“వైట్ డిస్చార్జ్ – స్త్రీలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య”

దీనినే తెల్లబట్ట లేదా వెజైనల్ డిస్చార్జ్, వైద్య పరిభాషలో ల్యూకొరియా (Leucorrhoea) అంటాం. ఏ సందర్భాలలో ఈ వైట్ డిస్చార్జ్ ఎక్కువగా ఉంటుంది? అలా ఉంటే కలిగే నష్టమేమిటి? ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలి? ఏ రకమైన వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? అనే విషయాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
వ్యక్తురాలైన ఆడపిల్లల నుండి, పెద్దవాళ్లయిన (మెనోపాజ్ దాటిన) స్త్రీల వరకు ఈ సమస్య కనిపిస్తుంది. స్రావాల ద్వారా జననాంగాలను తడిగా ఉంచడమనేది మన శరీర రోగనిరోధ వ్యవస్థలో ఒక భాగం. ఒక్కోసారి ఈ స్రావాలు అధిక మోతాదులో వచ్చి, లోదుస్తులపై మరకగా ఏర్పడినప్పుడు, దైనందిన కార్యక్రమాల్లో ఇబ్బంది కలిగినప్పుడు, ఇలా ఎందుకు జరుగుతుంది, ఇదేమైనా వ్యాధా అని స్త్రీలు బెంబేలు పడతారు. ఇది వ్యాధి కాదు. మన శరీరవ్యవస్థలో సహజంగా ఏర్పడిన ఒకానొక ప్రక్రియ.
అయితే ఇది సహజంగా ఏర్పడినదో, వ్యాధుల నుండి సంక్రమించినదో, ఆ ఇబ్బందిని ఎదుర్కొన్న స్త్రీలెలా చెప్పగలరు?
లోపలి భాగాల్లో దురద లేకుండా, చెడువాసన లేకుండా ఉంటే వ్యాధి కాదని నూటికి 90 శాతం చెప్పవచ్చు. గాని, పూర్తిగా నిర్ధారించుకోవడానికి వైద్యుల తనిఖీ అవసరం.
స్త్రీ జననాంగాలకు రక్షణ ఇవ్వాల్సిన స్రావాలు, వ్యాధికారకాలు లేకుండా ఏ పరిస్థితులలో అధిక మోతాదులో విడుదలై స్త్రీలను ఇబ్బంది పెడతాయంటే, 1. నెలసర్లు (Menarche) మొదలైన కొత్తల్లో, 2. గర్భిణీ స్త్రీలల్లో, 3. అండం విడుదలైన సమయంలో, 4. ఆ తర్వాత బహిష్టు వచ్చేవరకు, 5. స్త్రీ పురుషుల కలయిక సమయంలో, 6. లైంగిక ఊహల్లో మనసు తాదాత్వ్యం చెందినప్పుడు, ఈ స్రావాలు ఎక్కువగా విడుదలవుతాయి. దీనికి ఏ రకమైన వైద్యమవసరం లేదు. కౌన్సిలింగ్ చేస్తే సరిపోతుంది.
అసహజంగా ఏ పరిస్థితుల్లో ఈ స్రావాలు ఎక్కువగా స్రవిస్తాయంటే…. 1. లైంగిక వ్యాధులు (గనేరియా, సిఫిలిస్, ట్రైకోమోనియాసిస్, క్యాండిడియాసిస్ మొII) ఉన్నప్పుడు, 2. బ్యాక్టీరియల్ వెజైనోసిస్ ఉన్నప్పుడు 3. జననాంగాలపై చిన్నగా పుళ్ళు పడినప్పుడు, 4. పాలిప్స్ అనే చిన్న కాయలు ఏర్పడినప్పుడు, 5. బయటకు కనిపించకుండా ఉండాల్సిన సెర్వైకల్ గ్రంధులు వెజైనాలోకి కనిపిస్తున్నప్పుడు, 6. గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ ఉన్నప్పుడు, 7. చిన్నపిల్లల్లో, ఒక రకమైన నులిపురుగులు ఉండడం వలన కూడా (Thread worms), స్రావాలెక్కువగా ఊరి స్త్రీలను / పిల్లలను ఇబ్బంది పెడతాయి.
కారణాలేమిటి? జననాంగాలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా? అనేది వైద్యుల తనిఖీల్లో, పరీక్షల్లో తెలిసిపోతుంది. స్రావాలను మైక్రోస్కోప్ క్రింద చూసినప్పుడు తెల్ల రక్తకణాలు ఉంటే అది ఇన్ఫెక్షన్ నుండి వచ్చిందని అర్థం.
వెజైనల్ డిస్చార్జి సూక్ష్మజీవుల వలన కలిగితే కనిపించే లక్షణాలు:
1. స్రావాలు చెడువాసన కలిగి ఉండడం,
2. లోభాగాల్లో దురద ఉండడం,
3. లోభాగాలు కాస్త వాచి ఉండడం,
4. స్రావాలు ట్రాన్స్పరెంట్ గా లేకుండా ముద్దలా ఉండడం
5. తెలుపు, పసుపు, ఆకుపచ్చ, మధ్యమధ్య ఎరుపు రంగులో స్రావాలు ఉండడం
