
“వచ్చావా!? ఎక్కడున్నావే!?” అంది జానకి ఫోన్ చెవిదగ్గర పెట్టుకుని.
“ఇదిగో ఈ కుడివైపుకు చూడు. నిన్ను నేను చూస్తున్నా. గేట్ వద్ద నాకు కనిపిస్తున్నావ్ నువ్వు. ” చేయుపుతూ అంది శారద.
“ఆ…. కనీపించావ్! ఆగు వస్తున్నా” అటువైపు నడిచింది జానకి.
జానకి, శారద చిన్నప్పటి నుండీ మంచి స్నేహితులు. ఒకే వీధిలో ఇళ్లు. ఒకే స్కూల్. ఒకే కాలేజ్.
మనస్తత్వాలలో భిన్నత్వం ఉన్నా అభిరుచులలో ఏకత్వం, ఒకరిపై ఒకరికి గల అభిమానం, వారి మధ్య ఎప్పుడూ విభేదాలు రానివ్వ లేదు. ఇద్దరూ పోటీ పోటీగా చదివేవారు. క్లాస్ లో మొదటి రెండు స్థానాలు వీరివే.
శారద ఉన్నత మధ్య తరగతి నుండి వస్తే, జానకిది దిగువ మధ్యతరగతి. అవేవీ వారి అన్యోన్య స్నేహానికి అడ్డు కాలేదు.
డిగ్రీ అయ్యాక జానకికి ఓ చిరుద్యోగితో వివాహం చేసేసాడు పోస్ట్ మాస్టర్ గా పని చేసే ఆమె తండ్రి.
శారద తరువాత పీజీ చదివి మంచి ప్రభుత్వ రంగంలో గెజిటెడ్ హోదాలో ఉద్యోగం సంపాదించుకుంది. ఆపై పెళ్ళై ఆ ఊరి నుండి ఆమె కూడా వెళ్ళి పోయింది.
అలా ఇద్దరూ పెళ్ళిళ్ళై విడిపోయారు. ఎవరికి వారు తమ పిల్లలు, భర్త, ఉద్యోగం, సంసారం గొడవల్లోతలమునకలయ్యారు.
చాలా ఏళ్ల తరువాత తమ అరవైల వయసులో, తీరిక దొరికి, కాలేక్షేపం కోసం, తమ సాహిత్యాభిరుచిమేరకు, ఓ సాహిత్య ప్రధాన గ్రూపులో చేరి, అక్కడ కామెంట్స్, పోస్ట్‌లలో ఒకరినొకరు గుర్తుపట్టి, ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుని, ఇలా ఈ రోజు ఈ పార్క్ లో కలుసుకోవలని ప్లాన్ చేసుకున్నారు.
అన్ని సంవత్సరాల తరువాత అనుకోకుండా కలుసుకోవటంతో ఆనందంతో కన్నీళ్ల పర్యంతమయ్యి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుని, కుశల ప్రశ్నలతో ఒకరినొకరు ఉక్కిరిబిక్కిరిచేసుకున్నారు.
ఒకరి చేతిలో ఒకరు చెయ్యి ప్రేమగా పట్టుకుని తీరికగా మాట్లాడుకోవటం మొదలు పెట్టారు.
“మా వారు మా చిన్నవాడికి ఏడేళ్ళుండగా గుండెపోటుతో హఠాత్తుగా పోయారే. ఇద్దరు పిల్లలను చాలా క్రమశిక్షణతో పెంచాను.పెద్దవాడు ఏర్ లైన్స్ లో, చిన్నవాడు లాయర్ గా హైకోర్ట్ లో పని చేస్తున్నారు. నీ పిల్లలు!? ” తన గురించి చెప్పి జానకిని అడిగింది శారద.
“నాకు ఇద్దరూ కూతర్లేనే. మా వారు రిటైర్ అయ్యాక, కిడ్నీ ఫైల్యూర్ తో కొంత కాలం పోరాడి పోయారు. ఇప్పటికి నాలుగేళ్లైంది. నా పిల్లలిద్దరూ సాఫ్ట్వేర్ కంపెనీలలో మంచి జీతంతో పని చేస్తున్నారు. ఈ సిటీలోనే. వాళ్ళ భర్తలూ అదే ఫీల్డ్.” జానకి మనసులోని నిశ్చింత ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
“అవునా! ఇంతకూ నువ్వెక్కడ ఉంటున్నావ్!? ఒంటరిగా ఉన్నావా!? నాతో పాటూ ఆశ్రయ గోల్డేజ్ హోం కు వచ్చేయ్ కూడదూ!? నా రూంలోనే ఉందుగానీ.నేనే పే చేస్తాను. చాలా బావుంటుంది అక్కడ. సపరేట్ ఏ సి గది, విత్ అటాచ్డ్ బాత్రూం. ఆ బిల్డింగ్ చుట్టు పెద్ద గార్డెన్.ఆర్గానిక్ కూరల పెంపకం. యోగా కేంద్రం, చిన్న దేవాలయం, ఇరవైనాలుగు గంటలూ డాక్టర్స్ అందుబాటులో ఉంటారు, చక్కని, తాజా ఆహారం సమయానికి అందిస్తారు. నేనున్న రూం ఒక్కరికైతే నెలకు ఇరవై నాలుగు వేలు, అక్కడే ఇద్దరుంటే ముప్పై వేలు.” ఉత్సాహంగా జానకి రెండు చేతులూ తన చేతిలోకి తీసుకుని అడిగింది శారద.
