నేను పరిచయం చేస్తున్న విశిష్ట కవయిత్రి, కథా రచయిత్రి శ్రీమతి మాకన వెంకట ఉమాదేవి.
గజల్స్, కైతికాలు, సమ్మొహనాలు, నానీలు, మణిపూసలు వంటి ఎన్నో పక్రియలలో కవితలు వ్రాస్తున్న ప్రముఖ సీనియర్ కవయిత్రి, కథా రచయిత్రి, ఇష్టపదుల శ్రేష్ఠ శ్రీమతి మాకన వెంకట ఉమాదేవి (యం.వి. ఉమాదేవి) గారి గురించి నా పరిచయంలో…..
జీవిత విశేషాలు
ఉమాదేవి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు పట్టణ వాస్తవ్యులైన కీ.శే. మాకన విఠల్ రావు- వనజాక్షి దంపతుల సంతానంగా జన్మించారు.. ఉమాదేవి గారి తండ్రి రెండోప్రపంచ యుద్ధంలో సియాచిన్ నుండి పాల్గొని వచ్చి, సబ్ ట్రెజరీ షరాఫ్ గా పదవీ విరమణ చేసి, స్టాంప్ వెండర్ గా ఉన్నారు, సన్నకారు రైతుగా వ్యవసాయం కూడా చేశారు.. తల్లి గృహిణి.. ఉమాదేవి గారికి ఒక అన్న ఎం.వి.కె.వి ప్రసాద్ ఒక అక్క రత్నమ్మ చెల్లి సంధ్యా లక్ష్మి ఉన్నారు.

విద్యాభ్యాసం
ఉమాదేవి గారు కావలి పట్టణంలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు వెంకయ్య మాస్టారు బడి లో చదివారు.. తర్వాత విశ్వోదయ బాలికల పాఠశాల లో 9వ తరగతి వరకు చదివారు..
కుటుంబ నేపథ్యం
ఉమాదేవి గారికి నెల్లూరు జిల్లా, ఇందుకూరు పేట వాస్తవ్యులైన కోనేటి బ్రహ్మయ్య, బి.కామ్, బీ.ఈడి గారితో 1981లో వివాహం జరిగింది.. బ్రహ్మయ్య గారు మండల పరిషత్ లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తూ పదవీ విరమణ పొందారు … ఈ దంపతులకు ఇద్దరు కుమారులు,
అభిరుచులు
ఉమాదేవి గారు పనికిరాని వస్తువులతో బొమ్మలు చేయడం, పూసలతో జంతువులు, వెంకటేశ్వర స్వామి పటము, గాజులతో సీనరిలు, బటన్స్ తో వాల్ హ్యాంగింగ్స్, తాటి నారతో బుట్టలు, కాగితం రుబ్బి బుట్ట వంటివి తయారుచేసేవారు.. దూరదర్శన్ లో లలిత గేయాలు, అన్నమయ్య కీర్తనలు ఇష్టంగా చూస్తారు.
సాహితీ ప్రస్థానం
ఉమాదేవి గారు స్కూల్ కెళ్లే ప్రాయం నుండే టై ఫాయిడ్ తో బధిర వైకల్యంతో వున్నప్పటికీ దువ్వూరులో ఉన్న అమ్మమ్మ ఉబ్బర వెంకటమ్మ గారి ప్రోత్సాహంతో మనసు సాహిత్యం వైపు మళ్ళింది.. మెల్లిగా చిన్న చిన్న కవితలు వ్రాయడం అలవాటు చేసుకున్నది.. కొన్ని సార్లు పత్రికల్లో వచ్చేవి. పారితోషికం కాంప్లిమెంటరి కాపీలు పోస్ట్ లో వచ్చేవి. పెళ్లి తర్వాత బాధ్యతల స్వీకరణతో మూడున్నర దశాబ్దాలు సాహిత్యానికి విరామం కలిగింది.. అన్నగారు చదవమని ఇచ్చిన కలామ్ గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం చదవడంతో స్ఫూర్తి పొంది మళ్లీ కవిత్వం వ్రాయడం మొదలుపెట్టింది..
