బతుకునిచ్చే బతుకమ్మ – బజార్లో బతుకమ్మ

కవిత

పసుపూ కుంకుమలు ప్రకృతి
పరవశాలు
అస్తిత్వమూ ఆడబిడ్డలూ బతుకమ్మ ఆటపాటలు
బతుకమ్మ ఆడోళ్ల ఆత్మగౌరవ పండుగ

విప్లవాల చరితకోనలో
వికసించిన అమర స్త్రీ
పుణ్యస్త్రీల అస్తిత్వాల
తెలంగాణ ఆడబిడ్డల పండగ

ఎర్రటి రక్తాల దారుల్లో
పుట్టిన ఆడబిడ్డ
గౌరమ్మ రూపమై ప్రతి గడపని
పరవశింపజేసిన పండగ

సప్పట్ల మోతల్లో,
సప్త స్వరాలు కలిసే గొంతుల్లో
నాదమైసాగి ఊరంతా ఏకం
చేసిన పండగ

అమ్మలక్కల భుజంగల్పుడులో
అడుగులో అడిగేసి
చేతుల సేయి కలిపి
గౌరమ్మను మనసారా
పలకరించిన పల్లెలు

గునుగు తంగేడు బంతి
చామంతి పూలు తెచ్చి
బతుకు నిచ్చే బతుకమ్మను పేర్చి
ఊరడమ్మ కాడ పదం పాడి
పలకరించుకునే పండగ

సత్తిపిండి, మలీద ముద్దలు
నైవేద్యాలుగా పెట్టి
సౌభాగ్యాన్ని సమృద్ధిగా
నిలుపుమని అమ్మను కోరుకునే పండగ

మరి గియ్యాల…

పదం పాడిన నోరు
డీజే పాటలను మోస్తుంది
సప్పట్లతో అమ్మను ఆస్వాదించిన సేతులు
అమ్మను అగౌరవపరుస్తూ ఆడుతున్నాయ్

అడుగుల అడుగు కలిపిన
గా కాలు చిత్తు గంతులకు
అలవాటు పడి
క్రమం తప్పి కాళ్లు అలసిపోయినయ్

జానపదాల జాడలను
గుర్తుచేసిన గా జాడలు
గుర్తులను మరిచి
స్టేటస్ ట్రెండ్ అంటూ అలవాటు పడిండ్రు

తీరొక్క పూలు తెచ్చి
పసుపు కుంకుమలతో
పేర్చే బతుకమ్మను..
ఆర్టిఫిషియల్ బతుకమ్మగా మార్చేసిండ్రు

సప్త స్వరాలు పలికే గా గొంతును
మూగదాన్ని చేసి
డీజే సప్పుళ్లకు సవాల్ చేస్తుండ్రు
గీ ట్రెండ్ ఆడోళ్ళు..

ప్రకృతి పరవశించే గీ పండుగను
ప్రకృతిని పాడుజేసే విధంగా
సౌండ్ పొల్యూషన్ తో
డీజే పాటలతో ప్రాణానికి
ముప్పు చేస్తుండ్రు..

పల్లె సంస్కృతి సాంప్రదాయాలకు
అద్దం బట్టే విలువలను మరిసి
బతుకు నిచ్చే బతుకమ్మను
బజార్లో వెట్టి బాగోతం చేస్తుండ్రు

తీపి గుర్తులు ఇచ్చే బతుకమ్మను
చేదు గుర్తులిచ్చి
చెర్లకు సాగనంపుతుండ్రు..!!

Written by Jurki Lavanya

జుర్కి.లావణ్య
ఫోన్ నెం:8309495388
జిల్లా:సంగారెడ్డి
గ్రామం:సిర్గపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

లోకాభిరామాయణం 12

మన పండుగ—మన పాలపిట్ట జమ్మి చెట్టు