ఏమిటో ఈ తిప్పలు?

(కథ)

కాలింగ్ బెల్ మోగుతోంది…
మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది.

అప్పటివరకు పనులన్నీ ముగించుకొని బెడ్ రూంలో
అల్మారాలో దాచి ఉంచిన కాగితాలను సర్దుతూ అవసరం లేనివాటిని పక్కన పడేస్తూ ఎప్పటినుండో వాయిదా వేస్తున్న పనిని ముగించే ప్రయత్నంలో ఉంది స్వప్న. “అబ్బా! ఈ టైమ్ లో ఎవరొచ్చారు?” అని విసుగ్గా చేతిలోని కాగితాలను మంచం మీద పెట్టి హాల్లోకి వస్తుండగానే బెల్ మరొక్కసారి మోగింది.

“అబ్బబ్బా! వస్తున్నా…” అంటూ అరిచి, ఈయన గానీ
అమ్మాయి గానీ మళ్లీ ఏదో ఆన్ లైన్ ఆర్డర్ పెట్టినట్టున్నారు. రోజూ ఈ ఆర్డర్లు తీసుకోలేక ఛస్తున్నాను. ఏది కనిపిస్తే అది కొనేయడమే. ఇల్లంతా నింపుతున్నారు” అని భర్త మనోజ్ మీద, అమ్మాయి మృదుల మీద ప్రేమగా విసుక్కుంటూ తలుపు తెరిచింది.

“బాగున్నావా? స్వప్నా? ఎంతసేపటికీ తలుపు తీయవేం?” అంటూ మనోజ్ కి వరుసకు మేనత్త అయ్యే సరోజనమ్మను చూస…
[7:06 AM, 7/23/2026] Aruna Dhulipala: మెల్లగా లోపలికి బెడ్ రూమ్ లోకి వెళ్లి, మెల్లగా మనోజ్ కు ఏ వివరాలు లేకుండా సరోజనమ్మ వచ్చినట్లు మాత్రమే మెసేజ్ చేసింది. తాను 8 గంటలకల్లా వచ్చేస్తానని మనోజ్ రిప్లై చేశాడు. ఇక ఈరోజు తన పని అయ్యేది కాదని కాగితాలన్నీ అల్మారాలో కుక్కి, మంచం మీద శరీరాన్ని వాల్చి రకరకాల ఆలోచనలతో సతమతమవుతోంది స్వప్న.

** *** ****
ఆరోజు సాంబయ్య ఒక్కగానొక్క కూతురు స్వప్న, శాంతారాం ఏకైక పుత్రుడు మనోజ్ ల నిశ్చితార్థం. శాంతారాం కు అక్కచెల్లెళ్ళు ఎవరూ లేరు. చిన్నాన్న కూతురు సరోజనమ్మ వరుసకు అక్క అవుతుంది. చిన్నతనం నుండీ వీళ్ల ఇంటికి ఆమే ఆడపడుచు. కోరిందల్లా సాధించుకునే మనస్తత్వం. తనకూ ఎవరూ లేకపోవడం వల్ల, ఆమె తనకంటే వయసులో పెద్దది కూడా అవడం వల్ల శాంతారాం కు ఆమె చెప్పింది వేదం. ఈ విషయంలో శాంతారాం భార్య సావిత్రి కూడా నిస్సహాయురాలు.

ఇంట్లోకి అడుగు పెట్టడంతోనే కళ్ళతో ఇంటి మొత్తాన్ని కలయబెట్టింది సరోజనమ్మ. లావుగా, కాస్త ఎత్తుగా ఉండే ఆమె చూపులో నిర్లక్ష్యం, మాటలో తీక్షణత, నడతలో దర్పం.. వీటితో “మేం మగపెళ్ళివారం” అన్న విషయాన్ని ప్రతీక్షణం గుర్తు చేసింది. ముఖం మటుకు ఎప్పుడూ ఒక అసంతృప్తితో ఉన్నట్టు చిటపటలాడిస్తూనే ఉంది. ఆమె నైజమే అంత. భర్త రామచంద్రయ్య తన స్వంత ఆలోచనలు చేయడం ఎప్పుడో మానేశాడు.