“అదేంటీ!? నువ్వు ఓల్డేజ్ హోంలో ఉన్నావా!?” పట్టలేని ఆశ్చర్యంతో శారదవైపు చూస్తూ అంది జానకి.
“అవును!? ఏం!? అయినా…! అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది. నువ్వూ ఒంటరిగానే ఉంటున్నావని అడిగాను!?” చప్పబడిన ఉత్సాహం జానకికి దొరకనివ్వకూడదనే ప్రయత్నం చేస్తూ, చిన్నగా తన చేతులు వెనక్కు తీసుకుంది శారద.
“లేదే. నేను నా కూతుర్ల దగ్గరే ఉంటున్నాను ఆయన పోయినప్పటి నుండీ. అది సరే! నీ పిల్లలు నిన్నిలా ఒంటరిగా ఎందుకు ఉండనిస్తున్నారు..!?” అంది జానకి.
శారద తన భావాలు ముఖంలో చూపకుండా …”ముందు నువ్వు చెప్పు. నీ అల్లుళ్ళు నిన్ను తమ వద్ద ఉంచుకోవడానికి ఒప్పుకున్నారా…!?” ఆసక్తిగా చూసింది జానకి కళ్ళలోకి.
జానకి చెప్పటం మొదలుపెట్ఠింది.
“మావారి మరణం నేను తట్టుకోలేకపోయాను. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అదృష్ఠవసాత్తు మా అల్లుళ్ళిద్దరూ చాలా మంచి వాళ్ళు. నన్ను వంటరిగా మా ఇంట్లో ఉండనీయకుండా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. అమ్మాయిలిద్దరూ అమ్మలా నన్ను కడుపున పెట్టుకొని చూసుకున్నారు. వారి ఆదరణ, ఆప్యాయత, మనవళ్ళు మనవరాళ్ళ ఆటపాటలతో తేరుకున్నాను.ఇద్దరూ పక్కపక్కనే ఉండటంతో ఇద్దరి మధ్యా తిరుగుతూ, పిల్లలకు కావలసిన సహాయము చేస్తూ నిశ్చింతగా ఉన్నాను. ఇక నీ సంగతి చెప్పు” అంది జానకి.
“నా సంగతంటే సుధీర్ఘంగా చెప్పాలి. చెప్పానుగా పెద్దవాడు ఏర్ లైన్స్ లో అదే అమెరికన్ ఏర్ లైన్స్ లో అమెరికాలో, చిన్నవాడు కూడా అమెరికాలోనే హైకోర్ట్ లో లాయర్ గా సెటిల్ అయ్యారు. నేను రిటైర్ అయ్యాక వాళ్ళ దగ్గరకు వెళ్ళాను. పిల్లలు అక్కడే వారి దగ్గరే ఉండమని, గ్రీన్ కార్డ్ కు అప్లై చేస్తామని అన్నారు. నేను కూడా పిల్లల దగ్గర ఉండేందుకు మొగ్గాను. గ్రీన్ కార్డ్ కు అప్లై చేసే ముందుమూడు నెలలు అమెరికాలో స్థానికంగాఉండాలి.కోడళ్ళు చక్కగా చేసిపెడుతుంటే, వీకెండ్స్ లో మాల్స్ కు వెళుతూ ఎంజాయ్ చేస్తుండేదానిని. ఒక పెద్దావిడని వరుసగా మూడునాలుగు సార్లు ఒక స్టోర్ లో పని చేస్తుండటం చూసాను. పాపం పిల్లలు చూడటం లేదేమో ఈ వయసులో కూడా పని చేస్తోంది అని అనుకునే దానిని. ఓ సారి ఆపుకోలేక ఆవిడను మీరు ఈ వయసులో కూడా పని చేస్తున్నారు. మీ పిల్లలు మిమ్మలిని చూడరా అని అడిగాను. ఆవిడ నా వైపు విచిత్రంగా చూసి, “పిల్లలెందుకు చూడటం? నా ఆరోగ్యం బాగుంది. నేను పని చేయగలను. వూరికే కూర్చొని ఏమి చేస్తాను?” అంది. నిజమే కదా ఇరవై సంవత్సరాలు పెంచామని పిల్లల మీద ఆధారపడిపోవటం ఎందుకు? నాకు ఆర్ధికంగా కాని ఆరోగ్యపరంగా కానీ ఏ ఇబ్బందీ లేదు. పిల్లలు ఇన్ని సంవత్సరాలుగా అమెరికా లో ఉండి ఇక్కడి జీవన విధానానికి అలవాటు పడ్డారు. నా జీవన శైలి వేరు. నా పద్దతులు వారికీ, వారివి నాకూ ఇబ్బందిగా ఉండటము గమనిస్తూనే ఉన్నాను.