పై లక్షణాలున్నప్పుడు పరీక్ష చెయ్యవలసిన అవసరం ఎంతైనా ఉంది. వైద్యులు సమస్య నిర్ధారణ ఎలా చేస్తారంటే, తగిన ప్రశ్నలు వేస్తూ, పేషెంట్ లోపలి బాగాలను సునిశితంగా తనిఖీ చేసి, డిశ్చార్జ్ ను మైక్రోస్కోప్ క్రింద చూస్తే వ్యాధికారకం సులువుగా తెలిసిపోతుంది. కారణం తెలిస్తే, తగిన మందుల ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.
ట్రైకోమోనియాసిస్: ఇది ట్రైకోమోనియాసిస్ వెజైనాలిస్ అనే పరాన్నజీవి వలన వస్తుంది. ఈ వ్యాధిలో స్రావాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
క్యాండిడియాసిస్: క్యాండిడా అనే ఫంగస్ వలన వస్తుంది. విరిగిపోయిన పాలల్లా, తెల్లని ముద్దలా, ఉంటాయి స్రావాలు.
గనేరియా: గోనోకోకస్ అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. స్త్రీ పురుషుల కలయికలో ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. యూరిన్ పోసుకునేటప్పుడు మంట ఉండడంతో పాటు, చీములా స్రావాలుంటాయి.
బ్యాక్టీరియల్ వెజైనోసిస్: వెజైనాలో మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి వ్యాధికారక క్రిములు పెరిగినప్పుడు వస్తుందిది. కొద్దిగా పొటాషియం హైడ్రాక్సైడ్ వేస్తే చేపల కంపు కొడుతుంది. దీనిని విఫ్ టెస్ట్ అంటారు
పైన చెప్పిన వ్యాధులకు, లైంగిక వ్యాధులకు మందులున్నాయి. వ్యాధికారకాన్ని బట్టి మెట్రోనిడజోల్, మికోనజోల్, క్లిండామైసిన్ మొదలైన మందులను, లోపల పెట్టుకునే క్రీముల/ మాత్రల రూపంలోనో, లేదా నోటిమాత్రల రూపంలో ప్రిస్క్రైబ్ చేస్తారు వైద్యులు. క్రమం తప్పకుండా వారం రోజులు మందులను వాడితే వ్యాధి నయమైపోతుంది.
కొన్ని సందర్భాలలో సూక్ష్మజీవుల వలన కాకుండా, ముందే చెప్పుకున్నట్టు వేరే కారణాలుండొచ్చు. 1. జననాంగాల సమీప అవయవాల్లో రక్తప్రసరణ ఎక్కువగా ఉన్నప్పుడు, ఉదాహరణకు క్రానిక్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీస్ (Chronic Pelvic Inflammatory disease) ఉన్నా, 2. కండరాలు వదులై గర్భాశయం క్రిందకు జారినప్పుడు, 3. గర్భసంచి ముఖద్వారం వాచిపోయినప్పుడు (Cervicitis), లేదా 4. క్యాన్సర్ ఉన్నప్పుడు (Cervical cancer), 5. పాలిప్ లనే చిన్నచిన్న కాయలున్నప్పుడు, 6. కండరాలు వదులైనప్పుడు గర్భసంచి క్రిందకు జారకుండా రింగు పెసరీ (Ring pessary)లను పెట్టినప్పుడు, 7. కొన్ని రకాలైన గర్భనిరోధక సాధనాలను వాడినప్పుడు, గూడా ఈ సమస్య తలెత్తవచ్చు.
ఇటువంటి సందర్భాలలో సమస్యను బట్టి చికిత్స మారుతుంది. పాలిప్ లు, గర్భసంచి జారినప్పుడు, గర్భసంచి ముఖద్వారపు క్యాన్సరున్నప్పుడు తప్పనిసరిగా శస్త్రచికిత్స పడుతుంది.
ముఖ్యంగా పాటించవలసిన విషయం, స్త్రీ పురుషులిద్దరూ ప్రైవేటు భాగాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. లేనప్పుడు పైన చెప్పిన వ్యాధులన్నీ ఒకరి నుండి ఒకరికి సంక్రమించి, స్త్రీలల్లో పైన చెప్పిన ఇబ్బందుల్ని కలిగిస్తాయి. గనేరియా ఇన్ఫెక్షన్ వస్తే అండవాహికలు మూసుకుపోయి గర్భం దాల్చడంలోనూ, తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సర్వైకల్ క్యాన్సరుని తొందరగా డయాగ్నోజ్ చెయ్యకపోతే, ప్రాణహాని కలిగే అవకాశమెక్కువ. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని, నిర్లక్ష్యం వహించకుండా వైట్ డిశ్చార్జ్ కు, వైద్యసలహా తీసుకోవడం ఎంతైనా అవసరముంది.