నిశ్చితార్థం వేడుక వైభవంగా జరిగింది. భోజనాల తరువాత మెల్లగా స్వప్న ఉన్న గదిలోకి వచ్చిన సరోజనమ్మ స్వప్నను కూర్చోబెట్టుకొని “నాకు నా మేనల్లుని పైన సర్వాధికారాలు ఉన్నాయి. ఏ విషయమైనా నాకు తెలియకుండా జరగడానికి వీల్లేదు. చదువుకున్నదానివి కదా! ఇంతకంటే ఎక్కువ చెప్పనవసరం లేదనుకుంటా” అని అన్నమాటలోనే అనేక అర్థాలను స్ఫురింపజేసింది.

తెల్లబోయిన స్వప్న తేరుకునేలోపే “వెళ్ళొస్తానమ్మా!”
అంటూ వెనక్కి చూడకుండా విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె ఏం మాట్లాడిందో తెలియకపోయినా స్వభావం తెలుసు కాబట్టి స్వప్న ముఖంలో ఏదో తెలియని ఆందోళన చూసి వెంటనే మనోజ్ గాభరా పడొద్దంటూ స్వప్నకు సైగ చేశాడు.

సాంబయ్య అంతో ఇంతో డబ్బు గలవాడే అని చెప్పక తప్పదు. మధ్యమధ్యలో సరోజనమ్మ
ఆడపడుచు పంతాన్ని చూపించినప్పటికీ
ఏ మర్యాదలకు లోటు లేకుండా ఘనంగా వివాహం జరిపించాడు. శాంతారాం ఇంట్లో చుట్టాలు అందరూ తెల్లవారే వెళ్లిపోయినా పదిరోజులు ఉండివెళ్లారు సరోజనమ్మ, రామచంద్రయ్యలు.

ఆ పదిరోజులు స్వప్నకు భయంగానే గడిచాయి.
అత్తవారింటికి వెళ్లిన మొదటి మూడురోజులు తనకు ప్రశాంతంగా ఉన్నా సరోజనమ్మ ఏదో కారణానికి సావిత్రిని దేనికో ఒకదానికి ఎద్దేవా చేస్తూనే ఉండేది. ఆ ఆ తరువాత గాలి స్వప్న వైపు దిశను మార్చుకుంది. చేస్తున్న పనులలో తప్పులు వెతుకుతూ….
“సరిపోయింది.. అత్తా కోడళ్లకు..ఒక్క పని సరిగా చేయలేరు. ఇప్పటివరకూ ఈమెకు చెప్పడం అయిపోయింది. కొత్తగా ఇది కూడా జోడయ్యింది. ఆడపిల్ల అన్నాక చదువుతో పాటు పనీ పాటలు రావొద్దూ!” అంటూ మొదలుపెట్టేది.

అక్కడ అందరూ ప్రేక్షకులే. అత్త సావిత్రి, భర్త మనోజ్ చాటుగా స్వప్నను ఓదార్చేవారు. ఆమె వెళ్లిపోయేంత వరకూ ఓపిక పట్టమనేవారు. మగవాళ్ళతో సమానంగా
వ్యవహారాలు మాట్లాడుతూ, వాళ్ళతో పాటే భోజనం కూడా చేసేది. ఏరోజూ సావిత్రి వాళ్ళతో కలిసి కూర్చొని భోజనం చేయడం చూడలేదు స్వప్న. అందుకే అత్తగారి మీద జాలితో తాను కూడా వీళ్ల తర్వాత ఆమెతో కలిసి తినేది.