ఉమాదేవి గారు తెలుగు మరియు ఇతర భాషల అనువాదాలు అన్నీ చదివేవారు.. కవిత్వంలో దాశరథి , గజల్స్ కు సినారె, కథలకి విశ్వనాథ సత్యనారాయణ గారు తనకు ప్రేరణ అంటారు.. ఉమాదేవి గారి సాహితీ ప్రయాణంలో మొదటగా అడిగొప్పుల సదయ్య, తిరునగరి శరత్ చంద్ర, ఆర్. వి. ఎస్. ఎస్. ఎస్. శ్రీనివాస్,గుడిపూడి రాధికా రాణి, ,పొర్ల వేణుగోపాలరావు, గోస్కుల శ్రీలత రమేష్, దండెం రాజు రామశర్మ గారు, శ్రీ వేదాంత సూరి గార్లతో బాటు ఆమె అన్నయ్య ఎం. వి. కె. వి. ప్రసాద్ గారు ఇంకా అనేకమంది ఆమె రచనలు చేయుటకు ప్రోత్సాహించారు…
ఉమాదేవి గారు వివిధ ప్రక్రియల్లో కలిపి అయిదేళ్లలో ఉమాదేవి గారు పదివేలకు పైగా కవితలు వ్రాసారు.. వచన కవితలు, పద్యాలు రెండువేలకు పైగా వ్రాసారు.. కథలు, మినీ కథలు 200కు పైగా వ్రాసారు.. అంతే కాదు అనేక సమీక్షలు కూడా వ్రాసారు.. శ్రీ పోతగాని సత్యనారాయణ గారి ద్వారా దోహాలు నేర్చుకోని శతకం వ్రాసారు.. తరువాత ఆటవెలది లో వనజ శతకం, శ్రీనివాస శతకం, కందం లో చిత్ర పద్యాలు ద్వి శతకము,అబాబీలు శతకం వ్రాసారు..
ఉమాదేవి గారు వ్రాసిన కథల్లో గోరింటాకు, అనుకోని అతిథి, గంధము పుయ్యరుగా, బ్రతుకు చిత్రం మొదలగునవి బాగా ప్రజాదరణ పొందాయి.. ఉమాదేవి గారు వ్రాసిన కొన్ని కథలు టీవీ సినీ నటులు అంబాళం పార్థసారథి గారు యూట్యూబ్ లో చదివారు..
గత అయిదేళ్లుగా వివిధ వాట్సాప్ గ్రూప్ లు, వివిధ పత్రికల్లో ఉమాదేవి గారు వ్రాసిన గజళ్లు, అన్ని ప్రక్రియలలో వ్రాసిన కవితలు ప్రచురణ అయ్యాయి.. ఇవి కాకుండా అనేక సంకలనాల్లో ఆమె రచనలున్నాయి. జ్వలిత గారి చేతి వృత్తుల కథా సంకలనం మల్లె సాల లో ఆమె వ్రాసిన కథ తళుకులు-బెళుకులు ప్రచురితమైంది..
ముద్రిత రచనలు
జేగంటలు -(కైతికాలు )
ఉమాంతరంగం (ఇష్టపదులు )
రమణీయ తిరుప్పావై (ఇష్టపదులు )
ఊహలు (మణిపూసలు )
హరిణవల్లరి (గజల్ సంపుటి )
చుక్కల దారుల్లో (బాల గేయాలు )
వనజ శతకము (ఆట వెలది పద్యాలు )నానీల నవ్య కోశo(నానీలు )
పెన్నా తీరం (సమ్మోహనాలు )
పురస్కారాలు
పదేళ్ల ప్రాయాన నెల్లూరు, కొండబిట్రగుంట బ్రహ్మోత్సవాలలో సంప్రదాయ నాట్య ప్రదర్శన కు వెండి పతకంతో సన్మానం.
16ఏళ్ళ వయసులో పలు పత్రికల లో రచనల ప్రచురణతో పారితోషికాలు అందుకున్నారు..
ఇంకా సముద్రాల ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం,
కొడుపుగంటి సుజాత గారి కవితా పురస్కారం,
అమరకుల దృశ్యకవి గారిచే కవి చంద్ర పురస్కారం సన్మానం.
వడిచర్ల సత్యం గారిచే కవి వరేణ్య బిరుదుతో సన్మానం.
ఇంకా.. వివిధ సాహితీ సంస్థలచే మరియు పలు వాట్సాప్ గ్రూపుల్లో, కవితలు, కథల పోటీల్లో విజేతగా పలు సన్మాన, సత్కారాలు, ప్రశo సాపత్రాలు అందుకున్నారు..
ఉమాదేవి గారు గజల్స్, కైతికాలు, సమ్మోహనాలు, నానీలు, మణిపూసలు లాంటి ప్రక్రియలలో కవితలు, ఆటవెలదిలో , కందము లో శతకాలు వృత్త పద్యాలు, ఇష్ఠపదులు మరియు బాలగేయాలు , అబాబీలు వ్రాస్తూ కవయిత్రిగా కథా రచయిత్రిగా బాగా రాణిస్తున్నారు.. ఆమె రచనలు ప్రతీ వారం తపస్వి మనోహరం వారపత్రిక, మాస పత్రికలో రెగ్యులర్ గా ప్రచురణ అవుతున్నాయి.