మోడ్రన్ ఇల్లాలు

ఇరవై ఏళ్ల చరిత్ర ఉన్న “శ్రీలక్ష్మీ జనరల్ స్టోర్స్.” అనే ఒక చిన్న కిరాణా దుకాణాన్ని మధు నడిపేవాడు.

మధు తండ్రి కష్టపడి ప్రారంభించిన ఆ దుకాణాన్ని, తండ్రి చనిపోయిన తర్వాత మధు తన ప్రాణంగా చూసుకుంటూ నడుపుతున్నాడు. దుకాణం పెద్దది కాదు. చిన్నది. రెండు బియ్యం బస్తాలు, కొన్ని పప్పులు, నూనె డబ్బాలు, బిస్కెట్ ప్యాకెట్లు, అన్నీ రకాల సబ్బులు, పిల్లల కోసం చాక్లెట్లు మాత్రమే ఉంటాయి.

మధు భార్య వైష్ణవి. డిగ్రీ చదివింది. ఉద్యోగం చేయాలనుకుంది. కానీ మధు తండ్రి చనిపోయాక కుటుంబ బాధ్యతలన్నీ ఒక్కసారిగా వారి మీద పడ్డాయి. దాంతో వైష్ణవి “బయట ఉద్యోగం చేసి పరాయివాళ్లకు పని చేయడం కంటే… మన ఇంటిని నిలబెట్టడం గొప్ప పని.” అని ఆలోచించి ఇంటినీ, దుకాణాన్నీ ఒకేసారి చూసుకోవడం మొదలు పెట్టింది. ఉదయం పిల్లలను స్కూల్‌కు పంపడం, ఇంటి పనులు చేయడం, మధ్యాహ్నం మధుకు భోజనం తీసుకెళ్లడం, రాత్రి లెక్కలు చూసుకోవడం.. అన్నీ ఆమెనే చేసేది. ఒకనాడు మధు టీ తాగుతూ పేపర్ చదువుతూ ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. వైష్ణవి గమనించింది.

“ఏమైంది?” అని అడిగింది. మధు పేపర్ ఆమె చేతిలో పెట్టాడు. అందులో పెద్ద ప్రకటన.”మరో పది రోజుల్లో… సూర్యాపురంలో అత్యాధునిక మెగా మార్ట్ ప్రారంభం! ఒకే చోట…కిరాణా, కూరగాయలు,

బట్టలు, పిల్లల వస్తువులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, ఆకట్టుకునే డిస్కౌంట్లు, ఏసీ హాల్, హోమ్ డెలివరీ.. అని ఉంది. మధు గుండె ఒక్కసారిగా బరువైంది.

“ఇక మన దుకాణం మూసుకోవాల్సిందే” అన్నాడు. వైష్ణవి మాత్రం ప్రశాంతంగా పేపర్ మడిచింది.

“ఇంకా వాళ్లు రాలేదు కదా. వచ్చాక తెలుస్తుంది.” అంది.

పది రోజుల తర్వాత…మెగా మార్ట్ ప్రారంభమైంది. మొదటి రోజు ఉచిత బహుమతులు.. రెండో రోజు యాభై శాతం తగ్గింపు. మూడో రోజు ఒకటి కొంటే ఒకటి ఉచితం కావడంతో ఊరంతా అక్కడికే వెళ్ళడం ప్రారంభించారు. తెలిసిన వాళ్ళని మధు ఎంత పిలిచిన ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఒక రోజు రాత్రి దుకాణం మూసేసి ఇంటికి వచ్చాడు. భోజనం కూడా చేయలేదు. నిశ్శబ్దంగా కూర్చున్నాడు. వైష్ణవి ఏమీ మాట్లాడలేదు. అతని బాధను అర్థం చేసుకుంది.

రాత్రి అందరూ పడుకున్న తర్వాత…ఒంటరిగా కూర్చుని ఒక పుస్తకం తీసుకుంది. “వాళ్ల బలం ఏమిటి?

పెద్ద భవనం. డబ్బు. ఆఫర్లు. వేల రకాల సరుకులు” అని రాసుకుంది. తర్వాత మరో పేజీ తెరిచి “మన బలం ఏమిటి? మధు నిజాయితీ. ఇరవై ఏళ్ల నమ్మకం. ప్రతి కస్టమర్ గురించి తెలిసిన అనుబంధం. ఇంటింటి పరిచయం. అప్పుగా సరుకులు ఇవ్వడం.” అని రాసుకుంది. ఆమె పెన్ను అక్కడే ఆగిపోయింది. ఒక్కసారిగా ఆమె ముఖంపై చిరునవ్వు విరిసింది. “పోటీ వాళ్ల బలంతో కాదు… మన బలంతో చేయాలి.” అని మనసులో అనుకుంది.