పదిరోజుల తర్వాత సరోజనమ్మ వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో పూర్తి ప్రశాంతత ఏర్పడింది. శాంతారాం ఏవో బిజినెస్ పనులు చూసుకోవడంలో
ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. మనోజ్ ఉదయమే ఆఫీసుకు వెళ్తే రాత్రికి వచ్చేవాడు. రాత్రి భోజనం నలుగురూ కలిసి చేసేవాళ్ళు. స్వప్న చదువుకున్నదే అయినా ఉద్యోగం చేయాలనే కోరికలాంటివి ఏవీ లేవు.
ఉద్యోగం ఉన్న మంచి భర్త దొరికితే చాలనుకుంది. అది నెరవేరడమే కాక హైదరాబాద్ లాంటి మహానగరంలో. అందువల్ల స్వప్నకు జీవితం సాఫీగా గడిచిపోతోంది. అత్తాకోడళ్లు స్నేహితుల్లా కలిసిపోయారు.

సరోజనమ్మ కొడుకులిద్దరూ విదేశాల్లో వాళ్లకు
నచ్చిన అమ్మాయిల్ని పెళ్లి చేసుకొని సెటిలయ్యారు. ఎప్పుడైనా రెండు మూడేళ్లకు వీళ్ళు వెళ్లి రావడమే తప్ప కొడుకులు రావడం చాలా తగ్గిపోయింది. ఆ విషయంలో పిల్లల మీద ఆమెకు ఎంతో కోపం. కానీ అక్కడ సాగుబడి లేక శాంతారాం ఇంటిమీద పడి ఆ అక్కసును కూడా వీళ్ళ మీదే తీర్చుకుంటుంది. వచ్చినప్పుడల్లా వారం, పదిరోజులు ఉంటారు సరోజనమ్మ దంపతులు. ఆ కొద్దిరోజులు రామచంద్రయ్యకు ఆటవిడుపు. వీళ్లకు మాత్రం రోజులు లెక్కబెట్టుకోవడమే అవుతుంది. ఎంత పెత్తనం చెలాయించినా ఈ కుటుంబమంటే ఆమెకున్న అంతులేని ప్రేమ వల్ల వీళ్ళు కూడా అంతే గౌరవాన్ని ఆమెకు ఇస్తూ ఆమె మాటను శిరసావహిస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆడవారికి సహజంగా ఉండే మాట లాలిత్యం గానీ, ప్రవర్తనలో సౌకుమార్యం ఆమెకు లేవు.

మృదుల పుట్టిన తరువాత పదేళ్లకు మనోజ్ కు ఇక్కడి కంపెనీ వాళ్ళు బెంగుళూరులో మంచి ఆఫర్ ఇవ్వడంతో
అందరినీ వదిలి రాక తప్పలేదు. ఇప్పుడు మృదుల హాస్టల్ లో ఇంజినీరింగ్ చదువుతోంది.

*** ****

ఇంతకుముందు రెండు మూడు సార్లు ఒక్కతే
హైదరాబాద్ నుండి వచ్చిన అనుభవం సరోజనమ్మకు ఉంది. ఆ విషయంలో స్వప్నకు అనుమానమేమీ రాలేదు. కానీ ముందే ఆమె వస్తున్న సమాచారం ఆ దంపతుల్లో ఎవరో ఒకరు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా
ఇదేంటి?

హాల్లో సరోజనమ్మ లేచిన అలికిడి విని గభాలున బయటకు వచ్చిన స్వప్న ఆమెకు మంచినీళ్లు తెచ్చిచ్చి
ఎదురుగా కూర్చుంది. మెల్లగా కబుర్లలో పడిపోయారు.

మనోజ్ వచ్చి రాత్రి భోజనాలు అయ్యాక ఏవేవో విషయాలు మాట్లాడుతున్నా గొంతులో మునుపటి గాంభీర్యం, అధికారం లేకపోవడం వీళ్ళిద్దరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. డైరెక్టుగా అడిగేంత సాహసం ఇద్దరిలో ఎవరికీ లేదు.