ఇప్పుడు నేను మారలేను. అందుకని వాళ్ళను ఇబ్బంది పెట్టటమూ, నాకోసం వాళ్ళను పద్దతులు మార్చుకోమనటమూ సబబా? అందుకేఅక్కడే నేను సెపరేట్ గా ఏదైనా అపార్ట్మెంట్ తీసుకొని ఉందామా అని ఆలోచించాను. కాని అన్ని పనులూ నేను మానేజ్ చేసుకోవటం కష్టం. పోనీ సీనియర్ కేర్ సెంటర్ లో ఉందామా అంటే, మంచిది అన్ని వసతులూ ఉన్నదైతే కనీసం నెలకు నాలుగువేల డాలర్స్ కట్టాలి. అంత డబ్బూ కట్టలేను.పిల్లలను అడగటం ఇష్టం లేదు. అలా చాలా ఆలోచించాను. ఒక రోజు చిన్నవాడు నన్ను కలిసేందుకు వచ్చినప్పుడు ‘నాకు పూర్తిగా మీమీద ఆధారపడి ఉండటం ఇష్టం లేదు. అలా అని మీకు దూరంగా ఉండలేను. నేను పిలిస్తే మీరు, మీరు పిలిస్తే నేను పలికే దూరంలో ఉండాలి.మీ ఉద్యోగాలు మానుకొని నాకోసం ఇండియా రమ్మనలేను. ప్రస్థుతం గ్రీన్ కార్డ్ వద్దు. ఎట్లాగూ పెద్దవాడికి ఫ్రీ టికెట్స్ ఉంటాయి కదా వాడు వీలైనప్పుడల్లావస్తూనే ఉంటాడుగా. ఏమి చేయాలో చిన్నగా ఆలోచిద్దాం’ అని వాళ్ళను ఒప్పించి ఇండియా వచ్చాను.ఇప్పటి వరకూ నాకు ఉద్యోగం ఉంది కనుక వంటరితనం తెలియలేదు. ఈ హోం లో అన్ని వసతులూ ఉన్నాయని చేరాను. నిన్ననే పెద్దవాడు ఫోన్ చేసి, ‘ “శాంతినికేతన్” అనే పేరు తో అమెరికాలో ఇండియన్ గేటెడ్ కమ్యూనిటీ, ఇండియన్ పెద్దవాళ్లు,యాభైఅయిదు సంవత్సరాలు దాటిన వారి కోసం కడుతున్నారు. పిల్లలకు దగ్గరగా ఉండాలనుకునేవారు అక్కడ ఇళ్ళు కొనుక్కుంటున్నారు. అందులో క్లబ్, ఇండియన్ కిచెన్,కేర్ టేకర్, మెడికల్ కేర్మొదలయినవసతులన్నీ ఉన్నాయి.మనకు కావాలనుకున్నవి, అవసరమైనవి పే చేసి వాడుకోవచ్చు. నువ్వే వండుకోవాలనుకుంటే వండుకోవచ్చు. నీ ఇంట్లో నువ్వు ఉన్నట్లుగానూ, నలుగురిలో ఉన్నట్లుగానూ ఉంటుంది. నీకు అలవాటయిన భాష, వాతావరణం ఉంటుంది. అందులో నీకూ ఒక ఇల్లు బుక్ చేస్తాను.ఇక నువ్వు నీ ఇంట్లో మేము పలికేదూరంలో ఉండవచ్చు. ఎక్కడో ఇండియాలో ఒక్కదానివే ఉన్నావన్న టెన్షన్ మాకుండదు అన్నాడు. వెళుదామనేఅనుకుంటున్నాను. నేనే ఇక్కడ ఉండటం లేదు, గభుక్కున నిన్ను రమ్మన్నాను, పైగా నేను హోం లో ఉన్నానంటే పిల్లలను తప్పుగా అనుకుంటావేమో అని తమాయించుకున్నాను” అంది శారద.
“అయితే నొప్పించక, తానొవ్వక అన్నమాటబాగుంది” అంది జానకి.
ఎంతైనా మనపిల్లలు సినిమా పిల్లలు కాదు మంచి పిల్లలు అని హాయిగా నవ్వుకున్నారిద్దరు.
(ఇందులో నేను ప్రస్తావించిన శాంతినికేతన్ అనే గేటెడ్ కమ్యూనిటీ అమెరికాలో ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉంది. అది నేను పేపర్ లో చదివి ఈ కథలో ఉపయోగించుకున్నాను. మరి మీ అభిప్రాయం చెపుతారుగా!)