మరుసటి ఉదయం…మధు దుకాణానికి వెళ్లబోతుండగా…”ఈరోజు దుకాణం కొంచెం ఆలస్యంగా తెరుద్దాం.” అని వైష్ణవి చెప్పింది.

“ఎందుకు?”

“నాకు ఒక ప్లాన్ ఉంది.”

మధు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు.

“ఈరోజు దుకాణం తెరవడానికి ముందు మనం కొన్ని ఇళ్లకు వెళ్దాం.” అంది.

“ఇప్పుడు అమ్మకాలు లేవు. ఇళ్లకు వెళ్లి ఏం చేస్తాం?”

“సరుకులు అమ్మడానికి కాదు… మనుషులను అర్థం చేసుకోవడానికి.” అంది వైష్ణవి.

మధు ఏం మాట్లాడలేదు. వైష్ణవితో కలిసి మొదట వెంకటమ్మ ఇంటికి వెళ్లారు. డెబ్బై ఏళ్ల వెంకటమ్మ ఒంటరిగా ఉంటుంది. ఆమె కొడుకు దుబాయ్‌లో ఉద్యోగం చేస్తుంటాడు.

“అత్తయ్య… ఈ మధ్య మా దుకాణానికి రావడం లేదు.” అని అడిగింది.

వెంకటమ్మ నిట్టూర్చి.. “రావాలని ఉంటుంది. కానీ కాళ్లు సహకరించడం లేదు.” అని చెప్పింది.

“ మరి సరుకులు ఎలా తెచ్చుకుంటున్నావు అత్తయ్య?” వైష్ణవి అడిగింది.

“ పెద్ద సూపర్ మార్కెట్‌కు వెళ్తున్న వాళ్ళని బతిమాలి తేప్పించుకుంటున్నాను. ఇంకా ఏం చేయని చెప్పు. వెళ్ళే శక్తి లేదు కదా” 

“ఇక నుంచి మీరు బయటికి రావాల్సిన అవసరం లేదు అత్తయ్య. మీరు ఫోన్ చేస్తే చాలు. సరుకులు మీ ఇంటి దగ్గరికి తీసుకొస్తాం.”

వెంకటమ్మ ఆశ్చర్యంగా చూసింది.

“నిజమా?”

“నిజం అత్తయ్య. ఫోన్ చేసి చెప్పు. మేము తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వెళ్ళిపోతాం.”

వెంకటమ్మ సంతోష పడింది. తర్వాత వారు రిటైర్డ్ టీచర్ రామకృష్ణ ఇంటికి వెళ్లారు. ఆయన భార్య

“మాకు నెల నెలా ఒకే సరుకులు కావాలి. ప్రతిసారి లిస్ట్ రాయడం మరిచిపోతుంటాం.” అని చెప్పింది.

“మీకు ఏం కావాలో చెప్పండి. వాటిని గుర్తు పెట్టుకుని, ప్రతి నెల మొదటి తేదీన మేమే మీ ఇంటికి సరుకులు తీసుకోస్తాం. అప్పుడు మీకు ఎలాంటి సమస్య ఉండదు.” అని వైష్ణవి చెప్పింది. వాళ్లు సంతోషంగా ఒప్పుకున్నారు.

ఆ రోజు మొత్తం వైష్ణవి, మధు కలిసి దాదాపు ముప్పై ఇళ్లకు వెళ్లారు. ఎవరికి ఏ సమస్య ఉందో జాగ్రత్తగా నోట్ చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చాక…ఆమె ఒక తెల్ల కాగితం మీద పెద్ద అక్షరాలతో

శ్రీ లక్ష్మీ జనరల్ స్టోర్స్.. మా కొత్త సేవలు..  ఫోన్ చేస్తే ఇంటికే సరుకులు. వృద్ధులకు ఉచిత హోమ్ డెలివరీ. నెలవారీ సరుకుల ప్లాన్. ఇంట్లో తయారు చేసిన కారం పొడి, పసుపు, పప్పు పొడులు, పచ్చళ్లు. అత్యవసర సరుకులు అరగంటలో డెలివరీ.. కింద ఒక మొబైల్ నంబర్ కూడా రాసింది. ఆ కాగితాలను జిరాక్స్ తీసి ఊరంతా పంచింది.