కాసేపటి తరువాత “పొద్దుపోయింది. మీరు వెళ్లి పడుకోండి!” అంటూ తనకు కేటాయించిన రూమ్ లోకి వెళ్లి పడుకుంది సరోజనమ్మ. విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసే సాహసం ఇద్దరిలో ఎవరూ చేయలేకపోయారు.

స్వప్న మెసేజ్ వచ్చిన తరువాత రామచంద్రయ్య తనకు ఫోన్ చేశాడని, మామూలుగానే మాట్లాడాడని, అత్త క్షేమంగా చేరిందా అని అడిగాడని, ఫోన్ తీయడం లేదని అన్నాడని, మనోజ్ స్వప్నకు చెప్పాడు.

** ** ***
చూస్తుండగా ఇంకో వారం రోజులు గడిచిపోయాయి. సమయానికి స్వప్న, మనోజ్ లతో కలిసి తినడం, కాలక్షేపానికి కాసేపు టి.వి చూడడం, లేదంటే మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండడం సరోజనమ్మకు అలవాటుగా మారిపోయింది. ఆమె స్వభావానికి పూర్తి విరుద్ధమైన ఈ చేష్టలను మనోజ్ దంపతులు అర్థం చేసుకోలేకపోతున్నారు.

ఈ వారంలో మనోజ్ కు రెండుసార్లు రామచంద్రయ్య ఫోన్ చేసి, మీ అత్త ఫోన్ రిసీవ్ చేసుకోవడం లేదని, మిమ్మల్ని చూడాలనిపిస్తోందని, నాల్గురోజుల్లో వస్తానని చెప్పిందని, ఇంకా ఎన్ని రోజులు అక్కడ ఉంటుందని అడిగాడు.

“మీ ఇద్దరి మధ్యా ఏమైనా జరిగిందా మామయ్యా?” అని మనోజ్ అడిగితే “అట్లా ఎప్పుడైనా జరిగిందా రా?” అని ఎదురు ప్రశ్న వేశాడు రామచంద్రయ్య. తనకు వంటకు కష్టమవుతోందని, త్వరగా పంపుమని కూడా చెప్పాడు.

మరునాడు ఆదివారం. మనోజ్ , స్వప్నలు ఏదైనా అడగాల్సిందేనని నిర్ణయించుకున్నారు.

“అత్తా! పదిరోజులకు పైగా నువ్వు మాతో ఉండడం ఎంతో సంతోషంగా ఉంది. నువ్వు ఎన్నాళ్లు ఉండాలనుకున్నా ఇది నీ ఇల్లు. మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ మామయ్య అక్కడ ఒంటరిగా ఉండడం, నువ్వు ఇక్కడికి ఒక్కదానివి రావడం ఆశ్చర్యంగా ఉంది. రెండు రోజులు కూడా మామయ్యను వదిలి రాలేవు. అసలేం జరిగింది? ఇద్దరు బావలతో సమానంగా నన్నూ కొడుకులా చూశావు. నీకే కష్టం వచ్చినా నేనున్నాను. నువ్విక్కడ ఉన్నా, నీ మనసు ఇక్కడ లేదని నాకు తెలుసు. అసలేం జరిగిందో
చెప్పు?” అంటూ రెండు చేతులు పట్టుకొని అనునయంగా అడిగాడు మనోజ్.

ఒక్క నిమిషం అయోమయంగా చూసి ఇద్దరినీ పట్టుకొని బావురుమన్నది సరోజనమ్మ. ఆమె స్థితిని చూసి గాభరా పడిపోయారు మనోజ్ దంపతులు. స్వప్న పరుగెత్తుకొని వెళ్లి మంచినీళ్లు తెచ్చిచ్చింది. గటగటా నీళ్లు తాగి కొంచెం స్థిమితపడి చెప్పడం ప్రారంభించింది సరోజనమ్మ.