Written by Dr. Majji Bharathi

రచయిత్రి పరిచయం

ప్రభుత్వ వైద్య కళాశాల, రాజమహేంద్రవరంలో ప్రొఫెసరుగా మరియు మైక్రోబయాలజీ విభాగాధిపతిగా పనిచేస్తున్న ప్రొఫెసర్ (డాక్టర్) మజ్జి భారతిగారు, మూడు కథా సంపుటాలు- 1. ఆలోచనా తరంగాలు (2022), 2. వేకువ (2024), 3. జీవన గానం (2025), 4. భారతీ! వందనము (2026) అనే పద్య సంకలనాన్ని వెలువరించి, నాల్గవ కథా సంపుటం "అనగనగా ఒక కథ" ప్రచురించబోతున్నారు. వందకు పైగా కథలు, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ వ్యాసాలు, ట్రావెలాగ్స్, కవితలు వివిధ పత్రికలలో (ఈనాడు ఆదివారం అనుబంధం, విశాలాక్షి, విశాఖ సంస్కృతి, మాతృక, భూమిక, పాలపిట్ట, ప్రసారిక, సాహితీ కిరణం, ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం మొదలైన పత్రికలలో, కథామంజరి, కౌముది, విహంగ, సారంగ, సంచిక, మాధురి, తరుణి, మయూఖ, రవళి, బహుళ, గో తెలుగు డాట్ కాం మొదలైన అంతర్జాల పత్రికలలో) ప్రచురింపబడ్డాయి. మూడు కథలకు ప్రథమ బహుమతులు, నాలుగు కథలకు ప్రత్యేక బహుమతులు వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

డాక్టర్…డాక్టర్!

వర్షపు ధార