పట్టు ఉన్న వ్యక్తి. స్నేహశీలి. కొడుకును చక్కగా, బాధ్యతగా పెంచారు. ఐతే స్వేచ్ఛ కూడా ఇచ్చారు. అందుకే ఉద్యోగం వచ్చిందని పార్టీలు చేసుకుంటున్నాడు. మంచివాడే కానీ వయసు, స్నేహితుల ప్రభావం).

రాఘవయ్య చిన్నగా నవ్వాడు. “వద్దురా. మొదటి జీతం అమ్మ చేతిలో పెట్టాలి. అది మన ఆచారం. ఇప్పుడు అప్పు చేసి తిరిగితే, అదే అలవాటైపోతుంది.”

విక్రమ్ చిరాకుగా హ్యాండిల్ తిప్పాడు. “మీ తరం ఆలోచనలు మీవి నాన్నా! ఈ కాలంలో అందరూ ఇలాగే ఉంటారు. నాకు తెలుసు”.

“నేను ఏది చెప్పినా… నీ మంచికే.‌ ఆలోచిస్తే నీకే బోధపడుతుంది” అన్నాడు రాఘవయ్య దారి వదులుతూ.

విక్రమ్ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయాడు. గోవాలో మూడు రోజులు క్షణాల్లా గడిచాయి. బిల్లు మాత్రం నలభై వేలు.

బెంగళూరులో జాయిన్ అయ్యాడు విక్రమ్. కొత్త ఫ్లాట్, కొత్త బైక్ EMI, వీకెండ్ పార్టీలు. మొదటి జీతం వచ్చింది. అడ్డుకునే నాన్న ఇక్కడ లేరు. అకౌంట్లో పడీ పడగానే EMIలు, కార్డు బిల్లు, ఫ్రెండ్స్ అప్పులు.
ఆరు నెలలు గడిచింది. విక్రమ్ కి రెండు వేలు మాత్రమే అకౌంట్లో మిగులుతున్నది. మొదట్లో అర్థం కాలేదు కానీ రానురాను ఒక విధమైన గిల్టీనెస్ ఫీలౌతున్నాడు. నాన్న చెప్పినట్లు వింటే బాగుండేది. ఇంటి దగ్గర ఉన్న బైక్ తెచ్చుకుని, ఇంటికి కొంత డబ్బు పంపిస్తే బాగుండేది. ప్రతి నెల బొటాబొటిగా గడుస్తున్నది అనుకుంటే…ఇప్పుడు క్రెడిట్ కార్డు బాధకూడా వచ్చింది. అని బాధ పడుతున్నాడు తనలో తాను.

ఆరోజు సాయంత్రం అమ్మ ఫోన్ చేసింది. “ఒరేయ్! మొదటి జీతం. గుడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి, మీ నాన్నకు బట్టలు పెట్టరా.”

“సరే అమ్మా! నెక్స్ట్ మంత్ పక్కా. ఈ నెల కొంచెం టైట్.” అని సమాధానపరిచాడు.

ఆరు నెలలు గడిపాను. అప్పుల్లో కూరుకుపోయాను. ఆఫీస్ లో టార్గెట్ ప్రెషర్. మొన్న టీమ్ లీడ్ పిలిచి గట్టిగా అరిచాడు. “పని మీద ఫోకస్ లేదు. వీకెండ్ అంతా పబ్బులేనా? ఇంకో వార్నింగ్ వస్తే నీ ఉద్యోగం ఊడుతుంది.”

ఆ రాత్రంతా ఫ్లాట్ లో ఒక్కడే కూర్చున్నాడు. ఫ్రిజ్ ఖాళీ. పర్సు ఖాళీ. మనసు ఖాళీ. ఫోన్ మోగింది. అమ్మ…

“ఎలా ఉన్నావ్ రా? తింటున్నావా?”

“హా అమ్మా. బాగున్నా.” గొంతు పూడుకుపోయింది.

“అబద్ధం చెప్పకు! మీ నాన్న కలలోకి వచ్చావ్ అంట. ‘వాడు కష్టంలో ఉన్నాడు’ అని కలవరిస్తున్నాడు నాన్న. ఏమైంది?”

విక్రమ్ కు ఒక్కసారిగా ఏడుపు తన్నుకొచ్చింది. “అమ్మా! నేను చెడిపోయాను. అప్పులు. ఆఫీస్ లో తిట్లు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు.”

అటు నుండి నిశ్శబ్దం. తర్వాత రాఘవయ్య గొంతు. “ఊరికి రారా. ఒక్కసారి.”

విక్రమ్ బస్సెక్కి ఊరెళ్లాడు. సిగ్గుతో తల వంచుకుని గడపలో నిలబడ్డాడు. రాఘవయ్య ఏమీ అనలేదు. భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకెళ్లాడు. వేడి అన్నం, నెయ్యి, ఆవకాయ అమ్మ కంచంలో పెట్టింది. తిని ఎన్ని రోజులైందో.

రాత్రి ఇద్దరూ పెరట్లో మంచం మీద కూర్చున్నారు. చల్లని గాలి.

“నాన్నా! నన్ను క్షమించు. నీ మాట వినలేదు.”

రాఘవయ్య చిన్నగా నవ్వాడు. “నేను కూడా వయసులో నీకంటే అల్లరివాడినేరా. మీ తాత నాకు సైకిల్ కొనివ్వలేదని మూడు రోజులు అన్నం మానేశా. ఆయన రాత్రికి రాత్రి కాళ్లకు చెప్పులు లేకుండా వెళ్లి, డబ్బు తెచ్చి సైకిల్ కొన్నాడు.”

విక్రమ్ ఆశ్చర్యంగా చూశాడు.