“మనోజ్! దాదాపు మూడు నెలలుగా మీ మామయ్య ప్రవర్తన బాగుండడం లేదు. ఇంత వయస్సు వచ్చి ఇదేం పోయేకాలమో అర్థం కావడం లేదు. మీకు ఈ విషయం చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది. మీ అమ్మా నాన్నలకు చెబితే వాళ్ళు తట్టుకోలేరు. ఇక నా కొడుకులంటావా? కనిపెంచిన తల్లిదండ్రులకు ఎంత దూరం ఉంటే అంత గొప్ప అనుకుంటూ విదేశాల్లో స్వార్థంతో బతుకుతున్నారు. అందుకే నన్ను కాదనరనే ధైర్యంతో మీ దగ్గరకు వచ్చాను. వచ్చిన రోజే చెప్పాలనుకున్నాను. చెప్పడానికి పెద్దరికం అడ్డొచ్చింది” అని ఒక్క క్షణం ఊపిరి తీసుకుంది.

మనోజ్, స్వప్నలు ముఖాలు చూసుకున్నారు. మళ్లీ సరోజనమ్మే “అరేయ్ మనోజ్! మీ మామయ్య ఎప్పుడూ ఫోన్ లోనే ఉంటున్నాడు. అదేం తప్పని మీరు అనుకోవద్దు. మొదట్లో నేనూ అట్లానే అనుకున్నాను. రాను రాను మితిమీరి పోయి, తనలో తనే ముసిముసిగా నవ్వుకోవడం, ఎవరినో చూస్తూ ముచ్చట్లు పెడుతుండడం గమనించి, ఓ రోజు ఆయన పడుకున్నాక ఫోన్ తీసి చూస్తే ఎవరో ఒకామె ఫోటో, నాకంటే కొంచెం వయసు చిన్నదిగా ఉంది. ఎన్నో రంగులతో, ఎన్నో ప్రాంతాలలో ఉన్న అనేక రకాల ఫోటోలు కనిపించాయి. ఈ వయసులో నా మనసుకు ఇలాంటి గాయం తగలడం తట్టుకోలేక పోతున్నా.

ఊళ్ళో ఎంతో గొప్పగా బతికిన వ్యక్తి. ఈ విషయం పదిమందికి తెలిస్తే పరువేమన్నా ఉంటుందా? ఎప్పుడూ ఇంట్లోనే ఉండే ఈ మనిషికి ఆమె పరిచయం ఎట్లా కలిగిందో అర్థం కావడం లేదు. కంపరం పుడుతోంది. ఆయనను అడగలేక ఆయనతో ఉండలేక, తోచని స్థితిలో మీ దగ్గరకు వచ్చాను” అని చెప్తూనే వెక్కి వెక్కి ఏడ్చింది.

*** ** *** ***
“మామయ్యా! అత్తకు కొంచెం ఆరోగ్యం బాగా లేదు.
మీరు వెంటనే బయలుదేరి రండి” అన్న మనోజ్ ఫోన్ తో వెంటనే తెల్లవారి రాత్రికల్లా బెంగుళూరుకు వచ్చాడు రామచంద్రయ్య. ఆయనను చూడగానే ఒక నిర్లిప్త భావనతో ముఖం ముడుచుకుంది సరోజనమ్మ. అది గమనించిన రామచంద్రయ్య ఆశ్చర్యపోయాడు.

రాత్రి భోజనాలు చేసిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో మనోజ్ మొదలుపెట్టాడు.

“ఆమె ఎవరు మామయ్యా? మీరు ఏదో దాటేయడానికి ప్రయత్నం చేయొద్దు. అత్త అన్నీ చెప్పింది. పెద్దరికంగా మాకు చెప్పాల్సింది పోయి ఇదేంటి?’ అన్నాడు.

అందరివైపు అయోమయంగా చూస్తూ రామచంద్రయ్య “ఆమెనా? ఆమె ఏంది?” అన్నాడు.