రెండు రోజుల తర్వాత.. ఉదయం ఎనిమిది గంటల సమయం. మధు దుకాణంలో ఒంటరిగా కూర్చున్నాడు. అప్పుడే వైష్ణవి ఫోన్ మోగింది.

“హలో… శ్రీ లక్ష్మీ స్టోర్స్?”

“అవునండి.”

“నేను వెంకటమ్మను. ఒక కిలో బియ్యం… అర కిలో పప్పు… ఒక లీటర్ నూనె పంపించమ్మా.”

“పది నిమిషాల్లో వస్తాయి.” అని చెప్పి.. మధుకు ఫోన్ చేసి చెప్పింది. మధు వెంటనే సంచిలో సరుకులు పెట్టుకుని, సైకిల్ మీద నవ్వుతూ వెళ్లాడు. అదే రోజు మరో నాలుగు ఫోన్లు వచ్చాయి.

మరుసటి రోజు పది ఫోనులు, వారం రోజుల్లో ఇరవై.. ఇక దుకాణంలో ఖాళీగా కూర్చునే సమయం లేకుండా పోయింది. ఒక రోజు వైష్ణవి మరో కొత్త ఆలోచన మధుకి చెప్పింది.

“మన దగ్గర ఉన్నవి కారం పొడి, సాంబార్ పొడి అన్నీ కంపెనీ ప్యాకెట్లు కదా!”

“అవును.”

“అవి అందరికీ దొరుకుతాయి. కానీ అమ్మ చేసిన రుచి ఎక్కడ దొరుకుతుంది?” అని అడిగింది.

మధు అర్థం కాక చూసాడు.

“మనమే తయారు చేద్దాం.” వైష్ణవి అంది. మొదట మధు భయపడ్డాడు.

“ఎవరైనా కొంటారా?”

“కొనిపించే బాధ్యత నాది.” అంది వైష్ణవి.

మరుసటి రోజు…వారి ఇంటి మేడపై, ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, అన్నీ శుభ్రంగా ఎండబెట్టింది. గ్రైండింగ్ మిల్లులో మెత్తగా పట్టించి…చిన్న చిన్న ప్యాకెట్లలో నింపింది. ప్యాకెట్ మీద చిన్న “వైష్ణవి హోమ్ ఫుడ్స్” అని స్టిక్కర్ అతికించింది. కింద…”అమ్మ చేతి రుచి… ఆరోగ్యానికి మంచి నాణ్యత.” మొదట పది ప్యాకెట్లు మాత్రమే తయారు చేశారు. అవి రెండు రోజుల్లో అయిపోయాయి. తర్వాత యాభై.. ఆ తర్వాత వంద.. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఆర్డర్లు రావడం మొదలైంది.

ఒక రోజు మెగా మార్ట్ మేనేజర్ రోహిత్, వైష్ణవి దుకాణం ముందు నిలబడి గమనిస్తున్నాడు. ఉదయం నుంచి ప్రజలు వస్తూనే ఉన్నారు. ఏవేవో ఫోన్స్ వస్తున్నాయి. ఎవరెవరో సరుకులు తీసుకెళ్తున్నారు.

మరి కొందరు…”వైష్ణవి గారి కారం పొడి ఉందా?” అని అడుగుతున్నారు. రోహిత్ ఆశ్చర్యపోయాడు.

“ఇంత పెద్ద సూపర్ మార్కెట్ ఉన్నా… ఈ చిన్న దుకాణం ఎలా నడుస్తోంది?” అని ఆలోచించాడు.

అతనికి తెలియదు…వాళ్లు సరుకులు మాత్రమే అమ్మడం లేదు, నమ్మకాన్ని, అనుబంధాన్ని, సేవను కూడా అందిస్తున్నారు. వారం రోజులు.. ఒక నెల.. రెండు నెలలు… గస్తుండగానే “శ్రీ లక్ష్మీ జనరల్ స్టోర్స్” మళ్లీ కళకళలాడసాగింది. ఉదయం దుకాణం తెరవకముందే రెండు మూడు ఫోన్లు వచ్చేవి.

“అన్నా… పాలు పంపించండి.”

“అక్క… సరుకులతో పాటు బిస్కెట్లు కూడా పంపండి.”

“వైష్ణవి గారూ… గత నెల ఇచ్చిన కారం పొడి ఇంకో రెండు ప్యాకెట్లు పెట్టండి.”

మధు ముఖంలో మళ్లీ నవ్వు కనిపించింది.

“ఇది అంతా నీ వల్లే వైష్ణవి.” అని తరచూ చెప్పేవాడు.