“కానీ ఆ సైకిల్ వల్ల నాకు పొగరెక్కింది. చదువు పడిపోయింది. తరువాత నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నిలదొక్కుకున్నాను. నీకు కూడా సమయం మించిపోలేదు కదా! జరుగుతూ ఉంటాయి ఇలా. తెలుసుకుంటే బాగుపడినట్లే నాన్నా” అంటూ ధైర్యం చెప్పాడు.

విక్రమ్ కళ్లలో నీళ్లు. “నాకు ఇప్పుడు బోధపడుతోంది నాన్నా. నేను డబ్బు విలువ తెలుసుకోలేదు. సంపాదన కంటే ఖర్చు ఎక్కువైంది.”

“పోనీలే. తప్పు చేయనివాడు మనిషే కాదు. దిద్దుకోనివాడు మనిషి అనిపించుకోడు. రేపటి నుండి కొత్త లెక్క.”

తెల్లారి రాఘవయ్య విక్రమ్ ను పొలం దగ్గరికి తీసుకెళ్లాడు. “ఇది ఎకరం. కౌలుకు ఇచ్చాం. ఈ ఏడు నువ్వే సాగు చెయ్యి. కొన్నాళ్ళు ఆఫీస్ కు వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగు. కుదరకపోతే వీకెండ్ ఇక్కడే ఉండు.”

“వ్యవసాయమా? నాకేం వచ్చు?”

“నేర్చుకో. చిన్నప్పుడు తిరిగిన పొలమేగా విక్రమ్. ప్రయత్నం చేస్తే తప్పేముంది? చెమట కారకపోతే డబ్బు విలువ తెలియదు. నీ అప్పులు నేను తీరుస్తా. కానీ ఒక షరతు. ప్రతి నెలా నీ జీతంలో ముప్పై శాతం పొదుపు చేయాలి. ఇంకో ముప్పై శాతం ఇంటికి పంపాలి. మిగిలిన దాంతోనే బతకాలి.”

విక్రమ్ సరే అన్నాడు. అదృష్టం ఆఫీసు వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఒప్పుకున్నారు. ఆరు నెలలు కష్టపడ్డాడు. పొద్దున లేచి పొలం, రాత్రి ల్యాప్ టాప్. బురదలో కాళ్లు పెడితే, విత్తనం విలువ తెలిసింది. కలుపు తీస్తే, శ్రమ విలువ తెలిసింది. పంట చేతికి వచ్చాక, మొదటి సారి కష్టపడి సంపాదించిన డబ్బు విలువ తెలిసింది.

ఇప్పుడు వచ్చిన జీతం అమ్మ నాన్నకు లెక్క చెబుతున్నాడు. మొదటి పంట ఫలం చూసి సంబరపడ్డాడు. అమ్మ కళ్లలో నీళ్లు. రాఘవయ్య భుజం తట్టాడు. “ఇప్పుడు చెప్పరా, నేను అప్పుడు ఎందుకు వద్దన్నానో?”

విక్రమ్ సిగ్గుపడుతూ నవ్వాడు. “ఏది చెప్పినా… నా మంచికే.‌ ఆలోచిస్తే నాకే బోధపడింది నాన్నా.”

రెండేళ్లు గడిచాయి. విక్రమ్ అప్పులన్నీ తీర్చేశాడు. ఆఫీస్ లో ప్రమోషన్ వచ్చింది. ఊళ్లో పది మందికి ఉపాధి చూపించాడు. సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టాడు.

ఒకరోజు విక్రమ్ ఫ్రెండ్ కిరణ్ ఫోన్ చేశాడు. “రేయ్, నా లైఫ్ తలకిందులైందిరా. క్రెడిట్ కార్డులు, అప్పులు. ఏం చేయాలో తెలియట్లేదు.”

విక్రమ్ నవ్వాడు. “ఒకటే మాట చెప్తా రా. మన పెద్దలు ఊరికే చెప్పరు. ఏది చెప్పినా… నీ మంచికే.‌ ఆలోచిస్తే నీకే బోధపడుతుంది. ఒక్కసారి ఆగు. ఆలోచించు. నీ జీతం, జీవితం ఎటు పోతోందో లెక్క చూసుకో.”

కిరణ్ ఫోన్ పెట్టేశాక, వెనక నుండి రాఘవయ్య గొంతు. “ఎవరురా?”

“నా ఫ్రెండ్ నాన్నా. దారి తప్పాడు.”

రాఘవయ్య మనవడిని ఎత్తుకుని అన్నాడు, “వాడికి కూడా ఒక రోజు బోధపడుతుంది లేరా. మనం చెప్పడం మానకూడదు. వినేవాళ్లు మారకపోవచ్చు, కానీ మనం మారకూడదు.”

ఆ మాటలో ఉన్న మర్మం, బాధ్యత, ప్రేమ ఇప్పుడు పూర్తిగా అర్థమైంది విక్రమ్ కి. జీవితం అంటే సంపాదించడం కాదు, సంస్కారం నేర్చుకోవడం , సక్రమంగా విలువగా, ఆదర్శంగా బ్రతకడం అని.

Written by Varalalaxmi Yanamandra

నేను విశ్రాంత ప్రభుత్వం ఉపాధ్యాయిని
హైదరాబాద్
కవితలు, పద్యాలు, గజల్స్, రుబాయిలు, పలు లఘు ప్రక్రియలు రాస్తాను. యనమండ్ర సాహితీ వేదిక సమూహ వ్యవస్థాపక అధ్యక్షురాలిని, కొన్ని సమూహాలు నిర్వహిస్తున్నాను. సమీక్షలు చేస్తాను. ఇప్పటికి 5 పుస్తకాలు ముద్రించాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన భవిష్యత్తు ఏది?

“హిమాచల్ ప్రదేశ్ లోని శక్తిపీఠాలు-2”