వెంటనే సరోజనమ్మ అందుకొని “ఆయన ఎందుకు చెప్తాడ్రా? చేసిందంతా చేసి. ఛీ ఛీ…ఏమీ తెలియనట్లు చూడు! అమాయకునిలా ఎట్లా నటిస్తున్నాడో?” అంటున్న సరోజనమ్మను వారిస్తూ…”ఏయ్. ఆపు! ఏందిరా మనోజ్, ఇది?” అన్నాడు.

“అదేంటి మామయ్యా! మీరు కూడా! సరే, నా నోటినుండే వినాలని మీకుంటే చెప్తాను వినండి.” అని అత్త బాధపడుతున్న విషయాన్ని చెప్పాడు.

రామచంద్రయ్య తల పట్టుకొని పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. అనుకోని ఈ హఠాత్పరిణామానికి
మిగతా అందరూ బిగుసుకుపోయి చూస్తున్నారు. ఇక నవ్వడం తనవల్ల కాదంటూ నవ్వుతూనే ఫోను ఓపెన్ చేసి ఆ ఫోటోలు చూపెట్టాడు. కుతూహలాన్ని అణచుకోలేక మనోజ్ చేతిలోని ఫోనులోకి తొంగి చూసిన స్వప్న, మనోజ్ వైపు చూడడంతో ఇద్దరూ నవ్వు ఆపుకోలేక పడీ పడీ నవ్వసాగారు.

వీళ్ళ నవ్వుకు కారణం అర్థం కాక ఉక్రోషంగా చూస్తున్న అత్తను చూస్తూనే, “ఇది మీకెట్లా సాధ్యమైంది మామయ్యా?” అడిగాడు మనోజ్ నవ్వుతూనే.

“ఏముందిరా! ఈ రోజుల్లో ఫోను చేతిలో ఉంటే చాలు. ప్రపంచమే గుప్పిట్లో ఉంటుంది. నేను వ్యవసాయానికి సంబంధించిన కొత్త విషయాలను గూగుల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వ్యవసాయంలో అభివృద్ధి కొరకు సాధ్యమైనంతవరకు వాటిని అమలులో పెట్టేందుకు ప్రయత్నం చేస్తానని నీకు తెలుసు కదా!

“అదిగో! అప్పుడే బయటపడింది ఈ కృత్రిమ మానవ మేధస్సు (AI). దీని గురించి చదివినప్పుడు ఎంతగానో ఆశ్చర్యపోయాను. మనిషి ఏ స్థాయికి ఎదుగుతున్నాడో కదా! అనుకున్నాను. సరదాగా మీ అత్త ఫోటోను ఒక దాన్ని మార్చి చూశాను. భలేగా అనిపించింది. అదే హాబీగా మారి వీటిని చూస్తూ ఆనందించడం అలవాటయిపోయింది. దీని గురించా మీ అత్త ఇంత రాద్ధాంతం చేసింది?” అన్నాడు చేయి నోటికడ్డం పెట్టుకొని మళ్లీ నవ్వుతూ.

ఈ ముగ్గురినీ చూస్తూ దిగులుగా కూర్చున్న అత్త దగ్గరికి వెళ్లి ‘AI’ ఏం చేయగలుగుతుందో వివరించి, మామయ్య చేసింది తప్పు కాదని ఆమెకు అర్థం చేయించేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది మనోజ్ కు.

మనోజ్ చెప్తున్నంత సేపు తనవైపే ప్రేమగా చూస్తున్న రామచంద్రయ్యను చూసి కళ్ళతోనే తనను క్షమించమని తలదించుకుంది సరోజనమ్మ. “ఇప్పటినుండీ ఆ ఫొటోలో ఉన్నట్టు ఉండాలి సుమా!” అని రామచంద్రయ్య అంటుంటే అందరూ హాయిగా నవ్వేశారు.

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అనామకులెవరు? ( కాలమ్ )

అతను-ఆమె