వైష్ణవి మాత్రం “ఇది నా విజయం కాదు. మన కస్టమర్ల నమ్మకం.” అని చెప్పేది.

ఒకరోజు మెగా మార్ట్ మేనేజర్ రోహిత్ తన ఆఫీసులో సిబ్బందితో సమావేశం పెట్టాడు.

“మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఏసీ ఉంది. ఆఫర్లు ఉన్నాయి. డిస్కౌంట్లు ఉన్నాయి. అయినా ఆ చిన్న దుకాణానికి కస్టమర్లు ఎందుకు వెళ్తున్నారు? అని కోపంగా అడిగాడు.

అప్పుడు అక్కడ పనిచేసే ఒక సేల్స్ బాయ్ అన్నాడు.

“సార్…వాళ్లు సరుకులు అమ్మడం లేదు. మనుషుల్ని గెలుచుకుంటున్నారు.”

రోహిత్ ఆశ్చర్యపోయాడు.

“అంటే?”

“వృద్ధుల ఇళ్లకు వెళ్లి సరుకులు ఇస్తారు. రాత్రి పది గంటలైనా ఫోన్ చేసిన వెంటనే సరుకులు పంపిస్తారు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మందులు కూడా తెచ్చిస్తారు. అందుకే వాళ్లను వదలడం లేదు.”. రోహిత్ కొద్దిసేపు ఆలోచించాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. మరుసటి రోజు నుంచే మెగా మార్ట్ కొత్త ఆఫర్ ప్రకటించింది. “ఏ సరుకు కొన్నా… ఇంటికే ఉచిత డెలివరీ! అంతేకాదు…వైష్ణవి తయారు చేసే పప్పు పొడులు, కారం పొడులకు పోటీగా పెద్ద కంపెనీల వస్తువులు చాలా తక్కువ ధర” అని. ఊరిలో మళ్లీ చర్చ మొదలైంది. ఆ మాటలు మధు మనసును మళ్లీ బాగా కలవరపరిచాయి.

రాత్రి ఇంటికి వచ్చి…”వైష్ణవి…ఇప్పుడేం చేద్దాం?” అని అడిగాడు. వైష్ణవి ప్రశాంతంగా నీళ్లు ఇచ్చింది.

“భయపడకండి. పెద్ద చెట్టు నీడ ఎక్కువగా ఉంటుంది. కానీ పండు మాత్రం ప్రతి చెట్టు ఇవ్వదు.” అంది.

మధుకు ఏమీ అర్థం కాలేదు.

మరుసటి రోజు…వైష్ణవి తన ఫోన్ తీసుకుని.. “మన ఊరి కుటుంబం.” అని ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ ప్రారంభించింది. దుకాణానికి వచ్చే ప్రతి కస్టమర్‌ను ఆ గ్రూప్‌లో చేర్చింది. ప్రతి ఉదయం…

“ఈరోజు తాజా బెల్లం వచ్చింది.” “ఇంట్లో చేసిన ఆవకాయ సిద్ధంగా ఉంది” “తాజా నెయ్యి వచ్చింది.”

అని ఫోటోలతో పంపేది. అంతేకాదు… వంట చిట్కాలు, ఆరోగ్య సూచనలు, పండుగలకు ప్రత్యేక వంటలు…ఇలా ప్రతిరోజూ ఉపయోగపడే విషయాలు పంపేది. ప్రజలకు ఆ గ్రూప్ నచ్చింది. మళ్ళీ మధు షాపు కళకళలాడటం మొదలయింది. మధు గర్వంగా తన భార్య వైపు చూశాడు.

“ఇంటి దీపం వెలిగితే… ఆ వెలుగు గడప దాటి ఊరంతా వెలుగుతుందని ఈరోజు తెలిసింది.” అని అన్నాడు. ఆ రోజు నుంచి ఆ ఊరిలో.. “తెలివైన ఇల్లాలు ఇంటిని మాత్రమే కాదు… భర్త ఆత్మవిశ్వాసాన్ని, కుటుంబ గౌరవాన్ని, సమాజ విశ్వాసాన్ని కూడా నిలబెడుతుంది.” అనే మాట వినబడుతూ ఉండేది.

Written by S Srilatha

చదువు ఇంటర్ మీడియట్
వృత్తి స్టోరీ రైటర్, 2d యానిమేటర్.
ఇప్పటి వరకు దాదాపుగా అన్ని పత్రికలలో కవితలు ప్రచురణ పొందాయి

9390572564

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త లోకాలు (కాలమ్-4)

మాయ నిండిన మది